సమాజాన్ని చిత్రిక పట్టేది రచయితలే!

సమాజ సంస్కరణ, సమస్యల చిత్రణ రచయితల బాధ్యత అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‍ కె. లక్ష్మణ్‍ అన్నారు. ఆగస్టు 24 శనివారం తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డా.దేవులపల్లి రామానుజ రావు 107వ జయంతి సందర్భంగా జరిగిన సభలో ప్రముఖ కవి డాక్టర్‍ సీతారాంకు దేవులపల్లి రామానుజ రావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పరిషత్తు ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన
ఉత్సవంలో జస్టిస్‍ లక్ష్మణ్‍తో కలిసి పరిషత్‍ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సీతారామ్‍ను 25 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువా, ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్‍ లక్ష్మణ్‍ మాట్లాడుతూ 80 సంవత్సరాలుగా సారస్వత పరిషత్తు తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పరిషత్తు అభ్యుదయంలో లోకనంది శంకర నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, డాక్టర్‍ సి.నారాయణరెడ్డి వంటి పెద్దల కృషి ఎంతో ఉందని అన్నారు.


పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సారస్వత పరిషత్తు కృషి వెనుక డాక్టర్‍ దేవులపల్లి రామానుజరావు, డాక్టర్‍ సి నారాయణ రెడ్డి కృషి కీలకమని తెలిపారు. రామానుజ రావు ప్రతాపరెడ్డి వంటి పెద్దల మంచి స్ఫూర్తి పొంది తెలుగు భాష కోసం సాహిత్యం కోసమే తమ జీవితాన్ని ధారవోశారని శివా రెడ్డి వివరించారు.


పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్‍ జె.చెన్నయ్య స్వాగతో పన్యాసం చేస్తూ 50 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో సారస్వత పరిషత్తుకు సేవ చేస్తూనే ఆంధప్రదేశ్‍ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా, అధ్యక్షునిగా, రచయితగా, కవిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా రామానుజరావు బహుముఖీనమైన సేవలు అందించారని తెలిపారు. రామానుజరావు అల్లుడు, పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు మాట్లాడుతూ రామానుజరావు ఏ స్థాయిలో ఉన్నా క్రమశిక్షణ, సమయపాలన, నిస్వార్థ సేవా గుణం అనుసరించారని తెలిపారు. పురస్కార స్వీకర్త డాక్టర్‍ సీతారాం తమ స్పందన ప్రసంగం చేశారు.


-దేవులపల్లి రామానుజరావు
పురస్కార ప్రదానోత్సవంలో జస్టిస్‍ కె.లక్ష్మణ్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *