సులభవ్యాపార విధాన సమిధలుగా కార్మికులు

సులభ వ్యాపార విధాన భావనకు పురుడు పోసి, పెంచి పోషించినది ప్రపంచబ్యాంకు. మొదటగా 2002లో ‘వ్యాపారం చేయడం’ నివేదిక ద్వారా యీ విధానాలకు పునాది వేసింది. వ్యాపారం ప్రారంభం, నిర్మాణాల అనుమతులూ, విద్యుత్‍ లభ్యతా, ఋణ పరపతీ, పన్నులూ తదితర వర్తక విధానాలూ సులువుగా, ప్రోత్సాహకంగా వున్నాయా లేదా అన్నవి సులభ వ్యాపారానికి ముఖ్యం. వివిధ దేశాలు వాటి సులభ వ్యాపార విధానాలకు రూపమిచ్చాయి. వాటిని బేరీజు వేసి ఒక సులభ వ్యాపార సూచీలోకి కుదించి ఏటా దేశాల శ్రేణిని ప్రకటిస్తూ వచ్చింది ప్రపంచ బాంకు. మెరుగైన సూచీతో పెట్టుబడులకు అనువుగా వుండేందుకు భారత్‍ లాటి దేశాలు పర్యావరణ, భద్రతా చట్టాలను కూడా సులభ వ్యాపార విధానాల పరిధిలోకి తెచ్చాయి. ప్రపంచబ్యాంకు రూప కల్పన చేసిన సులభ వ్యాపార విధానాల అమలు తెలుగు రాష్ట్రాలలో తరచూ పారిశ్రామిక ప్రమాదాలకు కారణమవుతున్నది. ఏటా వందల ప్రాణాలు పోతున్నాయి. వాటిని అరికట్టడానికి నిజాయితీగా ప్రయత్నాలు శూన్యం. ప్రమాదం జరగగానే హడావుడి. అంతే. తరువాత షరా మామూలే. సులభ వ్యాపార సూచీని అవక తవకల కారణంగా 2020 తరువాత ప్రపంచ బ్యాంకు రద్దు చేసినా మన ప్రభుత్వాలు దాని ప్రభావం నుండి బయట పడ లేదు.


సంపన్న దేశాలలో సులభ వ్యాపార విధానాలు పర్యావరణ, భద్రతా నిబంధనల జోలికి పోవు. సడలించవు. సింగపూర్‍, జర్మనీ, స్వీడన్‍ తదితర దేశాలేవీ పర్యావరణ నిబంధనలను సరళీకరించ లేదు. అధిక రిస్క్ వున్న పరిశ్రమలపై కేంద్రీకరించి, తక్కువ రిస్క్ వున్న పరిశ్రమల నియంత్రణ క్రమబద్ధీకరించాయి. క్రమ బద్ధీకరించడమంటే ఆయా పరిశ్రమల ప్రమాద స్థాయిని క్షుణ్ణంగా బేరీజు వేసి, స్వల్ప ప్రమాదమున్న పరిశ్రమలను గుర్తించి వాటి నియంత్రణ భారాన్ని తగ్గించుకుని, భారీ ప్రమాదమున్న పరిశ్రమల నియంత్రణకు అధిక వనరులను కేటాయించి నిరంతర నిఘావుంచడం. అందుకు భిన్నంగా ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలపై నిఘా చెట్టెక్కించారు. అయినా, ఇండియా సులభ వ్యాపార రాంకు 2020 లో 63 కాగా సింగపూర్‍ 2, అమెరికా 6, స్వీడన్‍ 10, జర్మనీ 22 స్థానాలలో వున్నాయి. ప్రతి లక్ష మంది కార్మికులకీ 2023 లో పారిశ్రామిక ప్రమాద మరణాలు సింగపూర్‍ లో 0.99, 2021 లో జర్మనీలో 0.84, స్వీడన్‍ లో 0.77, జపాన్‍ లో 1.6, అమెరికాలో 3.6. తెలంగాణలో 5.77 (ఒక పత్రికలో వార్త ఆధారంగా కట్టిన లెక్క). నిజానికి మరణాలు కొన్ని రెట్లు వుండే అవకాశం వుంది. బ్రిటిష్‍ భద్రతా మండలి భారత పనిలో ప్రమాద గణాంకాలు అసమగ్రమనీ, వాస్తవం కంటే చాలా తక్కువనీ చెప్పింది. భారత్‍ లో ఈ మరణాలు 2007లో ప్రపంచంలో అత్యధికంగా 116.8 (వికీపీడియా). అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‍ఒ) ప్రపంచ దేశాల పనిలో ప్రమాద గణాంకాలు సేకరించి నివేదికలు విడుదల చేస్తుంది. ఆ నివేదికలలో భారత గణాంకాలు లేవు. భారత్‍ పనిలో భద్రత విషయంలో 52 అంతర్జాతీయ ఒడంబడికలపై సంతకం చేయ లేదు.


పైగా బలహీనమైన, అసమగ్రమైన పర్యావరణ చట్టాలను ఇంకా బలహీన పరచి దానిని సులభ వ్యాపారానికి ప్రోత్సాహకంగా భావిస్తున్నారు. అది తప్పని పై పనిలో మరణ గణాంకాలు తెలుపుతున్నాయి. కోవిడ్‍ కాలంలో రెడ్‍ కాటగిరీ మందుల పరిశ్రమలనూ, తరువాత ఇథనాల్‍ ఇంధన పరిశ్రమలనూ పర్యావరణంపై స్వల్ప ప్రభావం చూపే పరిశ్రమలుగా మార్చి వాటికి పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక సమర్పించి ప్రజాభిప్రాయ సేకరణ చేయవలసిన నిబంధనను తొలగించారు. తెలుగు రాష్ట్రాలలో మార్చిన నిబంధన పరిధిలో వందల సంఖ్యలో మందుల పరిశ్రమలకు అనుమతులిచ్చారు. కంపెనీలు నిర్మాణం చేపట్టినపుడు ప్రజలు తిరగ బడ్డారు. గట్టుప్పల్‍లో ప్రజలు ఉద్యమించి వ్యతిరేకించిన కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ జరప లేక పోయింది. అదే పరిశ్రమ నూతన విధానంలో అనుమతి తెచ్చుకుని నిర్మాణం చేయడానికి ఉపక్రమించగానే ప్రజలు మళ్ళీ తిరగ బడ్డారు. అలాగే మునుగోడు, తురకల ఖానాపూర్‍, ఇంకా ఎన్నో గ్రామాలలోనూ ప్రజలు అడ్డ తోవలో యిచ్చిన అనుమతులను తిరస్కరించారు. ఇథనాల్‍ పరిశ్రమలకు నీటి వనరులు భారీగా కావాలి. నిజంగా ఎంత నీరు వాడుతున్నారన్న అధ్యయనం లేదు. ఆంధ్రా లోని ఒక ఇథనాల్‍ కంపెనీ నీటి వనరులు చాలక విస్తరణను తెలంగాణకు మార్చుకుంది. తెలంగాణలో ఒక కంపెనీ అనుమతి పొందిన సామర్ధ్యంలో 38 శాతం స్థాయిలో పని చేస్తూ అనుమతి కంటే దాదాపు మూడు రెట్లు నీరు వాడినట్లు ప్రజల ఫిర్యాదులతో బయట పడింది. అదే కంపెనీ విధాన సరళీకరణ వాడుకుని నిర్మాణం చేయని ప్లాంటు నడుపుకునే అనుమతి పొందింది. ఏ సంపన్న దేశంలోనూ ఇలాటి సరళీకరణ జరగలేదు.


తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సింగపూర్‍ని ఆదర్శంగా ప్రకటిస్తుంటాయి కాని అక్కడి పాలనా ప్రమాణాలు పట్టించు కోవు. పనిలో భద్రత పాటించని బాధ్యులైన వారికి జైలు శిక్షలు వేస్తారు. ఒక రవాణా కంపెనీ డైరెక్టర్‍ శిక్షణ లేకుండా ఎక్స్ కవేటర్‍ వాడి ఒక కార్మికుడి మరణానికి కారణమైనందున అతనికి 5 నెలల 2 వారాల జైలు శిక్ష వేశారు. ఒక రిఫైనరీలో పని చేయడానికి భద్రతా అనుమతులిచ్చే అధికారి నిర్లక్ష్యం వల్ల ఒక కార్మికుడు చనిపోతే అతనికీ అదే శిక్ష వేశారు. నవంబర్‍ 2014లో, డ్యూపాంట్‍ హ్యూస్టన్‍ నగర పరిసరాలలోని లాపోర్ట్లో మిథైల్‍ మెర్కాప్టాన్‍ (MeSH) అనే అత్యంత విషపూరితమైన, మండే వాయువును సుమారు 24,000 పౌండ్లు గాలిలోకి విడుదల చేసింది. అది నలుగురు కార్మికులను చంపడంతో పాటు, ఇతర డ్యూపాంట్‍ ఉద్యోగులనూ గాయపరిచింది. ఇంకా డీర్‍ పార్క్తో సహా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో మరికొంతమంది ప్రజలు గాయపడ్డారు. డ్యూపాంట్‍ నేరాన్ని అంగీకరించడంతో మొత్తంగా 19.26 మిలియన్‍ డాలర్ల జరిమానా విధించి దానిలోని 4 మిలియన్ల డాలర్లతో ఆ ప్రాంతాన్ని జరిగిన పర్యావరణ హాని నుండి పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్లాంటు అధిపతికి రెండేళ్ళ ప్రజా సేవ శిక్ష వేసింది. ఆస్ట్రేలియాలో 2023 లో పనిలో భద్రతా ఆరోగ్యం చట్టాన్ని కార్మికుల మరణాలను హత్యా నేరంగా పరిగణించి 20 సంవత్సరాల వరకూ జైలు శిక్ష, 18 మిలియన్‍ డాలర్ల వరకూ జరిమానా విధించేలా సవరించారు. స్వీడన్‍ లో ప్రతి గుర్తించిన పని చోటులోనూ పనిలో భద్రతా ఆరోగ్య ప్రతినిధి వుంటారు. వీరందరూ కలిసి ప్రాంతీయ ప్రతినిధులుగా ఏర్పడి భద్రత అమలుపై నిఘా వుంచుతారు. కార్మికులు దోపిడీకి గురికాకుండా కాపాడేందుకు 1 జులై 2018లో తెచ్చిన చట్టంలో 10 సంవత్సరాల వరకూ జైలు శిక్ష వేసే వీలు కల్పించారు. భద్రతా ఉల్లంఘనలకు వేసే అత్యధిక జరిమానాను 1 జులై 2020 నుండి 10 మిలియన్‍ క్రోనా నుండి 500 మిలియన్‍ క్రోనాకు పెంచింది. ఇవేవీ వారి సులభ వ్యాపార విధానాలకు అడ్డు కాలేదు. మన దగ్గర పాల్‍ ఫార్మర్‍ చెప్పిన ‘‘కొందరి ప్రాణాలు అంత విలువైనవి కావన్న భావన ప్రపంచపు సకల అపసవ్యాలకు మూల కారణం’’ అన్న మాట నిరూపణవుతున్నది.


సులభ వ్యాపార సంస్కరణల కోసం నియంత్రణ సంస్థలను దిష్టి బొమ్మలుగా మార్చారు. అవి ప్రజల సొమ్ముతో నడుస్తున్నా ప్రజల కొరకు పనిచేయవు. పర్యావరణ, ప్రజారోగ్య, కార్మికుల ఆరోగ్య ప్రాణ రక్షణలకు గాక వ్యాపార ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పని చేసేలా మార్చారు. జవాబు దారీ తనమే లేదు. పారదర్శకత శూన్యం. నైపుణ్యం ప్రశ్నార్ధకం. వ•త్తిపర సవాళ్ళను ఎదుర్కొని వాటికి పరిష్కారాలు కనుగొనే అవసరం, సంస్కృతీ సంస్థలలో లేక ఉద్యోగ ధర్మానికి తగ్గ నైపుణ్యం ఎదగడం లేదు. ఉద్యోగ నైతిక విలువల ప్రకారం ప్రజల భద్రత, సంక్షేమమే విధిగా పని జరగడం లేదు. ఆయా సంస్థల పని సంస్కృతిలో విలువలు క్షీణించాయి. ఈ సంస్థల పనితీరులో ప్రాధమిక మార్పులు అవసరం. ఉదాహరణకి పర్యావరణ మంత్రిత్వ శాఖ, పిసిబి జవాబు దారీ లేని నిపుణుల కమిటీల పేరుతో అనుమతి నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ కమిటీలకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అనుబంధంగా పని చేస్తాయి. కమిటీలలో నిజమైన నిపుణులూ అరుదు. యుకెలో ఇఐఎ నివేదిక మూల్యాంకనం సంస్థలోని అధికారులే చేస్తారు. అందువల్ల అధ్యయనం, నైపుణ్య వృద్ధీ అనివార్యమవుతాయి. సంస్థ వాతావరణమూ అందుకు తోడ్పడాలి.


ఇక ఫాక్టరీ విభాగాన్ని చూస్తే ఫాక్టరీల సంఖ్య పెరుగుతోంది, విభాగం కుదించుకు పోతోంది. ప్రధానంగా ప్రమాదాలు రసాయన కంపెనీలలో జరుగుతున్నా సంబంధిత నైపుణ్యమున్న అధికారులు కరవు. ప్రమాద నివారణ చర్యలు కనపడవు. ప్రమాదం జరిగిన తరువాత ప్రజలకు వివరించడం చేయరు. పత్రికలలో ఊహాగానాలు వస్తుంటాయి. సరైన ప్రమాద దర్యాప్తు సామర్ధ్యం లేదు. అదే ప్రమాదాలు మళ్ళీ జరుగుతున్నాయి. జులై 2020లో విశాఖలో జరిగిన ప్రమాదమే ఒక ఫార్మాలో జూన్‍ 2023లో జరిగింది. ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెంలో జరిగిన పేలుడు ప్రమాదంలో 10 మంది చనిపోయారు. దర్యాప్తులో జాతీయ హరిత ట్రిబ్యూనల్‍ (ఎన్‍జిటి)కి తప్పుడు కారణాలు చూపారు. అదే కంపెనీ మరో రెండు చోట్ల అదే ఉత్పత్తి చేస్తున్నది. ఆ రీయాక్టర్‍లో రసాయన చర్య జరిగేప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని తొలగించడానికి చల్లబరచే వ్యవస్థ లేదు. అది సరి చేయకుండా అశాస్త్రీయంగా బండ పద్ధతులలో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. సరైన డిజైన్‍ మార్పులతో సమర్ధవంతంగా, ప్రమాదరహితంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. కాని భద్రత పట్ల కంపెనీల అలక్ష్యానికి, నియంత్రణ సంస్థల నిర్వహణా లోపాలు తోడై సహేతుక మార్పులు జరగడమే లేదు. అదే తప్పు చందాపూర్‍లో జరిగింది. చల్లబరిచే వ్యవస్థ లేక ఉష్ణోగ్రత పెరిగి రీయాక్టర్‍ పేలి పోయింది. ఆరుగురు చనిపోయారు. పంతొమ్మిది మంది గాయ పడ్డారు. ఉత్పత్తయ్యే రసాయనం పేలుడు స్వభావం కలది. ఏళ్లుగా ఫాక్టరీ అధికారులూ, కాలుష్య నియంత్రణ అధికారులూ చేసిన తనిఖీలలో ఆ తప్పులు గుర్తించ లేదు. పైగా ఆప్రాంత ఫ్యాక్టరీ అధికారి కంపెనీలను వెనకేసుకొస్తూ రీయాక్టర్‍ లాటి కీలక పరికరాలపై ఎట్టి పరిస్థితులలోనూ శిక్షణ లేని కార్మికులను కంపెనీలు పెట్టవని పత్రికలకు సెలవిచ్చారు. ఈ ప్రమాదంపై విచారణ చేసిన మాకు ఆ కంపెనీలో జరుగుతున్న ఉత్పత్తిపై కనీస అవగాహన గల ఉద్యోగి కనపడలేదు. ఆ పరిశ్రమలో రోజువారీ ఉత్పత్తి చేసే వారందరూ కనీస అర్హతలు లేని వారే. రీయాక్టర్‍ అదుపు తప్పుతోందని తెలుస్తున్నా ప్రమాద నివారణ చర్యలు ఏమి చేయాలో తెలియదు. కనీసం ఎవరికీ హాని జరగకుండా సురక్షిత ప్రదేశానికి పని వారందరినీ పంపాలనే ప్రాధమిక భద్రతా చర్య కూడా తీసు కోలేదు. యజమాని అక్కడ నిలబడితే, ఉద్యోగులు తమాషా చూస్తున్నట్లు అక్కడే నిలబడ్డారు. భద్రతా స్పృహ లేని యాజమాన్యం తప్పుకోమని హెచ్చరించలేదు. ఒక్కరికీ గాయం కూడా కాకుండా కాపాడే అవకాశం వున్నా భద్రతా అజ్ఞానంతో పట్టించు కోలేదు.


భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ జీవించే హక్కు కల్పించింది. అది ప్రాధమిక హక్కు. పొట్టకూటి కోసం ప్రమాదకర రసాయన కంపెనీలలో పనికి చేరిన కార్మికులూ, ఉద్యోగులూ పనిలో భద్రత కరవై, ప్రాణాలు కోల్పోతున్నారు. సులభ వ్యాపార విధానాలు కార్మికుల జీవించే హక్కుని పణంగా పెడుతున్నాయి. నియంత్రణ సంస్థలు భద్రత అమలు గాలికి వదిలేశాయి.

  • డా. కలపాల బాబూరావు
    ఎ : 94911 16543

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *