చారిత్రాత్మక ప్రదేశం నంది మేడారం

చారిత్రక కట్టడాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలు. చరిత్రకు ప్రతిరూపంగా
ఉన్న అలాంటి కట్టడాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. మన సంస్క•తీ సాంప్రదాయాలను, వారసత్వాన్ని తెలియజేసే అనేక చారిత్రాక ప్రదేశాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటి చారిత్రాత్మక వారసత్వాన్ని కలిగిన ప్రదేశమే మేడారం అని పిలువబడే నంది మేడారం గ్రామం.
ఓరుగల్లు కేంద్రంగా పరిపాలించిన కాకతీయులు అనేక కోటలను, దేవాల యాలను, రాతి కట్టడాలను, చెరువులను నిర్మించారు. మేడారం గ్రామం పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి 24 కి.మీ., ధర్మారం మండల కేంద్రానికి 3 కి.మీ దూరంలో ఉంది. కాకతీయ సామంతులైన మేడరాజులు మేడారం గ్రామాన్ని పరిపాలించారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ గ్రామంలో ఉన్న కాకతీయుల కాలం నాటి కోటలు ఇప్పటికీ మన రాజుల యొక్క కళా వైభవాన్ని, వారి యొక్క చరిత్రను తెలియజేస్తున్నాయి.


కాకతీయులు హన్మకొండలో ప్రతిష్టించిన నందిలాగే ఇక్కడ ఉన్న నంది విగ్రహం కూడా అతి పెద్దగా ఉంది. కాకతీయుల పరిపాలనా చిహ్నంగా శతాబ్దాల క్రితం చెక్కించిన భారీ రాతి నంది విగ్రహం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. మేడారంలోని నంది విగ్రహం 7.5 అడుగుల పొడవు, 5.8 అడుగుల ఎత్తు ఉందని పరిశీలకులు అంటారు. ఇది బహు ప్రసిద్ధి చెందిన అతిపెద్ద నందీశ్వరుని ఏకశిలా విగ్రహం. ఈ నందీశ్వరుని కారణంగా గ్రామం పేరు ‘‘నంది మేడారం’’గా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ రెండు శాసనాలు కూడా లభ్యమయ్యాయి. కాకపోతే ఈ శాసనంలోని అంశాలు పొంతన లేకుండా కొంత అస్పష్టంగా ఉన్నాయని ప్రముఖ చరిత్రకారుడు డా. జైశెట్టి రమణయ్య తన గ్రంథంలో పేర్కొన్నారు. ఇందులో పేర్కొన్న మేడరాజు పొలాస రాజ్య రెండవ మేడరాజై ఉంటాడని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న త్రికుటాలయంను మేడరాజే నిర్మించాడని శాసనం చెపుతుంది.


చెరువు కట్టపై తూర్పు చివరిభాగంలో ఉన్న ఈ త్రికూటాలయం కాకతీయుల కళావైభవానికి తార్కాణం. ప్రస్తుతం పర్యవేక్షణలోపంతో, నేడు అది శిథిలావస్థకు చేరి నాటి చరిత్రకు అనవాళ్లుగా మాత్రమే ఉంది. 16 స్తంభాలతో కూడిన విశాల మండపం చుట్టూ ఉన్న పిట్టగోడ ఇక్కడ ప్రత్యేకం. ఈ త్రికూటాలయం కళారీతిలో వేయి స్తంభాల గుడిని తలపింప జేస్తున్నది. ఇక్కడే ఉన్న కోట బురుజులో ఒక సొరంగం ఉన్నట్లు చెపుతారు.
ఈ గ్రామంలో వ్యవసాయ మరియు తాగునీటి అవసరాల కోసం కాకతీయుల కాలంలో రెండు గుట్ట బోరులను కలుపుతూ తవ్వించిన అతి పెద్ద చెరువు కూడాఉంది. చుట్టూ ఉన్న పది గ్రామాల పంట పొలాలకు, ఇక్కడ ఉన్న మత్స్యకారుల జీవనోపాధికి ఈ చెరువే ఆధారం. మేడారం పెద్ద చెరువు ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో కీలకంగా మారింది. కాళేశ్వరం ఆరో ప్యాకేజ్‍లో భాగంగా ఈ చెరువు దగ్గరే ‘‘నంది రిజర్వాయర్‍’’ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.


చెరువు కట్ట అంచున అమరేశ్వర స్వామి ఆలయంలో శివుడు లింగరూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన నాగకన్య విగ్రహం ఉంది. ఈ నాగదేవత కన్య రూపంలో దర్శనమివ్వడం విశేషం. శిల్పం పైభాగంలో స్త్రీ రూపంలో.. నాభి నుంచి దిగువకు సర్ప రూపంలో ఉండి తలపై అనేక పడగలు కనిపిస్తాయి. సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు పుడతారని ప్రజలు విశ్వసిస్తారు. ఈ దేవాలయాన్ని నందిమేడారంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తుల వచ్చి దర్శనం చేసుంకుంటారు. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.
అమరేశ్వర అలయంతో పాటు గ్రామంలో ఉన్న అంజనేయస్వామి దేవాలయం, మార్కండేయ దేవాలయం, గంగమ్మ ఆలయం, ఎల్లమ్మ దేవాలయం, మల్లన్న గుడి, మడలేశ్వర ఆలయం మొదలగునవి ప్రజలలో ఆధ్యాత్మిక భావనను, సమైక్యతను పెంపొందిస్తున్నాయి. నంది దగ్గర ఉన్న వివిధ దేవాతామూర్తుల విగ్రహాలు, శిలాస్తంభాలు, గణపతి విగ్రహం, సప్తమాత•కలు,
ఉద్యానవనం, నంది పంపు హౌస్‍, సమ్మక్క సారక్క గుట్ట, గ్రామం చుట్టు ఉన్న పంట పొలాలు, చెట్లు, చెరువు కట్ట, గుట్టలు మొదలైనవి పర్యాట కులను విశేషంగా ఆకట్టుకుంటాయి.


1972 నుండి 2009 వరకు మేడారం శాసన సభ నియోజక వర్గంగా కూడా ఉంది. అయిన్నప్పటికీ దీని పర్యాటక శాఖ వారు గానీ, పురావస్తుశాఖ వారు గానీ పట్టించుకోకపోవడం వలన ఊరు మధ్యన బ•హత్‍నంది విగ్రహం, కోట బురుజు, త్రికూటాలయం, అమరేశ్వరస్వామి దేవాలయం నాగకన్య విగ్రహం నందిమేడారం చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కడుతూ కేవలం చారిత్రాక ఆనవాళ్లుగా మాత్రమే నిలుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నంది మేడారంలో ఉన్న చారిత్రక సంపదను భవిష్యత్తు తరాలకు అందించడం కోసం మేడారంను పర్యాటక ప్రదేశంగా ప్రకటించాలని, పర్యాటకులకు చెరువులో బోటింగ్‍ సౌకర్యంను కల్పించాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. మేడారం పేరును నంది యొక్క చరిత్రను తెలిపేలా నంది మేడారంగా మార్చాలనేది ప్రజల అభిప్రాయం. ‘‘నంది మేడారం’’ పేరును అధికారికంగా అన్ని శాఖల్లో అమలు పరిచి ఇక్కడ ఉన్న చారిత్రక ఆనవాళ్లను పునఃనిర్మించి టూరిజం కేంద్రంగా చేయాలనేది ప్రజల చిరకాల వాంఛ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *