డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ (DHAT) 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‍లో తన తాజా మూడు పుస్తకాలను విడుదల చేసింది. ఈ ఘన కార్యక్రమం ఈ రోజు, 2024 డిసెంబర్ 29, ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎన్‍టిఆర్ స్టేడియంలో, ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ‘‘సాదిక్ అలీ స్టేజ్’’ వద్ద జరిగింది.
విడుదల చేసిన మూడు పుస్తకాలు ఇవీ:
‘‘కోర్టు తీర్పులో సాహిత్య మెరుపులు’’ – డాక్టర్ మంగరి రాజేంద్ర (జిమ్బో) రచన
‘‘తెలంగాణ శిథిలాలు… వ్యథాభరిత కథనాలు’’ – డాక్టర్ ఎమని శివనాగిరెడ్డి రచన
‘‘తెలంగాణ చరిత్ర తొవ్వల్లో’’-శ్రీ రామోజు హరగోపాల్ రచన
ఈ పుస్తకాలు తెలంగాణ సాహిత్యం, చరిత్ర, మరియు సంస్కృతిని విశదీకరిస్తూ, పాఠకుల మనసులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి.
డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ (డీఏటీ) చైర్మన్ వేదకుమార్ మణికొండ స్వాగతం పలికి పుస్తకాల్లోని చారిత్రక అంశాలను వివరించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ ఏయూ) వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రముఖ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి హాజరయ్యారు. డాక్టర్ మంగరి రాజేంద్ర (జింబో), విశ్రాంత న్యాయమూర్తి, ‘‘కోర్టు తీర్పులో సాహిత్య మెరుపులు’’ రచయిత పుస్తకాలను లాంఛనంగా ఆవిష్కరించి సమీక్షించారు. తెలంగాణ వారసత్వాన్ని పరిరక్షించడంలో వాటి పాత్రను నొక్కి చెబుతూ పుస్తకాల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ చరిత్ర, సాహిత్యం, సాంస్కృతిక వారసత్వానికి వారు చేసిన క•షిని నొక్కిచెబుతూ పుస్తకాల ప్రాముఖ్యతపై తమ ప్రసంగాలతో కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు.

‘‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’’ అనే రచనను మంగారి రాజేందర్ రచించారు. ఈయన కలం పేరు జింబో. ఈయన వృత్తి రీత్యా న్యాయవాది. న్యాయస్థానాల్లో జరిగే సన్నివేశాలను, సందర్భాలను, తీర్పులను తీసుకొని అనేక రచనలు చేశారు. ఈ రచనలు న్యాయస్థానాల్లో జరిగే సన్నివేశాలను తీసుకొని వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాల సంపుటి ఈ రచన. అలాగే తెలంగాణకు చరిత్ర ఉన్నట్లే తెలంగాణ న్యాయ వ్యవస్థలకు చరిత్ర ఉందని రచయిత అంటారు. తెలంగాణ న్యాయవ్యవస్థ అనేక సంవత్సరాల నుంచి అన్యాయానికి గురవుతూ వస్తుందని తెలియజేస్తున్నారు. ఇంకా మన న్యాయవ్యవస్థలు ఫ్యూడల్ స్వభావాన్ని కలిగి ఉన్నాయని అంటారు.
అలాగే తెలంగాణ చరిత్ర తొవ్వలో-2లో కనుమరుగైన, కనుమరుగవుతున్న తెలంగాణ చరిత్రను రచయిత శ్రీ రామోజు హరగోపాల్ తెలియజేశారు. అట్లాగే తెలంగాణ చరిత్ర తొవ్వలో -1 లో తెలంగాణ చరిత్రను తెలియజేశారు. ఈ రెండు రచనల్లోని వ్యాసాలన్నీ దక్కన పత్రికలో క్రమంగా అచ్చయిన వ్యాసాలు. రచయిత చాలా కాలం పాటు తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ చరిత్ర మీద, సాహిత్యం మీద విస్తృతంగా పరిశోధించి, పరిశోధానాత్మకమైన వ్యాసాలు రాస్తూ వస్తున్నారు. రచయిత తెలంగాణలోని పల్లె పేరు వెనుక ఒక చరిత్ర దాగి ఉందని అంటారు. తెలంగాణలోని ఏ పల్లెను తాకిన చరిత్రను చెప్తుందని అంటారు. అలాగే ఏ చెట్టును, పుట్టను, గుట్టను, గుళ్లను తాకిన తెలంగాణ చరిత్రను చెప్తుందని అంటారు. తెలంగాణ చరిత్ర అంతా అద్భుతమైనదని అంటారు. భారతదేశంలో పట్టనంత చరిత్ర తెలంగాణలో ఉందని అంటారు. తెలంగాణలోని అదిలాబాదులో లావా స్తంభాలు ఉంటాయని చాలామందికి తెలియదని అంటారు. ప్రపంచ మానవ విశ్వాస దశలన్నిటిని తెలంగాణ చరిత్రలో, సాహిత్యం చూడవచ్చని రచయిత అంటారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రచయిత హరగోపాల్ తెలంగాణలోని అనేక ప్రాంతాలను, చారిత్రక ప్రదేశాలను, గుహలను, కట్టడాలను సందర్శించి తెలంగాణ చరిత్రను వెతికి తీశారు. తెలంగాణకు కేంద్రమైన హైదరాబాదులో మూలమూలాన తెలంగాణ చరిత్ర దాగి ఉందని, దానిని వెతుకోచ్చని అంటారు. అలాగే తెలంగాణలోని గ్రామ గ్రామాన తెలంగాణ చరిత్రను కూడా ఎతుకోవచ్చని రచయిత అంటారు.
‘‘తెలంగాణ శిథిలాలు -వ్యతాభరిత కథనాలు’’ దీనిని ఈమని శివనాగిరెడ్డి రచించారు. ఇది చాలా చిన్న రచన. కానీ ఇందులో తెలంగాణకు సంబంధించిన అనేక చారిత్రక, సామాజిక, సాహిత్య అంశాలు ఉన్నాయి. తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలను నిర్లక్ష్యం చేయడం వల్లే తెలంగాణ చరిత్ర రోజురోజుకు కాలగర్భంలో కలిసిపోతుందని రచయిత అంటున్నారు. తెలంగాణ చరిత్ర ఎలా కాలగర్భంలో కలిసి పోతున్నదో ఈ రచనలో వివరించారు. ఎట్లా కనుమరుగవుతున్నదో తెలియజేశారు. అది గుడి కావచ్చు, గోపురం కావచ్చు. శాసనం కావచ్చు. కోటలు కావచ్చు. వనరులు కావచ్చు. ఇవన్నీ మన చరిత్ర అని చెప్పి ఆనవాళ్లు, చారిత్రక అంశాలు. రచయిత శివనాగిరెడ్డి తనదైన శైలిలో తెలంగాణ చరిత్రను ఈ రచనలు ఆవిష్కరించారు.

వేదకుమార్ మణికొండ తెలంగాణ సమాజమంతటికి సుపరిచితులు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయడంలో గాని, సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించడంలో గాని తన వంతు కృషి ఎంతో చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ‘‘తెలంగాణ రిసోర్స్ సెంటర్’’ను స్థాపించి అనేక సమావేశాల్లో చర్చలను, సదస్సులు నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ‘దక్కన్‍ల్యాండ్’ పత్రిక స్థాపించారు. ఈ పత్రిక నేటికీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ పత్రికలో వచ్చిన వ్యాసాలను అనేక పుస్తకాలుగా ప్రచురించారు. 1) కోర్టుతీర్పులు సాహిత్య మెరుపులు, 2) తెలంగాణ చరిత్ర తువ్వలో-2, 3) తెలంగాణ శిథిలాలు వ్యథాభరిత కథనాలు’ ఈ మూడు రచనలోని వ్యాసాలు దక్కన్ పత్రికలో అచ్చయిన వ్యాసాలు. దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ రచనలు ఆవిష్కరించబడ్డాయి. ఈ మూడు రచనలు తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ చరిత్రను తెలియజేస్తున్నాయి.
కార్యక్రమంలో రచయితలు బీవీ భద్రగిరీష్ (తెలంగాణ చరిత్రకారుడు) మరియు డాక్టర్ డి.ఆర్. శ్యాంసుందర్ రావు (చరిత్రకారుడు) కూడా పాల్గొన్నారు. ప్రధాన అతిథులు ఆవిష్కరించిన మూడు పుస్తకాల విశేషాలను తెలియజేశారు. ఇలాంటి ప్రచురణలు తెలంగాణ గాఢ వారసత్వానికి జీవం పోస్తాయని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరినీ ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ రవీందర్‍రెడ్డి శాలువాలతో సత్కరించారు. ఖైజర్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం రచయితలు, చరిత్రకారులు, విద్యావేత్తలు మరియు పుస్తక ఔత్సాహికులతో సహా ఉత్సాహభరితమైన ప్రేక్షకులను ఆకర్షించింది.
ఎ. మల్లేష్,
రీసెర్చ్ స్కాలర్, ఒ.యు,
ఎ : 960387073