ఆదివాసీ ‘గుస్సాడి’ నృత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసిన కనకరాజు ‘అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం’ (అక్టోబర్ 25) నాడు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహించి మొత్తం తెలంగాణ ఆదివాసీలకు గర్వకారణమైన ఆయన సేవలను ఒకసారి మననం చేసుకోవడం మన విధి. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్ల వాయి గ్రామానికి చెందిన కనకరాజు 1941లో జన్మించారు.
చిన్నతనం నుంచే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అంటే మక్కువ. ఆ క్రమంలోనే గుస్సాడి నృత్యకళపై అభిరుచిని పెంచుకున్నారు. పశువులను మేపడానికి అడవిలోకి పోయిన సందర్భంలో భుజం మీద కట్టెపుల్లను పెట్టుకొని టిక్కుటిక్కుమని శబ్దం చేసుకుంటూ తనే స్వతహాగా గుస్సాడి సాధన చేసేవారు.
నిరక్షరాస్యుడైన కనకరాజు బతుకుదెరువు కోసం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తూనే… ఊరూరా తిరు గుతూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. అంత రించిపోతున్న కళను బతికించారు. ఏటా దీపావళికి వారం రోజుల ముందు నుండే గోండు ప్రాంతా లలో దండారి పండుగ మొదలవుతుంది. ఈ పండుగ వారికి చాలా పవిత్రం. గ్రామదేవతల శుభప్రద ఆశీస్సులను ఇతర గ్రామస్థులకు అందించే ధన్యజీవులు గుస్సాడీలు.
వారు పొలికేక పెట్టి నాట్యం ఆపిన అనంతరమే వచ్చినవారికి ఆహ్వానాలు, పలకరింపులు మొదలవుతాయి. గుస్సాడీల చేతులలోని రోకళ్లను శంభు మహా దేవుని త్రిశూలంగా భావించి అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివుని ప్రతిరూపాలుగా భావించి వారి వస్తువులు, సంగీత పరిక రాలను (ఎత్మసూర్ పెన్) పూజిస్తారు. అందరూ కలసి గుస్సాడి నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు భోజనం వడ్డిస్తారు.
దండారీలో గుస్సాడీలు, పోరిక్‍లు ప్రముఖ పాత్ర వహిస్తారు. నెత్తి మీద నెమలి ఈకలు, పెద్ద టోపీ లతో ముఖానికి, ఒంటికి రంగులతో మెడ నిండా పూసల దండలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో గంగారాం సోటితో గంతులు వేసుకుంటూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
ఈ కళ అంతరించి పోకూడదనే ఉద్దేశంతో అప్పటి ఐఏఎస్ అధికారి మడావి తుకారాం ప్రత్యేక చొరవ తీసుకుని కనకరాజును ప్రోత్సహించారు. దీంతో కనకరాజు శిక్షకుడిగా మారి 150 మందికి ఐదు రకాల దరువులతో కూడిన డప్పు సహాయంతో శిక్షణ ఇచ్చారు. 1976 నుండి వరుసగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవా లలో ప్రదర్శనలు ఇప్పించారు.
1981లో ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. 2004లో ఎర్ర కోటలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముందు ప్రదర్శించారు. కొన్ని సినిమాలలో కూడా ఈ కళను ప్రదర్శించారు. కనకరాజు గుస్సాడి నృత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని ఇచ్చి గౌరవించింది.
ఎనిమిది పదుల వయసు దాటినా, గుస్సాడిని బతికించడానికి మరో 30 మందికి శిక్షణనిచ్చారు. గుస్సాడి కళను వెలుగులోకి తెచ్చిన సామాన్యుడైన కనకరాజు ఈనాటి కళాభిమానులకు ఆదర్శప్రాయుడు. కనకరాజుకు నివాళిగా ఆయన శిష్యులు మరింతగా ఈ కళను ప్రపంచవ్యాప్తం చేస్తారని ఆశిద్దాం.
-గుమ్మడి లక్ష్మినారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ
94913 1840