(ఈ నెలలో 18 సం।।లు పూర్తి అయిన సందర్భంగా)
తల్లి తెలంగాణా విముక్తి కోసం భూమి పుత్రుల పాదయాత్ర – నేల తల్లి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మట్టి మనుష్యుల జైత్రయాత్ర, నడక, నడుస్తున్న చరిత్ర. మా కాళ్ల మీద మేం నడుస్తున్నాం. మా నేల మీద మేం నడుస్తున్నాం. మేం ముందుకు మున్ముందుకే నడుస్తాం. ప్రపంచం మా వెంట నడుస్తుంది. నడక, నడక, నడక మా నేస్తం. కంటికి దూరమైతే కాలికి దూరమా? చుట్టు ముట్టు సూర్యాపేట నట్టనడుమ నల్లగొండ, ఆ పైన హైద్రాబాదు అందులో గోలుకొండ – గోలుకొండ ఖిల్లా క్రింద ఆంధ్రుల నయా వలస వాదాన్ని బొంద పెట్టడానికే లాంగ్‍మార్చ్ – పాలేరు వాగు వంతెన మీద నుండి నాంపల్లి బాగే ఆం ఎదురుంగ ఉన్న అమరవీరుల స్థూపం దాకా. ఆ అమరవీరుల ఆత్మల్ని విముక్తం చేసి, వారు కన్న కలలను నిజం చేసే దాకా. మట్టి మనుషుల పాదయాత్ర.
‘‘భూమి కోసమే నడు
భుక్తి కోసమే నడు
విముక్తి కోసమే నడు
బయం గియం విడునడు’’
2007 నూతన సంవత్సరం ప్రారంభదినం. ఉదయం పది గంటలు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం దగ్గరిలోని నల్లబండ్ల గూడెం గ్రామానికి ఆనుకుని ఉన్న పాలేరు వాగు మీది వంతెన. చరిత్రకు సాక్షీభూమైన వంతెన. మౌనమునిలా కాలాన్ని పరిశీలించే వంతెన. ఆంధ్రా సరిహద్దును దాటి తెలంగాణాకు ముఖద్వారం మాదిరిగానిలిచిన అతి పురాతనమైన వంతెన. కాలానికి కట్టిన కత్తుల వంతెన. నెత్తుటి వంతెన. ఆ రోజు ఆక్కడి జాతీయ రహదారి నంబర్ నైన్ మట్టి మనుషుల పాదముద్రలతో పులకించి పోయింది. పరవశించి పోయింది.
భాజా భజంత్రీలు, మేళ తాళాలు, తెలంగాణా నినాదాలు, బ్యానర్లు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు మరికొన్ని గులాబీ కండువాలు ఆ మట్టి మనుషులతో కలిసి కదం కదం కలిపి, భుజం భుజం కలిపి తెలంగాణా ఐక్యతను చాటటానికి అక్కడ గుమికూడినారు. సరిహద్దుకు అటు ఇటు ట్రాఫిక్‍జాం. రెండు వైపులా ‘ముసాఫిర్లు’ అక్కడ ఏం జరుగుతుందో అని కుతూహలంతో చూస్తున్నారు. అదొక ‘‘లగాన్’’ టీం. తమ రక్తంతో చెమటతో భూమిని దుక్కిదున్ని ఆరుగాలం కాయకష్టం చేసి ‘‘రాజనాలు’’పండించే రైతు బిడ్డల టీం. గోసి గొంగడి గాళ్ల దళం. ‘‘కఫన్’’ మాదిరిగా తలలకు చుట్టుకున్న తలపాగాలు భుజాలకు వ్రేలాడే జోలె సంచులు. పాదాలకు కిర్రు చెప్పులు, ఆకు చెప్పులు, చేతి కర్రలకు ‘‘జై తెలంగాణ’’ నినాదాలున్న శ్వేత కేతాలు. ఎవరు వారు? ఎచటివారు? ఎచట నుండి ఇటు కొచ్చినారు?
ఆ పాదయాత్రకు, సారథ్యం వహిస్తున్నది వేనేపల్లి పాండురంగారావు. మిరియాలగూడెం మండలంలోని ‘‘అలగడప’’ గ్రామం మాజీ సర్పంచ్. అతను ఏం చేసినా తనదంటూ ఒక సొంత ముద్ర ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ఒక భాగమే ‘‘పాలేరు వాగు నుండి మూసీ నది దాకా’’ నడుస్తున్న జనయాత్ర, జైత్రయాత్ర.
ఇక ఆయనను అనుసరిస్తున్నది సుమారు 60, 70 మంది భూమి పుత్రులు. ఆలగడప వారు మరియు దాని చుట్టుప్రక్కల వారు. ఆ బృందంలో అతి పెద్ద వయసున్న వాడు షేక్ జాన్. 75 సం।।లు ఉన్నా నడకలో మాత్రం నవయువకుడు. ఆలగడప గ్రామానికి మస్కూరిగా పనిచేశాడు. అతి చిన్న వయస్సున్న పిల్లగాడు క్రాంతికుమార్ 17 సం।।రాల నునూగు మీసాల ప్రాయం. ‘‘మోతె’’ గ్రామం నివాసి. 5వ తరగతి వరకు చదువుకొని ‘‘హలికుడుగా’’ మారాడు.
అయితే అంశుల స్వామిది మాత్రం మరో విషాద గాథ. చక్రాల కుర్చీలోనే పాదయాత్రను అనుసరిస్తున్న అతను ‘‘ప్లోరోసిస్’’ బాధితుడు. ప్రక్కనే కృష్ణానదీ పరివాహక ప్రాంతమున్నా త్రాగే నీటికి నోచుకోక కలుషిత జలాల్ని తాగి కుంచించుకొని పోయిన దేహంతో జీవచ్ఛవంలా బ్రతుకీడుస్తున్న వంచితుడతను. ఐదేళ్ళ పిల్లవాడిలాగ కనబడుతున్న 35 సంవత్సరాల యువకుడతను. నడవటం కాదు కదా సరిగ్గా నేల మీదనే కూచోలేని దీన పరిస్థితి అతనిది. పడుకొనే అన్నం తింటాడు. అన్ని పనులు పడుకునే. ఎవరి నిర్లక్ష్యపు ఫలితమిది? అని పెద్ద పెద్ద మూగ కండ్లతో మనల్ని ప్రశ్నిస్తుంటాడు. ‘‘ఈ సర్కారు పాలనలో మన్నుబడ’’ అని చూపులతోనే శపిస్తుంటాడు.

అతని ప్రక్కనే దుశ్చర్ల సత్యనారాయణ. జల సాధన సమితి నేత. విఫలమైన తెలంగాణా ‘‘భగీరథుడు’’. బిల్కుల్ పైదల్ ఆద్మీలాగ జీబురు గడ్డంతో పిచ్చి పిచ్చిగా పెరిగిన జుట్టుతో తెలంగాణ మీద తప్ప తన మీద తనకే సోయి లేకుండా ఊడిపోయిన ఒక పన్నుతో, వెలుగుతున్న కండ్లతో ముఖమంతా చిరునవ్వులతో ఒక యోగిలా కనబడ్డాడు. అప్పుడెప్పుడో ఐదేండ్ల క్రితమే నెలకు 30 వేల రూపాయల బ్యాంకు ఉద్యోగం వొదులుకొని క్రిష్ణమ్మ జీవజలాల్ని నల్లగొండకు మళ్లించి ఫ్లోరోసిస్ భూతాన్ని ఓడించాలని భంగపడ్డ భగీరథుడతను. ‘‘హర్‍దర్ద్కా దవా జిందాతిలిస్మాత్’’ అన్నట్లు అన్ని సమస్యలకు పరిష్కారం ‘‘తెలంగాణా’’ అని యుద్ధ రంగంలోకి దూకిన క్షత్రగాత్ర సైనికుడతను. వేయి యుద్ధముల ఆరితేరిన యోధుడతను.
పాలేరు వంతెన కాడ పాండురంగారావు ఉపన్యాసంతో పాదయాత్ర ప్రారంభమైంది. అది మామూలు ఉపన్యాసం కాదు. మూడు తరాల తెలంగాణా ప్రజల ఆత్మఘోష. సకల విధాల దోపిడీలకు, అన్యాయాలకు గురైన జీవుల వేదన.
‘‘యాభై అరవై సంవత్సరాల క్రింద మీరు ఖాళీ చేతులతో కట్టు బట్టలతో కల్లబొల్లి కబుర్లతోఈ వంతెనను దాటి మా తెలంగాణా లోపలికి వచ్చారు. ఆ తర్వాత ఈ రోజు వరకూ ఈ వంతెన పై నుండే మీరు మా సిరిసంపదలను, భోగభాగ్యాలను మీ ఆంధ్రా ప్రాంతానికి తరలించుకు పోయారు. దానికి ఈ వంతెననే మూగసాక్షి. దాని క్రింది నుండి ప్రవహించేవి నీళ్లుకాదు, మా తెలంగాణా ప్రజలకన్నీళ్లు. మాకన్నీళ్ళ వల్లనే మీ సముద్రంలో ఉన్న నీళ్లన్నీ ఉప్పుగా మారినాయి’’ అని వేనేపల్లి తన గుండె గొంతుకతో ఘోషిస్తుంటే ఆ ఉపన్యాసం వింటున్న వారి కండ్లల్లో కన్నీళ్లు గుబగుబమని పొంగుకొచ్చాయి. ఆవేశంతో పిడికిళ్లు బిగుసుకున్నాయి. ‘‘జై తెలంగాణా’’ నినాదాలతో మిన్నూ మన్నూ ఏకం అయినాయి.
పాదయాత్ర నల్లబండ్లగూడెం దాటి కోదాడకు చేరుకుంది. ప్రతి రోజు 20-25 కిలోమీటర్ల చొప్పున పది రోజులలో హైద్రాబాదు చేరుకోవాలని వారి ఆలోచన. సడక్ మీద కలిసిన ప్రతి ఒక్కరికి తమ పాదయాత్ర లక్ష్యానికి సంబంధించిన కరపత్రాలను పంచుతున్నారు. ప్రతి చిన్నా, పెద్ద గ్రామంలో నలుగురు కూడిన కాడ తెలంగాణా ఎందుకు కావాలో చిన్న చిన్న ఉపన్యాసాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ‘‘రోడ్లకు మా నమస్కారం’’ అంటూ ఆ మట్టి మనుషుల పాదాలు చందన చర్చిత చల్లని ధూళి పరిమళాలతో పాదప్రక్షాళనం చేసుకుంటున్నాయి. తెలంగాణా కోసం ప్రార్థించే పాదాలు వారివి.
‘‘బాటలు నడిచి పేటలు దాటి’’ అన్నట్లు 3వ తారీకున ఆ పాదయాత్ర సూర్యాపేట చేరుకుంది. అట్ల 3 తారీఖున ఆ పాదయాత్రీకులకు ఘనంగా స్వాగతం పలుకుతూ సూర్యాపేటలో ‘‘తెలంగాణ విద్యావంతుల వేదిక వారు’’ ఒక సభను ఏర్పాటు చేశారు. అందులో కోదండరాం, విద్యావంతుల వేదిక అధ్యక్షులు ప్రసంగించారు. ఆ రాత్రి అక్కడ నిద్రచేసి తెల్లారంగానే మళ్లీ ‘‘తెలంగాణా కారవాన్’’ నకిరేకల్ వైపు పురోగమించింది. తోవ పొడుగునా వారిచ్చిన నినాదాలు సాదా సీదా నినాదాలే. సామాన్యులకు కూడా తెలంగాణా పోరాటం ఎందుకు జరుగుతుందో బోధ పడేటట్టు!
మా భూములు మాకు గావాలె
మా నీళ్లు మాకు గావాలె
మా కరెంటు మాకు గావాలె
మా బొగ్గు మాకు గావాలె
మా చదువులు మాకు గావాలె
మా ఉద్యోగాలు మాకు గావాలె
గుండె గోడల్లోకి చొచ్చుకొని పోయే ఈ సులభమైన నినాదాలు ‘‘రామనామ తారక మంత్రం’’ లాగా గ్రామీణులపై పనిచేశాయి.
అదే పాండు రంగారావు ప్రత్యేకత. ఏ విషయంలోనూ నేలవిడిచి సాము చేయటం అతనికిష్టం ఉండదు.
వేనేపల్లి జనం ముందు నిలబడి పోటోలకు ఫోజులిచ్చే నాయకుడు కాదు. తెరవెనుక మనిషి జనం వెనుక మనిషి కావుననే ఆయన ఆ మట్టి మనుషులు ముందు నడుస్తుంటే వారి వెనుక నడుస్తున్నాడు. ఆ దృశ్యం చూసే సరికి నాకు చర్చిలో కిరస్తానీ సోదరులు పాడుకునే పాట జ్ఞాపకం వచ్చింది.
‘‘చిన్న గొర్రె పిల్లలము ఏసయ్యా
మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా’’
ఆ సాయంత్రం పానుగల్లు దేవాలయం దగ్గర ఆ మట్టి మనుషుల పాదయాత్రకు భాజా భజంత్రీలతో, మేళ తాళాలతో చెవులు గింగురుమనే నినాదాలతో, ఒడలు పులకరించే పాటలతో ఘనంగా ఎదుర్కొళ్ళు జరిగినాయి. నల్లగొండ పట్టణానికి సంబంధించిన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులంతా అందులో పాల్గొని వారిని సాదరంగా పట్నంలోకి ఆహ్వానించారు. ఆ ఊరేగింపుతో నల్లగొండ పట్నంలోని పురవీధులన్నీ పులకరించిపోయాయి. తర్వాత ఎస్‍బిఆర్ ఫంక్షన్‍హాలులో బహిరంగ సభ జరిగింది. దుర్గాబాయి ఆహ్వానం పలికి వేదికపై అతిథులను పిలిచింది. తెలంగానా రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి వేణు సంకోజు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఆయన తన అధ్యక్షోపన్యాసంలో ‘‘మట్టి మనుషుల పాదయాత్రీకులకు పేరు పేరునా పాద నమస్కారం చేస్తున్నాను’’ అని ప్రకటించగానే సభయావత్తు కరతాళధ్వనులతో మారుమోగింది. జై తెలంగాణ నినాదాలు ఆకాశాన్ని అంటినాయి. చాలా మంది ఉత్తేజంగా ప్రసంగించినారు. ముగింపులో పాండు రంగారావు, హృదయాలు ద్రవించి, మనుసులు ఆర్ధ్రమయే రీతిలో ఉపన్యాసమిచ్చినాడు.
ఏడవ తారీఖు సాయంత్రం చిట్యాలలో ఒక బహిరంగసభ జరిగింది. ‘‘ఈచ్ వన్ టీచ్ వన్’’ లాగా ప్రచారం సాగింది. చౌటుప్పల్, కొయ్యలగూడెం, కొత్తగూడెం, భూదాన్‍పోచంపల్లి, అనాజ్‍పూర్, అబ్దుల్లాపూర్‍మెట్, హయత్‍నగర్ దాటి ‘‘మట్టి మనుషులు యల్.బి.నగర్ చౌరస్తా దగ్గర పదో తారీఖు ఉదయాన పది గంటలకు నగర ప్రవేశం చేశారు.
పట్నమొల్లు పల్లెటూరు రైతుబిడ్డలకు ‘‘తమదైన పద్ధతిలోనే ‘‘వెల్‍కం’’ చెప్పారు. ఏమైతేనేం నగరంపై మట్టిమనుషుల ‘‘ముట్టడి’’ ప్రారంభమైంది. ‘‘లగాన్ టీం’’ దండయాత్ర నగరవీధులలో కదంతొక్కి మార్చ్ చేసింది. గోసి గొంగడి మనుషుల తలలకు చింపుల పేగుల తలపాగాలు. వడివడిగా నడిచే ఆ కిర్రు చెప్పులు, భుజాలకు వ్రేలాడే జోలెసంచులు, ‘జైతెలంగాణా’ శ్వేత కేతాలను ఎగురవేసే చేతి ఊతకర్రలు నగరవాసుల దృష్టిని ఆకర్షించాయి. చైతన్యపురి, దిల్‍సుఖ్‍నగర్ చౌరస్తాలు అడ్డుదొలిగి పక్కపక్కలకు వొదిగి వారికి దారినిచ్చి వారిని గౌరవించాయి. ఆ నినాదాలలో దాగిన వారి గుండె చప్పుళ్ళను జాగ్రత్తగా విన్నాయి. వారు పంచిన కరపత్రాలను చదివి అర్థం చేసుకున్నాయి.
ముస్లిం సోదరులు మలక్‍పేటలోని ఆజం ఫంక్షన్‍హాల్‍లో వారందరికి భోజనాలు ఏర్పాటుచేసి తెలంగాణా పట్ల తమ సంఘీభావాన్ని తెలియజేశారు. నగర జన నీరాజనాలను అందుకొంటూ పాదయాత్ర సాయంత్రం మూడుగంటలకు బాగేఆం ఎదురుంగ ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుంది.
అలగడప తదితర గ్రామాల నుండి బయలుదేరిన ‘‘మట్టి మనుషులు’’ అమరవీరుల స్థూపానికి పూలదండలు వేసి ఒక్కనిమిషం వారికి శ్రద్దాంజలి ఘటించారు. పిమ్మట ‘‘అమరవీరుల ఆశయాలను సాధిస్తాం. సాధిస్తాం.’’ అని ప్రతిజ్ఞలు చేశారు. అక్కడ గుమికూడిన ప్రజలంతా వారితో గొంతు కలిపారు. ఆ తర్వాత చరిత్రను లిఖించే అద్భుత క్షణాలు’’ ప్రారంభమైనాయి. ఆ మట్టి మనుషులు తమ వెంట ఒక సంచిలో ‘‘అలగడప నేల మీద మట్టిని’’ తెచ్చారు. వేనేపల్లి ఆ మట్టి సంచిని అందరికీ చూపిస్తూ ‘‘ఈ మట్టి నా పూర్వికుల మట్టి. చెమట, రక్తం, కన్నీళ్ళతో తడిసిన మట్టి. ఈ మట్టిలోనే వారంతా పుట్టి పెరిగి తిరిగి ఈ మట్టిలోనే మట్టిగా మారినారు. మట్టిని ఆంధ్రుల వలసవాద పరిపాలన నుండి విముక్తి చేస్తాం. ఈ మట్టికి స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తాం. రాబోయే తరాల వాళ్ళందరూ ఈ మట్టిలో సుఖశాంతులతో జీవించాలి. వర్ధిల్లాలి’’ అంటూ ఉద్వేగంగా ప్రసంగిస్తూ సంచిలోని ఆ మట్టిని తన గుప్పిళ్లతో తీసుకొని తన నడినెత్తి మీద పోసుకుంటుంటే ఆ మట్టిని తన ముఖానికి అద్దుకుంటుంటే అందరి కండ్లలో కన్నీటి ఊటలు ఉబికినాయి. గుండెలు గుబగుబలాడినాయి.
ఆయన ఇంకా ప్రసంగిస్తూ ‘‘మా పాదముద్రలలో మొత్తం మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అడుగుజాడలు ఉన్నాయి. వారందరూ మా వెంట ఉన్నట్లే. ఒక వేళ ఢిల్లీ పీఠం వారు తెలంగాణా ఇవ్వకపోతే తెలంగాణా అన్ని దిక్కుల నుండి ఇటువంటి పాదయాత్రలెన్నో బయలుదేరి ఈ నగరాన్ని ముట్టడిస్తాం. అష్టదిగ్బంధనం చేస్తాం. తెలంగాణాను మేం సాధించుకుంటాం.
ఈ స్వామి అంశులస్వామి. నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్‍నుండి విముక్తం చేయటానికే మేము తెలంగాణాను విముక్తికిప్రయత్నిస్తున్నాం. మాకు నీల్లు కావాలె. ఇక భవిష్యత్తులో మా పిల్లలెవరూ ఇట్లా కావొద్దు.
వేనేపల్లి పాండురంగారావు తన ‘‘రాగాలాపన చేస్తుంటే అతని మాట మంత్రంగా మారి శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసింది. తెలంగాణా ఆశయానికి అందరినీ కట్టిపడేసింది. అంకితం చేసింది.
అమరవీరుల స్థూపం దగ్గర అలగడప మాజీ మస్కూరి 75 సంవత్సరాల జాన్‍ను ‘‘ఏం తాతా ఎట్లుంది యాత్ర’’ అని పలుకరించంగనే గొంతులో గురగురలతో ‘‘పెద్ద దొరలు రానిచ్చేటట్లులేరు నాయనా అయినా మేము నడుస్తనే ఉంటం. దీని అంతు చూసేదాకా. ఈ రోడ్డు మీద నా తనువు పోయినా పర్వలేదు. నడుస్తనే ఉంటం ఇవి భగవంతుడు ఇచ్చిన కాళ్లు ఆయనే మమ్ములను నడిపిస్తున్నడు’’ అని అన్నడు. అతన్ని చూస్తుంటే 1969 మొదటి తరం తెలంగానా పోరాటానికి ప్రతినిధిలాగా కనిపించిండు. మూడుతరాల తెలంగాణాపోరాటం. మూడు దశల తెలంగాణా పోరాటం.
చివరికి ముగింపుగా ఆ పాదయాత్ర మంజిల్ ఔర్ మక్సద్ గవర్నర్ గారి నివాసం రాజ్‍భవన్. అయితే ఆయన లేరని తెల్సింది. అయినా పాదయాత్రీకుల ప్రతినిధి బృందం గవర్నర్ గారి ఓ.యస్.డి.ని కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ‘‘తెలంగాణ మాత్రమే కావాలని’’ సమర్పించింది. వేనేపల్లితో పాటు ప్రతినిధి బృందం సభ్యులు తెలంగాణా ఆవశ్యకతను వివరిస్తుంటే ఆయన ఓపికగా విన్నారు. ఆఖర్లో చక్రాల కుర్చిలో వెంటవచ్చిన అంశుల స్వామిని ఎదురుగా ఉన్న ఆయన టేబుల్‍పై పండబెట్టారు. అతడిని చూసి ఆ అధికారి పరేషాన్ అయినాడు. ‘‘నాలాగా మరెవరూ కావొద్దు. మాకు మంచి నీళ్ళు గావాలె. మాకు తెలంగాణా కావాలె అని అంశుల స్వామి రెండు చేతులెత్తి ఆ అధికారికి మొక్కిండు.
గవర్నర్ నివాసం నుండి అందరం ఇవతలికి వచ్చాం. ఇక వీడ్కోలు. ఇక ఆ మట్టి మను షులకు వారు చేసిన పాదయాత్రకు ‘‘అల్విదా’’ చెప్పే క్షణాలు దగ్గరికి రానే వచ్చాయి.
అందరి హృదయాలు బరువెక్కి ఉన్నాయి. మాటలు కరువయ్యాయి. లక్షల పాదముద్రలతో చరిత్రను లిఖించిన 275 కిలోమీటర్ల పాదయాత్ర ‘‘పాలేరువాగు నుండి మూసి నది దాకా’’ ముగియబోతుంది.
‘‘మరి మీ తిరుగుప్రయాణం ఎట్ల పాండురంగారావ్’’ అని దిగులుగా అడిగాను.
‘‘ఏముంది ఆర్‍టిసి బస్సులలో’’ అన్నాడు చిర్నవ్వుతో.
వచ్చి అన్నం తిని రెస్టు తీసుకోవచ్చు గదా’’!
‘‘లేదు రేపు మా ఊర్ల ఉండాలె. అక్కడ మిషన్లు పంచే పని
ఉంది’’ అన్నాడు ఈ భూమి పుత్రుడు. అతని నేతృత్వంలో ఆ ‘‘లగాన్ టిం’’ రోడ్డు దాటి వడివడిగా నడిచి పోతుంటే నాకెందుకో అకస్మాత్తుగా గాంధీగారి ‘‘దండియాత్ర’’ సీను గుర్తుకొచ్చింది. (వ్యాస రచనా కాలం 2007 జనవరి)
-పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847