బాధిత జంతువులు – మానవ బాధ్యతలు – పర్యావరణం

చరిత్రలో ప్రధాన బాధితులు జంతువులే అంటాడు చరిత్రకారుడు యూవల్‍ నోవా హరారి. పెంపుడు జంతువులను కూడా సమధికంగానే చరిత్రలో అధికంగా మానవులు బాధించారనీ ఆయన పేర్కొన్నాడు. ఈ అభిప్రాయాలు వినడానికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి కానీ, ఇది తిరస్కరించలేని వాస్తవం. 1975లో పీటర్‍ సింగర్‍ ‘యానిమల్‍ లిబరేషన్‍’ అనే గ్రంధం ప్రచురించాడు. ఈ గ్రంధం కొంతయినా మనుషుల ఆలోచనల మీద ప్రభావం చూపింది. అసలు జంతువులు విముక్తి గురించి కొంతయినా ఆలోచించటానికి, కొద్దిగానైనా చర్చించటానికి ఈ పుస్తకం అవకాశమిచ్చింది.
యానిమల్‍ లిబరేషన్‍ గ్రంధం ప్రచురితమై ఏభై ఏళ్లు గడిచాయి. శాస్త్రవేత్తలు తమ అధ్యయనాన్ని జంతువుల గ్రహణశక్తి వాటి ప్రవర్తన, మానవులకు, జంతువులకు మధ్య ఉండే సంబంధాలపై కొనసాగించడానికి ‘జంతువుల విముక్తి’ గ్రంధం ఎంతగానో దోహదం చేసింది. సింగర్‍ చెప్పిన అభిప్రాయాలు తదనంతర శాస్త్రవేత్తలు జరిపిన కృషివల్ల ధృవీకరించబడ్డాయి. జంతువుల మృత కళేబరాలు మానవ ప్రగతికి దోహదకారులుగా నిలిచాయనేది కూడా వాస్తవమే. మన రాతియుగపు మానవ పూర్వీకులు పర్యావరణ విధ్వంసాలకు తొలి కారకులు. నలభై ఐదు వేల సంవత్సరాల క్రితం తొలి మానవులు ఆస్ట్రేలియా ఖండంలోకి ప్రవేశించాక తొంభైశాతం భారీ జంతువులు అంతరించటం అనేది వేగవంతమైంది. హోమో సీసియన్లు భూమిపైన, పర్యావరణ వ్యవస్థలపైన చూపిన ప్రభావానికి తొలి ఆనవాళ్లు ఇక్కడే కనిపిస్తాయి. అయితే ఇదేమీ చివరిది కాదు.


పదిహేను వేల సంవత్సరాల క్రితం మానవులు అమెరికాను వలసగా మార్చకున్నాక డెభ్బై ఐదు శాతం భారీ క్షీరదాలు ఈ క్రమంలో తుడిచిపెట్టుకుపోయాయి. ఆఫ్రికా, యూరేపియీ, ఇతర ద్వీపాల నుండి అనేక జాతులు, రకాలు అదృశ్యమైపోయాయి. ఒక దేశం తరువాత మరొక దేశం ఇటువంటి విషాదాల చరిత్రనే పురావస్తు శాఖ రికార్డులు తెలుపుతూ ఉన్నాయి. మానవులు ఉనికి, జాడ లేనప్పుడు పెద్ద పెద్ద జంతువులు సమృద్ధంగా వివిధ రకాలుగా వృద్ధిలో ఉన్నాయి. మానవుల జాడ కనిపించటం మొదలయ్యాక పలురకాల ఆయుధాలు, పనిముట్లు వాడకంలోకి వచ్చాక జంతువుల ఎముకలు శిలాజాల రూపంలో దొరకటం మొదలైంది. మానవులు తొలి విత్తనం నాటక ముందే తొలి లోహ ఆయుధం వాడక ముందే పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద జంతు సమూహాలు యాభై శాతం కంటే అధికంగానే అంతరించడం జరిగింది.
ఆ తరువాత కథ మనకు తెలిసిందే వ్యవసాయ విప్లవం ప్రారంభమయ్యాక మానవ – జంతువుల మధ్య సంబంధాలలో వచ్చిన మార్పులు చెప్పుకోదగినవి. సంచార వేటగాళ్లుగా, ఆహార సీకర్తలుగా ఉన్న మనుషులు స్థిర వ్యవసాయంలో కుదురుకొని పశు పోషకులుగా, జంతువులను మచ్చిక చేసుకొని జీవనం సాగించిన వారిగా కొత్త అవతారమెత్తారు. ఇది భూమిపై సరికొత్త జీవరూపం ప్రత్యక్షం కావడానికి నాంది పలికింది. అవే మచ్చిక చేసుకున్న జంతువులు. అయితే ప్రాధమిక దశలో ఈ అభివృద్ధి స్వల్ప ప్రాధాన్యాన్నే కలిగి ఉంటుంది. మనుషులు ఏ పదో పాతికో పశుపక్ష్యాదులను మచ్చిక చేసుకున్నప్పటికీ, మిగిలిన వన్నీ వన్యప్రాణులుగానే అసంఖ్యాకంగా మిగిలాయి. శతాబ్దాలు గడిచే కొద్దీ ఈ మచ్చిక చేసుకోవటం, పశుపోషణ సాధారణ నియమంగా మారింది. ప్రస్తుతం తొంభైశాతానికి పైగా జంతువులను మనిషి మచ్చిక చేసుకున్నాడు. వీటిలో పెద్ద జంతువులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నాయి. ఉదాహరణకు కోడినే తీసుకోండి. పదివేల ఏళ్ల క్రిందట దక్షిణాసియాలోని ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైన పక్షిజాతి. నేడు అది ఒక్క అంటార్కిటికా భూభాగంలో తప్ప భూమిపై ప్రతి ఖండం, ప్రతి ద్వీప ఖండంలోనూ పెంచబడుతూ ఉన్నది. కోళ్లు, ఆవులు, పందులు తదితరాలు ఇంతకు మునుపుకంటే విజయవంతంగా సంఖ్యాపరంగా పెంచబడుతూ ఉన్నాయి.


పెంపుడు జంతువులగా అవి ఉన్నప్పటికీ అవి బాధితమవుతూ ఉన్నాయి అనాదిగా. జంతురాజ్యంలో మిలియన్ల సంవత్సరాలుగా అనేక జంతుజలాలు పలు విధాలుగా బాధితులగానే మిగులుతూ ఉన్నాయి. మచ్చిక కాని జంతువులకంటే ఇవి మెరుగ్గానే ఉన్నట్లు, జీవిస్తున్నట్లుగా కనిపిస్తాయి. అడవి దున్నలు నీరు, ఆహారం, ఆవాసం కొరకు రోజులు గడుపుతూ తరచుగా సింహాలకు బలవుతాయి. లేదా పరాన్న జీవులనుండి ముప్పును ఎదుర్కొంటూ ఉంటాయి. అలాగే వరదలు, క్షామానికి గురువుతుంటాయి. వాటికి ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. దీనికి భిన్నంగా పెంపుడు పశువుల మానవుల పోషణలో, సంరక్షణలో
ఉంటాయి. ఆవులకు వాటి సంతతికి ఆహారం, నీళ్లు, ఆవాసం మనుషులు కల్పిస్తారు. అవి జబ్బు పడ్డప్పుడు చికిత్స చేయిస్తారు. ప్రకృతి వైపరీత్యాల నుండి, వాటిని ఆహారం కోసం వేటాడే జంతువుల నుండి కాపాడుతారు. అయితే అంతిమ వాస్తవం ఏమంటే అవి కబేళాలకు చేరటం కూడా జరుగుతుంది. మరి వాటి బతుకు, జీవనం అడవి దున్నలకంటే ఏ విధంగా మెరుగ్గా ఉన్నట్లు? పులో, సింహం బారినో పడటం కంటే, అవి మనిషి చేతనే వధశాలకు తరలింపబడటం ఏ విధంగా మెరుగుగా ఉన్నట్లు. తన ఆకలి కోసం జంతువులను వేటాడే సింహం క్రూరమైనదా లేక స్వార్థం కోసం వ్యధశాలకు చేరుతున్న మనిషి దయగల వాడా? ఇక్కడే హరారి ఒక ప్రశ్నవేస్తాడు స్టీల్‍ బ్లేడ్‍ల కంటే మొసలి దంతాలు దయగలవా? కర్కశమైనవా? అని.


పెంపుడు జంతువుల లేదా ఫాం జంతువుల అస్తిత్వం క్రూరంగా చేయబడుతున్నది. అవి మరణించే మార్గం కాదు అవి జీవించే లేదా పెంచబడే మార్గం క్రూరమైంది. పశుశాలల్లో పెంచబడే జంతువుల స్థితిగతులు ఏమిటి మనుషులకు వాటి మాంసం, పాలు, గుడ్లు, తోలు ఇతర జంతు కండరశక్తి అంతిమంగా వినోదం కావాలి. మరోవైపు వారికి అవి దీర్ఘకాలం జీవించి ఉండటం కావాలి. అవి పునరుత్పత్తి చేయాలి. వాటిని ఇటువంటి క్రూర స్థితి నుండి రక్షించటం అనేది ఎటు పోతుంది? ఒక వేళ మనిషి వాటికి ఆహారం, నీళ్లు ఇవ్వకుండా పాలు పిండుకుంటే ఉత్పత్తి తగ్గిపోతుంది. అవి త్వరగా చనిపోతాయి. మనుషులు జంతువులకు అనేక రకాలుగా ఇతర మార్గాలలో కూడా బాధను కలిగిస్తారు. అవి మనుగడలో ఉండేట్లు, పునరుత్పత్తి చేసేట్లు చేస్తూనే వాటిని బాధలకు గురిచేస్తాడు. జంతువులను పంజరాలలో బంధించటం, బోనుల్లో పెట్టటం, వాటి కొమ్ములు, తోకలు కత్తిరించటం, వాటిని వాటి దూడల్నించి వేరు పరచటం లాంటివి అనేకం చేస్తాడు. అవి తీవ్రంగా బాధలు పడుతూ కూడా సంతతిని వృద్ధి చేస్తాయి. డార్విన్‍ జీవ పరిణామ సిద్దాంతం చెప్పేదేమంటే జంతువుల సహజాతాలు, కోరికలు, ఉద్వేగాలు అన్నీ పరిణామం పొందుతాయి. ఎందుకంటే ఒకటి మనుగడ, రెండు పునరుత్పత్తి కోసం పశుశాలల్లో పెంచుతున్న ప్రాణులకు కావలసిన సామాజిక అవసరాలను మనిషి తీర్చడం లేదు అంటాడు నోవల్‍ హరారి.
అందుకు ఒక ఉదాహరణ కూడా యిచ్చాడు. ఒక లేగదూడను తన తల్లి నుంచి వేరు చేసి, చిన్న బోనులో ఉంచి పెంచారనుకోండి. దానికి వాక్సిన్‍ వేయించారు తగిన ఆహారం, నీరు అందించారు. తగిన ప్రాయం వచ్చాక కృత్రిమ పద్ధతిలో గర్భం వచ్చేట్లుగా కూడా చేశారు. నిష్పాక్షిక దృష్టితో చూస్తే ఈ దూడకు తల్లితో అనుబంధం ఏమీ ఉండదు. దాని అవసరాలన్నీ మనిషి కృత్రిమంగా తీర్చాడు. అయితే వ్యక్తిగత దృష్టితో పరిశీలించినప్పుడు ఆ దూడకు తన తల్లితో బంధం కలిగి ఉండాలనిపిస్తుంది. తోటి దూడలతో ఆడుకోవాలనిపిస్తుంది. ఈ కోరికలు తీరకపోతే ఆ దూడ తీవ్రంగా బాధకు గురవుతుంది. పరిణామవాద సైకాలజీ ప్రకారం ఇది ప్రాథమిక పాఠం. ఆ దూడకు ఆ అవసరం ఎందుకు ఏర్పడిందంటే వేల తరాల క్రిందటే అది రూపుదిద్దుకుని ఇప్పటికీ దానిలో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దాని మనుగడకు, పునరుత్పత్తికి అది అవసరం లేకపోయినా సరే, మనుషులకు వ్యవసాయ విప్లవం పశువుల వ్యక్తిగత అవసరాలు తీర్చనక్కర లేకుండానే వాటి మనుగడ, పునరుత్పత్తి చేయించగల శక్తినిచ్చింది. అయితే మచ్చిక చేయబడిన జంతువులు సమూహంగా అవి విజయవంతం అయ్యాయి కానీ, విడిగా అవి కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. గత కొన్ని శతాబ్దాలుగానే ఈ స్థితి మరింత దుర్భమైంది. సంప్రదాయ వ్యవసాయం పారిశ్రామిక వ్యవసాయ విధానానికి దారినిచ్చింది.


పరిణామాత్మకంగా వచ్చిన ఒత్తిడులు మనుగడ, పునరుత్పత్తి కాంక్షను పెంచాయి. అయితే ఈ వత్తిడులు లేని స్థితిలో ఉన్నా వాటి సహజాతాలు, కోరికలు ఉద్వేగాలు ఒక్కసారిగా మటుమాయం కావు. అవి మనుగడకు, పునరుత్పత్తికి సాధనాలు కాకపోయినప్పటికీ జంతువుల వైయక్తిక అనుభవాలను రూపుదిద్దుతూ ఉంటాయి. ఈనాటి భౌతిక, ఉద్వేగాత్మక, సామాజిక అవసరాలు నేటి ఆవుల, కుక్కల, మానవుల ప్రస్తుత స్థితిగతులను ప్రతిఫలించవు సరికదా, వేల సంవత్సరాల క్రిందట వీటి పూర్వీకులు ఎదుర్కొన్న పరిణామ క్రమ వత్తిడులను ప్రతిఫలిస్తాయి. ప్రస్తుతం ఆధునిక మానవులు తీపి పదార్థాలు తినడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకంటే రాతియుగపు మానవ పూర్వీకులు తీయనైన, పండిన పండ్లను ఆబగా తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ పండ్లను ఆరగించేవారు. ఆ అనుభవపు వత్తిడి పరిణామంలో ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది. అయితే ఇది మానవ మనుగడకు అవసరమైనది కాకపోయినా అది నిలిచే ఉంది.


ఇటీవల ఒక కంటైనర్‍లో తరలిస్తున్న పశువులలో ఇంచుమించు పదహారు పశువులు మరణించాయి. కారణం ఏమంటే ఆ కంటైనర్‍ను పోలీసులు పట్టుకున్నారు. ఇరవై గంటలకు పైగా వాటికి ఎటువంటి నీరు, పశుగ్రాసం అందలేదు. కనీసం గాల కూడా అందలేదు. ఆ రవాణా అక్రమమైనా సక్రమమైనా తరలింపబడుతున్న పశువులు వాటిపట్ల చూపవలసిన కనీస కర్తవ్యం కూడా చూపబడలేదన్నది వాస్తవం. పలు సాంకేతిక కారణాలు చూపినప్పటికీ వాటి మరణానికి బాధ్యులు ఎవరనేది తేలలేదు. పశువులే కాకుండా అనేక రకాలైన వన్య ప్రాణులు వేటకు బలవుతూనే ఉన్నాయి. వాటి వార్తలు వివిధ దినపత్రికల్లో చదువుతూనే ఉన్నాం. కానీ, పౌర సమాజం నుండి ఎటువంటి ప్రతి స్పందనా వ్యక్తం కాలేదు. పర్యావరణం పట్ల సరైన అవగాహన ఉన్న సమాజాల్లోనే ప్రతి ప్రాణి పట్ల మానవులుగా మనకు ఉండవలసిన బాధ్యత ఏమిటో తెలిసి వస్తుంది. లేదంటే అనేక ప్రాణులు, జంతువులు మూగగా రోదిస్తూ మానవులుగా మన నిర్లక్ష్యానికి, పట్టని తనానికి గురవుతూ, బలి అవుతూ ఉంటాయి.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *