తెలంగాణాలో బయల్పడిన అతిపెద్ద సూక్ష్మ రాతియుగపు పనిముట్టు

దక్కన్‍ చరిత్ర, సం స్కృతి, వారసత్వం, భౌగోళిక, పర్యావరణ అంశాలతో ఒక దశాబ్ద కాలంగా వెలువడుతున్న దక్కన్‍ల్యాండ్‍ మాసపత్రికలో పురావస్తు, చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‍లో పండుగలు, పబ్బాలు, అలనాటి మేటి తెలంగాణా శాసనాలు, వారసత్వం- ఆలయాలు (తెలంగాణా శిథిలాలు, వ్యథాభరిత కథనాలు) పేరిట అనేక వ్యాసాలను రచించారు. దక్కన్‍ల్యాండ్‍ మాసపత్రిక 2025 జనవరి మాసం నుంచి ‘మైలురాళ్లు’ (తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు) అనే కొత్త శీర్షికను ధారావాహికంగా అందిస్తున్నారు. -మణికొండ వేదకుమార్‍, సంపాదకులు


ఆదిమ మానవుని అడుగుజాడలతో ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించిన ఆఫ్రికా తరువాత, దాదాపు అవే ఆనవాళ్లు గల మనదేశపు వివిధ ప్రాంతాల్లో తెలంగాణా కూడ ఒకటి. ప్రాచీన, మధ్య, సూక్ష్మ శిలాయుగాలకు సంబంధించిన అనేక పురాతన స్థలాలు తెలంగాణాలో వెలుగుచూశాయి. ప్రస్తుత నాగర్‍ కర్నూల్‍ జిల్లాలోని అమ్రాబాదు, ఆదిలాబాద్‍ జిల్లాలోని రామగుండం, బోధ్‍, పొచ్చెర, వేములపల్లి, ఖమ్మం జిల్లా చర్ల ప్రాంతంలో ప్రాచీన శిలాయుగపు పనిముట్లు, అసిఫాబాదు, పద్ర, చలేశ్వరం, ఏలేశ్వరం, దేవరకొండ, లక్సెట్టిపేట, సోమశిలలో మధ్య శిలాయుగపు పనిముట్లు, వాంకిడి, హైదరాబాదు సెంట్రల్‍ యూనివర్సిటీ, ఏటూరునాగారం, పాకాల, లక్కవరం మొదలైన చోట్ల చివరి పాత రాతి యుగపు (Upper Palaeolithie Age) రాతి పనిముట్లు దొరికి, తెలంగాణాలో ఆదిమ మానవుని బుడిబుడి నడకల గుర్తుల్ని అందించాయి.


క్రీ.పూ. 40,000-10,000 సం।।ల మధ్యకాలానికి చెందిన ఈ యుగం, ప్లీస్టోసీన్‍ అనే మంచుయుగపు ముగింపు దశగానూ, అలాగే హోలోసీన్‍ యుగపు ప్రారంభ దశగానూ నిర్ణయించారు. ఈ యుగంలో వేట ప్రధానంగా ఆహారాన్ని సంపాందించుకొన్న అలనాటి మానవుడు, బ్లేడ్లు, పక్క అంచు బ్లేడు అనే పనిముట్లతో పాటు, బ్యురిన్‍ అనే రంధ్రాలు చేసే పరికరాలను కూడ తయారు చేసుకొన్నాడు.
వీటితో పాటు పెద్దా, చిన్నా ఆకారపు బ్లేడు, మళ్లీ పదును పెట్టిన బ్లేడ్లు, పెచ్చు బ్లేడ్లు, గోకుడు రాళ్లను ఎక్కువగా క్వార్జైటులో తయారించుకొన్నారు. ఇదే యుగంలో తాము నివసిస్తున్న కొండచరియ ఆవాసాల గోడలు, కప్పులపై సహజసిద్ధంగా లభించే మట్టి రంగులతో వేసిన తొలితరం శిలాయుగపు చిత్రకళ ఆనవాళ్లు కూడా లభించాయి.


శిలాయుగపు చిత్రకళ పాత, మధ్య, సూక్ష్మ శిలాయుగపు స్థావరాలు ఎన్నో ఉన్న తెలంగాణాలో నాగర్‍కర్నూల్‍ జిల్లా, కొల్లాపురం మండలం, సోమశిల సమీపంలోని కృష్ణానదీ తీర గ్రామమైన బొల్లారంలో పురావస్తు శాస్త్రవేత్తలు విస్తు బోయిన ఆధారాలు లభించాయి.
పాత బొల్లారంలో 1984లో అప్పటి పురావస్తుశాఖ, సంచాలకులు డా. వి.వి. కృష్ణశాస్త్రి గారి ఆధ్వర్యంలో, సోమశిల దేవాలయాల పునర్నిర్మాణ బాధ్యతలను చూస్తున్న బి. సుబ్రహ్మణ్యం, ఈమని శివనాగిరెడ్డి రెండు శిలాయుగపు స్థావరాలను గుర్తించారు. పాము పడగ ఆకారంలో గల ఈ ఆదిమ మానవుని ఆవాసాల గోడలు, కప్పులపై ముగ్గుల్ని పోలిన వర్ణచిత్రాలతో పాటు ఒక పక్షి ఆకారం కూడా ఉంది. దీన్ని స్థానికులు కిన్నెర అనీ, ఆ గుండును కిన్నెరసాని గుండు అని పిలుస్తున్నారు. ఈ ఆవాసాల కింద పేరుకుపోయి గట్టిపడిన నేలను గమనించిన బి. సుబ్రహ్మణ్యం గారికి ఒక 17.08 సెంమీ. పొడవు, 5.03 సెంమీ. వెడల్పు సెంటిమీటరు మందంగల క్వార్జైటు రాతితో చేసిన ఒక బ్లేడు దొరికింది. ఇప్పటి వరకూ మనదేశం మొత్తం మీద ఇంత పొడవైన, రెండువైపులా మొనగల అతిపెద్ద సూక్ష్మ రాతియుగపు పనిముట్టు దొరకడం తెలంగాణా చరిత్రలో అందునా ఆదిమ మానవుని చరిత్ర, పురావస్తు అన్వేషణల్లో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి, ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *