గురు శిష్యుల అనుబంధాన్ని తెలిపే కథలు

గరిపెల్లి అశోక్‍ బాల సాహిత్యంలో పరిచయం చేయనవసరంలేని పేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పిల్లలకు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కల్పిస్తూ బాల సాహిత్యంలో పిల్లల రచనలు వికసించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేస్తున్నారు గరిపెల్లి. వయస్సు రీత్యా ఉపాధ్యాయ వృత్తి నుండి విరమణ పొందినప్పటికీ, ఇప్పటికీ పిల్లలకోసం తన సమయాన్ని కేటాయిస్తూ, వివిధ సాహితీ కార్యశాలలు నిర్వహిస్తూ పిల్లల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. అంతేకాక ఖాళీ సమయంలో తనకున్న విశేష అనుభవంతో పిల్లల కోసం మంచి మంచి కథలు రాసి వాటిని పుస్తకరూపంలో తెస్తున్నారు.


ఇంతకుముందే మా బడి కథలు, ఎంకటి కథలు, సరికొత్త ఆవు పులి కథల పుస్తకాలతో పిల్లలకి ఇష్టమైన కథలను రాసిన గరిపెల్లి అశోక్‍ గారు ఇప్పుడు ‘‘గోటీలాట’’ అంటూ మరో పిల్లల కథల పుస్తకంతో మన ముందుకు వచ్చారు. ఇవి కథల కావు, ఇవన్నీ బడిలో జరిగిన యదార్థ సంఘటనలు. ఇవన్నీ బడిలో ప్రతి ఉపాధ్యాయుడికి కనిపించే వాస్తవ దృశ్యాలు. ఆత్మీయతకు, అనురాగానికి, అనుబంధానికి మార్గంగా నిలిచిన సన్నివేశాలు. చిన్నారుల ఆలోచనలకు ప్రతిబింబాలు. చిట్టి మనసుల్లో కల్మషం లేని ప్రేమని తెలియజేసే గుర్తులు మొత్తంగా ఇవన్నీ ఒక మధుర జ్ఞాపకాలు.
ఇచ్చిపుచ్చుకోవడం, పెద్దలపట్ల గౌరవం, తోటి వారికి సహాయం చేయడం, ఐకమత్యం మొదలగు అనేక విలువలను తెలుపుతూ ఈ కథలు కొనసాగాయి. పిల్లలు ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరనే ధైర్యం నింపే కథలు ఇవి. విద్యార్థులకు పుస్తకాల్లోని చదువొకటే కాదు సంస్కారంతో పాటు అనేక సామాజిక విషయాలు కూడా తెలియాలనే విషయాన్ని ఈ కథలు తెలియజేస్తాయి. మాటల్లో తీయదనం, మక్కకంకుల మాధుర్యం, చేపలు పట్టడంలో నైపుణ్యం, బొమ్మలు చేయడంలో నేర్పరితనం వంటి పిల్లలకు ఉన్న ఎన్నో నైపుణ్యాలు ఈ కథలలో మనకు కనబడుతాయి.
పిల్లలకు అనేక ఆలోచనలు ఉంటాయి. పిల్లల మనసుని గెలిచే ఉపాధ్యాయులంటే వారు దేనినైనా సాధిస్తారు. బడి పిల్లల లేత మనసుల్లోకి తొంగి చూసిన ఉపాధ్యాయుడికి అనేకానేక ద•శ్యాలు గోచరిస్తాయి. గురు శిష్యుల అనుబంధాన్ని తెలిపే కథలు ఇవి. పిల్లల బంగారు భవిష్యత్తుకు బంగారు బాట పడాలంటే ఇట్లాంటి కథలను ఉపాధ్యాయులు చదవాలి. నేటి తరం పిల్లలకు నాటి తరం అనుభవాలను తెలియజేసిన ఒక మంచి పుస్తకం ఇది. ఈ తరం పిల్లలకు ఇట్లాంటి పుస్తకాలు ఎంతో అవసరం. ఇందులో ఉన్న ప్రతి కథ వాస్తవానికి దగ్గరగా ఉంది. కథ చదివే వారికి వారి బాల్యపు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.


పిప్పరమెంట్లు కథలలో రమేశ్‍ సార్‍ చెప్పిన పిల్లల పంచాయతీ కాకెంగిలి రుచిని తెలియజేసింది. ఈ కథ మనల్ని ఒక్కసారిగా మన బాల్యంలోకి తీసుకుపోతుంది. స్నేహితులతో తోబుట్టువులతో కాకెంగిలి చేసుకుని తిన్న రోజులు గుర్తుకు వస్తాయి. పిప్పరమెంట్లు కథలో లల్లి, చెర్రి మధ్య జరిగిన గొడవకు పరిష్కారం చూపుతూ రమేశ్‍ సార్‍ వారిని మిత్రులుగా మార్చడం కొరకు వేసిన శిక్ష అది శిక్ష కాదు రక్ష అని తెలియజేస్తాడు. బఠానీలు కథ శ్యాం సార్‍ ద్వారా బడిలో ఏం తిన్న అందరికీ పంచాలనే స్నేహ సూత్రంను తెలుపుతుంది. బఠానీలు తింటున్న శీనుకు తన తప్పు తాను తెలుసుకొని తన తోటి పిల్లలతో పంచుకొని తినడంలో ఉన్న ఆనందాన్ని చూపిస్తాడు ఉపాధ్యాయుడు.
బిస్కట్లు కథలో ఇసుక బట్టీల నుంచి వచ్చిన కుర్రాడి బాధను విని రామారావు సార్‍ స్పందించిన తీరు పిల్లలకు సహాయం గుణాన్ని అలవరుస్తుంది. వలస కూలీల జీవిత కష్టాలను తెలిపే బిస్కెట్ల కథ స్నేహ బంధాన్ని తెలుపుతుంది. మధ్యతరగతి కుటుంబంలోని పేదరికపు కష్టాలు వలన చిన్నప్పుడే కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకునే విధానమును పిల్లలకు తెలుపుతుంది. కూరా, చారు కథలో పద్మ బడికి లేటుగా రావడానికి గల కారణం బడిలో పెట్టిన గుడ్డును ఇంటికి తీసుకు వెళ్ళడానికి గల కారణం పెద్దసార్‍ తెలుసుకోవడం వల్ల పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని తెలుపుతుంది. నాన్నపై పిల్లలకున్న ప్రేమను మన కళ్ళముందు నిలిపింది. పెద్దసార్‍ పద్మ ఇంటి పరిస్థితులను తెలుసుకొని పెన్నులు, పుస్తకాలు ఇవ్వడం
ఉపాధ్యాయుడి ఔదార్య గుణమును తెలియజేస్తుంది.


ఎండ్రికాయలు- చేపలు కథలో వర్షం కొట్టినప్పుడు పిల్లలు బడికి రాకుండా చేపల పట్టడానికి వెళ్లడం, చేపలు పడుతూ సార్లకు దొరికిపోవడం, తల్లిదండ్రులు పిల్లలను బాగా కొట్టండి అనడం జరుగుతుంది. కానీ వారు చెడిపోయిన విద్యార్థులు కారని జీవన నైపుణ్యాలు ఉన్న వారని గుర్తించి సార్‍ వారిని మందలించి వదిలిపెడుతారు. పిల్లలు చదువుతో పాటు బతుకుపాఠాలు కూడా నేర్చుకుంటున్నారని తల్లిదండ్రులకు చెపుతారు. పండ్ల బుట్టలు కథలో సఫాయి వెంకటయ్య కొడుకు సత్యం చేయని నేరానికి దొంగలా ముద్రపడుతాడు. తన నిజాయితీతో పోలీసుల ఆలోచనలు మార్చగలుగుతాడు. చివరికి నిర్దోషి అని తెలిసి పోలీసులు అతనిని సన్మానించడం జరుగుతుంది. సత్యం గురించి పోలీస్‍ తో సార్‍ చెప్పిన తీరు విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడికి ఉన్న సదాభిప్రాయంను తెలియజేస్తుంది. అంతేకాక ఈ కథ పరిసరాల పరిశుభ్రత గురించి కూడా తెలియజేసింది.
మక్క కంకులు కథలో శీను అనే విద్యార్థి కంకులు కొని తన తోటి స్నేహితులందరితో సమానంగా పంచుకొని తినడం, మీసాల సార్‍ (బాల్‍ రెడ్డి), లచ్మన్‍ సార్లు కూడా సొంత పిల్లల కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమించడమనేది ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య అనుబంధాన్ని తెలుపుతుంది. పంచుకొని తినడంలో ఉన్న ఆత్మీయతను మక్కకంకుల కథ ద్వారా తెలియజేశారు. గోటీలాట కథలో జేబు నిండా గోటిలతో పిల్లలు ఆడుకోవడం, తల్లిదండ్రులను డబ్బులు అడుక్కొని చాటుగా గోటీలు కొనుక్కోవడం, తండ్రి మందలించడం జరుగుతుంది. పిల్లలు సరదాగా ఆడుకునే గోటీలను సురేష్‍ సార్‍ గణితాన్ని బోధించడానికి ఉపయోగించడం ఉపాధ్యాయుడి స•జనాత్మకతకు నిదర్శనం. ఆటల వల్ల పిల్లల్లో ఏకాగ్రత, స•జనాత్మకత, పోటీ తత్వం, స్నేహ బంధం అలవడుతుందని చెపుతాడు.


ఎల్లిగడ్డలు కథలో తిరుపతి స్నానం చేయకుండా బడికి రావడం, ఉపాధ్యాయుడి మందలింపు, తిరుపతి తప్పు ఒప్పుకోవడం జరుగురుంది. కానీ నారాయణ సార్‍ అప్పజెప్పిన పనిని తిరుపతి మనసు పెట్టి చేసి గురువు మాటను గౌరవిస్తాడు. పరిసరాల పరిశుభ్రత గురించి బడికి స్వచ్ఛతా పురస్కారం వచ్చినందుకు తిరుపతి బహుమతి ఇవ్వడం కొసమెరుపు. జామకాయలు కథ స్వర్ణకార, వడ్రంగి, కుమ్మరి మొదలగు వ•త్తిపని వారి నైపుణ్యంను తెలియజేయడమే కాకుండా తాత మనుమడి అనుబంధమును తెలియజేసింది.
చిప్పల పండ్లు కథలో తిరుపతి, వాళ్ల అమ్మ పడుతున్న శ్రమను గుర్తించి దసరా రోజున ఇంటికి ఆహ్వానించి వారికి కొత్తబట్టలు, నగదు ఇప్పించడం నారాయణ సార్‍ గొప్ప మనసును చాటుతుంది. సార్‍ మనవడు కూడా చుట్టుపక్కల వారిని పిలుసుకువచ్చి వారికి తోచినంత ఇప్పిచడం, పెద్దలను చూసి పిల్లలను నేర్చుకుంటారని తెలియజేస్తుంది. సెలవుల తర్వాత పోశమ్మ నారాయణ సార్‍ కొరకు మరియు మిగతా ఉపాధ్యాయులు కొరకు చిప్పల పండ్లు తెచ్చి తన ఆత్మీయతను చాటుకుంది.
ఇలా ఇందులో ప్రతి కథ కూడా దేనికదే ప్రత్యేకమైనది. ఇవన్నీ స్థానికతను గ్రామీణ జీవితాన్ని, బాల్యంలో పిల్లల అలవాట్లను, ఒకప్పటి పల్లె జీవనశైలిని మనకు తెలియజేస్తాయి. అన్ని కూడా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి పిల్లల కథలు. అలతి అలతి పదాలతో అక్కడక్కడ అచ్చమైన గ్రామీణ పదాలతో చాలా చక్కగా రాశారు. ఈ కథల ద్వారా కొన్ని తెలంగాణ యాస పదాలను కూడా పిల్లలకు పరిచయం చేయడం జరిగింది. పుస్తకానికి అందమైన ముఖ చిత్రాన్ని వేయడమే కాకుండా కథలకు అనుగుణంగా గోపాలక•ష్ణ వేసిన చక్కని బొమ్మలు గోటిలాట పుస్తకానికి మరింత అదనపు శోభను కలిగించాయి. గరిపెల్లి అశోక్‍ గారి నుండి మరిన్ని పిల్లలకు ఉపయోగపడే రచనలు రావాలని ఆశిస్తూ అభినందనలు..


-కందుకూరి భాస్కర్‍
ఎ : 9441557188

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *