కంకల్ల చారిత్రక గాథ

కాలగర్భంలో ఎన్నో చారిత్రక సంఘటనలు. భూగర్భంలో కూడా దాగిపోయిన చారిత్రక శిల్పాలు, శాసనాలు, గుడులు, పురావస్తువులెన్నెన్నో. తవ్వుకున్న కొద్ది చరిత్ర గంపలకెత్తుకునేంత. మానవ వికాస, పరిణామదశల్ని తెలుసుకునే ప్రయత్నమే చరిత్రాన్వేషణ. ఒక్కొక్క చోట ఒక్కో చారిత్రకమైన ఆనవాళ్ళు వెతుకుకోగలం. చరిత్రకు ప్రతిచోటు, ప్రతివస్తువు కావలసినదే. వాటిని పరిశీలించి, పరిశోధించి చరిత్రను వెలుగులోనికి తేవలసిన బాధ్యత చరిత్రకారులది.
ఉత్తరభారతంలోని మధురకు సమీపంలో ‘కంకాలితిల’ అనేచోట పురావస్తుశాఖ తవ్వకాలు జరిపినపుడు బయటపడ్డ క్రీ.పూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ.12 శతాబ్దం మధ్య జైననిర్మాణాలైన స్తూపాలు, దేవాలయాలు, శిల్పాలు, శాసనాలు ఎంతో విలువైనవి చరిత్రకు. లభించిన శాసనాలవల్ల ఆ కాలంలో జైనంలో వచ్చిన దిగంబర, శ్వేతాంబర శాఖల పరిణామం తెలుస్తున్నది. తెలంగాణాలో కూడా తొలుత దిగంబర పిదప శ్వేతాంబర శాఖల శిల్పాలు లభిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‍ జిల్లా, పూడూరు మండలం, కంకల్‍ గ్రామంలో ఇటీవల ఎన్నో దిగంబర జైన శిల్పాలు గుర్తించబడ్డాయి. వాటితోపాటు రాష్ట్రకూట, కళ్యాణీ
చాళుక్య, కాకతీయ రాజవంశాల కాలపు శిల్పాలు, గుడులు, శాసనాలు వెలుగులోనికి వచ్చాయి.
ఈ గ్రామాన్ని సందర్శించి గుడులు, శిల్పాలను, వాటి కాలాలను, శైలులను గుర్తించారు స్థపతి, ప్లీచ్‍ ఇండియా ఫౌండేషన్‍ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డిగారు. అక్కడ ఉన్న శాసనాలను పరిశీలించడానికి గ్రామస్తుల కోరిక మేరకు నేను కంకల్‍ గ్రామానికి వెళ్ళాను.
వీరభద్రాలయ ప్రాంగణంలో రెండు శాసనస్తంభాలున్నాయి. ఎన్నో శిల్పాలను వేదిక మీది చేర్చారు. ఇంకా ఊరంతటా విగ్రహాలు ఎన్నో వున్నాయి. పదుల సంఖ్యలో వీరగల్లులున్నాయి.
కంకల్‍ లోని జైన శిల్పాలు:

వీరభద్రుని గుడి పక్కన ఉన్న వేదిక మీద మూడు సింహాల లాంఛనం, పీఠానికి రెండువైపుల రెండు ఏనుగులున్న అధిష్టానపీఠం ఉంది. ఇది 24వ జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుని శిల్పం నిలిపే పీఠం. ప్రస్తుతం దాని మీద అమ్మదేవత శిల్పం పెట్టివుంచారు.

వీరభద్రాలయానికి ఆగ్నేయదిశలో నిలబెట్టి వున్న శిల్పాలలో 3వ విగ్రహం 23వ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడు. అతనికి కుడిపక్కన ఎడమచేతులలో చామరాలు ధరించి నిల్చున్నవారు జైనయక్షులు, ద్వారపాలకులు. అన్నీ రాష్ట్రకూటశైలివే.

వీరభద్రునిగుడికి ఎదురుగా రోడ్డుకవతల చిన్న గుడిమంటపం, అందులో 5 అడుగుల ఎత్తైన గణపతి శిల్పం. మంటపానికి ముందున్న రెండు స్తంభాలు రాష్ట్రకూటశైలిలో వున్నాయి. వెనక గుడిద్వారానికి ఉన్న స్తంభాలటువంటివే. గణపతి ద్విభుజుడు. తలపై చిన్న కిరీటం ఉంది. మెడలో మువ్వల హారం ఉంది. పొట్టమీద నాగబంధం ఉంది. లలితాసనంలో ఉన్న ఈ గణపతి జైన సంప్రదాయానికి చెందినవాడుగా కనబడుతున్నాడు.

గ్రామంలో అంగడి దగ్గర, బొడ్రాయి సమీపంలో పడివున్న విడిశిల్పాలలో చామరధారి జైనయక్షుడు, జినుని తల, ద్వారపాలకుని శిరస్సు కనిపిస్తున్నాయి.

గ్రామంలో పుడుగుర్తి వెళ్ళే తొవ్వలో బావి పక్కన చింత చెట్టు కింద ఒరిగించి పెట్టిన కాయోత్సర్గ భంగిమలో నిల్చున్న, తలలేని జైన తీర్థంకరుని(?) శిల్పం ఉన్నది. దాని పక్కన జినుని తల ఉన్నది.

ఊరిలోని ఒక దిబ్బమీద జైన చామరధారి శిథిల శిల్పం
ఉన్నది.

గ్రామంలో ఒకరి ఇంటిగోడకు ఆనించి నిలబెట్టిన మరొక జైన చామరధారి శిల్పం కనిపించింది.

అక్కడే తలలేని జైన తీర్థంకరుడు రుషభుని శిల్పముంది.
శైవధర్మ శిల్పాలు:

వీరభద్రాలయ ప్రాంగంణంలోని వేదిక మీద పెట్టివున్న శిల్పాలలో వీణాధరమూర్తి(శివుడు), గణపతులతో కూడిన సప్తమాత•కల శిల్పఫలకం ఉంది. అందరి వాహనాలు, పరికరాలు, ఆభరణాలు సుందరంగా చెక్కబడ్డాయి. ఇది రాష్ట్రకూట (8,9,10వ శ.) శైలి శిల్పఫలకం.

అక్కడ నిలబెట్టిన నాగశిలలు వివిధ కాలాలకు చెందిన శైలులలో వున్నాయి. రాష్ట్రకూట, చాళుక్య కాలాలకు చెందినవి.

అక్కడున్న శివలింగం కాకతీయశైలి సమలింగం. బ్రహ్మ, విష్ణు, రుద్రభాగాలతో సమతలశీర్షంతో ఉన్నది.

వేదిక మీద చిన్ననంది పెద్దమువ్వల పట్టెడలతో, ముఖ పట్టకం, గజ్జెలదండతో చిన్న కొమ్ములు, చిన్న మూపురంతో ఉన్నది. ఇది రాష్ట్రకూటశైలి.

గణపతి శిల్పం కొత్తది. లక్ష్మీగణపతి.

వేదిక మీదున్న లింగం, నందులు కొత్తవి.

వేదికకు వెనకవైపున అరుగుమీద ఉన్న రెండు శిల్పాలు వాతావరణానికి నునుపుదనాన్ని కోల్పోయాయి. ఒకటి పురుషశిల్పం.ద్విభుజుడు. జైన సంబంధ విగ్రహమనిపిస్తున్నది. రెండవది చతుర్భుజురాలైన దేవత చాముండి శిల్పం.

అదే అరుగుమీదున్న మరొక స్త్రీశిల్పం కూడా చాముండిదే. చతుర్భుజి. ఢమరుకం, త్రిశూలం, ఖడ్గం, రక్తపాత్రలు పరికరాలు.

గుడి తూర్పున బాటదగ్గరలో ఒక శిథిలమైన నంది ఉన్నది. పెద్దగంటల పట్టెడతో రాష్ట్రకూటశైలి శిల్పం.

అక్కడే పడివున్న గుడి మంటపస్తంభం కిందివైపు, పై వైపు చతురస్రభుజాలతో మధ్యన కంకణం, దానికిరువైపుల 16 ఫలకాలతో కూడివుంది. పైన పుష్పదళ కంఠం వుంది.

కాకతీయశైలిలో చెక్కిన మరొక నంది విగ్రహం అక్కడేవున్నది.

గణపతి గుడికి కుడిపక్కనున్న గుడి కొత్తది. వందేండ్లు పైబడ్డ నిర్మాణం. ఈ శివాలయం ఎదురుగా గూడులో రాష్ట్రకూటశైలి పాత నంది వుంది. మంటపంలో కొత్త నంది ఉంది. లోపల గుండ్రని పానవట్టం మీద ఛత్రోపరితల శీర్షంతో లింగం
ఉంది. కొత్త శివలింగం. గుడి పైన సున్నంతో చేసిన దేవేరులతో గరుడవాహనం మీద విష్ణువు కనిపించడం విశేషం. పరికరాలు కూడా కొత్తవే.

వీరభద్రాలయం ముందర మసీదుంది. దానికి దేవాలయ భాగాలను వాడినట్లు బయటగోడలవల్ల తెలుస్తున్నది. మసీదు ఉత్తరంగోడలో దేవాలయపు అర్ధమంటపం పిట్టగోడ రాతిదిమ్మె ఉంది. దానిమీద చాళుక్యశైలి చతుర్దళపుష్పాలు చెక్కివున్నాయి.

ఆ ప్రాంగణంలో దేవతపాదాల పీఠం, రాష్ట్రకూటశైలి స్తంభాలు, దేవాలయపు గోడల రాతిగోడభాగాలు కనపడుతున్నాయి.
కంకల్‍ గ్రామంలో విడిశిల్పాలు:
హనుమాండ్ల గుడిలో శిల్పం కొత్తదిగానే తెలుస్తున్నది. గ్రామంలో అక్కడక్కడ నాగశిలలున్నాయి. గ్రామంలో విడిశిల్పాలు చాలానే అగుపిస్తున్నాయి. తలలు విరిగినవి, తలలు మాత్రమే మిగిలిన శిల్పాలున్నాయి. కొన్ని కాకతీయ, చాళుక్యశైలుల శిల్పశిథిలాలు. గ్రామంలోని కాలువ ఒడ్డున ఇద్దరు దేవతల సుఖాసనస్థితి శిల్పఖండాలు రెండు కనిపించాయి. గ్రామం బయట చిన్న కిరీటంతో మెడలో హారంతో, కుడిచేత గదవంటి ఆయుధం, ఎడమచేతిలో ఫలంవంటిది ధరించి స్థానకభంగిమలో ఉన్న పురుషశిల్పం వీరగల్లువలె వుంది. పక్కన చాముండి శిల్పం వుంది.
వీరభద్రాలయం:
వీరభద్రాలయంలో గుడి ద్వారం సాదాసీదా ద్వారబంధంతో ఉన్నది. దానిమీద గణపతి లలాటబింబంగా ఉన్నాడు. గర్భగుడిలో వీరభద్ర శిల్పం సుందరమైనది. త్రికోణాక•తి మకరతోరణం వీరభద్రుని తలవెనక అగుపిస్తున్నది. చతుర్భుజుడైన వీరభద్రుడు పరహస్తాలలో ఢమరుకం, త్రిశూలాలు, నిజ హస్తాలలో ఖడ్గం, డాలు ధరించి, ద్విభంగిమలో నిల్చుని కనిపిస్తున్నాడు. పాదాలు అర్థవైతస్తిక స్థితిలో ఉన్నాయి. మెడలో హార, గ్రైవేయకాలు, ఉదరబంధం, మేఖల, అర్థోరుకం, చేతులకు హస్తభూషణాలు, పాదాలకు పాంజీబులు, కపాలమాల జంధ్యంగా ధరించి కనిపించే వీరభద్రుని శిల్పం కాకతీయశైలిలో ఉన్నది. వీరభద్రునికి కుడిపక్కన మేషశిరంతో దక్షుని చిన్న శిల్పం వుంది. కుడిపాదం సమీపాన సూక్ష్మ గణపతి శిల్పముంది.
గర్భగుడిలో శివలింగం:
గర్భగుడిలో కనిపించే శివలింగం 9 అడుగుల పొడుగైందని, దానికి బ్రహ్మ, విష్ణు, రుద్రభాగాలున్నాయని చెప్పారు. ఈ శివలింగం ఒక సమలింగం. దీనికి ఛత్రోపరితం ఉన్నది. కాకతీయశైలి.
ఉపాలయంలో భద్రకాళి:
వీరభద్రుని గుడికి ఉపాలయంగా ద్వాదశభుజురాలైన భద్రకాళి శిల్పం(కొత్తది) ఉన్నది. ఈ గుడి ద్వార శాఖలు రెండు వేర్వేరు. కుడివైపున్న ద్వారశాఖమీద చామరధారిణులతో ద్వారపాలకుడున్నాడు. ద్వారశాఖ మూడు పట్టీలతో చతుర్దళపుష్పం, లతలు, తామరపూరేకులతో వాటి పక్కన స్తంభికతో ఉన్నది. ఎడమవైపు ద్వారశాఖ మీద పెద్ద ధమ్మిల్లంతో కుడిచేత గదవంటి ఆయుధంతో వైతస్తిక(వైష్ణవ)పాదభంగిమలో నిల్చున్న స్త్రీ ద్వారపాలిక ఉన్నది. పక్కన స్తంభిక ఉంది. ద్వారపతంగం మీద లలాటబింబంగా గణపతి ఉన్నాడు.


గుడిలో బావి:
గుడిలోనే ఆగ్నేయంగా చిన్న మెట్లబావి వుంది. చేదబావి అంత విస్తీర్ణంలో నీరుంది. ఈ కోనేరును గుడి ఆవరణలోనికి నిర్మాణమెందుకు చేసారో మరి.
కంకల్‍ శాసనాలు:
1వ శాసనస్తంభం:
ఈ స్తంభం మీద
1వ వైపు భూలోకమల్లుని 4వ రాజ్యసంవత్సరంలో ఉత్తరాయణసంక్రాంతి పర్వనిమిత్తం అంటే క్రీ.శ.1129 డిసెంబరు 25వ తేదీన కంకల్లలో బెజ్జేశ్వరుని ప్రతిష్టాసమయంలో బెజ్జరసరు 100 మర్తురుల భూమిని నైవేద్యాదుల కొరకు దానం చేసాడన్న శాసనం,
‘‘శ్రీమచ్చాళుక్య భూలో/క వర్షద 4 నేయ సౌమ్య సంవ/త్సవరద పుశ్య సుద్ధ13 సోమ/వారదందుత్తరాయణ సంక్ర/మణదపర్వ నిమిత్తవాగలుముంన/తమన్వయాగతదింపిన్దు శ్రీమతు/కంకల్ల్ల బేజేస్వరదేవర ప్రతి/ ష్టదేయదుమయ్యదేయ బెజ్జర/సరు కంకల్ల(హి)లదల్లి’’
3వ వైపు భూలోకమల్లదేవుని 5వ రాజ్య సంవత్సరంలో సూర్యగ్రహణ సందర్భంగా అంటే క్రీ.శ.1130 అక్టోబరు 5న మహామండలేశ్వరుడు సోవిదేవనడిగర్‍ ప్రెగ్గడ, ప్రముఖ కరణం, సౌధరుడు బెజ్జయనాయకుడు బెజ్జేశ్వరదేవర అంగభోగనైవేద్యాలకు భూములు, గద్యాణాలను కానుకగా ఇచ్చాడన్న శాసనం,
‘‘స్వస్తిశ్రీ మచ్చాళుక్య భూలోకవ(ర్ష)/ద5నేయ సాధారణ సంవత్సరదఆ/శ్విజదమావాశ్యేఆదిత్యవారదందు సూ/ర్యగ్రహణపర్వ నిమిత్తవాగి/శ్రీ మన్మహామణ్డలేశ్వరం సోవిదేవ/నడిగరార్కేయ.. ఆదహెగ్గడదణమ/ కప్రముఖకరణంగళుసేదరే బెజ్జ/యనాయకప్రముఖ.. బుగొవి/ణద్దుగళువి… శ్రీ బెజ్జేశ్వరదేవరం../బొగనివేద్యనదాది’’
ఇదే శాసన స్తంభం మీద ఉపశాసనంగా బెజ్జేశ్వరదేవర తొత్తు (సేవకుడు) కంకల్లలో బెజ్జేశ్వరునికి గుడి, మంటపం కట్టించాడు. మహామండలేశ్వరుడు సోమపెర్మానడి సూర్యగ్రహణ సందర్భంగా వందల మర్తురుల భూమిని దానం చేసాడన్న శాసనం ఉన్నాయి..
‘‘స్వస్తిశ్రీమతుబెజ్జేస్వరదే/వరతొత్తుకంకల్లకరుమ…/.. ఱిద్దిశ్రీబెజ్జేస్వరదేవరపా/దేసెలుబెగిమట్ట../ దలాగిదేగుల ము మం/టపముమంమాడిసి..శ్రీ/మన్మహామణ్డలేస్వరంసో/మపెర్మానడిగల్లే.. న/పగాయకదబూరహ/దదుకొట్టల్లెకు’’
2వ శాసన స్తంభం:
దీని మీద చాళుక్య చక్రవర్తి భూలోకమల్లదేవుని 6వ రాజ్య సంవత్సరంలో ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం అంటే క్రీ.శ.1132 జనవరి 8న మహామండలేశ్వరులు సోమపెర్మానడిగలు, సౌధరి గుండనరస, కంకల్లనాథ సౌధరులు, గావుండాలు బమ్మినాయకుడు, బిలనాయకుడు, సారిగెయనాభనాయకుడు, నకరంలోని వారందరు కూడి భూదానం చేసారు.
‘‘శ్రీమ/చాళుక్య భూలోకవర్షద 6నేయ వి/రోధక•తు సంవత్సరద (..ళ్య)సుద్ద/5 సుక్రవారదందుముత్తరాయణ /సంక్రాన్తినిమిత్తదిసమస్తప్రసస్తిసహి/తం శ్రీమన్మాహమణ్డలేశ్వరం సోమ(ఉ)మ్మ/వడిగళ పెగ్గడసోదరేగు(డ్డి) నరసనుం కం/కల్లనాథ సొదొరెళుల…… గా/వున్డనుంబమ్మినాయకనుం బిలనా/యకనుం సారిగెయనాభె నాయక/నుం అల్లియ సమస్త నఖరము నా/ద సమస్తప్రభు… తూమ్డిగళుం కూడి’’
ఈ రెండు శాసనాలు కంకల్లలోని బెజ్జేశ్వర దేవరకు చేసిన దానాలే. వందలాది ఎకరాల భూమిని దానం చేసారు. ఈ దానాలీయడంలో కంకల్ల-24 కంపణంలోని కంకల్ల నకరం ప్రజలందరు పూనుకోవడం, సహకరించడం వంటి సత్సంప్రదాయం మళ్ళీ కాకతీయుల కాలంలో కనిపిస్తుంది. శాసనంలో వాడిన పదాలను అధ్యయనం చేయవలసివుంది.
కంకల్‍ వీరగల్లులు:

తలపై కుడివైపుకు ఒరిగిన బంతిసిగ, దానికి రిబ్బను, చెవులకు పెద్దకుండలాలు, మెడలో రత్నాలహారం, నడుమున ధట్టీ, దానికి వేలాడుతున్న పట్టాకత్తి, వీరకాసె, కాళ్ళకు కడియాలు, చేతులకు కంకణాలతో రెండుచేతుల్లో పట్టుకున్న బల్లెంతో గుర్రాన్ని వధిస్తున్న వీరుడు యుద్ధరంగంలో వున్నాడు. అతని తలవైపున ఈటెతో దాడిచేస్తున్న అశ్విక వీరుడు, ఎడమకాలివైపు ఇద్దరు అశ్వికులు తనపై దాడి చేస్తున్నారు. వీరునికి పై అంతస్తులో అప్పరాంగనల వీవెనలతో ఉపచారాలందుకుంటున్న వీరుని శిల్పముంది. ఇది రాష్ట్రకూటశైలి శిల్పం.

తలపై కిరీటంతో కత్తి,బల్లెంతో యుద్ధానికి సిద్ధపడి కనిపిస్తున్న ఈ వీరగల్లు కాకతీయానంతర శిల్పం.

కుడివైపు దూసుడుముడి సిగతో, చెవులకు కుండలాలతో, మెడలో హారంతో, దండకడియాలు, కంకణాలు, కాళ్ళకు కడియాలతో డాకాలు ముందుకు చాపి, వీరకాసెతో రెండు చేతుల్లో బల్లెంతో కనిపిస్తున్న వీరుడు, శత్రువీరున్ని వధిస్తున్నాడు. తాను యుద్ధంలో అమరుడై వీరస్వర్గమ లంకరించినట్లు పై అంతస్తులో అప్సరాంగనలు చామరాలు వీస్తున్నారు. వీరుడు వీరస్వర్గంలో…

ఒకేచోట 4 వీరగల్లులున్నాయి. ఒక వీరగల్లులో వీరుడు తలవెనక జారుడు సిగముడితో కనిపిస్తున్నాడు. ఈటెతో పొడిచి శత్రువీరుణ్ణి పైకెత్తాడు. తాను మరణించి వీరస్వర్గమ లంకరించినట్లు పై అంతస్తులో కనిపిస్తున్నాడు.

అక్కడే వున్న రెండవ వీరగల్లులో వీరుడు బల్లెంతోనే పోరాడు తున్నాడు. నడినెత్తిన కొప్పున్నది. దానికి రిబ్బన్‍ కట్టివుంది. పై అంతస్తులో తాను వీరస్వర్గంలో వున్నాడు. ఇది రాష్ట్రకూటశైలి వీరగల్లు.

కుడిచేతితో కత్తి భుజం మీద పెట్టుకుని, తలవెనక సిగముడిచి కనిపిస్తున్న వాలుకన్నుల వీరుడు ఎడమచేత బాకు పట్టుకుని వున్నట్టుంది. అమరుడై వీరస్వర్గమలంకరించాడు.

తలవెనక సిగతో చేతిలో బల్లెంతో పోరాడుతున్న వీరుని శిల్పం కాకతీయానంతర శిల్పం.

కుడిభుజం మీద కత్తి, ఎడమచేతిలో విల్లుతో కనిపిస్తున్న వీరుడు ఎక్కటి. పలు ఆయుధాలను ప్రయోగించగలిగే కమెండో వంటి వీరుణ్ణి ఎక్కటి, ఏకాంగవీరుడు అంటారు. నడినెత్తిన కొప్పుతో కనిపిస్తున్న ఈ వీరుడు ఎక్కటి.

కత్తి కుడిభుజాన పట్టుకుని నిలుచున్న వీరునికి ఎడమపక్కన చిన్న లేబుల్‍ శాసనం కనిపిస్తున్నది. తలభాగం విరిగిన వీరగల్లు

మరొక వీరగల్లు రెండు ముక్కలై వుంది. కాకతీయశైలి శిల్పం.

నడినెత్తిన కొప్పుతో, చెవులకు చిన్న కుండలాలతో, మెడలో కంటెతో, రెండుచేతుల్లో బల్లెం పట్టుకుని శత్రువును దును మాడుతున్న ఇతడు పశుసంరక్షక వీరుడు. వీరుని కుడిభుజం పైన శాసనం కనిపిస్తున్నది.
1.
‘‘స్వస్తిశ్రీ…/ ఱిరున్దయ్యవ/య్య గావుణ్డన/మగ చాచమ్యక/వ్రిత్తిన్య(ర) పే/..హితాళిని/యస్ర ఇ
మాన చమన/ (నా)యక న్నీ/సికవసిలా’’
శాసనంలో.. ఱిరుందయవయ్య అనే గావుండ కొడుకు చాచమ్మ హితం కొరకు వేసిన చమన నాయక నీసికవశిల అని వుంది.

అందమైన వీరగల్లు. తలపై ఛత్రంతో, జారుడు సిగముడితో, చెవులకు కుండలాలతో, మెడలో రుద్రాక్షల దండతో, వీరకాసెతో, నడుమున బాకుతో కనిపిస్తున్న వీరుడు తనపై దాడి చేస్తున్న శత్రువీరుణ్ణి ఈటెతో పొడిచి చంపుతున్నాడు. మరొక శత్రువు కిందపడి వున్నాడు. వీరుడు వీరస్వర్గాన అప్సరాంగనల వీవెనలందు కుంటున్నాడు. ఇది రాచహోదా వీరగల్లు. వీరునికి కుడి, ఎడమపక్కల శాసనం చెక్కివుంది.
కొట్టివ్రి/త్తి పొగొ(ప)/.. నమ/తళఱి/కతన/మ్మడి/ని పు/ట్టిగే/యుమ/ కొట్ట/ప్ర/తిష్టతి/ఆవి../ క్రతా/ 0డి/ర
కొట్టం అంటే రాజ్యవిభాగం. కొట్టవ్రిత్తి అంటే ఒక రాజ్యభాగాన్ని పారంపర్యంగా పొందిన… తలారి (కే)తనమ్మడికి పుట్టినతనికి కొత్త ప్రతిష్ట…
‘‘శ్రీమతు సౌ/రె సూ/రపయ్యనాయ/క చుగెమనతొ/…. మ నాయక’’
సౌధరుడు సూరపయ్యనాయక చనిపోయాడు.
ధన్యవాదాలు:
స్థపతి, ప్లీచ్‍ ఇండియా ఫౌండేషన్‍ సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డిగారికి, కంకల్‍ గ్రామ సందర్శన చేయించిన టీచర్లు సి.సంపత్‍ కుమార్‍ (•ష్ట్రణ, దీ=•••), చిన్నిక•ష్ణలు, గ్రామస్తులు రవీందర్‍, సుధాకర్‍, బాలయ్య, అనంతయ్య, మల్లేష్‍, రాజు, శ్రీకాంత్‍, వెంకటేశం, జంగం కుమార్‍, అశోక్‍, రాములు, వీరేశం, గురురాజ్‍, నరేందర్‍, నర్సింలు, తదితరులకు.

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *