అంబేద్కర్ 125వ జయంత్సుత్యవాలు దేశ, విదేశాల్లో ఘనంగా జరుపుకొంటున్నాం. ఆయన రచనలన్నీ ఇప్పుడు వివిధ భాషల్లో ఉచితంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తెలుగు యూనివర్సిటీ ప్రచురించిన తెలుగు సంపుటాలు కూడా ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉన్నాయి. అంబేద్కర్‍ని భిన్న పార్శ్వాల్లో దర్శించడానికి ఆయన రచనలు దారి చూపిస్తున్నాయి.
అయితే అంబేద్కర్ కన్నా ముందే దేశవ్యాప్తంగా ‘ఆదిహిందువు’ల, నిమ్నజాతుల (హరిజన అనే పదాన్ని భాగ్యరెడ్డి వర్మ నిర్ద్వందంగా వ్యతిరేకించిండు) వారి నాయకుడిగా గుర్తింపు పొందినవాడు భాగ్యరెడ్డి వర్మ. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు మొదలు ఎం.సి. రాజా వరకు ఎందరో మన్ననలు అందుకున్న ఆయన 128వ జయంతి మే 22న జరుపుకున్నాం. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని భాగ్యరెడ్డి వర్మ గురించి కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. భాగ్యరెడ్డి వర్మ కుమారుడు 1952లోనే హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికైన గౌతమ్ ‘భాగ్యోదయం’ పేరిట ఇంగ్లీషులో చిన్న పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకానికి మాతృక అంతకముందు 1921లోనే వడ్లకొండ నరసింహారావు రాసిన రచన. ఈ పుస్తకం ఇప్పుడు తెలుగు పాఠకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. సంతోషం.
అయితే భాగ్యరెడ్డి వర్మ రచనలు, ఉపన్యాసాలు, సంపాదకీయాలు, సృజాత్మక రచనలు ఇంతవరకూ పుస్తక రూపంలో రాలేదు. వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. గతంలో ఒకరిద్దరు భాగ్యరెడ్డి వర్మ రచనల్ని ఈ వ్యాసకర్త నుంచి తీసుకొని ముద్రించడానికి ప్రయత్నం చేసినారు కాని అది ముందుకు సాగలేదు. ఆ రచనల్ని ఆంగ్లంలోకి కూడా తర్జుమా చేసి ఆయన గొప్పతనాన్ని జాతికి చాటి చెప్పాలి.
నిజానికి ఈ దేశ మూలవాసులు దళితులేనని బోధిస్తూ, వారి పట్ల సమాజం చూపిస్తున్న వివక్షా వైఖరిని ఖండిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ఉద్దేశంతో 1906లోనే ‘జగన్మిత్రమండలి’ అనే సంస్థను నెలకొల్పి దాని ద్వారా కృషి చేసిండు. 50 సంవత్సరాల జీవితంలో 32 యేండ్లు ప్రజాశ్రేయస్సుకోసం వినియోగించిన భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిజాం ప్రభుత్వంతో పోరాడి దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు, బ్రహ్మసమాజ్, ఆర్యసమాజ్, సంఘసంస్కార నాటక మండలి, దేవదాసీ నిర్మూలనోద్యమం, ఆదిహిందువుల ఐక్యత, రాజకీయ వాటా కోసం, దళితుల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం ఆయన చేసిన కృషి ఇప్పటికీ గుర్తింపుకు నోచుకోలేదు.
ఇక అసలు విషయానికొస్తే నేను ఎంతో శ్రమకోర్చి సేకరించిన / కాపాడిన భాగ్యరెడ్డి వర్మ రచనలు త్వరలో పుస్తక రూపం దాల్చనున్నాయి. నిజానికి ఇప్పటి వరకు భాగ్యరెడ్డి వర్మ ఒక దళితోద్యమ నాయకుడిగానే అందరికీ తెలుసు. అయితే ఈయన భాగ్యనగర్, ఆదిహిందూ పత్రికల్ని నడిపించడమే గాకుండా దళితుల హక్కుల కోసం పోరాటం చేసిన తొలి నాయకుల్లో ప్రథముడు, హక్కులు కాపాడడంలో భాగంగానే 1938లోనే ఆదిహిందూ పత్రికలో ‘‘ప్రాథమిక హక్కులు’’ అనే సంపాదకీయం రాసిండు.
ఆ కాలంలో తెలంగాణాలో మొత్తం చదువుకున్న తెలుగువారి జనాభా ఐదారు శాతానికి మించదు. ఇందులో దళితుల అక్షరాస్యతా శాతం మరీ అధ్వాన్నం అయితే నిమ్నజాతుల వారి గోడు అగ్రకులాల వారికి కూడా తెలియాలి. ముందు వారు సమస్యను సానుకూలంగా అర్థం చేసుకునేందుకు పత్రికా రచన ఉపయోగపడుతుందని నమ్మి దాన్ని నిర్వహించిన వినయ సంపాదకుడు భాగ్యరెడ్డి వర్మం. పత్రికల్లో రాజరామ్‍మోహన్‍రాయ్, బ్రహ్మసమాజ్, బుద్ధ జయంతి సందర్భంగా రాసిన సంపాదకీయాలు ఆనాటి అనేక విషయాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి.
‘‘గ్రామ హిందువులు, ఆది హిందువుల బాలురను స్కూళ్లకు పంపిచింనందున వారి బావులలో గాజునూనెను పోసి పారదోలిరి. మరొకచోట నూనెతో భక్ష్యములు చేసుకొనినందున అతనిని చావతన్ని అన్న ఆహారములకు మన్నుగప్పిరి. ఇంకొకచోట సర్కారువారితో ఆజ్ఞను పొంది గోధుమ రొట్టెలు చేసుకొని విందారగించు సమయమున హిందువులు తండోపతండాలుగా వచ్చి ఆహారమునంతయు మట్టిలో కలిపి దుడ్డుకర్రలతో చావమోదిరి.
మరొకచోట కూరలలో నెయ్యిని వాడినందులకు, ఊరేగింపులో గుర్రమెక్కినందులకు, సైకిళ్ళపైనెక్కి దారిన పోవుచుండ ఆవులను చూచి దిగిదండము పెట్టనందులకు, మొన్న నర్సాపురం తాలూక తూర్పుతాళ్ళ శివారు శిరంశెట్టిల యింట్లో జరిగిన ఆదిమాంధ్రుల వివాహ సందర్భమున పెండ్లి వారు పీటలపై కూర్చొని యుండగా, గడ్డిబుట్టలతో పోవు కాపులను కండ్లు కనబడుటలేదాయని’’ దుర్భాషలాడుతూ ఊరుకాపులందరు యేకమై వచ్చి తలుపులు విరగగొట్టి దాగుకొనిన వారందరినీ చావమోదిరి. అనేకులకు గాయమునలొర్చిరి. కొల్లాబత్తుల వెంకన్న తల పగులగొట్టిరి. కుండలమధ్య దాగుకొనిన 80 సం।।ల ముసలమ్మ నడుము విరగొట్టిరి. చేతులు జోడించి మొక్కబోయినవారికి చేతులు విరగొట్టిరి. స్త్రీలను, వృద్ధులను, పిల్లలను వారి ఇష్టము వచ్చినట్లు కొట్టగా గాయములు పొందినవాడు ఆసుపత్రిలో చికిత్స బడయుచున్నట్లు స్థలాంతరమున ప్రకటించిన వార్తవలన తెలియుచున్నది’’ అని ఆంధ్రా ప్రాంతంలో జరిగిన దాడులను ఏకరువు పెడుతూనే, అలాంటివి తెలంగాణలో జరుగకుండా నిజాం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రాథమిక హక్కులు పేరిట రాసిన సంపాదకీయంలో అభిప్రాయపడ్డారు.
దీనితో పాటుగా ఆదిహిందూ వార్షిక సభల సందర్భంగా చేసిన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇది వరకే కొన్ని చిన్న చిన్న బుక్‍లెట్స్గా ప్రచురింపబడ్డాయి. వాటిలో పోలీసు, సైనిక విభాగాల్లో ఆదిహిందువులను చేర్చుకోవడంలో చూపిస్తున్న వివక్ష, వెట్టి చాకిరీలను విమర్శిస్తూ చేసిన ఉపన్యాసాలు తర్వాతి కాలంలో వ్యాసాలు పత్రికల్లో అచ్చయ్యాయి.
అలాగే ఆంధ్రమహాసభ వాళ్ళు ప్రతి యేటా 1930 నుంచి నిర్వహించిన సభలకు భాగ్యరెడ్డి వర్మ తప్పనిసరిగా హాజరయ్యేవారు. ఆయా సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా ఆ కాలంలో పత్రికల్లో అచ్చయ్యాయి. ఖమ్మం సభకు తాను వెళ్ళలేక పోయినప్పటికీ తన ఉపన్యాసాన్ని రాసి పంపించడంతో అక్కడ చదవడం జరిగింది. ఇవేగాకుండా సందర్భానుసారంగా వివిధ విషయాలపై భాగ్యరెడ్డి వర్మ దాదాపు 1911 నాటి నుంచి వివిధ పత్రికలకు వ్యాసాలు రాసేవారు. అలా ఆయన రాసిన మొదటి వ్యాసం ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో 1911లో అచ్చయింది.
వీటితో పాటుగా మొత్తం తెలుగులోనే మొట్టమొదటిసారిగా కథలు రాసిన దళితుడు భాగ్యరెడ్డి వర్మ. మాదిగల వెట్టి చాకిరి జీవితాల పట్ల చలించి ‘అజ్ఞాతవాసి’ అనే పేరిట 1931లోనే ‘వెట్టి మాదిగ’ అనే కథను భాగ్యరెడ్డి వర్మ రాసిండు. వీటితో పాటుగా గణపతి తత్వం అనే సెటైరికల్ నాటికను కూడా ఈయన రాసిండు.
నిజానికి భాగ్యరెడ్డి వర్మ రచనలు చాలా వరకు అలభ్యంగా ఉన్నాయి. భాగ్యరెడ్డి వర్మ తన పేరు, హైదరాబాద్ పేరూ రెండూ వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ‘భాగ్యనగర్’ పత్రిక ప్రతులు నాలుగైదు సంచికలు మించి ఇప్పుడు అందుబాటులో లేవు. నిజానికి ఈ భాగ్యనగర్ ప్రతులన్నింటినీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన కునుమ ధర్మన్నకు ఇచ్చినట్లు ఈ వ్యాసకర్తతో గతంలో గౌతమ్ గారు చెప్పారు. అయితే ఆ ప్రతులన్నీ అగ్ని ప్రమాదంలో కాలిపోయి
ఉండవచ్చనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం జేసిండు. భాగ్యనగర్, ఆదిహిందూ పత్రికా ప్రతులు దొరికినట్లయితే భాగ్యరెడ్డి వర్మ రచనలపై మరింత లోతుగా పరిశీలన చేయడానికి వీలవుతుంది.
ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భాగ్యరెడ్డి వర్మ మీద ఒక ఎంఫిల్ పరిశోధన జరిగింది. నిజానికి నాలుగైదు పిహెచ్‍డీలు చేయగలిగినంత సమాచారం, ఉన్నతి ఉన్న వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. (తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్క•తిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
–డా।। సంగిశెట్టి శ్రీనివాస్
ఎ : 9849220321