వ్యాధులు లేని ఉగాదుల కోసం..!

మినామట అనే వ్యాధి గురించి మనం సమీప గతంలో కానీ, సుదూర గతంలోనైనా విన్నామా? ఇదొక పట్టణ ప్రాంతం జపాన్‍లో ఉంది. ఆ ప్రాంతం ఒక రకంగా ఫ్యాక్టరీ టౌన్‍గా వ్యవహరింపబడుతుంది. చేపలు, షెల్‍ఫిష్‍ లాంటి కలుషితమైనవి తినటం వల్ల సంక్రమించే వ్యాధిగా 1968 నాటికి నిర్ధారణకు రాగలిగారు. షెల్‍ఫిష్‍ లేదా చేపలు ఎందుకు కలుషితం అవుతున్నాయంటే మిథైల్‍ మెర్క్యురీ అనే రసాయన పదార్థం ఒక రసాయన కర్మాగారం నుండి వెలువడుతుంది. అది ఆ సమీపాన గల సముద్రమో, నదో, వాగో, వంకల్లోని నీటిలో కలుస్తుంది. ఆ నీటిలో పెరిగే చేపలను తినడం వల్ల వ్యాధి సంక్రమించడానికి అన్ని మార్గాలను తెరిచినట్లే అవుతుంది. తమ పరిసరాల్లో లభించే వాటిని ఆహారంగా ప్రజలు స్వీకరించకుండా ఉండలేరు. తినడం వల్ల వ్యాధుల బారిన పడతారు. ఈ వ్యాధి లక్షణ ఏమిటి? ప్రధానంగా స్పర్శను కోల్పోవటం. అందునా కాళ్లు చేతులు పట్టు తప్పటం. వాటికి అవి పడిపోవటం. అట్లాగే దృష్టిలోపం ఏర్పడటం జరుగుతుంది. బ్యాటరీల్లోనూ, ప్లోరోసెంట్‍ లైట్లలోనూ దీనిని వినియోగిస్తారు. గాలిని, నీటిని కలుషితం చేసే సాధారణ రసాయన పదార్థమే మిథైల్‍ మెర్క్యురీ. 1950లోనే జపాన్‍లోని పలు ప్రాంతాలలో ఈ వ్యాధి ప్రబలింది. పారిశ్రామిక వ్యర్థాల వల్ల నదులు, ఇతర సముద్ర తీర ప్రాంతాలలోని నీరు కలుషితం అవుతుంది. మినామట, నీగటలలోనే సుమారు ఆరువందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మినామటలో అధిక మరణాలు సంభవించిన కారణంగానే ఆ ప్రాంతం పేరుతోనే వ్యాధి ప్రఖ్యాతమైంది. చిస్సో కార్పొరేషన్‍ యాజమాన్యంతో నడుస్తూ ఉన్న రసాయన కర్మాగారం 1932 నుండి 968 దాకా కొనసాగింది. ఈ అన్నేళ్లూ తన వ్యర్థాలలో మిథైల్‍ మెర్క్యురీని వదులుతూనే ఉంది. ఎప్పుడో 1960లలో వ్యాధి బారిన పడ్డవారికి అందవలసిన నష్టపరిహారం 1995 దాకా చెల్లించబడలేదు. న్యాయస్థానం తీర్పు ఇచ్చాక కూడా ఇంచుమించు ఇరవైరెండు సంవత్సరాల పాటు జాప్యం చేసింది ఆ కంపెనీ నష్టపరిహారం చెల్లించడానికి. నిజానికి 1956లోనే ఈ వ్యాధి కనుగొనబడింది.


మిథైల్‍ మెర్క్యురీ ప్రభావానికి గురైన చేపలను తినటం ద్వారా శరీరావయాలను చచ్చుబడేట్లు చేయగలుగుతుంది. మిథైల్‍ మెర్క్యురీ అత్యంత ప్రమాకరమైన రసాయన విషపదార్థం. వాటర్‍ బాడీస్‍లోకి కర్మాగారాల వ్యర్థాల ద్వారా చేరటం. ఆ నీటిలో పెరిగే జలచరాలు ఆ నీటిని వినియోగించటం, చేపలు, షెల్‍ఫిష్‍ లాంటి వాటిల్లోకి చేరాక అది ఒకటికి పదింతలుగా వృద్ధి పొంది తీవ్ర ప్రభావాన్ని ప్రజల ఆరోగ్యం మీద కలిగిస్తుంది. సుమారు 36 ఏళ్ల పాటు మనుషులు, జంతువులు మిథైల్‍ మెర్క్యురీ విష ప్రభావానికి గురవుతూ చనిపోతూ ఉండటం జరిగింది. ఈ రసాయన పదార్థం చావును కానుక చేసే సంగతి అట్లా ఉంచితే, శరీరం చచ్చుబడటం, మొద్దు బారటం, సాధారణ కండరాల బలహీనత, వినికిడి సమస్య, మాట్లాడలేకపోవటం, పక్షవాతం, కోమా, మతి భ్రమణం లాంటివి కూడా ఈ విష రసాయనం కలిగిస్తుంది. నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ వ్యాధి కారక రసాయన పదార్థాన్ని ఉత్పత్తి చేసే చిస్సో కార్పొరేషన్‍ ప్రభుత్వంతో లాలూచిపడి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఈ వ్యాధి బారిన పడ్డ రోగుల పక్షాన మిచికో షిరాషి అనే ఫ్రీలాన్స్ పాత్రికేయురాలు నిలబడి పోరాడింది. సంవత్సరాల తరబడి న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నడిచాయి. తొలుత తనకేమీ బాధ్యత లేదన్న చిస్సో, షిరాషి పోరాటం వల్ల అంతో యింతో నష్టపరిహారం బాధితులు పొందగలిగారు కూడా.


అయితే ఇటువంటి పర్యావరణ సంబంధిత వ్యాధులు ప్రబలినప్పుడు వాటికి గురైన పర్యావరణ బాధితుల గురించి పోరాడేందుకు, పర్యావరణ న్యాయం అందించేందుకు పౌరసమాజాలు చైతన్యం పెంపొందించుకోవలసిన అవసరం ఎంతయినా ఉన్నది.
క్రిష్టఫర్‍ విలియమ్స్ అనే ఆయన ఎన్విరాన్‍మెంటల్‍ విక్టియాలజీ అనే వ్యాసం రాస్తూ నాలుగు మంచి మాటలు చెప్పాడు.
నేను బాధితుడిగా మారాలనుకోవటం లేదు. ఒకవేళ నేను బాధితుడ్నే అయ్యే పక్షంలో అన్నిరకాల చర్యలూ నేను బాధుతడ్ని కాకుండా ఉండేందుకు తీసుకోవాలని ఆశిస్తాను.
ఒక వేళ నేను బాధితుడ్నే అయితే, నాకు అన్ని విధాలుగా సాయం కావాలి. ప్రభుత్వం, పరిశ్రమ, సమాజం కలిసికట్టుగా నన్ను ఆదుకోవాలని కోరుకుంటాను.
ప్రభుత్వాలు పునఃపునః నన్ను బాధుతుడిగా మార్చకూడదని భావిస్తాను. ఒక్క ప్రభుత్వమే కాదు, కంపెనీలు, న్యాయస్థానాలు, వైద్య, న్యాయ సంబంధ వృత్తులు నన్ను తిరిగి బాధుతుడ్ని చేయకూడదని భావిస్తాను అంటాడు.
ఈనాడు మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నామంటే పర్యావరణం వల్ల మనకేమి హాని జరగనుందో గుర్తించలేని స్థితిలో
ఉన్నాం.
అసలు పర్యావరణానికి ఏ హాని మానవాళి వల్ల జరుగుతూ
ఉన్నదో గుర్తించకుండా పట్టని తనంతో ఉన్నాం.
పర్యావరణంతో ఎట్లా వ్యవహరించాలో తెలియకుండా ఉన్నాం. ఒక్క ముక్కలో చెపితే పర్యావరణ నిరక్షరాస్యులుగా
ఉన్నామేమోననిపిస్తుంది. వ్యాధులు లేని ఉగాదులు చూడాలంటే పర్యావరణ హిత చైతన్యం అవసరం.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *