నవరత్నాలలో గోమేధికం

గార్నెట్‍ అందరికి బాగా తెలిసిన ఒక రత్నం. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. నాగరికత ప్రారంభ మైనప్పటి నుండి అన్ని సంస్కృతులలో దాని సులభ లభ్యత కారణంగా ప్రజాదరణ పొందింది. ఇది నవరత్నాలలో భాగం. రాహువుకు ప్రతీకగా భావిస్తారు. దీన్ని కలియుగరత్నం అనీ, విశ్వాసరత్నం (Gem of Faith) అని కూడా అంటారు.


గార్నెట్‍ అనే పేరు లాటిన్‍ పదం గ్రానాటస్‍(అంటే విత్తనాలు) నుండి వచ్చింది. దానిమ్మ గింజలకు గార్నెట్‍కు ఉండే దగ్గరి పోలిక ఒక కారణం కావచ్చు.
గార్నెట్‍ స్టీవెన్‍ (Steven Universe) విశ్వం అనే ప్రముఖ TVషోలో ఒక కల్పిత పాత్ర, రూబీ మరియు నీలమణి ప్రేమవల్ల ఫ్యూజన్‍ ద్వారా ఒకే వ్యక్తిగా మారాలని అనుకొని గార్నెట్‍గా మారిపోయాడు. ఇది కల్పితం అయినా రూబీకి గార్నెట్‍కు ఉన్న పోలికలను సూచిస్తుంది. చరిత్రకారుల ప్రకారం గార్నెట్‍ చాలా ‘‘అపార్థం చేసుకోబడిన రత్నం’’. అప్పటిలో దాని రంగువల్ల పొరపాటుగా రూబీ అని భావించబడేది.
పురాతన గ్రీకు పురాణాల ప్రకారం, పాతాళ దేవత హేడిస్‍ అంద మైన కన్య పెర్సెఫోన్‍ను (జియస్‍ కుమార్తె) ఒక సెలయేరు వద్ద చూసి ఆమెను మోహించి, తన భార్యగా చేసుకోవాలని పాతాళానికి తన వెంట తీసుకుని వెళ్ళాడు. ఆ పని జియస్‍కు కోపం తెప్పించినచో అనర్థం అని తెలిసి పెర్సెఫోన్‍కు దానిమ్మ గింజలు తినిపించాడు. వాటి రుచికి అలవాటు పడిన పెర్సిఫోన్‍ ప్రతి శీతాకాలంలో పాతాళానికి తిరిగి వచ్చేది. ఆ దానిమ్మ గింజలు గోమేధికాలుగా మారాయి మరియు అలా గోమేధికం జనవరి రత్నంగా మారింది.


గరుడపురాణం ప్రకారం రత్నాలన్నీ వధించబడిన బలిచక్రవర్తి శరీర భాగాలే! అలా గోమేధికాలు రాక్షసుడి గోళ్ళ నుండి పుట్టాయి వీటిని నాగదేవత మ్రింగి హిమాలయాల్లో వదిలేసింది.


చరిత్రలో గార్నెట్‍
భారతదేశంలో గార్నెట్‍ అనాదిగా వాడకంలో ఉంది. అరికమేడు తవ్వకాలలో బయటపడిన గార్నెట్‍ పూసలు ఇందుకు ఉదాహరణ. వరాహమిహిరుడు ప్రస్తావించిన 22 రత్నాలలో గోమేధికం ఒకటి. హెలెనిస్టిక్‍ మరియు రోమన్‍ యుగంలో ఎరుపు ఊదా రంగు గోమేధికాలు రత్నాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా ఉండేవి, సహజంగానే వీటి ఖరీదు ఎక్కువ. వీటిని ప్రధానంగా రోజువారి ఉపయోగం నుండి ఖరీదైన ఆభరణాల వరకు
ఉపయోగించే వారు, పురాతన ప్రపంచంలో ఇవి విడిగా సానపట్టిన రాళ్లుగా మరియు నగలో పొదిగిన మణులరూపంలో ఉపయోగంలో ఉండేవి.
పూర్వం ఐరోపా ఖండంలో వాడకంలో ఉన్న గార్నెట్‍ పూర్తిగా భారత దేశం నుండి వచ్చిందే.


ఆంత్రాక్స్ (గార్నెట్‍ గ్రీకు భాషలో) మరియు కార్బంకులస్‍ (లాటిన్‍) 300 BCనుండి రోమన్‍ సామ్రాజ్యం చివరి వరకు వాడుకలో ఉన్నాయి. గోమేధికంను ఆరవ శతాబ్దం వరకు యూరోపియన్‍ ఆభరణాలలో ‘‘ఆధిపత్యరత్నం’’గా పేర్కొనవచ్చు మరియు ఏడవ శతాబ్దంలో సాసానియన్లు, తరువాత ముస్లింలు అరబ్‍ దండ యాత్ర మొదలైన కారణాల వల్ల భారతదేశానికి సముద్ర మార్గాన్ని మూసివేయడం వలన యూరప్‍లో కనుమరుగైంది. క్రైస్తవ మతం కారణంగా ఖననం అలవాట్లు కూడా మారాయి. 300 BCనుండి 700 AD వరకు ఉన్న కాలాన్ని ‘‘గార్నెట్‍ మిలియనియం’’ అని కూడా అంటారు.
దీన్ని రాహు రత్నం, గోమేధిక, తమోమణి, గోమూత్ర, జంబు, పింగ స్ఫటిక, బహురత్న మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. గోమేధికం అంటే ‘‘గో మూత్రం వంటి’’ అని అర్దం.


తేనె రంగులో లేదా గోమూత్రం రంగులో ఉన్న రాయిని ఈ పేరుతో వ్యవహరిస్తారు.అయితే గార్నెట్‍ లు అన్ని ఒకే రంగులో ఉండవు. అనేకరంగుల్లో లభిస్తాయి. హెస్సినైట్‍ రకం గార్నెట్‍ మాత్రమే ఈ రంగులో ఉంటుంది. గార్నెట్‍ ఒక ఖనిజ కుటుంబం ఇందులో ముఖ్యంగా 6 రకాల గార్నెట్లు ఉంటాయి.


గార్నెట్‍ ఖనిజ సమాచారం
నెసోసిలికేట్‍ ఫార్ములా (ఆర్థోసిలికేట్‍ అని కూడా అంటారు)
సాధారణ సూత్రం: X3Y2(SiO4)3IMA
స్ఫటిక వ్యవస్థ (crystal system): ఐసోమెట్రిక్‍ క్రిస్టల్‍
రంగు- దాదాపుగా అన్ని రంగులలో ఉంటుంది, నీలిరంగు మాత్రం చాలా అరుదుగా ఉంటుంది
మోహ్స్ స్కేల్‍ కాఠిన్యం: 6.5-7.5
పారాగమ్యత ?(Diafanity): పారదర్శకంగా, అపారదర్శకంగా ఉంటుంది. అర్ధ పారదర్శకంగా కూడా ఉండొచ్చు.
విశిష్ట గురుత్వం: 3.1 నుండి 4.3
వక్రీభవన సూచిక (Refractive index):: 1.72 to 1.94


రకాలు:
Pyrope : Mg3Al2Si3O12
Almandine : Fe3Al2Si3O12

Spessartine : Mn3Al2Si3O12
Andradite : Ca3Fe2Si3O12
Grossular : Ca3Al2Si3O12
Uvarovite : Ca3Cr2Si3

అన్ని రకాల గార్నెట్‍లు ఒకే విధమైన భౌతికలక్షణాలు మరియు స్ఫటికరూపాలను కలిగి ఉంటాయి. కానీ రసాయన కూర్పులో విభిన్నంగా ఉంటాయి. విభిన్నజాతులు పైరోప్‍, అల్మండిన్‍, స్పెస్సార్టైన్‍, గ్రాసులర్‍, యువరోవైట్‍ మరియు ఆండ్రాడైట్‍ గార్నెట్‍లు రెండు ఘన, ద్రావణ శ్రేణులలో ఉంటాయి: అవి పైరోప్‍ – అల్మండిన్‍ – స్పెస్సార్టైన్‍ (పైరల్‍స్పైట్‍), (Mg,Fe, Mn) 3Al2 (SiO4)3 మరియుuvarovite-grossular-andradite (ugrandite), Ca3 (Cr, Al, Fe) 2 (SiO4) గార్నెట్‍ యొక్క రసాయన కూర్పు ఘన, ద్రవ శ్రేణిగ ఉండటంవల్ల కొన్నిసార్లు గార్నెట్‍లు మిశ్రమ రసాయన కూర్పుతో కూడినవిగా ఉంటాయి.


గార్నెట్‍ల లభ్యత:
ప్రపంచంలో దాదాపు అన్నిచోట్లా గార్నెట్‍లు లభిస్తాయి. ముఖ్యంగా టాంజానియా, మడగాస్కర్‍, కీన్యా, నమీబియా మరియు మాలి వంటి దేశాల్లో విరివిగా లభిస్తుంది. మడగాస్కర్‍లో పెద్ద మొత్తంలో లభిస్తాయి. శ్రీలంక, భారతదేశంలో గార్నెట్‍లు లభిస్తాయి. అమెరికా, రష్యా, చైనాలో కూడా దొరుకుతాయి.
రూపాంతర ప్రాప్తశిలలో (మైకా స్కిస్ట్లో గ్రాన్యులైట్‍ ఆంఫిబోలైట్‍ శిలలలో) గార్నెట్‍లు ఎక్కడ దొరుకుతాయి.
అగ్ని శిలలైన గ్రానైట్‍, పెగ్మటైట్‍లలో కూడా లభిస్తాయి.
పైరాక్సనైట్‍ వంటి అల్ట్రామాఫిక్‍ శిలలలో, పాలరాయిలో సంపర్క రూపాంతర మండలాలలో (Contact Metamorphic zone), ఇంకా బీచ్‍ సాండ్స్లో కూడ లభిస్తాయి.
భారతదేశంలో గార్నెట్‍ ఒరిస్సా, రాజస్తాన్‍, తెలుగు రాష్ట్రాలలో నెల్లూరు, శ్రీకాకుళం మరియు ఖమ్మం జిల్లాలలో లభిస్తాయి. తమిళనాడులో కోయంబత్తూరు, రామనాథపురం మొదలైన చోట్ల లభిస్తాయి.


తెలంగాణలో గోమేధికాలు:
ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంకు దక్షిణంగా గరీబ్‍పేట కొండ ఉంది. గార్నెట్లు ఇక్కడ మొదట ‘‘ద్వితీయ డిపాజిట్‍’’గా వోయ్సే 1833లో వివరించాడు. మీర్జా 1937లో ఇక్కడ జరిగిన మైనింగ్‍ గురించి వివరించాడు. ఫణి 2014 లో ఇక్కడ ఆల్మండిన్‍ స్పటికాలు దొరుకుతున్నట్టు తెలిపాడు. దీని కూర్పు 85% ఆల్మండిన్‍ గాను, 9.5% పైరోప్‍, మరియు 0.9% స్పెస్సార్టైట్‍గా ఉందనీ కుమార్‍ 1992లో తేలిపాడు. గరీబ్‍పేట ప్రొటెరోజోయిక్‍ యుగానికి చెందిన తూర్పు కనుమల బెల్ట్ యొక్క పశ్చిమ భాగంలో గోదావరి చీలిక లోయ దగ్గరలో ఉంది. ఇక్కడ అనేకమైన టెక్టోనిక్‍ ఒరోజెనిక్‍ ఎపిసోడ్‍లు జరిగినట్టు మరియూ సంక్లిష్టమైన భౌగోళిక చరిత్ర ఉన్నట్టు తెలుస్తుంది. కొత్తగూడెం – గరీబ్‍పేట ప్రాంతాలు ఖమ్మం స్కిస్ట్ బెల్ట్లోని వింజమూరు డొమైన్‍కు చెందినవి. ఇందులో మెటా అవక్షేపాలు మరియు మెటా అగ్నిపర్వత శిలులు కొద్దిగా మాఫిక్‍ (Mafic)మరియు గ్రానిటిక్‍ చొరబాట్లతో ఉన్నట్టు సుబ్బరాజు 1976లో వివరించారు.
జిఎస్‍ఐ నివేదిక ప్రకారం గార్నెట్‍ స్ఫటికాలు లోతైన గులాబీ రంగు మరియు గోధుమ ఎరుపు రంగులో ఉంటాయి. పరిమాణం 2 సెంటీమీటర్ల వరకు ఉంటుంది.ఈ ప్రాంతంలో మొత్తం అంచనా రిజర్వ్ 31 మిలియన్‍ టన్నులు. రాతిలో గోమేదికం శాతం 11 నుండి 19% వరకు అంచనా వేయబడింది. యెల్లందు యొక్క ఆగ్నేయంలోని హార్న్బ్లెండ్‍ గ్రానైట్‍ల నుండి గోమేదికాల యొక్క పోర్ఫెరోబ్లాస్ట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో నిమ్మకాయ పరిమాణంలో ఉన్న గార్నెట్‍లు కూడా దొరుకుతాయి అని NVBS దత్తా పేర్కొన్నారు.


గార్నెట్‍ ఉపయోగాలు:
ఆభరణాలు అలంకరణలో బాగా ఉపయోగపడుతుంది. కెంపులకు ప్రత్యామ్నాయంగా బాగా పనికొస్తుంది.
రత్నాలరకం కాని గార్నెట్‍ పాలిష్‍ వంటి పారిశ్రామిక
ఉపయోగాలకి పనికి వస్తుంది.
గార్నెట్‍ జియోబారామీటర్‍ గాను జియోథర్మామీటర్‍గా శాస్త్రీయ అధ్యయనాలలో పనికి వస్తుంది.
ఇండెక్స్ ఖనిజంగా కూడా పనికి వస్తుంది. లేజర్‍ ఆప్టిక్స్లో యాగ్‍ (YAG) గార్నెట్‍ పనికి వస్తుంది.
ఇంకా అధునాతన మరియు అధునాతన శాస్త్రీయ అధ్యయనాలలో గార్నెట్‍ చాలా బాగా ఉపయోగపడుతుంది.
కొన్ని రకాల గార్నెట్లు =జుజు మూలకాలు కలిగుంటాయి కాబట్టి =జుజు యొక్క వెలికితీత కోసం ఉపయోగించబడుతుంది.
ఆయుర్వేద ఔషధంగా కూడా గార్నెట్‍ పనికివస్తుంది.
గార్నెట్‍ రకాలు:
డెమోంటాయిడ్‍ గార్నెట్‍: ఇది ఆకుపచ్చ రకం గార్నెట్‍. దీని మెరుపు మరియు తేజస్సు వజ్రానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి దీనిని డెమోంటాయిడ్‍ లేదా డైమండ్‍ వంటిది అని పేరు వచ్చింది. రష్యాలోని ఉరల్‍ పర్వతాలలో మొదటి కనుగొన్నారు. అందుకే ఉరల్‍ ఎమరాల్డ్ అని కూడా అంటారు. ఇది రసాయనికంగా ఆండ్రాడైట్‍ గార్నెట్‍, కాల్షియం మరియు ఇనుములతోపాటు కొంత క్రోమియం కూడా ఉండటం వల్ల గ్రీన్‍ కలర్‍లో ఉంటుంది. నమీబియా, మడగాస్కర్‍, ఇటలీ, ఇరాన్‍ మరియు ఆఫ్గనిస్తాన్‍లో కూడా కొత్తగా దీన్ని కనుగొన్నారు. గుర్రపుతోక వలే కనిపించే సర్పెన్టైన్‍ చేర్పులవల్ల డెమోంటాయిడ్‍ గార్నెట్‍ విలువ పెరుగుతుంది.
సావోరైట్‍ గార్నెట్‍ : ఇది కూడా ఒక ఆకుపచ్చ రకం గ్రాసులర్‍ గార్నెట్‍, కాల్షియంతోపాటు క్రోమియం వెనాడియం జాడలు ఉండటం వల్ల ఆకుపచ్చ రంగు వచ్చింది. కెన్యాలోని త్సావో ఈస్ట్ నేషనల్‍ పార్క్ గౌరవార్థం సావోరైట్‍ పేరు పెట్టబడింది.
రోడోలైట్‍ గార్నెట్‍: ఇది రోజ్‍ పింక్‍ రకం పైరో/ అల్మాండెన్‍ గార్నెట్‍, గ్రీకు దేవుడు రోడాన్‍ పేరు మీదుగా రోడోలైట్‍ అన్నారు. ఇది మిశ్రమ గోమేధికం, కొందరు వ్యక్తులు ఈ పేరును రత్నంగా కాకుండా వ్యాపారనామంగా భావిస్తారు.
ఇండియా బ్రెజిల్‍ మరియు మొజాంబిక్‍ బెల్ట్ ఆఫ్రికన్‍ దేశాలలో లభిస్తుంది.
మాండారిన్‍ గార్నెట్‍ : ఇది స్పష్టమైన నారింజ పసుపు రంగు స్పెస్సార్టైట్‍/అల్మాండెన్‍ గార్నెట్‍. మడగాస్కర్‍, నమీబియా USAలలో దొరుకుతుంది. పురాతన కాలంలో చైనాలో నారింజ రంగు దుస్తులు ధరించడానికి ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే అనుమతించ బడ్డారు. దీని రంగు పోలిక వల్ల ఆరెంజ్‍ స్పెస్సార్టైట్‍కి మాండారిన్‍ గార్నెట్‍ అనే పేరు పెట్టారు. ఇది మిశ్రమ జాతి గార్నెట్‍. హాలెండైన్‍ మరియు కునేన్‍ స్పెస్సార్టైట్‍ వంటి వాణిజ్య పేర్లు కూడా దీనికి ఉపయోగంలో ఉన్నాయి.


రంగు మార్పుగార్నెట్‍: మలయా గార్నెట్‍ పైరోప్‍ మరియు స్పెస్సార్టైట్ల యొక్క మిశ్రమం, సాధారణంగా గులాబీ నుండి నారింజ రంగు వరకు ఉంటుంది కానీ కొన్నిసార్లు అవి పగటి కాంతిలో నీలం ఆకుపచ్చ మరియు ప్రకాశించే కాంతి (Incandescent light)లో ఊదా/ఎరుపు గులాబీ రంగులో కనిపిస్తాయి. ఈ రంగు మార్పుకు అధికమొత్తంలో వెనాడియం జాడలు కారణం. టాంజానియా మరియు మడగాస్కర్‍లలో లభించె ఈ గార్నెట్‍ నీలం గార్నెట్‍గా పరిగణించ బడుతుంది. బ్లూ గార్నెట్‍ చాలా అరుదుగా దొరుకుతుంది.
స్టార్‍ గార్నెట్‍: కొన్ని సార్లు సానపట్టిన గార్నెట్‍ ఉపరితలం పైన నక్షత్రం ఆకారంలో రేఖలు కలిగి ఉంటుంది. ఇవి గార్నెట్‍ అందాన్ని మరియు విలువను ఇనుమడింప చేస్తాయి. ఇవి రూటైల్‍/హెమటైట్‍ వంటి ఖనిజాల చేరికతో ఏర్పడతాయి. దీనిని ‘‘స్టార్‍ గార్నెట్‍’’ అంటారు. అమెరికాలో దొరికే ఇడాహో స్టార్‍ గార్నెట్‍ చాలా ప్రసిద్ధి చెందింది. గ్రేప్‍ గార్నెట్‍గా ప్రసిద్ధి చెందిన ఒరిస్సాలో దొరికే ఆల్మండీన్‍ రకం గార్నెట్‍ కూడా ఇదే రకం గార్నెట్‍.


గార్నెట్‍ vs గోమేధికం : సాంప్రదాయ రత్నశాస్త్రంలో పేర్కొన్న గోమేదికం అనే పేరు దాని రంగు మరియు భౌతిక లక్షణాలపై ఆధారపడి నిర్ణయించ బడ్డది. ఖనిజశాస్త్రపరంగా భిన్నమైన కంపోజిషన్‍లు ఒకే భౌతిక లక్షణాలను ప్రదర్శించగలవు. అటువంటి పరిస్థితులలో రత్నం పేరును నిర్ణయించడం కాస్త గందర గోళంగా ఉంటుంది. హెసోనైట్‍ గార్నెట్‍ గ్రాన్యులర్‍ రకానికి చెందినది. దీనినే దాల్చిన చెక్క రాయి అని కూడా అంటారు. గోమేధికం యొక్క రంగు వివరణ దీనితో బాగా సరిపోతుంది. విషయాన్ని మరింత క్లిష్టతరం చేయడానికి ఈ వర్ణన పసుపు జిర్కాన్‍తో కుడా సరిపోతుంది. కానీ గోమేధికం అనే పదాన్ని గార్నెట్‍కు మాత్రమే ఉపయోగించడానికి పరిశ్రమ మొగ్గు చూపుతుంది. ఈ పరిస్థితులలో గోమేధికం అనే పదం ఇతర రకాల గార్నెట్లకు కాకుండా హెసోనైట్‍కు మాత్రమే పరిమితం చేయబడుతుందని కొందరి అభిప్రాయం.


అరికెమేడు తవ్వకాలు:
తమిళనాడులో ఉన్న అరికమేడు పురావస్తు తవ్వకాల ప్రదేశం గోమేధికాలు మరియు గాజులను ఉపయోగించే పూసల ఉత్పత్తి పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. అయితే గోమేదికాల మూలం చాలాకాలం వరకు నిర్ధారించబడలేదు. పూసల తయారీకి ఉపయోగించే గోమేధికాలు అసలు మూలం 640 కి.మీ దూరంలో ఉన్న గరీబ్‍పేట అని ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గార్నెట్‍లో ఉన్న జోనింగ్‍ మరియు చేరికల అధ్యయనం ఆధారంగా గార్నెట్‍లు గరీబ్‍పేట సమీపంలోని డిపాజిట్‍ నుండి వచ్చినట్లు కనుగొనబడింది.


-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్‍ జనరల్‍ జిఎస్సై(రి)
ఎ: 9866449348

శ్రీరామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *