బ్రిటిష్ సైన్యం హైదరాబాద్ ప్రజానీకానికి క్రికెట్‍ను పరిచయం చేసింది. సుమారుగా 1880 ప్రాంతంలో నగరంలో క్రికెట్‍కు బీజాలు పడ్డాయి. మొయినుద్దౌలా గోల్డ్ కప్ 1930/31కు పూర్వం హైదరాబాద్‍లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‍కు సంబంధించి ఏ రికార్డులు లభ్యం కావడం లేదు. 19వ శతాబ్ది చివరికాలం, 20వ శతాబ్ది మొదట్లో రాజా లోచన్ చంద్ ఈ ఆటకు ప్రధాన పోషకుడిగా ఉన్నట్లు చెబుతారు. మసూద్ అహ్మద్, అహ్మద్ అలీ, నజీర్ బేగ్, ఖుర్షీద్ బేగ్ లాంటి క్రికెటర్లు అప్పట్లో రాణించారు.
హైదరాబాద్‍ను సందర్శించి ఇక్కడ ఆడిన మొదటి విదేశీ జట్టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అథెంటిక్స్. ఆ జట్టు 1902/03లో భారతదేశంలో పర్యటించింది. ఆ జట్టు హైదరాబాద్‍లో ఆడిన మ్యాచ్‍లను ఫస్ట్ క్లాస్ క్రికెట్‍గా పరిగణించలేం. ఆ విషయాన్ని ధ్రువీకరించేందుకు అధికారిక రికార్డు లేవీ అందుబాటులో లేవు. క్రమక్రమంగా నగరంలో క్రికెట్ చక్కటి ఆదరణ పొందసాగింది. దేశంలో 1920, 1930 ప్రాంతాల్లో హిందువులు, ముస్లింలు, యురోపియన్లు, పార్సీల మధ్య క్వాడ్రాంగ్యులర్ టోర్నమెంట్లు జరిగేవి. దేశవ్యాప్తంగా క్రికెట్ బాగా ప్రాచుర్యంలోకి రావడంలో ఈ టోర్నమెంట్లు కీలకపాత్ర పోషించాయని చెప్పవచ్చు. హైదరాబాద్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. క్రీడల్లో మతపరమైన విభజనకు ముగింపు పలకాలని మహాత్మాగాంధీ కోరినప్పటికీ, క్వాడ్రాంగ్యులర్ / పెంటాగ్యులర్ టోర్నమెంట్స్ 1947 వరకు జరుగుతూ ఉండేవి. ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా వీటిల్లో పాల్గొనేవారు. ఈ క్రీడలో రాణించడాన్ని యువతరం సీరియస్ తీసుకోవడాన్ని కూడా ప్రోత్సహించేవారు.
నిజామ్స్ కాలేజ్, మెడికల్ కాలేజ్, మదరసా- ఐ-అలియా లాంటి హైదరాబాద్ విద్యాసంస్థ లు విద్యార్థులు ఈ క్రీడను ఆడడాన్ని ప్రోత్సహిస్తూ నగరంలో క్రికెట్ ఉన్నతికి దోహదపడ్డాయి. నవాబ్ మొయినుద్దౌలా, మహరాజా కిషన్ పర్షాద్, నవాబ్ సాలార్‍జంగ్ బహదూర్ ఈ ఆటకు పోషకులుగా వ్యవహరించారు. పాఠశాలలు, విద్యాసంస్థలు, క్లబ్స్ కోసం టోర్నమెంట్‍లు నిర్వహించేవారు. హెచ్‍యూసీసీ, ఎస్‍యూసీసీ లాంటి ప్రైవేటు క్లబ్‍లను ఔత్సాహికులు ఏర్పాటు చేశారు. అవెంతో ప్రసిద్ధి చెందాయి. క్రికెట్ లీగ్‍లు జరిగేవి.
నవాబ్ మొయినుద్దౌలా యత్నాల ఫలితంగా 1930 /31లో మొయినుద్దౌలా గోల్డ్ కప్‍తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ హైదరాబాద్‍కు చేరింది. ఆ టోర్నమెంట్‍లో మూడు జట్లు పాల్గొన్నాయి. హైదరాబాద్, మహరాజ్ కుమార్ ఆఫ్ విజయ నగరం మరియు నవాబ్ ఆఫ్ మొయినుద్దౌలాలు వీటిలో ఉన్నాయి. హైదరాబాద్ నగర వాసులు తొలిసారిగా ప్రపంచస్థాయి ఆటగాళ్ళను ఈ మ్యాచ్‍ల సందర్భంగా చూశారు. జాక్ హబ్స్, బెర్ట్ సట్‍క్లిఫె (ఇంగ్లీష్ టెస్ట్ తారలు) ఈ టోర్నమెంట్‍లో ఆడారు. వారితో పాటుగా ఇండియన్ ఫస్ట్ క్లాస్ సర్క్యూట్ లోని సి.కె. నాయుడు, వజీర్ అలీ, జేజీ నాల్వె, అమర్ సింగ్, నావోమాల్ జావోమాల్ లాంటి వారు కూడా ఇందులో పాల్గొన్నారు. వీరంతా 1932లో లార్డస్లో ఇంగ్లాండ్ జట్టుపై ఆడిన భారతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించారు.
1933 / 34లో డగ్లస్ జార్‍డిన్ నేతృత్వంలో ఎంసీసీ భారత్‍లో పర్యటించింది. ఆ జట్టు దేశంలో మూడు టెస్ట్ మ్యాచ్‍లు ఆడింది. 1934 జనవరి 25న జింఖానా గ్రౌండ్స్లో ఎంసీసీ జట్టు నవాబ్ ఆఫ్ మొయినుద్దౌలా జట్టుపై ఆడింది. హైదరాబాద్‍లో ఆడిన మొదటి అధికారిక విదేశీ జట్టు ఎంసీసీనే. ఆ విధంగా అది అంతర్జాతీయ స్థాయి క్రికెట్‍ను హైదరాబాద్ ప్రజానీకానికి అందించింది. ఎంసీసీకి చెందిన స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్ హెడ్లీ వెరిటీ బౌలింగ్‍ను హైదరాబాద్ ప్రజానీకం చూడగలిగారు. 40 టెస్ట్ మ్యాచ్‍లలో ఆడిన ఘనత ఆయనది. హైదరాబాద్‍లో జరిగిన మ్యాచ్‍లో మొదటి ఇన్నింగ్స్లో 5/63, రెండో ఇన్నింగ్స్లో 3/78 ఆయన రికార్డు. ఈ మ్యాచ్‍లో ముస్తాఖ్ అలీ, లాలా అమర్‍నాథ్, సీఎస్ నాయుడు నవాబ్ ఆఫ్ మొయినుద్దౌలా జట్టు తరఫున పాల్గొన్నారు. వీరందరికీ ఇంగ్లాండ్‍పై జరిగిన టెస్ట్ సిరీస్‍లో పాల్గొనడం అదే తొలిసారి. నవాబ్ మొయినుద్దౌలా బహదూర్ కృషి ఫలితంగా ఈ టోర్నమెంట్ ప్రమాణాలు క్రమంగా మెరుగుపడుతూ వచ్చాయి. ఈ టోర్నమెంట్‍తో ఎంతో మంది ప్రముఖ క్రికెటర్లు రూపుదిద్దుకున్నారు. 1934లో రంజీ ట్రోఫీ నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఛాంపియన్‍షిప్‍ను దేశంలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో స్థానికంగా క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, ప్రోత్సహించేం దుకు ఒక సంస్థ ఏర్పాటు అవసరమైంది. 1934 ఏప్రిల్‍లో నాదిర్‍షా చెనాయ్, డిఎన్ డిటియా, గణేశ్ రావు, హుసేన్ అలీ ఖాన్, ఎస్.అలీ రాజా, మహమూద్ హుసేన్ ఖాన్, పి.ఎఫ్. డురాండ్, దత్తాత్రేయ, రంగన్న తదితరులచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేయబడింది. దీనికి నవాబ్ తురబ్ యార్ జంగ్‍ను మొదటి అధ్యక్షుడిగా, ఎస్.ఎం. హాదిని సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఆ విధంగా 1934లో ఏర్పడిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నాటి నుంచి కూడా హైదరాబాద్, తెలంగాణ ఉమ్మడి పదిజిల్లాల్లో క్రికెట్ క్రీడ బాధ్యతలను చూస్తోంది. మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్ 1930-31 నుంచి 1937-38 వరకు, 1962-63 నుంచి 1973-74 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. దీనికి ఫస్ట్ క్లాస్ హోదా ఉండింది.
–ఎం.డి.కరీం, ఎ: 9618644771