- నాడు 60% వరకు ఎండిపోయిన 700 ఏళ్ల మహా వృక్షం
- పునరుజ్జీవానికి చర్యలు చేపట్టిన అధికారులు
- సెలైన్ ట్రీట్‍మెంట్, రక్షణ చర్యలతో సత్ఫలితాలు
- అటవీశాఖ కృషితో చిగురించిన కొత్త ఊడలు
- ప్రస్తుతం 90 శాతం వరకు పచ్చని ఆకులతో కళకళ
- మళ్లీ పర్యాటకులకు అనుమతి
పురాతన పిల్లలమర్రి పూర్వస్థితికి తిరిగొచ్చేలా అటవీ శాఖ చేసిన కృషి ఫలించింది. సుమారు 700 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చెట్టు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. నాడు 60 శాతం వరకు ఎండిపోయి నిలువ నీడనిచ్చే పరిస్థితి లేకుండా పోయిన మహావృక్షం ప్రస్తుతం 90 శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ కనులకు విందు చేస్తోంది.
ఇదీ చరిత్ర: 700 ఏళ్ల క్రితం మొలకెత్తిన మర్రి మొలక క్రమేణా శాఖోపశాఖలుగా విస్తరించి క్రమేణా మొదలు ఎక్కడో అంతుచిక్కని మహావృక్షంగా ఎదిగింది. మహబూబ్‍నగర్ జిల్లా కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మర్రి చెట్టు పర్యాటకులను అలరించేంది. దాని చల్లని నీడన ప్రజలు సేద తీరేవారు. పిల్లలతో పాటు యువత ఊడల్ని పట్టుకుని ఊగేవారు. మొత్తం మీద ఓ పర్యాటక ప్రదేశంగా ఈ చెట్టు దేశ, విదేశీయుల్ని ఆకర్షించింది. అయితే సుమారు ఏడేళ్ల క్రితం (2017న డిసెంబర్ 16) ఈ మహావృక్షానికి సంబంధించిన భారీ కొమ్మ ఒకటి విరిగిపడింది. ఆ తర్వాత క్రమంగా మరికొన్ని కొమ్మలు విరిగిపడే దశకు చేరుకున్నాయి. దీంతో అటవీ అధికారులు దీనిపై దృష్టి సారించారు.
ప్రత్యేక ట్రీట్‍మెంట్‍తో: భారీ కొమ్మ విరిగిపడిన నేపథ్యంలో పిల్లలమర్రి పునరుజ్జీవం కోసం మెరుగైన చికిత్స అందించే బాధ్యతను అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ అటవీ శాఖకు అప్పగించారు. 2017న డిసెంబర్ 20నే పర్యాటకులు ఊడలపై కూర్చోకుండా, వాటితో వేలాడకుండా ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. అటవీశాఖ పరిశోధనా నిపుణుల సలహాలు, సూచనలతో ప్రత్యేక ట్రీట్‍మెంట్‍ను ప్రారంభించారు.
పిల్లర్ల రక్షణలో పిల్లల మర్రి
కొమ్మలు, ఊడలు విరిగిపోకుండా, కిందికి పడకుండా అధికారులు వాటికి సహాయంగా పిల్లర్లు నిర్మించారు. 2018 ఫిబ్రవరి నుంచి సెలైన్ బాటిళ్లతో పిల్లలమర్రికి ప్రాణం పోసే చర్యలకు ఉపక్రమించారు. ఒక బాటిల్ నీళ్లలో 20 ఎంఎల్ క్లోరోపైరిపస్ మందును కలిపి పడిపోతున్న ఊడలకు కట్టారు. లీటర్ నీళ్లలో 5 ఎంఎల్ క్లోరోపైరిపస్ మందును కలిపి ఊడల కింది భాగంలో పిచికారీ చేశారు. చెదలు పట్టిన భాగాన్ని తీసివేసి సల్ఫర్ ఫాస్పేట్ చల్లారు. ప్రతి 15 రోజులకోసారి పంచగవ్వ, హ్యుబ్రిక్ యాసిడ్ కూడా పిచికారీ చేశారు. ఈ నేపథ్యంలో చిగురిస్తున్న ఊడలు త్వరగా పెరిగి చెట్లకు ఆధారంగా నిలిచేలా ఊడలకు ప్లాస్టిక్ పైపులు (రూట్ ట్రైనర్) బిగించారు. అందులో ఎర్ర మట్టి, వర్మీ కంపోస్టు, కోకోపెట్, మాస్ (నాచు) నింపారు. దీంతో చెట్టుకు కొత్త ఊడలు వచ్చాయి.
అయిదడుగుల కంచె..
సీసీ కెమెరాలు
పిల్లలమర్రి మహావృక్షాన్ని సంరక్షించేందుకు అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. చెట్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా, తాకకుండా చుట్టూ దాదాపు ఐదు అడుగుల ఎత్తున కంచె ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వాచర్లను నియమించారు. ఎవరైనా ఫెన్సింగ్ దూకి చెట్టు వద్దకు వెళ్లి తాకినా, ఆకులను తెంపినా ఫైన్ వేయనున్నారు. 2017 డిసెంబర్ తర్వాత ఈ సంవత్సరం జులై నెలలో పర్యాటకులను అనుమతించనున్నారు.
రూ.40 లక్షల వ్యయం
పిల్లలమర్రి చెట్టు ట్రీట్‍మెంట్‍కు, చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.40 లక్షలు వ్యయం చేశాం. సందర్శనకు వచ్చేవారు పిల్లలమర్రి చెట్టును ఫెన్సింగ్ అవతలి నుంచే చూడాలి. చెట్టును తాకడానికి వీల్లేదు. ఎవరైనా తాకితే జరిమానా విధిస్తాం.
- సత్యనారాయణ, డీఎఫ్‍ఓ
మహబూబ్‍నగర్