మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొండపాక అపూర్వమైన చరిత్రపూర్వయుగ పురావస్తు సంపదతో, ఒక కళ్యాణీ చాళుక్యుల శాసనం, రెండు కాకతీయ శాసనాలతో ప్రఖ్యాతమైన పురాతన నగరం.
ఇటీవల తెలంగాణా చరిత్రబ•ందం సభ్యులు వేముగంటి మురళీక•ష్ణ, అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, సామలేటి మహేశ్, అరవింద్ ఆర్య, సునీల్ సముద్రాల, బీవీ భద్రగిరీశ్, కొలిపాక శ్రీనివాస్, శ్రీరామోజు హరగోపాల్ పరిశీలనలో కొండపాక గ్రామానికి దక్షిణ దిశలో పారే ‘దక్షిణ గంగ’ అంచున చిన్నరాతిబోడు మల్లన్నగుట్ట వద్ద వున్న చెలకలలో శాతవాహనుల నాటి ఇటుకలు, అమ్మదేవత టెర్రకోటబొమ్మల శకలాలు, కుండపెంకులు, చిన్న సైజు (గురుగులవంటి) మట్టిపాత్రలు, టెర్రకోట పూసలు, దోసిళ్ళకొద్ది ఆభరణాలలో వాడుకునే నల్లపూసలు, పగడాలు, రంగు, రంగుల పూసలు, గాజు పరిశ్రమలో వాడిన రంగురాతి ముక్కలు, ఇనుప పరిశ్రమలో మిగిలిన ఇనుం చిట్టేలు కొల్లలుగా దొరికాయి. అరణితో నిప్పు రాజేసేటందుకు వాడే గుంటవున్న రాయి (fire starting stone) కూడా లభించింది. అంతేకాదు ఆ పాటిగడ్డ మీదనే ఏనుగుదంతంతో చేసిన ఒక పాచిక దొరకడం విశేషం. శానం వంటి చీల్పుడు పనిముట్టొకటి, శాతవాహనుల కాలానికి ముందునాటి చరిత్ర పూర్వయుగంలోని కొత్తరాతి యుగం రాతిపనిముట్లు ఒకేచోట లభించాయి.
చరిత్రపూర్వయుగంలో కొండపాక:
మానవవికాసంలో రాతియుగం తొలిమెట్టు. లక్షల సంవత్సరాల కాలంలో పురామానవుల జీవనంలో రాతిపనిముట్లది పెద్దపాత్ర. వేట, ఆహారసేకరణ దశలో రాతి పరికరాలు లేకుండా కాలం గడువలేదు. ప్రపంచమంతటా మానవపరిణతిలో చేతులు శ్రమకు అనుగుణంగా వాడుకునే విధానాలు వేర్వేరు. జంతువులతో పురామానవులు పోటీపడి ఆహార సంపాదనలో ముందంజ వేసారు. రాళ్ళతో రాళ్ళను కొట్టి పనిముట్లు తయారుచేసుకున్నారు. తొలినాటి రాతిపనిముట్ల కాలం పాతరాతియుగం. మలియుగం సూక్ష్మరాతి పరికరాల కాలం. ఆఖరుది కొత్తరాతియుగం. కొత్తరాతి యుగం క్రీ.పూ.3000సం.ల నుంచి క్రీ.పూ. 1500సం. లని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ణయించారు. పురామానవులు వేట, ఆహారసేకరణ దశ నుంచి సొంతంగా ఆహారాన్ని పండించుకునే వ్యవసాయం, పశుపోషణ దశకు పరిణమించిన కాలం. అయినా రాతిపనిముట్లే వారి పనిముట్లపొదిలో వుండేవి. కాని, ఆ రాతిపరికరాలు మునుపటికన్నా వాడిగలవి, చేతుల్లో ఇమిడేవి, వాడకంలో మన్నికగలవి. ఈ రాతిగొడ్డండ్లలో అండాకారం, త్రికోణాకారపువి, బాదాంకాయ ఆకారపువి, గుండె ఆకారపువి, బల్లెం వంటివి, మైక్రోక్వియెన్లు (మధ్యపాతరాతి యుగానివి), డిస్కాయిడ్లు: చక్రాలవంటివి, కక్ష్యాకారపువి, ఆకుమొనవి వుంటాయి.
కొండపాకలో మల్లన్నగుట్ట దగ్గర పాటిగడ్డవద్ద కరుణాకర్, మహేశ్‍ల క్షేత్రపరిశీలనలో మధ్యరాతియుగంనాటి సూక్ష్మరాతి పరికరాలు (మైక్రోలిథ్స్) దొరికాయి. ఈ రాతియుగం వయస్సు క్రీ.పూ.8,000లసం.ల నుంచి 3000సం.ల వరకు వుంటుందని అని చరిత్రకారులు చెప్తారు. వాటిలో ఫ్లింట్ (చెకుముకి) రాయితో చేసిన బాణం ములికి లభించడం విశేషం. అక్కడే దొరికిన వివిధ ఆకారాలలో వున్న రాతి పనిముట్లలో ఎక్కువగా ట్రెపీజియం, త్రిభుజం, ద్విముఖ, ద్వికుంభాకార ఉపరితల లక్షణాలతో, వివిధ ఆక•తులలో కొత్తరాతి యుగం గొడ్డండ్లు చేతిగొడ్డండ్లు వున్నాయి. కొన్ని చీల్పుడు(క్లీవర్స్) రాళ్లు, చెక్కుడు రాళ్ళు(చాపర్స్) ఆ రాతిపనిముట్లలో వున్నాయి. కొండపాకలో దొరుకుతున్న చేతిగొడ్డండ్లలో అండాకారంవి, బల్లెం మొన వంటివి, బాదాం కాయ ఆకారం గలవి ఎక్కువ వున్నాయి. ద్విపార్శ్వసౌష్టవ, ద్విముఖ, కుంభాకార గొడ్డండ్లే ఎక్కువున్నాయి. వాటిలో కొన్ని అవశిష్ట వల్కలాలతో వున్నాయి. కొన్ని ఆఘాతాలతో, కొన్ని మెత్తటి సుత్తె దెబ్బలతో చేసినవి వున్నాయి.
ఈ రాతి పనిముట్లలో 7అంగుళాల పొడవు, 4అంగుళాల చుట్టుకొలతలున్న ద్వికుంభాకార, ద్విపార్శ్వముఖ, ధీర్ఘలంబితమైన బల్లెపుటాకారపు గొడ్డండ్లు, 6 నుంచి 3.5 అంగుళాల పొడవు, 4 నుంచి 2.6 అంగుళాల చుట్టుకొలత లున్న బాదంకాయ ఆకారంలో ద్వికుంభాకారం, ద్విపార్శ్వముఖాలతో ట్రెపీజియం రూపంలో కనిపించే చేతిగొడ్డండ్లున్నాయి. మొత్తం లభించిన గొడ్డండ్లు 21. వాటిలో వాడనివి, కొత్తవి 9, వాడినవి, అరిగినవి 9, విరిగినవి 3. ఈ వివరాలతో ఈ ప్రదేశం కొత్తరాతియుగంలో పనిముట్ల కార్ఖానా అని చెప్పవచ్చు. ఇక్కడ లభించే గట్టివి, విరుగనివి అగ్నిశిలలను రాతిగొడ్డండ్ల తయారీకి వాడినారు. కొత్తరాతి యుగంలో ఇక్కడ పురామానవుల ఆవాసాలు పెద్దసంఖ్యలో వుండాలి. ఈ రాతిబోడుకు తూర్పున మోయు తుమ్మెద వాగులో కలిసే దక్షిణగంగ అనే నీటిప్రవాహం జాడలున్నాయి. సమీపం లోనే 2,3 కి.మీ.ల దూరంలోనే చిన్నగుట్టలున్నాయి. ఆహారం లభించే అడవులు, నీటివనరులు, పనిముట్లకు కావలసిన రాయి లభించే చోటనే పురాతన మానవులు ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. వేట, ఆహారసేకరణ నుంచి వ్యవసాయానికి ఎదిగిన కాలమే కొత్తరాతియుగం. ఒకప్పుడు పురామానవులు ఆవాసంగా చేసుకొన్న రాతిబోడులోని గుహ ఇపుడు గుడిగా మారిపోయింది. ఆ రాతిగోడలపై ఎరుపురంగు బొమ్మలుండేవని, సున్నం వేయడంతో మలిగిపోయాయని గ్రామస్తులు చెప్తున్నారు.
లభించిన రాతిపరికరాలలో అపూర్వమైన రెండువైపుల ఆయుధపుటంచులున్న (Double edged Hand axe) గొడ్డలి విశేషమైనది. ఏకపార్శ్వ కుంభాకారంతో 8అంగుళాల పొడవు, 4అంగుళాల వెడల్పులున్న ఈ పనిముట్టు ఇంతవరకు లభించిన వాటిలో ప్రత్యేకమైనది. చాలా అరుదైనది. ఇటువంటి గొడ్డండ్లు ఇనుముతో చేసినవి లభించాయి. యుద్ధంలో వాడే ఇనుప గండ్రగొడ్డలి పాత మహబూబ్ నగర్‍లో లభించినట్టు తెలిసింది. కాని, రెండంచుల ఆయుధంతో గొడ్డలి దొరకడం ఇదే ప్రథమం తెలంగాణలో.
కొండపాకలో మధ్యయుగాలనాటి ఆలయాలు, శిల్పాలు:
మల్లన్నగుట్ట:
గుట్టకు పడమటివైపున రాతియుగపు మానవుల ఆవాసమైన కొండగుహలో మల్లన్నదేవుడు కొలువై వున్నాడు. ఈ గుహలో శివలింగం, నంది వున్నాయి. గుహ బయట మహిషాసురమర్దిని నల్లరాతివిగ్రహం వుంది. శైలినిబట్టి చూస్తే ఈ శిల్పం విష్ణుకుండినుల కాలపుదనిపిస్తుంది. ఈ మల్లన్నగుట్టపైన రాతిగుండుకు చెక్కి శాసనంలో పేర్కొన్న భగవతి ఈ దేవతే కావచ్చు. గుట్టకింద విష్ణుకుండినుల కాలంనాటి పొడవైన ఇటుకముక్క ఒకటి లభించింది.
కాకతీయ త్రికూటాలయం:
కాకతీయుల కాలంలో ఎక్కటీలు నిర్మించిన శివాలయం ప్రసిద్ధమైనది. కొండపాక శివాలయంలో చాళుక్యులకాలంనాటి సప్తమాత•కల శిల్పఫలకం గుడిలో ధ్వజస్తంభానికి ఆనించి పెట్టివుంది. బయట పడవేసిన శిల్పాలలో చాళుక్యులకాలం నాటి లింగపీఠాలు, ఒక లింగపీఠంలో అమర్చిన శివలింగం కనిపించాయి. ఇక్కడి మల్లన్నగుట్ట దగ్గర లభిస్తున్న వస్త్వాధారాలు మనకు వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్రని తెలియచేస్తున్నాయి.
పోచమ్మగుడి:
ఇవేకాక పోచమ్మ గుడి దగ్గర ఉన్న విగ్రహాలు అపూర్వమైనవి. ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం కోసం గుంత తీసినప్పుడు జైన దేవాలయాలలో కనిపించే కలశంతో కూడిన ద్వారస్తంభం ఒకటి బయటపడ్డది. ఇక్కడ 10వ శతాబ్దానికి చెందిన నాగశిల్పం, 11వ శతాబ్దం నాటి మహిషాసుర మర్ధిని శిల్పం వున్నది. దేవత రౌద్రరూపంలో ఉన్నది. చేతిలో డాలు, కత్తి ధరించి, త్రిశూలంతో అసురవధ చేస్తున్నట్టుగా ఉన్నది, చతుర్భుజుడైన భైరవుని పైచేతులలో ఢమరుకం, త్రిశూలం, ముందుచేతులలో ఖడ్గం, రక్తపాత్ర వున్నాయి.
మరొక చోట పొలంపక్కన కాకతీయుల కాలం నాటి శైలిలో చతురస్రాకారపు పానవట్టంతో శివలింగం ఉంది. శివలింగం పక్కనే అంజలి ఘటించి నిల్చున్న భక్తాంజనేయుడు కొలువు దీరి ఉన్నాడు. ఈ రెండు విగ్రహాలు కూడా మట్టిలో కూరుకు పోతున్నాయి. అన్నింటిలో ప్రత్యేకం సరస్వతి శిల్పం. అర్ధపద్మాసనంలో కూర్చునివున్న దేవత వెనక చేతులలో అంకుశం, పాశాలు, ముందుకుడిచేతిలో అక్షమాల, ఎడమచేతిలో పుస్తకం వున్నాయి. ఈ శిల్పం శైలిరీత్యా 11వ శతాబ్దానికి చెందింది. జైన సంప్రదాయానికి చెందిన ఈ శిల్పం బాసరలో కొత్తగా లభించిన సరస్వతి విగ్రహంతో పోలివుంది.
కొండపాక శ్రీరాముని దేవాలయం:
కొండపాక గ్రామానికి 2కి.మీ.ల దూరంలో ఉన్న చిన్న గుట్ట మీద రామాలయం వుంది. పైకి వెళ్ళటానికి మెట్లు లేవు. కాలిబాట వుంది. గుట్ట పైకి పూర్తిగా చేరక మునుపే రెండు ఎత్తైన రాతిగుండ్ల నడుమ గుహాలయం కనిపిస్తుంది. గుహాలయంలోనికి ప్రవేశించడానికి అసాధ్యమైన ఇరుకు, లైట్లు వేసినా కనిపించనంత చిమ్మచీకటి, గబ్బిలాలు, వెగటు వాసన… లోపల గుడి ఎలా వున్నదో చూడలేని స్థితి. బయట గుడికి కుడివైపు రాతిగుండుకు చెక్కిన ఎత్తైన హనుమంతుడు, ఎడమవైపు రాతిగుండుకు చెక్కిన పన్నిద్దరాళ్వార్లు శిల్పాలు చక్కగా వున్నాయి.
గుడికి ఎదురుగా అడ్డంగా పాతివున్న రాతి స్తంభంపై 6గురు ఆళ్వార్లు, మిగిలిన 6గురి శిల్పాలు విరిగి చెట్టు మొద్దుల కింద వున్నాయి. ఇవి తప్ప అక్కడ మరే శిల్పాలు కనిపించలేదు. గుట్ట పైకి వెళ్ళే చోట హనుమంతుని దేవళం వుంది. అక్కడే ధ్వజస్తంభం వుంది.
పైన గుడికి దగ్గర పెద్ద కప్పురాయి వంటిది అటిటు రాతిగుండ్ల మీద ఆని వుంది. దాని కింద నలుగైదుగురు తల దాచుకునేంత జాగ వుంది. అక్కడ వుండేందుకు చేసుకున్న ఏర్పాటుకు గుర్తుగా గోడల జాడలున్నాయి. ఆ పరిసరాల్లో విరిగిన రాతిగొడ్డలి దొరికింది. కొత్తరాతియుగం జాడలకు అది ఒక సాక్ష్యం.
రామనవమినాడే ఆ గుడివద్ద జాతర వంటిది జరుగు తుందంటారు. నిత్యపూజాకైంకర్యాలు లేవు. కింద హనుమంతునికి నిత్యపూజలున్నట్టున్నాయి.
కొండపాక మల్లన్న గుట్ట, ఈ రాముల గుట్ట, ఊదరగుట్ట ఇవన్నీ పురామానవుల ఆవాసాలే. ఊదరగుట్ట మీద రాతిచిత్రాలు, మల్లన్నగుట్ట, రాముల గుట్టల మీద కొత్తరాతియుగం పనిముట్లు దొరకడంతో…ప్రాచీనకాలం నుంచి కొండపాక అటవీప్రాంతమంతా పురామానవుల జీవనసంస్క•తికి ఆలవాలమని చెప్పకతప్పదు.
కొండపాకలో చారిత్రక శాసనాలు:
మల్లన్నగుట్ట శాసనం:
కళ్యాణీ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లుని భార్య కవయిత్రి, బాలసరస్వతి బిరుదాంకితురాలు, లక్ష్మీదేవి మల్లన్నగుట్ట మీద వున్న భగవతిదేవతకు చేసిన దానశాసనం. ఈ శాసనం అసంపూర్ణం. ‘‘స్వస్త్యనవరత పరమకళ్యాణాభ్యుదయ సహస్రఫళ భోగభాగిని ద్వితీయ్య లక్ష్మీసమానెయ్యకళంగనెయాళ యాశ్రితజనకల్పవల్లీవిగ ప్రతిబ్రతాపనతి శ్రీమత్రిభువనమల్లదేవ వక్షస్థలనివాసినెయరప్ప బాలసరస్వతి లక్ష్మాదేవియరుక్ష్మీ కొణ్డపాకెయ భగవతీ సన్నిధానదోళు పొయ్యెందగళిమ్బ విగడింకె తప్పదొళు గంగప్రవాహ’’ (మెదక్ జిల్లా శాసన సంపుటి, పేజి నం.178, శా.సం. 83)
త్రికూటాలయ శాసనాలు:
రెండోది కాకతీయ చక్రవర్తి రుద్రదేవుని కాలం క్రీ.శ. 1194 ఏప్రిల్ 7వ తేదీ శాసనం. 130 మంది ఎక్కటీలు తమరాజు రుద్రదేవునికి పుణ్యంగా 12మర్తురుల భూమిని ‘తూమునాయమ’నే పన్ను లేకుండా చేసిన దానశాసనం. కొండపాకలో కమెండోలవంటి కాకతీయ సైనికులు (ఎక్కటీలు) కట్టించిన త్రికూటాలయం ప్రసిద్ధమైనది.
‘….కొండ/పాక నూంట ముప్పెం/డు ఎక్కటీలును రుద్ర/దేవ మహారాజులకుం బు/ణ్యముగాను స్వస్తిశ్రీమ/తు శకవర్షములు 1116/యవు ఆనంద సంవత్స/ర వైశాఖ శుద్ధ దశమి/గురువారము నాండు/ రుద్రేశ్వర దేవరం బ్రతి/ష్ట సేసిరి శ్రీ……..
(మెదక్ జిల్లా శాసన సంపుటి, 128వ శా., పేజి నం. 226)
మూడోది కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని కాలం, క్రీ.శ. 1225 జనవరి 13వ తేదీ నాటిది. కొల్లిపాక-70 గ్రామ శ్రీకరణాధికారుడైన గణపతి మంత్రి చక్రవర్తి అనుమతితో ‘తన మామ ఆదిత్యామాత్యుని పేర అయితేశ్వర దేవర, తాత పేర సోమనాథ దేవర, తండ్రి పేర కేశవనారాయణ’ దేవుళ్ళకు కట్టించిన త్రికూటాలయానికి ఎక్కటీల కోరిక మేరకు ‘సర్వమాన్య’ సహితంగా చేసిన భూదాన, ధన దానశాసనం.
(మెదక్ జిల్లా శాసన సంపుటి, 129వ శా., పేజి నం. 228)
మరొక శాసనం కొండపాక గ్రామం బయట చెలకలో రాతిగుండు మీద చెక్కబడివుంది. అది అపరిష్క•త శాసనం.
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698