మహాబలిపురం చారిత్రక వారసత్వ కట్టడాలు

ప్రాంతం: తమిళనాడు
జాబితాలో చేర్చిన సం.: 1984
వర్గం: సాంస్కృతికం (కట్టడం)


మహాబలిపురంలోని చారిత్రక వారసత్వ కట్టడాలు సంప్రదాయ భారతీయ వాస్తుశిల్పంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి. మహాబలిపురం ఒకప్పుడు పల్లవ రాజవంశపు ప్రసిద్ధ ఓడరేవు నగరం. ఇక్కడి చారిత్రక వారసత్వ కట్టడాలలో రాతి గుహ దేవాలయాలు, ఏకశిలా దేవాలయాలు, బాస్‍-రిలీఫ్‍ శిల్పాలు ఇతర దేవాలయాలు అలాగే పురాతన దేవాలయాల తవ్వకాల అవశేషాలన్నాయి. ఈ కట్టడాలన్నీ ఏడు, ఎనిమిదవ శతాబ్దాలలో కోరమాండల్‍ తీరం వెంబడి రాతితో చెక్కబడ్డాయి. ఈ ప్రదేశం ప్రత్యేకించి రథాలు (రథాల రూపంలోని దేవాలయాలు), మండపాలు, భారీ బహిరంగ ప్రదేశాలు, అనేక అందమైన దేవాలయాలు, వేలకొద్దీ శివుడి శిల్పాలతో ప్రసిద్ధి చెందింది.


ప్రమాణాలు: (i) (ii) (iii) (iv)
(i): అర్జునుడి తపస్సు, గంగానది భూమి పైకి రావడాన్ని సూచించే బాస్‍ రిలీఫ్‍ శిల్పాలు ఒక ప్రత్యేక కళాత్మకతను కలిగిఉంటాయి.
(ii): ఈ శిల్పాల ప్రభావం, వాటి మోడలింగ్‍లోని మృదుత్వం, వంపుసొంపులు కాంబోడియా, అన్నమ్‍, జావా వంటి ప్రదేశాలకు విస్తరించింది.
(iii): మహాబలిపురం ఆగ్నేయ భారతదేశపు పల్లవ నాగరికతకు ప్రబల సాక్ష్యం
(iv): ఈ ప్రదేశం శివుని ఆరాధన ప్రధాన కేంద్రాలలో ఒకటి.


మహాబలిపురం వద్ద ఉన్న షోర్‍ టెంపుల్‍ భారతదేశంలోని పురాతన నిర్మాణ రాతి దేవాలయాలలో ఒకటి.
చెన్నైకి దక్షిణాన తమిళనాడు తూర్పు తీరంలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యూహాత్మక ఓడరేవు మహాబలిపురం. ఒక గ్రీకు నావికుడు తన రచన ‘పెరిప్లస్‍ ఆఫ్‍ ది ఎర్తేరియన్‍ సీ’ లో ‘కావేరికి ఉత్తరాన ఉన్న ఓడరేవు’గా పేర్కొన్నాడు. చైనీస్‍ యాత్రికుడు యువాన్‍ త్సాంగ్‍ కూడా మహాబలిపురం ఓడరేవు స్థావరం గురించి ప్రస్తావించాడు. అయితే ఆయన దానిని ‘కంచి’ అని తప్పుగా పేర్కొన్నాడు. రోమన్‍ నాణేలు, కుండల వంటి పురావస్తు ఆధారాలు కూడా మహాబలిపురం ప్రాముఖ్యతను చాటాయి. దాన్ని ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ధ్రువీకరించాయి. పల్లవ రాజులు శ్రీలంక, ఆగ్నేయాసియాలతో వాణిజ్య, దౌత్య కార్యకలాపాలను నిర్వహించడానికి మహాబలిపురం ఓడరేవును ఉపయోగించారు. మార్కోపోలో బహుశా మహాబలి పురానికి వచ్చిన తొలి యూరోపియన్‍ సందర్శకులలో ఒకరు అతని తర్వాత చాలా మంది ఈ ప్రదేశాన్ని ఒకప్పుడు ఒడ్డుకు సమీపంలో ఉన్న ఏడు దేవాలయాల కారణంగా ‘సెవెన్‍ పగోడాస్‍’ గా పేర్కొన్నారు.


మహాబలిపురం లేదా మామల్లపురం సామన్య శకం ఏడవ శతాబ్దంలో నర్సింహ వర్మన్‍-I చేత స్థాపించబడింది. ఇది తీరం వెంబడి ఉన్న చారిత్రక వారసత్వ కట్టడాలకు, సమీపంలోని కొండకు ప్రసిద్ధి చెందింది. వీటిని పంచ రథాల వంటి మోనోలిత్స్ గా, అర్జునుడి తపస్సు వంటి రాక్‍ రిలీఫ్స్ గా, ప్రసిద్ధ షోర్‍ టెంపుల్‍ వంటి గుహలు, దేవాలయాలుగా వర్గీకరించవచ్చు.
పంచ రథాలు అనేది ఒకే రాతితో చెక్కబడిన ఐదు ఏకశిలా దేవాలయాల చిన్న సమూహం. దేనికదేగా ఉండే నిర్మాణాలు బహుశా భారతదేశంలోని ప్రారంభ నిర్మాణాలు (ఎల్లోరాలోని కైలాస దేవాలయం కంటే కూడా ముందువి) కావచ్చు. ఈ దేవాలయాలు వివిధ పరిమాణాలు, ఎత్తులులో, వివిధ రకాల పైకప్పులను కలిగి ఉన్నాయి.


అర్జునుడి తపస్సు శిల్పం బహుశా సామాన్య శకం ఏడో శతాబ్దపు ప్రారంభంలో చెక్కబడి ఉండవచ్చు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన రాక్‍ రిలీఫ్స్ లలో ఒకటి, బహుశా అతి పెద్దది కూడా. గంగానది అవరోహణ అని కూడా వ్యవహరించే ఈ ప్యానెల్‍ (సుమారు 29.5X13 మీటర్ల వరకు ఉంటుంది) రెండు పెద్ద గ్రానైట్‍ బండరాళ్లపై చెక్కబడింది. ఇది రెండు ఇతివృత్తాలను చూపుతుంది-అర్జునుడి తపస్సు, గంగానది భూమిపైకి రావడం. అందుకే ఈ ప్యానెల్‍ ను ఈ రెండు రకాల పేర్లతో వ్యవహరిస్తుంటారు. ప్రతీకాత్మకతతో నిండిన ఈ ప్యానెల్‍ పై ఏనుగులు, సింహాలు, పులులు, పంది వంటి అడవి, పెంపుడు జంతువులు, గణాలు, (అటెండెంట్‍లు), కిన్నరులు, గంధర్వులు, అప్సరసలు మరియు నాగులు వంటి చక్కగా అమర్చబడిన పౌరాణిక బొమ్మలను కలిగిఉంటుంది. అర్జునుడు తపస్సు చేస్తున్న శిల్పంలో యోగ భంగిమలోని వ్యక్తిని, అలాగే కొన్ని కోతులు, పిల్లి వంటి వాటిని చూడవచ్చు.


షోర్‍ టెంపుల్‍ సముద్ర తీరంలో నిర్మించబడింది. దూరం నుండి చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. అందు బాటులో ఉన్న పాత పెయింటింగ్స్, లితోగ్రాఫ్‍ల ప్రకారం, ఈ ఆలయం తీరం వెంబడి ప్రయాణించే నావికులందరికీ మనోహర దృశ్యంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రధాన ఆలయం ఐదు అంచెల పిరమిడ్‍ పైకప్పు, అలాంటి శిఖర ప్రొఫైల్‍తో ముందు భాగంలో వాకిలితో ఉంటుంది. ఇది దాదాపు 18 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది, గ్రానైట్‍ రాతి బ్లాక్‍ లతో తయారు చేయబడింది. దీని వెలుపలి గోడలు సముద్రం నుండి వచ్చే ఉప్పుతో కూడిన గాలులతో నిరంతర రాపిడి కారణంగా వాటి రూపురేఖలను కోల్పోయిన చిత్రాలతో ఉంటాయి. ఆలయ సముదాయం భాగాలు ఇసుక కింద కూరుకు పోయాయి. అవి ఇటీవల తవ్వకాలలో బయట పడ్డాయి.


మహాబలిపురంలో అర్జునుడి తపస్సు ప్యానెల్‍కు ఆనుకుని ఉన్న స్థానిక కొండలో అనేక గుహలు, చిన్న ఆలయ నిర్మాణాలు, శ్రీకృష్ణుని వెన్నముద్దగా ప్రసిద్ధి చెందిన ఒక పెద్ద, ప్రమాదకర స్థితిలో ఉన్న రాతి బంతి ఉన్నాయి. ఈ గుహలు, దేవాలయాలలో వరాహ గుహ, ఒలక్కనాథ ఆలయం, కృష్ణ మండపం, ధర్మరాజ మండపం, గణేశ రథం ప్రముఖమైనవి.

  • జాన్విజ్‍ శర్మ
    అనువాదం : ఎన్‍. వంశీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *