పాఠశాలల పునః ప్రారంభం నేటి తరం బాలలు – మన తరగతి గదులు; సవాళ్ళు

బడులు తెరిచారు ఎవరి హడావిడి వారిది. విద్యాశాఖ పుస్తకాల పంపిణీలో, మౌలిక వసతులను బాగు చేయడంలో, ఉపాధ్యాయులకు సూచనలు చేయడంలో, బడి బాట కార్యక్రమ నిర్వహణలో బిజీ బిజీగా ఉన్నారు. ఉపాధ్యాయులు వేసవి సెలవులలో తమ పిల్లలతో విహార యాత్రలకు, పెళ్ళిళ్ళకు ఇతర ప్రయాణాలు చేసి బడులు తెరిచే నాటికి ఏమైనా ఇంట్లో పనులు ఉంటే చక్క బెట్టుకుని, బడులు తెరిచే మొదటి రోజు తప్పని సరి హాజరి ఉండాలి. కాబట్టి వారి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు బడులను సిద్దం చేయడం, పోయిన సంవత్సరం ఎవరైనా ఉపాధ్యాయులు మానేస్తే కొత్త వారిని నియమించుకోవడం, ఉపాధ్యాయులను తమ పాఠశాలలో పిల్లలను చేర్పించడం కోసం ఆయా ప్రాంతాలకు పంపి ప్రోత్సహించడం, కొత్త పుస్తకాలు, నోటు పుస్తకాలు అందుబాటులో ఉంచడం. యూనిఫామ్స్, టైలు, బెల్టులు, షూస్‍, సాక్స్లు సరఫరా చేసే వారితో సంప్రదింపులు ఇలా అందరూ బిజీ బిజీ అయిపోతారు కొత్త విద్యా సంవత్సరం ఆరంభంలో. కానీ పిల్లలు ఏమనుకుంటున్నారు. దాదాపు రెండు నెలలు ఇంటి వద్ద ఉండి బడులకు వేళాయే అని అందరి హడావిడిలో వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, వాళ్ళను బడులు ఉపాధ్యాయులు ఎలా అర్ధం చేసుకోవాలో తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది.


గత సంవత్సరం బడులు మూసినప్పుడు కేరింతలతో బడి చివరి రోజు పోయిన పిల్లలు, అదే కేరింతలతో బడికి తిరిగి వస్తున్నారా. ఎండా కాలం సెలవులలో వారి జీవితాలలో ఎలాంటి మార్పులు జరిగాయి అర్ధం చేసుకోవాలి.
పిల్లలందరూ ఒకే గుంపు కాదు అనేది అందరం అంగీకరిస్తాం. వారి సామాజిక ఆర్ధిక నివాస ప్రదేశాల నేపధ్యం చాలా భిన్నమైనది. ఒక్కో విద్యార్థి ఒక నేపధ్యం. ఈ రెండు నెలల కాలంలో ఒక్కో విద్యార్థిది ఒక్కో అనుభవం. ఈ అనుభవాలు చెడు అనుభవాలు కావచ్చు, సంతోషకరమైన అనుభవాలు కావచ్చు. రెండు నెలల తరువాత తరగతి గదికి వస్తున్న విద్యార్థుల మానసిక స్తితి గతులను వారితో సంభాషించే సమయం తీరిక మన బడులకు ఉండాలి. కానీ పిల్లల ద•క్పథం నుండి బడి కానీ, బడిని నిర్వహించే యాజమాన్యం కానీ ఆలోచించే పక్రియ ఇంకా లేవనే చెప్పాలి. ఇందులో ఆలోచించేది ఏముంది. బడికి వచ్చిన పిల్లలు చదువు మీద శ్రద్ద పెడితే సరిపోతుంది. సిలబస్‍ను మొదలు పెట్టి విద్యా సంవత్సరం ఆరంభిస్తే సరిపోతుంది కదా అనే వాదన చేయవచ్చు. అవన్నీ తల్లిదండ్రులు ఇంటి దగ్గర చూసుకునే విషయాలు బడికి అంత తీరిక లేదని కూడా వాదించవచ్చు.
మన బడికి వస్తున్న పిల్లల కుటుంబాలు అత్యధిక శాతం సామాజిక ఆర్ధిక వెనుకబాటు నుండి చదువుకు కదిలిన కుటుంబాలు. ఇంకా చెప్పాలంటే అత్యధిక శాతం మొదటి తరం బడికి వస్తున్న పిల్లలు, మొదటి తరం తమ పిల్లలను బడికి పంపిస్తున్న తల్లిదండ్రులు కూడా. ఈ కుటుంబాలలో ప్రతి నిత్యం ఏదో ఒక సంఘటన సంభవిస్తూనే ఉంటుంది. అది పిల్లల మీద చాలా ప్రభావమే చూపిస్తుంది. తల్లి లేదా తండ్రిని కోల్పోయిన విద్యార్థులు కొందరైతే అనారోగ్యంతో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలను కోల్పోయిన కుటుంబాల విద్యార్థులు కొందరు. అలాగే శ్రామిక కుటుంబాలు తాము నివసిస్తున్న ప్రాంతాలలో పని దొరకక వలస వచ్చిన కుటుంబాలు మరికొందరు. కొత్త ప్రదేశం, కొత్త బడి, కొత్త దోస్తులు, కొత్త ఉపాధ్యాయులు ఇలాంటి విద్యార్థుల మానసిక స్థితిని అర్ధం చేసుకుని విశ్వాసం ఇవ్వ వలసిన అవసరం ఎంతైన ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఘర్షణ వాతావరణం, మద్యానికి బానిసలై ఇంట్లో తగాదాలు, తల్లి దండ్రులు విడిపోవడాలు కూడా జరిగి పోయి ఉంటాయి. ఇలాంటి కొన్ని కుటుంబాలు కుటుంబ బాధ్యతలు తల్లి నడిపే కుటుంబాల పిల్లల స్థితి ఒక రకంగా, తండ్రులు నడిపే కుటుంబాల స్థితి మరో రకంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం నుండి వచ్చే పిల్లలు కూడా బడి తెరిచిన తరువాత బడికి వస్తుంటారు. మరికొన్ని సార్లు కారణాలు ఏమైనా కొన్ని కుటుంబాలు ఆడపిల్లలు కుటుంబ బాధ్యతలు మోసే కుటుంబాలు. ఇంట్లో అందరికీ వంట చేసి చిన్న పిల్లలు ఉంటే స్నానాలు చేయించి వారిని బడికి తయారు చేసి ఠంచను తయారై; మన బడికి వచ్చే పిల్లలు కూడా ఉంటారు. ఈ మద్య ఇద్దరమ్మాయిలు చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావించాలి. అనారోగ్యంతో తల్లి చనిపోయింది. తండ్రి మద్యానికి అలవాటుపడి ఏ మాత్రం బాధ్యత వహించడం లేదని చెల్లిని తీసుకొని హైదరాబాద్‍ వెళ్లాలని నిర్ణయం తీసుకుని దాదాపు 100 కిలోమీటర్ల దూరం నడక ప్రయాణం సాగించిన అమ్మాయి; తాను తన చెల్లి చదువుకునే అవకాశం కోసం చూస్తుంది. ఇలాంటి అమ్మాయిలకు బడి ఎంత నమ్మకం కలిగించాలి అనేదే ప్రశ్న. కొన్ని సార్లు తోటి విద్యార్థులు పాఠశాలలు తెరిచినా తిరిగి రారు. బడి ద•ష్టిలో అది డ్రాపవుట్‍ అయి ఉంటుంది లేదా ఆబ్సెంట్‍ అయి ఉంటుంది. కానీ తోటి స్నేహితులు ఎండాకాలం సెలవులలో ప్రమాదంలో చనిపోయిన సంఘటనలు లేదా వారి ఫ్రెండ్స్ కుటుంబాలు వేరే ప్రదేశాలకు వలస వెళ్ళి
ఉంటారు. ఇలాంటి సంఘటలు కూడా విద్యార్థులను వేధించే సంఘటనలే.


పట్టణ ప్రాంతాలలో పేద వర్గాలు నివసించే ప్రాంతాలలో నీళ్ళు ఒక రోజు విడిచి ఒక రోజు వస్తే వాటిని మెయిన్‍ రోడ్డు మీద ఉన్న డ్రమ్ములలో పట్టి మళ్ళీ ఆ డ్రమ్ముల నుండి తమ ఇళ్లలోకి మోసుకుని పోవాలి. ఈ పని ఎక్కువగా ఆడ పిల్లలు చేస్తుంటారు. వాళ్ళ అమ్మలు తెల్లవారక ముందే పనులకు వెళ్ళే కుటుంబాలు ఇవి. ఇదంతా బడి సమయం ముందు జరగాలి. ఒక్కో సారి ట్యాంకర్‍ అలస్యమైతే బడికి ఆలస్యమవుతారు. పిల్లలు ఆలస్యం ఎందుకు అయింది అని అడిగే బడి ఉంది కానీ కారణం తెలుసుకునే బడులు చాలా తక్కువ. ప్రతి బాత్‍ రూమ్‍లో నల్ల, డైనింగ్‍ హాల్‍లో నల్లా, చెట్లకు ప్రత్యేక నల్లా ఉన్న కుటుంబాల నుండి వస్తున్న నేటి తరం టీచర్లకు ఈ పిల్లల పరిస్తితి అర్ధం కావడం కొంచెం ఇబ్బందే. అయినా ఈ నేపధ్యం అర్ధం అయితేనే ఆ పిల్లలకు పాఠాలు బోధించే అర్హత అని టీచర్లు గుర్తించాలి. ఇటువంటి బాధ్యత గల పిల్లలకా నేను బోధించేదని గర్వపడాలి. అప్పుడే ఈ పిల్లలకు మా బడి, మా టీచర్లు అనే భావన కలుగుతుంది. ఎన్ని కష్టాలు ఓర్చుకుని అయినా ఈ దుఃఖాల నుండి బయట పడే మార్గం చదువే అని ఇంకా కసిగా చదువుతారు ఈ పిల్లలు.


మొత్తంగా కుటుంబాల అనిశ్చితి విద్యార్థులపై పడుతుంది. ఈ స్థితిని పాఠశాలలు అర్ధం చేసుకోవడం ఒక ఎత్తైతే, వారితో మాట్లాడి వారికి బడి విశ్వాసాన్ని పెంచినప్పుడే మనం చెప్పే పాఠాలు అర్ధం అవుతాయి. ఇలాంటి పరిస్థితులలో కేవలం పాఠ్యాంశాల బోధనే ధ్యేయంగా ఉంటే విద్యార్థులు చదువు పట్ల కేంద్రీకరించలేరు. ఇలాంటి పరిస్థితుల నుండి వస్తున్న విద్యార్థుల విద్యా సామర్ధ్యాల సాధనలో వెనుకబడి ఉన్నారని విద్యార్థులనే నిందించడం సరి అయిన పద్దతి కాదని గ్రహించాలి. ఇంకా కొంత మంది విద్యార్థులు బాల్య వివాహల విష వలయంలో చిక్కుకొని బడి మానేసిన తమ తోటి మిత్రుల గురుంచి ఆందోళనలో ఉన్న విద్యార్థులు. ఇది హైస్కూల్‍ స్థాయి బాలికల విషయంలో గమనిస్తాం. పెళ్ళైన విద్యార్థులు స్కూల్‍కు కేవలం డ్రాపౌట్‍ మాత్రమే కానీ తోటి తరగతి విద్యార్థులకు ఆందోళన కలిగించే విషయం.
ప్రయివేట్‍ స్కూల్‍ విద్యార్థుల పరిస్థితి మరో రకం. కనీసం ప్రతి కుటుంబంలో ఇద్దరు పిల్లలైన బడికి పోతున్న పిల్లలు ఉంటారు. ప్రభుత్వ బడులు అందుబాటులో లేక కొందరు, ప్రభుత్వ బడి మీద విశ్వాసం సన్నగిల్లిన వాళ్ళు మరికొందరు ప్రైవేటు విద్యాబాట పట్టి నోళ్ళు. బడులు తెరుస్తున్నారంటే ఈ తల్లిదండ్రుల కష్టాలు వర్ణనాతీతం. ఫీజుల కోసం, కొత్త డ్రెస్సుల కోసం, షూస్‍ సాక్స్ కోసం తమ తల్లిదండ్రులు అప్పులు చేయడం చూసిన పిల్లలు. చాలీ చాలని ఆదాయాలు, ఉపాధి తగ్గ వేతనాలు రాని కుటుంబాలు. గ•హ కార్మికులుగా పని చేసే తల్లులు, కూరగాయలు చిన్న వ్యాపారాలు చేసుకునే కుటుంబాలు. రోజు కూలీలుగా పని చేసే కుటుంబాలు. ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న కుటుంబాలు. బడులు తెరిచినప్పుడు తల్లి దండ్రుల మధ్య తమ చదువుల గురుంచి జరిగే ఘర్షణ ప్రత్యక్షంగా చూసిన పిల్లల మానసిక స్థితి కూడా అర్ధం చేసుకోవాలి. కొన్ని సందర్బాలలో పిల్లలే తమ తల్లి దండ్రులకు ఈ కష్టాలు ఎందుకని బడి మానేసిన పిల్లలు చాలా మందే ఉంటారు. వాళ్ళంతా మన బడి లిస్ట్లో డ్రాపవుట్‍ అయి డ్రాప్‍ బాక్స్లో నెంబర్లుగా మారిపోతారు తప్ప డ్రాపవుట్‍ వెనుక ఇంత తతంగం ఉందని బడికి తెలియదు.


ఇక మొదటిసారి అమ్మవడి వదిలి ఎల్‍కెజి, యూకేజీలలో చేరే పిల్లల అవస్థలు, మొదటి తరగతిలో చేరిన పిల్లల పరిస్థితి ఇంకా భిన్నమైనది. స్వేచ్చా వాతావరణంలో పెరిగి ఆట పాటలతో గంతులేసే పిల్లలు ఒక్క సారిగా క్రమశిక్షణ పేరుతో తరగతిలో బంది అయిన బాల్యం. ఇంటి దగ్గర రోజూ రంగు రంగుల డ్రెస్‍లు వేసుకునే పిల్లలు అందరూ ఒకే డ్రెస్‍లో కన్పించడం నుండి అన్ని ఆశ్చర్యాలే ఈ పిల్లలకు. వాళ్ళ మనసులో బుజ్జి బుజ్జి మాటలు కొన్ని సామాజిక మధ్యమాలలో చాలా చెక్కర్లు కొట్టడం మనము చూసాం. ఇన్ని రకాల సంఘర్షణల నుండి పిల్లలు మన బడికి రావడం అంటే మన తరగతి గదులన్నీ సమానమైనవి కావని ఎన్నో సామాజిక అసమానతలతో మిశ్రమ విద్యార్థుల కలయిక అని ముందుగా గ్రహించాలి. విద్యార్థుల మానసిక బలాన్ని పెంచే పక్రియ బడి నిర్వహించాలి. ఇది సిలబస్‍లో భాగం కావాలి. ఈ పరిస్థితులు కేవలం పేద వర్గాల పిల్లలకే కాదు. ఉన్నత వర్గాల పిల్లలకు ఉండే సమస్యలు వేరే రకం. ఆయాపాఠశాలలో కూడా తరగతి గదులన్నీ సమానవైనవి కావు అని గమనించాలి.
బడి అంటే పిల్లలు పాఠాలు చెప్పేదే కాదు బడి తమ జీవితాలలో భాగం అని భావించేలా ఉండాలి. టీచర్లతో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు అనే భావన కలిగించాలి. కొంత మంది విద్యార్థులు ఉదయం తినకుండానే స్కూల్‍కు పరుగెత్తుకొస్తారు. ఇంట్లో వంట చేయని కారణంగా కొందరైతే మరి కొందరు స్కూల్‍ లేట్‍ అయితే దండన ఉంటుందని కూడా తినకుండా స్కూల్‍కు పరుగెత్తుకుని వస్తారు. ఆకలితో ఉన్న విద్యార్థులు మేము తిని రాలేదు మాకు ఈ రోజు కొంత వెసులుబాటు ఇవ్వమని అడిగే సాంప్రదాయం ఉండే బడులు కావాలి. కొన్ని బడులలో కొంత మంది ఉపాధ్యాయులు ఈ అంశాలపై శ్రద్ద వహించి మధ్యాహ్న భోజనం కొంచెం తొందరగా ఇలాంటి విద్యార్థులకు తినే వెసులుబాటును ఇస్తున్నారు. ఇది ఒక వ్యవస్థీక•తం కావాలి. ఏదో కొందరి ఉపాధ్యాయుల చొరవ బాగానే ఉన్నా వ్యవస్థ స్పందించడం చాలా అవసరం.


ఇలాంటి తరగతి గదులను నిర్వహిస్తున్న టీచర్ల మీద అధిక భారం పడుతున్నది. పై అధికారులు సిలబస్‍ పూర్తి చేయమని వత్తిడి, పదవ తరగతి ఫలితాలు బాగా రావాలని జిల్లా అధికారుల వత్తిడి, పిల్లల హాజరుశాతం పెంచమని వత్తిడితో సతమత మవుతుంటారు. ఈ వత్తిడి నుండి తప్పించుకునేందుకు చాలా సార్లు పిల్లలను, పిల్లల తల్లి దండ్రులను బాధ్యులను చేస్తుంటారు టీచర్లు. నిజానికి తల్లిదండ్రులు చదువుకోలేదు కొంత మంది అంతో ఇంతో చదివి ఉంటారు. తల్లి దండ్రులు బడికి వచ్చినప్పుడు కానీ లేదా తల్లిదండ్రుల సమావేశాలలో టీచర్లు తమ పిల్లలపై ఫిర్యాదులు విని తమ నిస్సహాయతను వెలిబుచ్చుతారు. కొన్ని సార్లు తల్లిదండ్రులు ఇవన్నీ మాకు తెలియకనే కదా మీ బడులకు పంపుతున్నది మీరే ఏదో చేయాలి మా పిల్లల భవిష్యత్తు కోసం అని ప్రాధేయపడే తల్లిదండ్రులను మనం చాలా సార్లు చూశాం. టీచర్లు ఈ సవాళ్లను ప్రతి తరగతిలో పిల్లలు వస్తున్న నేపధ్యాన్ని సామాజిక అసమానతల సమాజాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. బడి ఇవ్వ వలసిన సహకారాన్ని ముందు టీచర్లు అర్ధం చేసుకోవాలి.


ఏదో కొంత మంది బాలలు కొన్ని ప్రత్యేకమైన సమస్యలతో బడికి వస్తున్నారు అనుకుంటే పొరపాటే. నేటి తరం బాలలు అంతా పరుగులు తీసే సమాజం రోజు రోజుకు మారుతున్న కాలంలో పుట్టిన వాళ్ళు. వాస్తవ ప్రపంచం కంటే సైబర్‍ ప్రపంచంలో జీవిస్తున్న
వాళ్ళు. పెద్దలుగా మనం పెరిగిన సమాజం ఇప్పుడు బాలలు పెరిగుతున్న సమాజానికి చాలా వ్యత్యాసం ఉందని పెద్దలుగా టీచర్లుగా ముందుగా గమనించాలి. ఈ తరం బాలలను చదువు చెప్పడమే కాదు వారికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండే నైపుణ్యాలను అందిపుచ్చు కోవాలి. అలా కాకుండా మా కాలంలో ఇలా కాదు అని పిల్లలను తప్పు బట్టడం వలన పిల్లలను మారుతున్న ప్రపంచానికి సిద్ధం చేయని వారమౌతాము. అత్యధిక శాతం బాలలు అనేక ప్రతికూల వాతావరణంలో జీవనం కొనసాగిస్తూ మన బడులకు వస్తున్నారు. ఈ వాతావరణంలో నుండి వస్తున్న పిల్లలు తాము ఈ సమాజంలో ఇమడలేమనే భావనలోకి వెళ్తారు. మరి కొంత మంది పిల్లలు స్మార్ట్ ఫోన్‍ / ఇంటర్నెట్‍లో ఎక్కువ సమయం గడుపుతున్నారని అనేక నివేదికలు తెలియచేస్తున్నాయి. ప్రతి నిత్యం టీచర్ల అనుభవంలో కూడా ఇదే రుజువు అవుతుంది. పిల్లల మనోభావాలు దెబ్బతిన కుండా నియంత్రించే మార్గాలు అన్వేషించాలి. పిల్లలకు నమ్మకాన్ని కలిగించే పద్ధతులు ఏమిటి, భయపెట్టి మార్పు సాధ్యమా, పిల్లలతో చర్చలతో సాధ్యమా అనే విషయాల మీద బడులు చర్చ చేయాలి. సామాజిక అసమానతల పట్ల తరగతి గదిలో చర్చ జరగాలి. వేసవి సెలవులలోతో పాటు ఇంటి వద్ద ఉన్న సమయాలలో బాలలు లైంగిక వేధింపులకు గురి అవు తున్నారని పలు నివేదికలు తెలియచేస్తున్నాయి. అటువంటి బాలలకు బడి భరోసా నివ్వాలి. వేధింపులకు గురి అయిన బాలలు విద్య మీద ద•ష్టి పెట్టడం చాలా కష్టం. తమకు జరిగిన అనుభవాన్ని టీచర్లతో చెప్పుకునే స్థానం బడి కల్పించాలి. ఇన్ని సవాళ్ళ మధ్య మన టీచర్లు బడిని నిర్వహిస్తున్నారని విద్యా శాఖ అధికారులు గమనించి టీచర్లకు అండగా ఉండాలి. వారి మీద పాలన పర వత్తిడులను తగ్గించాలి. బాలలు ఎదురుకుంటున్న నూతన సమస్యలను పరిష్కారాలు కూడా బోధనలో భాగంగానే చూడాలి. విద్యను కేవలం మార్కులు, పరీక్షలే కాకుండా బాలలను సమాజంలో మానవీయ కోణంలో చూసే పౌరులుగా తీర్చిదిద్దే ప్రధాన లక్ష్యాన్ని చేరుకుంటాము. అప్పుడే భావి తరాలను సమాజంలో మంచి పౌరులను తయారు చేసిన వారమౌతాము. ముందు తరాలు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఇబ్బందులలో ఉన్న ఇతరులకు అండగా ఉండాలానే స్ఫూర్తి నింపిన వాళ్ళము అవుతామని బడులే కాకుండా సభ్య సమాజం గుర్తించాలి.


తరగతి గదులలో ప్రజాస్వామ్య మూల సూత్రాలను పాఠాల రూపంలో ప్రశ్న జవాబుల రూపంలో మార్కుల రూపంలో బోధన పూర్తి చేస్తుంటాం. కానీ మన తరగతి గదులు మాత్రం ప్రజాస్వామిక పద్దతులు పాటించినట్లు కనపడవు. అవి అధికార దర్పం తోనే నడుస్తుంటాయి. తరగతి గదులు ప్రజాస్వామీకరణ జరిగిన నాడు విద్యార్థులకు తమ మనసులో మాటను చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి కూడా.
ఈ సమస్య టీచర్లు తీర్చే సమస్యలు కావు. పిల్లల మానసిక నిపుణులు ఈ విషయాల పట్ల ఆలోచించి పరిష్కారం చూపాలి. ముందుగా విద్యా శాఖ దీనిని ఒక సమస్యగా పరిగణించాలి. బెంగళూరులో ఉన్న NIMHANSఅనే జాతీయ సంస్థ ఈ విషయాల పట్ల అనేక సెమినార్స్ నిర్వహించారు. బాలలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల వారు శాస్త్రీయమైన విశ్లేషణ చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. మన విద్యా శాఖ ఈ సంస్థలో ఉన్న నిపుణులను సంప్రదించి మన తరగతి గదులను బాలల పక్షం వహించేవిగా బాలల మానసిక వికాస అభివ•ద్దికి తోడ్పడే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-ఆర్‍.వెంకట్‍ రెడ్డి
జాతీయ కన్వీనర్‍, ఎం.వి.ఫౌండేషన్‍
ఎ: 9949865516

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *