ఏ రంగంలోనైనా తొలి అడుగులు వేసేవారు, తొలి సంతకం చేసే వారు, తొలి రచనలు చేసేవారు, తొలి ప్రశ్నను సంధించిన వాళ్లు, తొలి ప్రయోగాలకు సిద్దపడేవారు, ప్రజల పోరాటాల్లో ముందు వరుసలో నిలిచేవారు, ఇతరులకు మార్గదర్శ నిర్దేశకులవుతారు. తరువాతి తరాలకు కొత్త దారులు పరిచిని వారవుతారు. అలాంటి వారు ప్రతి సందర్భంలోనూ అసామాన్యులే కారు. చాలా సార్లు సామాన్యులే అసామాన్యులుగా నిలుస్తారు.
అయితే వారిని ఎవరు గుర్తిస్తారు? ఎలా గుర్తిస్తారు అంటే చెప్పలేం. కానీ అలాంటి వారిని గుర్తిస్తేనే, వారి కృషిని వెలికి తీస్తేనే, వారి కృషిని, త్యాగాలను అక్షరీకరిస్తేనే అది చరిత్రలో నిలిచిపోతుంది. రాబోయే తరాలకు వారి అడుగుల జాడలు తెలిసే అవకాశముంటుంది.
కానీ, సమాజ గమనంలో మహిళలు చేసిన కృషి చాలా సందర్భాల్లో అసంపూర్తిగానే రికార్డ్ అవుతుంది. అనేక మంది సామాన్యులు చేసిన అసామాన్య కృషి మరుగున పడిపోతుంది. ఆయా సమయాల్లో, సందర్భాల్లో వారు చేసిన పని ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో, ఆ చరిత్రలోకి వెళ్తే మరింత బాగా అర్థమవుతుంది.

పురుషాధిపత్య సమాజంలో అనేక మంది మహిళల అనేక తరాలుగా అలా మరుగునపడి పోయింది. ఎప్పుడూ హీరోల గురించి మాత్రమే మాట్లాడుకోవడం మామూలై పోయింది. ఇలాంటి సామాజిక, రాజకీయ పరిస్థితిలో అనేక మంది మహిళలు చేసిన కృషిని, వారు చూపిన తెగువను, ప్రదర్శించిన ధైర్య సాహాసాలను, వారు అందించిన సేవలను, ఆత్మ గౌరవంతో, ఆత్మ నిబ్బరంతో వారు నిలబడిన తీరును ఈ తరం ఆడపిల్లలకు తెలియచేయాలనే సంకల్పంతో, ఆంధప్రదేశ్ లో పుట్టి పెరిగి, అమెరికా లో స్థిరపడిన డా. జాస్తి శివరామకృష్ణ ఒక నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టిన ఆలోచనకు ప్రతిరూపమే ‘‘షీరోస్’’. www.projectabcd.comలో భాగంగా భారతదేశంలోని వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి 256 మంది మహిళలను పిల్లలకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ పుస్తకానికి సహ రచయితగా 11 ఏళ్ల అయ్యల సోమయాజుల అహల తోడయింది. వీరిద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని అక్షరబద్దం చేస్తే, పిల్లలకు మరింత ఆకర్షణీయంగా ఈ పుస్తకం రూపుదిద్దుకోవడంలో బాబు దుండ్రెపల్లి వేసిన బొమ్మలు అదనపు ఆకర్షణగా మారాయి.
ఈ ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ 2024 జనవరి 8న గుంటూరులోని చేతన ప్రాంగణంలో, చేతన సంస్థ వ్యవస్థాపకురాలు మంగాదేవి గారి చేతుల మీదుగాను, అదే సమయంలో షీరోస్ గా తయారయి వచ్చిన దాదాపు 18 స్కూల్స్కి చెందిన 289 మందికి పైగా పిల్లల చేతుల మీదుగానూ జరిగింది. ఈ పిల్లలందరూ షీరోస్‍ని అనునయించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. అద్భుతంగా సాగిన ఆనాటి వేడుక పిల్లలకు ఒక మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మొదట ఇంగ్లీష్‍లో వచ్చిన షీరోస్ పుస్తకాన్ని, 11 నెలల తరువాత ‘‘256 ధీరవనితలు – స్పూర్తికాంతులు’’ పేరుతో తెలుగులోకి స్వతంత్ర జర్నలిస్ట్ పద్మ వంగపల్లి అనువాదం చేశారు. ఈ పుస్తకాన్ని శ్రీనివాస్ చాలా చక్కగా డిజైన్ చేశారు.
ఈ తెలుగు వర్షన్ హైదరాబాద్‍లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, హిమాయత్ నగర్, హైదరాబాద్ భాగస్వామ్యంతో 2024 డిసెంబర్ 22న కోలాహలంగా జరిగింది. స్కూల్ ప్రాంగణాన్ని బాలచెలిమి పిల్లల పత్రిక, సంపాదక వర్గం చాలా అందంగా ముస్తాబు చేసింది. దాదాపుగా 42 స్కూల్స్ నుండి వచ్చిన చిన్నారులు షీరోస్ వేషధారణతో తమ ప్రతిభా పాటవాలను చూపారు. అంతేకాదు షీరోస్ పాత్రల్లోకి పరక్కాయ ప్రవేశం చేశారనే చెప్పాలి.
రెండు సందర్భాల్లోనూ ఇతర పుస్తకావిష్కరణలకు భిన్నంగా కార్యక్రమాలు జరపడం షీరోస్ ప్రత్యేకతనే చెప్పాలి. ఇది పిల్లల పట్ల ప్రేమ
ఉన్నవారికి, పిల్లలకే పెద్ద పీట వేయాలనుకునేవారికి, ఏ పిల్లలకైతే ఈ పుస్తకం మరింత చేరువ కావాలని ఆకాంక్షించారో వారికి మాత్రమే సాధ్యమనేలా నిర్వహించారు.

పుస్తకంలో షీరోలుగా పిల్లలకు పరిచయమయిన రచయిత్రి ఓల్గా, ప్రవాస భారతీయురాలు శైలా తాళ్లూరి, డాక్టర్ ఉషాకిరణ్, స్వతంత్ర జర్నలిస్ట్ పద్మ వంగపల్లితో పాటు పిల్లల చేతుల మీదుగా తెలుగు పుస్తకావిష్కరణ వేడుక జరిగింది. నిరంతరం పిల్లల మధ్యే గడిపే నయితాలీం జాతీయ కమిటీ సభ్యులు CA ప్రసాద్ స్కూల్ పిల్లలతో మాట్లాడటం, టీచర్లను ఇందుకోసం సమన్వయం చేయడమే కాదు, ఏ స్కూల్‍కి వెళ్లినా ఈ పుస్తకం ప్రాధాన్యతను తెలియచేసి పిల్లలకు ఈ పుస్తకాన్ని మరింత చేరువగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.
ఈ వేడుకలో పిల్లలు చిన్నారులుగా అలరించారు, వాళ్లే పెద్దలుగా అభినయించారు, ప్రశ్నించారు, విజేతలుగా నిలిచారు. రాబోయే కాలానికి కాబోయే ధీరవనితలు-స్పూర్తికాంతులుగా మారతారనే నమ్మకం కలిగించారు. నిరంతరం పిల్లల కోసం ఏదో ఒక పని సృజనాత్మకంగా చేయాలనే ప్రయత్నంలో డా. శివజాస్తి గతంలోనూ పిల్లల కోసం ‘‘చిన్ననాటి ఆటలు-జ్ఞాపకాల మూటలు పేరుతోనూ తొమ్మిదేళ్ల క్రితం ఒక పుస్తకం తీసుకొచ్చారు. తెలుగులో పదివేలకు పైగా పజిల్స్ తయారుచేశారు. చదువులోనూ, ఇతరుల పట్ల స్పందించే తీరులోనూ పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ‘‘లెర్న్ అండ్ హెల్ప్’’నీ ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఏబిసిడి(ఏ బైట్ ఆఫ్ కల్చర్ ఇన్ డ్రెసెస్)పేరుతో భారతదేశంలోని వైవిధ్యమైన సంస్కృతిని పిల్లలందరికీ పరిచయం చేయాలనే పనిలో ఉన్నారు.

షీరోస్ తెలుగు వెర్షన్‍కి, NRIVA (నాన్ రెసిడెంట్ ఇండియన్ వాసవి అసోసియేషన్) సంస్థ ఆర్థిక, హార్దిక సహకారాన్ని అందించింది. ఈ సంస్థ అధ్యక్షులు పందిరి శ్రీనివాస్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ ధీరవనితల లిస్ట్ 256 కే పరిమితం కాకుండా మరింత మంది మహిళలను పరిచయం చేస్తూ ముందుకు సాగుతుందని నిర్వాహకులు తెలియచేయడం బాగుంది. ఈ ఆనందంలో కొన్ని గంటల పాటైనా పిల్లల మధ్య గడిపిన వారందరికీ తప్పకుండా ఇదొక మరిచిపోలేని అనుభూతిగా మిగులుతుందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.
–సీఏ. ప్రసాద్, ఎ : 94901 7516