తెలంగాణలో బౌద్ధం

జాతిపరంగా, దేశపరంగా వాడిన ఆంధ్ర శబ్దం మొట్టమొదట తెలంగాణకే చెల్లుతుంది. ఈ అంశాన్ని వాయు, మత్స్య పురాణాలేకాక బౌద్ధవాఙ్మయం నిరూపించింది. అంతేకాదు బౌద్ధం ఆచరించిన తొలి నేలగా ఈ ప్రాంతాల చరిత్రను బౌద్ధ సాహత్యమే తొలుత తెల్పింది. దాంతో తెలంగాణ చరిత్ర క్రీ.పూ.2500 సం।। నుండే ఉనికి (రికార్డు)లో ఉందన్న అంశం నిర్ధారితమైంది. ఇది బౌద్ధం వల్ల తెలంగాణకు కలిగిన లాభం.
‘‘సుత్తనిపాత’’ (పారాయణ వర్గ) ఈ ప్రాంతాన్ని ‘‘అంధక రట్ట’’గా పేర్కొంది. అస్సక, ములక రాజ్యాలు ప్రధానంగా నాటి షోడశ జనపదాల్లో పేర్కోబడ్డాయి. అస్సక దేశరాజధాని బోధన్‍ నిజామాబాద్‍ జిల్లా. ఈ అస్సక దేశంలో ములక విషయంలోని (కరీంనగర్‍) ప్రాంతాన్ని గూర్చి కూడా ఈ గ్రంథం తెలిపింది. పరమార్ధ జ్యోతికా వ్యాఖ్యానం కరీంనగర్‍ జిల్లాలోని నేటి బాదనకుర్తి ద్వీపాన్ని కవిటవన ద్వీపంగా గోదావరి మధ్యస్థమై దాన్ని గూర్చి తెలిపింది. నాటి బావరి అనే బుద్ధని సమకాలికుడైన బ్రాహ్మణుని గాథను గ్రంథస్తం చేసిందీ సుత్తనిపాత. ఈతని 16 గురు శిష్యులు. ఈయన ఆజ్ఞతో బుద్ధుని కలిసినారు. వీరిలో పింగియ మాత్రం తిరిగి తెలంగాణకు వచ్చినాడు. వీరి ప్రయాణమార్గం ఉత్తర తెలంగాణ నుండి శ్రాస్తి వరకు పేర్కొనబడింది. నాటి చారిత్రకుల వ్యాపార పథానికిది దగ్గరగా ఉంది. ఈ పింగియ తెలుగువాడే. నాడు నామాల చివర వుండే అయ్య, అన్న పదాలు చారిత్రకాధారాలతో లభించాయి. తిస్సమెత్తయ్య సుత్తనిపాతలో పేర్కొనబడ్డవాడు. కప్పడు మరొకడు. ఈతని పేరిట కప్పరాయ పేట నేటికీ కోటిలింగాల ప్రక్కన ఉంది. బుద్ధుని సన్నిహితుడైన పాయసి రాకుమారుని పేరిట పాయసిగా కప్పరాయపేట పక్కనే కరీంనగర్‍ జిల్లాలోని కోటిలింగాల పక్కగల మరో గ్రామం. మూడు బౌద్ధ స్థూపాలున్న గ్రామం పాశిగాం.


అంధకులు బౌద్ధానికి చేసిన సేవలో వారు నిర్మించిన అంధకవనాలు. ఇవి మహావగ్గలో పేర్కొనబడిన శ్రావస్తిలో ‘అంధవనం, రాజగృహలో అంధకవింద అనేవి, బౌద్ధానికి వ్యాఖ్యాన ప్రాయాలైన గ్రంథాలు అంధక భాషలో (తెలుగులో) వచ్చాయి. అప్పటికీ అంధక భాష ద్రావిడం నుండి విడవడి, ప్రాకృత మిశ్రితంగా వాడుకలోగల తెలుగే. శాతవాహనుల శాసనాల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతపు గ్రామ నామాలలో తెలుగు భాష ఉంది. సెరివణిజ్ఞ జాతకం తెలివాహ నది ఒడ్డునగల ఆంధ్రనగరాన్ని పేర్కొంది. తెలివాహ గోదావరి నది. దీని ఒడ్డునగల నగరం ఆంధ్రుల తొలిరాజధాని కోటి నగరం (నేటి కోటిలిగాల). ఇక్కడ శాతవాహనుల పూర్వరాజులైన గోబద, సమగోప, నరన వంటి ఆంధ్రరాజుల నాణేలు దొరికాయి.
ఈ పింగియ ఈ ప్రాంతంలో తొలుత బుద్ధుని దర్శించినవాడు. ఇతడు బౌద్ధం తాను ఆచరించి, తన గురువును బావరిని బౌద్ధం వైపు తిప్పి, తరువాత ఈ ప్రాంతాన్ని (ఉత్తర తెలంగాణను) బుద్ధ ధర్మానికి అంకితం చేసినాడు. ఈతని పేరిట నిజామాబాద్‍కు 150 కి.మీ. దూరంలో పింగళి అనే గ్రామం ఏర్పడింది. ఇది తరువాత అనేక తెలుగు వారి కుటుంబ నామమైంది. ఇది ఈ ప్రాంతపు తొలి బౌద్ధ క్షేత్రం. దీన్ని హ్యుయన్‍త్సాంగ్‍ దర్శించి Pingki-le అని రాస్తే బి.యస్‍.యల్‍. హనమంతరావు వంటి వారు వేంగి అని భ్రమపడినారు. ఇది పింగళి. నేడిది నిజామాబాద్‍ జిల్లా పక్కన పర్భణి తాలూకాలోనికి (మహారాష్ట్ర) పోయింది.


దండకారణ్యంలోని గోదావరి తీర భూములు అరణ్య జీవనులైన అంధకుల నివాస స్థానం. నేటికీ అదిలాబాద్‍ జిల్లాలో ‘అంధకులు’ అనే తెగ వారున్నారు. తెలంగాణ జనగణనలో వీరు 20వేలకు పైగా ఉన్నారు. ఐతరేయ బ్రాహ్మణం విశ్వామిత్రుడు శపించిన కాలం నుండి వీరిక్కడ నివాసంలో
ఉన్నారని భావించాలి. వీరిది అనార్యజాతి. అందుకే హిందూ ధర్మానికి ముందే బాగా ప్రచారంలోకి వచ్చిన బౌద్ధాన్ని ఈ ప్రాంతాలవారు బుద్ధుని బోధలనుండే స్వంతం చేసుకున్నారు. వీరి ఆహ్వానంతో బౌద్ధం తొలుత మధ్య ‘‘గోదావరి తీరం’లో వేళ్లూనింది. తైర్థికుల వల్ల రాజపథా లేర్పడి మరి శతాబ్దాలలో ఈ ప్రాంతపు ఉక్కు పరిశ్రమవల్ల వ్యాపారపథాలేర్పడి విదేశీయులనాకర్షించింది.
ఈ ప్రాంతాలనేలిన ఆంథ్ర రాజులు బౌద్ధాన్ని ఆచరించి ప్రచారం చేసారనడానికి కోటిలింగాల రాజకుమారుడు పాయసి సాక్ష్యం. పాయసిగాంలని నాలుగు బౌద్ధస్థూపాలు సాక్ష్యం. ఇవి తెలుగునాట అతి ప్రాచీన స్థూపాలు, వీటిలో అలంకారాలు ఏమీలేవు. స్తూపాలు కూడా చిన్నవే. ఒక్క కోటిలింగాల స్తూపం మాత్రం పెద్దది. బుద్ధుని సూక్తులు శిలా ఫలకాలుగా ఉన్న ఏకైక బౌద్ధక్షేత్రం కోటిలింగాల, క్రీ.పూ. 6వ శ నుండే ఇది రాజధాని నగరంగా విలసిల్లింది. శాతవాహనుల్లో తొలి రాజన్యుల కాలాన అనగా వారు రాజ్యాధికారంలో భాగస్వాములైన కాలాన (ఆంధ్ర భృత్యులుగా ఉన్నకాలాన) వీరి సైనిక కేంద్రాలుగా భావించాల్సిన కొండాపూర్‍, పెద్దబంకూరు, ధూలికట్ట, పింగళి, ప్రతిష్ఠానాల వంటివి, తరువాత వారి కుటుంబ వర్గాలకు రాజధానులుగా విలసిల్లినవి. ఈ ప్రాంతపు మట్టి కోటలు వీటికి సాక్ష్యాలు, ఇవి గ్రీకు రాయబారి మెగస్థనీస్‍ పేర్కొన్నవే.


చిముకుని తమ్ముడు కృష్ణుడు ఏలేనాటికి తిరిగి వైదిక ధర్మం ఆచరణలోకి వచ్చింది. బహుశ ఈ కాలానికి బౌద్ధం ఇతర ప్రాంతాల్లో కృష్ణా, విశాఖ తీరాల్లోకి వెళ్లి, ఉచ్ఛస్థితిలోకి పోయింది. తెలంగాణ బౌద్ధం (క్రీ.పూ.6వ శ నుండి (బుద్ధుని నుండి) క్రీ.పూ.2వ శతాబ్ది వరకే ప్రాభవంలో ఉందని భావించాలి.
ఈ ప్రాంతాల్లో బౌద్ధం ఇంత వైభవంలోకి రావడం వెనుక మరొక ప్రధానాంశం ఉంది. బుద్దుడు స్వయంగా తెలంగాణ కోటిలింగాలకు (నేటి కరీంనగర్‍ జిల్లా) వచ్చినాడు ఈయన రాకను, ‘‘అంతా’’కు వచ్చి ధర్మబోధ చేసినాడని యువాన్‍ ఛాంగ్‍ పేర్కొన్నాడు. అంతాలొ అంటే ఆంధ్ర అంటే నాటి తెలంగాణ రాజ్యాలు, అంతాలో అంత (ఆంధ్ర) ప్రాంతం ఇదే. ఇది తొలుత ఆంధప్రాంతమే కదా! బుద్ధుడు ‘గగదాటి కోటి గ్రామానికి వెళ్ళుదాం’ అని చెప్పినాడు. తిరుగు ప్రయాణంలో గంగ దాటుతుంటే ఇక్కడి ప్రజలు ‘మీరు వచ్చిన గుర్తు’గా ఈ నదికి గౌతమీ అనీ, మీరు దాటే తీరానికి గౌతమీ ద్వారమని పేరు పెట్టుకుంటామంటే బుద్ధుడు సరేనన్నాడు.
బుద్ధుడు ధాన్యకటానికి వచ్చాడని ఆంధప్రాంతపు చారిత్రకులు రాసినా వారిది ఊహే. ఏ ఒక్క ఆధారం చూపలేదు. మూడవ ధర్మచక్ర ప్రవర్తనకు వచ్చినాడని రాసినారు. రెండో ధర్మచక్ర ప్రవర్తనకే వచ్చే అవకాశం లేదు. (మొదటిది కాశీ దగ్గరి సారనాథ్‍లో నున్నది అందరూ అంగీకరించేది. రెండవది రాజగృహ అనే స్థలంలో జరుగగా నాటికి బుద్దుడు ఉన్నాడా అనేది కూడా సందేహించే అంశమేక్ష్మ ఇంక మూడవ దాని వరకు బుద్ధని నిర్మాణం జరిగింది.


గంగ ఒడ్డున ప్రాచీన కోటి గ్రామం ఎక్కడా లేదు. గోదావరికి గంగ అని పేరు ఉంది. బుద్దుని తిరుగు ప్రయాణంలో దానికి తీర ప్రాంతీయులు ‘గౌతమి’ అని గౌతమ బుద్ధుని పేరు పెట్టుకున్నారు. గౌతమి అన్నది గోదావరీ పురాణాల కాలంలో స్థిరపరచ బడ్డ పేరే. కోటి గ్రామం నేడు శైవం కారణంగా కోటిలింగాల. పైగా రాజధాని నగరం. ఈ రాజ్యపు కుఉడు లేదా రాజు పాయసి బుద్దుని ప్రత్యక్ష శిష్యుడే. బౌద్ధాభిమాని. ఇవన్నీ బుద్ధుడు ఇక్కడకు వచ్ఛాడనేందుకు సాక్ష్యాలు.


తెలివాహ నదిని కృష్ణానదిగా గుర్తించేందుకు కొందరు చారిత్రకులు ప్రయత్నించారు. తెలి తెల్లనిది, కృష్ణ నల్లనిది. చాలా స్పష్టంగా పేర్లు చెప్తుండగా తెలివాహ కృష్ణానది ఎలా అవుతుంది? ఈ బుద్ధుని రాకవల్ల ఈ తెల్లనది గోదావరి ప్రశస్తమై, జాతక కథలలో సెరివణిజ జాతక కథగా పేరు పొందింది. అది బౌద్ధులలో, బౌద్ధ వాఙ్మయంలో ప్రసిద్ధి పొందింది కనుకనే జాతక కథగా నిర్మించబడింది. ఈ జాతక కథలో బుద్ధుడు ‘ఆంధ్ర నగరం’కు వచిచనట్లు రాయబడింది.
అశోకుడు ఆంధ్రలో బౌద్ధం ఆచరణలో ఉందని తెలిపినాడు. అశోకుని 13వ శిలాశాసనం, ధాన్యకటకలోని అశోక స్తంభఖండ శాసనం తెలిపినదీ విషయం. ఆయనకు 3 వందల సంవత్సరాల ముందే బౌద్ధం తెలంగాణలో ఆచరణలో ఉంది. ‘బౌద్ధం’ బతికి బట్టకట్టి, జన జీవనాన్ని పరిమార్చిందీ అశోకుని రాకతోనే అన్న ఆంధ్రా ప్రాంతపు బౌద్దుల వాదన కూడా తప్పే. తెలంగానలోని తొలిదశ బౌద్ధం 6 వందల ఏండ్లది, మలిదశ అభివృద్ధి క్రీస్తు శకారంభం నుండి మరో 5 వందల ఏండ్లు కృష్ణా తీరం. ఆపై మిగతా ప్రాంతాలకు విస్తరించింది. ఐదు శతాబ్దుల అధిక కాలగమనంలో తెలంగాణ స్థూపాలు, బౌద్ధ నిర్మాణాలు శిథిలమైపోయినాయి.
తెలంగాణ ప్రాంతపు బౌద్ధధర్మానికి ఆనవాళ్లుగా నేటికీ మిగిలిన కొన్ని గ్రామల చరిత్రను కూడా తవ్వుకోవాలి.


తెలంగాణలోని ప్రసిద్ధ ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు:
1) ధూళికట్ట 2) కోటలింగాల 3) పాశిగాం 4) నేలకొండపల్లి 5) ఫణిగిరి 6) గాజులబండ 7) వర్ధమానుకోట (నల్గొండ) 8) ఏలేశ్వరం 9) కొండాపూర్‍ 10) చైతన్యపురి 11) నాగార్జునకొండ 12) తుమ్మలగూడెం 13) నందికొండ 14) బాసర 15) కారుకొండ.

-డా. సంగనభట్ల నరసయ్య
ఎ : 9440073124

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *