20వ శతాబ్ది ప్రధమార్ధ భాగంలో భారత రాజకీయ, సాంఘిక, మతవిశ్వాసాల రూపురేఖలపై చెరగని ముద్రవేసిన విప్లవ నాయకుడు, మానవ హక్కుల పోరాట యోధుడు, సంఘసంస్కర్తగా, న్యాయవాదిగా ఆర్థికవేత్తగా, ప్రజాప్రతినిధిగా, బ్రిటిష్ రాజ ప్రతినిధి కార్య నిర్వాహక మండలి సభ్యునిగా, భారత రాజ్యాంగ రూపశిల్పిగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, బహుముఖ ప్రజ్ఞాశీలిగా సమాజానికి సేవలు అందించి భారతరత్నమై నిలిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
1891 నుండి 1956 వరకు ఆరు దశాబ్దాల పైబడి ఆయన రచనల విస్తృతి చేసిన ఉద్యమాల ఉధృతి నడిపించిన స్వరాల సవ్వడి చూస్తే దిగ్భ్రమ కలుగుతుంది. దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన మతరహిత, కులరహిత ఆధునిక దేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటము చేశారు. చిన్న నాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరు ఎదురు కొనకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చరిత్రాత్మకమైనవి. డిసెంబర్ 6న ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
అంబేద్కర్‌లోని తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ అయినా వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో రాసుకున్నారు.
అంబేద్కర్ జీవిత నేపథ్యము
భీమ్ రావు రాంజీ అంబేడ్కర్ 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించాడు. తండ్రి రాంజీ రాంజీ సక్పాల్, తల్లి బీమా భాయ్ చిన్నతనంలోనే మరణించడంతో మేనత్త మీరాబాయి పెంపకంలో పెరిగాడు. పాఠశాల విద్య దశలోనే వివాహమైనది. అంబేద్కర్ మెట్రికులేషన్, కళాశాల విద్యను ఎల్పిన్ స్టన్లో పూర్తి చేశాడు.
అంబేద్కర్ జీవితంపై గౌతమ బుద్ధుని ఆలోచనలు, బోధనలు విశేషంగా ఆకర్షించాయి. బెంజిమెన్ ఫ్రాంక్లిన్‌ను తనకు ఆదర్శంగా చెప్పుకున్నాడు. రనడే, రూసో జాన్ డేవిడ్, బెర్నాడు షాల ప్రభావము అంబేద్కర్ పై ఉన్నది.
బరోడా మహారాజు, మాక్స్ ముల్లర్ సహాయంతో ఆయన అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, పీహెచ్డీ డిగ్రీలను పొందాడు. దేశానికి తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో సైనిక సెక్రటరీగా, ఆ తరువాత బొంబాయిలో ఆచార్యులుగా కొంతకాలము పనిచేస్తూ అవమానాలను ఎదుర్కొన్నారు. మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, సమత, జనత మరియు ప్రబుద్ధ భారత్ వంటి ప్రతికలను స్థాపించి సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి పార్టీలను స్థాపించారు. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, సిద్ధార్థ కాలేజ్, షెడ్యూల్ కులాల సమైక్య లాంటి సంస్థలని ఏర్పాటు చేశారు. ఆసమానతలకు, కులతత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నడిపించారు. చివరకు కుల వివక్ష లేని బౌద్ధాన్ని స్వీకరించారు.
అంబేద్కర్ కుల నిర్మూలన
కుల వ్యవస్థ పుట్టుక నిర్మాణం గురించి అంబేద్కర్ శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు. ప్రాచీన భారతదేశం ఆర్యులు, మంగోలు, వంటి వివిధ జాతుల సమ్మేళనం అని పేర్కొన్నాడు. కొన్ని ప్రత్యేక సంప్రదాయాలు ఆచారాలు గల ఈ జాతులు తమ ప్రత్యేకతను నిలుపుకునేందుకు కృషి చేశాయి. ఫలితంగా విచ్ఛిన్నమై శ్రేణియుత సామాజిక వ్యవస్థగా కుల వ్యవస్థ హిందూ సమాజంలో కుల వ్యవస్థను శక్తివంతం చేశాయని పేర్కొన్నారు. మత శాస్త్రాలను సాకుగా చూపి కుల వ్యవస్థను సమర్ధించడాన్ని అంబేద్కర్ వ్యతిరేకించాడు.
శ్రమ విభజన కుల వ్యవస్థకు ఆధారమని వాదనతో కూడా అంబేద్కర్ ఏకీభవించలేదు. ఏ నాగరిక సమాజంలో ఆసహజమైన పని విభజన ఉండదని కుల వ్యవస్థ శ్రమ విభజనని గాక శ్రామికులను కూడా కులాల వారీగా విభజించినదని అంబేద్కర్ విశ్లేషించారు. వ్యక్తి శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలతో నిమిత్తం లేకుండా పుట్టుక ప్రామాణికంగా వృత్తులను అంటగట్టడంలో ఆర్థిక ప్రగతికి, జాతీ అభివృద్ధికి కులం ఆటంకమైనది. కనుక కుల వ్యవస్థ నిర్మూలనకు హిందూ సమాజంలో మౌలిక వ్యవస్థాగత మార్పులు రావాలని సూచించాడు. కులాంతర వివాహాలు, సామూహిక భోజనాలు నిర్వహణ ఈ విషయంలో కొంత ప్రగతిని సాధించవచ్చని పేర్కొన్నారు. పురోహితాన్ని రద్దుచేసి ప్రవేశ పరీక్షల ద్వారా పురోహితులను నియమించాలని సూచించారు. కులం ద్వారా ఒక జాతిని గాని, నీతిని గాని నిర్మించలేమని పేర్కొన్నారు.
హిందూయిజంపై, బ్రాహ్మణిజంపై అంబేడ్కర్ భావాలు
వర్ణ ధర్మాన్ని వ్యతిరేకించి బౌద్ధమతంలో చేరాడు. హిందూ సమాజంలో వెనుకబడిన తరగతులను సాంఘికంగా దోపిడి చేసే, హింసించే వ్యక్తులుగా బ్రాహ్మణ వాదాన్ని ఆయన పేర్కొన్నాడు. వారు శూద్రులని యజ్ఞోపవీతాన్ని ధరించనీయలేదు. అలాగే విద్యకు దూరం చేశారు. హిందూ మత గ్రంథాలలో శూద్రులను అణిచివేసేందుకు అనేక అంశాలు తరువాత కాలాలలో చేర్చారని అంబేద్కర్ పేర్కొన్నారు. అంబేద్కర్ ప్రకారము బౌద్ధం బ్రాహ్మణుల మధ్య జరిగిన ఆధిపత్య పోరు నుంచి అస్పృశ్యత పుట్టుకొచ్చింది. అస్పృశ్యులు అంటే ఎవరు అనే గ్రంథంలో ఈ విషయమై ఆయన సవివరమైన విశ్లేషణ ఇచ్చాడు. హిందూ సమాజము విశాల ప్రజానీకాన్ని శతాబ్దాల తరబడి అణిచివేసి జనజీవన స్రవంతికి దూరంగా ఉంచింది. తమ పూర్వ పద్ధతులను వదిలి, కుల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. మధ్యపానము, జూదము విడనాడి తమ పరిస్థితిని, హోదాని మెరుగు పరుచుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంపై అంబేద్కర్ భావాలు
ప్రజాస్వామ్యంపై అంబేద్కర్ కు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నాడు. ప్రజా జీవితంలో రక్తపాతము లేకుండా విప్లవాత్మక మార్పులు తేవడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యమని వక్కానించారు. ప్రజలకు రాజ్య నిర్వహణలో భాగస్వామ్యము కల్పించడమే కాకుండా అసమానతలను రూపుమాపడానికి ప్రజాస్వామ్యము విస్తృత అవకాశాలని కల్పిస్తుందని పేర్కొన్నాడు. భారతదేశానికి పార్లమెంటరీ తరహా వ్యవస్థ సరియైనదని సూచించారు. పార్లమెంటరీ ప్రభుత్వంలో వారసత్వ పాలనకు తావులేదని, నిర్ణీత కాలానికి జరిగే ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచడం, ప్రజా ప్రతినిధుల ద్వారా పాలన జరుగుతుందని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ మనుగడకి బాధ్యతాయుత ప్రతిపక్షము, స్వేచ్ఛాయుత ఎన్నికలు మూల స్తంభాలని అంబేద్కర్ భావన. రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య సంస్కృతి తప్పనిసరిగా ఉండాలని నొక్కి చెప్పారు.
పౌర హక్కులు
ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే పౌరులందరికీ హక్కులు, స్వేచ్చ కల్పించగలదని పేర్కొన్నారు. ఆస్తి హక్కు తప్పనిసరి అని పేర్కొన్నాడు. సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు సమానంగా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. వీటికి భంగం కలిగితే న్యాయస్థానాలను ఆశ్రయించేలా ఏర్పాట్లు చేశారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు
అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు సమర్థించారు. భారతీయ సమైక్యతను సామాజిక ఉద్రిక్తతలను భాష వ్యవస్థీకరణ చేయాలని సూచించారు. అన్ని భాషలను ప్రోత్సహించాలని ఆయన సూచించాడు. హిందీని అధికార భాష హోదా కల్పించడంలో జాతీయ సమైక్యతకు ఆయన తోడ్పడ్డాడు. ఒకే భాషకు చెందిన భిన్న ప్రాంతాలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడాన్ని ఆయన సమర్థించాడు.
దేశ విభజనపై అంబేద్కర్ భావాలు
ప్రతి సముదాయానికి తమ మతము, సంస్కృతి కాపాడుకునే హక్కు, స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆయన భావించారు. ప్రతి జాతి ఒక స్వతంత్ర సార్వభౌమ రాజ్యాంగ ప్రకటించుకుని ఉండాలని అన్నారు. అంబేద్కర్ పాకిస్తాన్ ఏర్పాటును సమర్థించడమే కాకుండా, ప్రత్యేక దళితస్థాన్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే దేశ విభజన నాటి పరిస్థితులను దృష్ట్యా ఈ డిమాండ్‌ను ఉపసంహరించుకున్నాడు.
హిందూ కోడ్ బిల్
అంబేద్కర్ స్త్రీల కోసం చేసిన కృషిలో తల మాణికం హిందూ కోడ్ బిల్. రాజ్యాంగంలో పొందుపరిచిన స్త్రీలకు సమాన అవకాశాలను కార్య రూపం ఇచ్చే ప్రయత్నమే హిందూ కోడ్ బిల్. స్త్రీ హక్కులైనా దత్తత హక్కు, వివాహ హక్కు, విడాకుల హక్కు, బహుభార్యాత్వపు రద్దుని సూచిస్తుంది. హిందూ కోడ్ బిల్లును అంబేద్కర్ 1947 ఏప్రిల్ 11న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టాడు. ఈ బిల్లుపై దాదాపు నాలుగు సంవత్సరాలు వాదోపవాదాలు జరిగి సభ నిట్ట నిలువుగా చీలిపోయినది. ఫిరోజ్ గాంధీ, జగ్జీవన్ రామ్, దుర్గాబాయి, సుచేత, అమృత కౌర్, దేవి సింగ్, గాడ్గిల్ ఈ బిల్లును సమర్థించారు. శుక్ల భార్గవ్ మదన్మోహన్ మాలవ్య, బాబు రాజేందప్రసాద్ లాంటివారు దీనిని వ్యతిరేకించారు. హిందూ కోడు బిల్ ముసాయిదాను పార్లమెంటు నిలుపుదల చేయడంతో అంబేద్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా, ముసాయిదా కమిటీ చైర్మన్‌గా సేవలం దించారు. రాజ్యాంగాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ భారత రాజ్యాంగము దానిని అమలు చేసి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు.
విద్య ద్వారా విశ్వవిఖ్యాతి పొందిన ఆ మహనీయుని జయంతిని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. అలాగే అంబేద్కర్ స్ఫూర్తిని పట్టుదలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి.
అంబేద్కర్ పేర్కొన్న బోధించు, సమీకరించు, పోరాడు వ్యాఖ్యానాలను స్ఫూర్తిగా తీసుకొని వెనుకబడిన వర్గాలు రాజ్యాధికార దిశగా ముందుకు వెళ్లాలి.
అంబేద్కర్ సూచించిన సామాజిక న్యాయం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడి వడిగా అడుగులు వేయాల్సి ఉంది. బలహీనవర్గాలకి సరియైన రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలా కృషి చేసినప్పుడే ప్రజాస్వామ్యము పరిడవిల్లుతుందని, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము ప్రతి ఒకరి జీవనములో భాగం కావాలని అంబేద్కర్ సూచించారు.
- డా. ఎస్.యాదగిరి
ఎ : 94928 7570