నదులు జనజీవన నాడులు సెప్టెంబర్‍ 22న ప్రపంచ నదుల దినోత్సవం

నదులు నాగరికతకు చిహ్నం. నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత పరిఢవిల్లినట్లు, అభివృద్ధి జరిగినట్టు తేటతెల్లమవుతుంది. నదుల గురించి అవగాహన కలిగించడం, నదుల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి జీవవైవిధ్యాన్ని కాపాడడం వంటి అనేక చర్యల ద్వారా జనజీవితాలకు, ఇతర జీవరాశులకు మేలు చేయడం కోసం బ•హత్తర కార్యాచరణతో ముందుకు సాగడం, నదుల పరిరక్షణ పట్ల అవగాహన కలిగించడం ప్రపంచ నదుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
2005లో, ఐక్యరాజ్యసమితి వాటర్‍ ఫర్‍ లైఫ్‍ డిక్లేడ్‍ను ప్రారంభించింది, మన నీటి వనరులను మరింత మెరుగ్గా చూసుకోవాల్సిన అవసరం గురించి మరింత అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. దీని తరువాత, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నది న్యాయవాది మార్క్ ఏంజెలో ప్రారంభించిన ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ప్రపంచ నదుల దినోత్సవం ఏర్పాటు చేయబడింది.


అపార జల సంపద కడలి పాలు!
నదీనాం సాగరో గతిః అనేది వాస్తవం. అయితే అది గతం. ఆర్థర్‍ కాటన్‍, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి వారు ఎంతగానో శ్రమించి లక్షలాది ఎకరాల భూమిని సశ్యశ్యామలం చేశారు. ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందంజలో ఉంది. అయినా ప్రతీచోట జలవివాదాలు తలెత్తుతున్నాయి. అపారమైన జల సంపద కడలి పాలౌతున్నది. పంటలకు, తాగునీటి అవసరాలకు వినియోగించవలసిన జలరాశులను సముద్రాల పాలు చేయడం బాధాకరం. మానవ విజ్ఞానం స్వార్ధంతో పెనవేసుకుని నదులను, జలరాశులను పూర్తి వినియోగంలోకి తీసుకురావడంలో అడ్డుపడుతున్నది. తాగడానికి గుక్కెడు నీరైనా లేని ప్రాంతాలెన్నో ఉన్నాయి. బంజరు భూములన్నీ నీరు లేక నెర్రలు తీస్తున్నాయి. కరువు ప్రాంతాలుగా కటిక దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాల ప్రజల జీవన దైన్యస్థితి ఒకవైపు, మరోవైపు అతి వృష్టితో అపారమైన జలవనరులు వృధాగా పోతున్నాయి.
సముద్ర జలాలనుండి ఉప్పు నీటిని వేరు చేసి, మంచి నీటిగా మార్చే డీశాలినేషన్‍ ప్లాంట్ల ఏర్పాటును భవిష్యత్తులో విస్తృతం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే 100 దేశాలకు పైగా డీశాలినేషన్‍ పక్రియను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అయితే వీటీ నిర్వహణ వ్యయం ఎక్కువ! అందుచేత ప్రస్తుతానికి భూమిపై నీటి నిల్వలను ముఖ్యంగా నదుల్లోని నీటిని సంరక్షించి, సాగు, త్రాగునీటికి వినియోగించాలి. వీటిని తరిగిపోకుండా చూడడమే కాకుండా నేటి కలుషిత వాతావరణంలో మనకందరికీ పరిశుభ్రమైన నీరు విధిగా అందించవలసిన బాధ్యత ప్రపంచ సమాజంపై ఎంతైనా ఉంది. ఈనాటికీ ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు.


నీళ్లు కూడా అందించలేని సమాజాలు
ప్రతీ మనిషికీ త్రాగడానికి, ఇతర అవసరాలకు సరిపడా కనీస నీటిని కూడా మనం అందించలేకపోతున్నాం. దాని ఫలితమే ఈ నీటికారక వ్యాధుల విజృంభణ. మరో దశాబ్దం నాటికి నీటి అవసరాలు మరింత పెరుగుతాయి.మనకు నదులు, సరస్సుల రూపంలో నీటి వనరుల లభ్యత ఉంది. కానీ అనేక రకాల కారణాల వల్ల మనం నీటి వనరులను సరిగ్గా వినియోగించుకోలేక పోతున్నాం. నీరంతా వృథాగా సముద్రం పాలౌతుంది. సరైన అవగాహన, చైతన్యం లేకపోవడమే దీనికంతటికీ ముఖ్య కారణం.
ప్రజల తాగునీటి అవసరాలను సాకుగా తీసుకుని కొంతమంది రక్షిత మంచినీటి సరఫరాను పెద్ద వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా పుంఖానుపుంఖాలుగా, పుట్టగొడుగుల్లా వ్యాపిస్తున్న రక్షిత నీటి సరఫరా విభాగాలపై ప్రభుత్వాలు కొరడా ఝళిపించాలి. వీటి సరఫరా ప్రమాణాల ప్రకారం సక్రమంగా జరుగుతుందా లేదా పర్యవేక్షించేందుకు తగిన యంత్రాంగం నెలకొల్పాలి. ప్రాణాధారమైన నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాలి. విషరసాయనాలు, ఇతర కలుషిత పదార్థాలు నీటిలో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుని మానవాళి మనుగడను పదికాలాల పాటు భద్రంగా కాపాడుకోవలసిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచ నదుల పరిరక్షణకు పటిష్ఠమైన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అవసరం. ప్రపంచ నదుల దినోత్సవం నదుల పరిరక్షణకు దోహదం చేయాలని ఆశిద్దాం.

  • సత్య ప్రసన్న
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *