ప్రమాదకారక పరిశ్రమలు – ప్రజా చైతన్యం – పర్యావరణం

భారతదేశంలో అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ యూనియన్‍ కార్బైడ్‍ కర్మాగారం గురించి మనకు తెలుసు. భోపాల్‍ దుర్ఘటన ద్వారా అటువంటి కంపెనీ ఒకటుందని మనకు తెలిసింది. డిసెంబర్‍ 4, 1984లో కర్మాగారంలో సంభవించిన ప్రమాదం కారణంగా మిథైల్‍ ఐసోసైనేట్‍ అనే విషవాయువు 46.3 టన్నుల మేరకు గాలిలో కలిసిపోయింది. ఆ అర్థరాత్రి కార్బైడ్‍ కంపెనీ సమీపంలో ఉన్న ప్రజలు నిద్రలోనే చనిపోయారు. ఆ దుర్ఘటన ప్రభావం వల్ల ఎంత భారీ నష్టం వాటిల్లిందో ఊహించడం కూడా కష్టమే. ఒక అంచనా ప్రకారం ఎనిమిది వేలకు పైగా ప్రజలు కన్ను తెరవకుండానే నిద్రలో తనువు చాలించారు. 5,00,000 మంది గాయపడ్డారు. అందులో యాభై నుండి డెభ్భై వేల మందికి పైగా శాశ్వతంగా వికలాంగు లయ్యారు. ఆ ప్రమాదం జరిగిన పదిహేనేళ్ల తరువాత కూడా నెలకు సగటున పది పదిహేను మందికి పైగా మరణించారని నివేదికలు స్పష్టం చేశాయి. ఇరవై ఏళ్ల తరువాత కూడా వికలాంగులయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉందట. ఈ 2024వ సంవత్సరానికి ప్రమాదం జరిగి నాలుగు దశాబ్దాలు దాటింది. ఇప్పటికీ ఎంతమంది ఆ విషవాయు ప్రభావంలో ఉన్నారో లెక్క తెలియదు.


చరిత్రలో పారిశ్రామికంగా జరిగిన దుర్ఘటనల్లో అదే పెద్దదని చెపుతారు. పరిశ్రమలు సృష్టించే ప్రమాదాలకు భోపాల్‍ గ్యాస్‍ సంఘటన ఒక ప్రతీకగా నిలిచిపోయింది. అటువంటి ప్రమాద భరితమైన పరిశ్రమలు, మానవాళికి ముపు•ను తెచ్చి పెట్టేవి, పర్యావరణ హానికారకమైనవి జనావాసాలకు సమీపాన ఈ నాలుగు దశాబ్దాలలో ఎన్ని పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయో పౌర సమాజానికి తెలియదు. నిజానికి మిక్‍ వాయువుల లాంటి విషవాయువులు చంపుతున్నాయో లేక ప్రమాద భరిత పరిశ్రమల స్థాపన వెనుక ఉన్న ధన సంపాదనాకాంక్ష, పెట్టుబడులు, లాభాపేక్ష చంపుతూ ఉన్నదో మనకు తెలియదు.


నిజానికి మిథైల్‍ ఐసోసైనేట్‍ అనేది ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యేది కాదు. నైట్రోజన్‍, కార్బన్‍, ఆక్సీజన్‍ల సమ్మేళనమే సైనేట్‍. వీటికి మిథైల్‍ కలిపితే లేదా కలిస్తే మిథైల్‍ ఐసోసైనేట్‍. సహజంగా దొరికేది కాదు కనుక దీనిని కృత్రిమంగా తయారు చేయాలి. రసాయన శాస్త్ర, పరిశోధనలు పరిశ్రమల పరివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. క్రిమి సంహారకాలు కీటక నాశినులు తదితరమైనవి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే రసాయన పదార్థమే మిథైల్‍ ఐసో సైనేట్‍ మిక్‍ (mic)సంయోగం చెందితే అది అతి తీవ్రంగా చర్య జరుపుతుంది. అప్పుడు సాధారణ సంరక్షణ సాధనాలనేవి ఏవీ దాని ప్రభావిత ఆర్గానిజమ్‍ను కాపాడలేవు. శరీరంపై పడితే తీవ్రమైన గాయాలు లేదా చర్మం కాలిపోతుంది. కళ్లు, ఊపిరి తిత్తులకు సోకినా అంతే. ఛాతీనొప్పి, ఊపిరాడని తనం, తీవ్ర ఉబ్బసం మొదలైనవి తక్షణమే సంక్రమిస్తాయి. అంధత్వానికి, తీవ్ర న్యుమోనియాకి అంతిమంగా కార్డియాక్‍ అరెస్టుకు మిక్‍ వాయువు దారితీయగలదు.


భోపాల్‍ గ్యాస్‍ లీక్‍ ఘటనలో పెద్దసంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణం ‘మిక్‍’ వాయువుకున్న ప్రభావిత శక్తే కారణం. మిక్‍ వాయువును పీల్చడం వల్ల భయంకరమైన అనారోగ్యానికి గురికావటం జరుగుతుంది. అసలు మిక్‍ వాయువును కృత్రిమంగా సృష్టించడానికి కారణం ఏమిటంటే? మానవ అవసరాలు, అవి పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయరంగం కావచ్చు, వ్యవసాయంలో అధిక ఉత్పత్తులు సాధించడానికి క్రిమి, కీటకాదులు అవరోధాలుగా నిలుస్తాయి. కనుక వాటిని సంహరించడానికి మిథైల్‍ ఐసోసైనేట్‍ ఉత్పాదన అవసరమైంది. ప్రమాదం జరిగింది కనుక, ప్రాణనష్టం, ఇతర తీవ్ర దుష్పరిణామాల వల్ల మానవులు బాధితులయ్యారు కాబట్టి మిథైల్‍ ఐసోసైనేట్‍ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాం. పారిశ్రామిక ఉత్పాదన అటు ప్రకృతిని, ఇటు శాస్త్రాన్ని గురించి తప్పకుండా ఆలోచించాలి. మిక్‍ లాంటి ప్రాణులకు, జీవ పదార్థానికి ముప్పు తెచ్చిపెట్టే వాయువులనో, రసాయన పదార్థాలనో కొత్తగా సృష్టించడం ఎందుకంటే వ్యవసాయాభివృద్ధి కోసం అని సమాధానం వస్తుంది. వ్యవసాయంలో ఉత్పాదకత పెంచేందుకు, అందుకు ఆటంకంగా నిలుస్తున్న క్రిమికీటకాలను నిర్మూలించేందుకు ‘మిక్‍’ వాయువును ఉత్పాదించడం జరిగింది. ‘హరితవిప్లవం’ను ఘనంగా కీర్తిస్తాం. ఆ విప్లవ సారధులను గౌరవిస్తాం.


ఆ విప్లవం కోసం మానవాళి చెల్లిస్తున్న మూల్యం గురించి తరచుగా మరచిపోతాం. అసలు మరిచి పోయేట్లు చేస్తుంది మానవ అభివృద్ధి చోదిత పెట్టుబడిదారీ వాదం. కార్బయిడ్‍ ప్రమాదం ఏ ఒక్క విడి వ్యక్తి వల్ల జరిగిన ప్రమాదం కాదు. అది ఒక వ్యవస్థాగత విధాన నిర్ణయ ఫలితంగా జరిగింది. కార్బయిడ్‍ కేసులో ఎన్నో వాస్తవాలు మరుగున ఉండిపోయాయి. లేదా వెల్లడించబడలేదు. అంత భారీ మొత్తంలో మిక్‍ నిల్వలున్నాయనే విషయాన్ని అధికారికంగా అది వెల్లడించలేదు. ఫ్యాక్టరీ నిర్మాణం, ప్లాంట్‍ రూపకల్పన చిన్నవో పెద్దదో ప్రమాదాలు సంభవించడానికి అవకాశాలు అనివార్యంగా గల పద్ధతిలో నిర్మించబడింది. అంత లోతుల్లోకి కూడా మనం పోనవసరం లేదు.


నిజానికి మిథైల్‍ ఐసోసైనేట్‍తో పని లేకుండానే 1978కి పూర్వం ‘సెవిన్‍’ అనే పురుగులమందుని కార్బయిడ్‍ కంపెనీ ఉత్పత్తి చేసింది. 1980ల నాటికి తక్కువ ఖర్చుతో అధిక ప్రభావశీలత గలిగిన ‘మిక్‍’ను వాడుతూ పురుగుల మందును ఉత్పాదించడం మొదలుపెట్టింది. అయితే జర్మనీకి చెందిన బేయర్‍ సంస్థ కొద్దిగా ఖర్చు ఎక్కువైనప్పటికీ సురక్షితమైన పద్ధతిలో ‘సెవిన్‍’ ను మిథైల్‍ ఐసోసైనేట్‍తో కూడిన క్రిమి సంహారకాన్ని ఉత్పాదించింది. ఈ ఒక ఉదాహరణ చాలు అటు బేయర్‍ కానీ, ఇటు కార్బయిడ్‍ కానీ రెండూ బహుళ జాతి సంస్థలే. బేయర్‍ సంస్థ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పదనలే కాకుండా, మానవుల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి పలు రకాల ఔషధాలను కూడా తయారు చేస్తుంది. భారతీయ మార్కెట్లో వాటిని విక్రయిస్తున్నది కూడా. ఒక విశ్వసనీయ సంస్థగా బేయర్‍ రైతుల నమ్మకాన్ని పొందింది. కానీ, మార్కెటింగ్‍కు సంబంధించి కార్బయిడ్‍ అధిక లాభాలను ఆశించింది. ‘మిక్‍’ వాడకుండా బేయర్‍ సంస్థ క్రిమి సంహారకాల ఉత్పత్తిని కొనసాగిస్తుండగా, కార్బయిడ్‍ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావ శీలత గల ‘మిక్‍’ను వాడుతూ ఉత్పాదన మొదలుపెట్టింది. నిజానికి కార్బయిడ్‍ గ్యాస్‍ లీక్‍ ప్రమాదం సంభవించక పోయినా క్రిమిసంహారకాలకు సంబంధించిన వాడకంలో అంతకు మించిన ముప్పు దాగి ఉందనేది పర్యావరణ పరంగా ఒక వాస్తవం. ఎప్పటికప్పుడు అధిక ప్రభావశీల సంహారకాలను వాడటం వల్ల, ఒక విధమైన తట్టుకునే శక్తిని ఆ క్రిమి, కీటకాదులు సంతరించుకుంటాయి. అప్పుడు అంతకు మించిన ప్రభావశీలత కలిగిన రసాయన పదార్థం ఏదో వాడవలసి వస్తుంది. ఇట్లా ఈ చక్రీయ స్థితి ఎప్పుడూ కొనసాగించవలసి వస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ మరింత, మరింత శక్తి శీలత అనేది అనివార్యమవుతుంది. కార్బయిడ్‍ మిక్‍ నిల్వలు భారీగా పెట్టిన కాలంలో అనూహ్యంగా క్రిమి సంహారకాల వాడకం తగ్గుముఖం పట్టింది. అధికంగా ఉత్పత్తి చేసింది కనుక డిమాండ్‍ తగ్గటంతో నిర్వహణ భారం పెరిగింది. 1984లో ప్రమాదం జరగక ముందు 1982లో మిక్‍ వాయువును పీల్చడం వల్ల ఐదుగురు కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. నిర్వహణలో నిర్లక్ష్యం గురించి హెచ్చరికలు చేసినా కార్బయిడ్‍ ప్లాంటు వారు పట్టించుకోలేదు. స్పందించలేదు. కార్బయిడ్‍ ప్లాంట్‍ దగ్గర పర్యవేక్షించవలసిన, వాయు కాలుష్య, పరిశీలనకు సంబంధించిన పరికరాల్లాంటివి ఏవీ కూడా స్థానిక నియంత్రణాధికారుల వద్ద లేవు కూడా. కార్మికులు తమ యూనియన్‍ ద్వారా జరిపిన సమ్మెలు, నిరాహార దీక్షల్లాంటివి పెద్దగా ఫలితాన్నివ్వలేదు సరికదా! సమ్మె కట్టిన కార్మికులపై ఫైరింగ్‍ కూడా జరిగింది.


కాలుష్య, ప్రమాదకారక పరిశ్రమల పట్ల ఎప్పుడు ప్రజలలో అప్రమత్తత, చైతన్యం పెరుగుతుందో ఏ ప్రజలు తమ పరిసరాలను పర్యావరణ హితంగా ఉంటే పరిశ్రమలలో తీర్చి దిద్దుకునే అవగాహన కలిగి ఉంటారో అప్పుడు మాత్రమే మెరుగైన ఫలితాలను చూడగలుగుతారు. ఈ దృష్ట్యా తమ పరిసరాలలోని పరిశ్రమల గురించి అవి సృష్టించే కాలుష్యం గురించి, సృష్టించబోయే పెను ప్రమాదాల గురించి ఆలోచన, ఆచరణ రెండూ కావాలి.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *