సేవ్‍ ఓషన్‍.. సేవ్‍ లైఫ్‍జూన్‍ 8న మహాసముద్రాల దినోత్సవం

సముద్రాలంటే మనకు గొప్ప ఫాసినేషన్‍. సముద్రాన్ని ఒక్కసారి కూడా కళ్లతో చూడకున్నా, ఆ సముద్రాన్ని బాల్యంలోనే పరిచయం చేసుకొని ఉంటాం. దాన్ని కలలు కనుంటాం. కథలుగా వినుంటాం. కథలు కథలుగా చెప్పుకొని ఉంటాం. ఒక్కసారైనా చూసొస్తే ఇంక తెలీకుండానే ప్రేమలో పడిపోతాం. మనకు ఏకాంతాలన్నా సముద్రాలే, సమాధానాల్లేని ప్రశ్నలకైనా సముద్రాలే! అలాగని ఉల్లాసాన్నిచ్చేదిగా మాత్రమే ఉంటే అది మనం ఇంత ఇష్టపడే సముద్రం అయ్యేది కాదు. జీవి మనుగడకు కూడా సముద్రం ఒక కేంద్రం. అది లేకపోతే మన ఈ జీవితాన్ని ఇలాగే ఊహించుకోను కూడా లేం. మనకు ఇన్ని ఇచ్చి, ఇంతా చేసిన సముద్రానికి మనం తిరిగి ఏమిస్తున్నామంటే? కాలుష్యం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల కాలుష్యం. సముద్రం ఉప్పు తిని మనం చేస్తోంది ఏంటంటే.. ఆ సముద్రాన్నే ముంచేస్తున్నాం. ఇప్పటికీ ఓ అవకాశం ఉంది, ఎప్పటికీఉండదు అది.. సేవ్‍ ఓషన్‍… సేవ్‍ లైఫ్‍..


ఒకప్పుడు అన్నీ సముద్ర ప్రయాణాలే. విమానాలు వచ్చాక నీటిపై ప్రయాణాలు చాలా వరకు తగ్గిపోయాయి. కేవలం సరుకులే రవాణా అవుతున్నాయి. అంతెందుకు విదేశీయులు మన గడ్డను చేరుకుంది కూడా సముద్రమార్గంలోనే. మనం భూమిపై ఎంత ఆధారపడి ఉన్నామో, పరోక్షంగా సముద్రాలపై కూడా అంతే ఆధారపడి జీవిస్తున్నాం. పర్యావరణ సమతుల్యానికి, మనిషి జీవించే వాతావరణం ఉండేందుకు సముద్రాలు ఎంతో సహకరిస్తున్నాయి. సముద్రాలే లేకుంటే మనిషి బతకడం కష్టతరంగా మారుతుంది. వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది.

భూ వాతావరణాన్ని మార్చేది సముద్రాలే. భూమి పై వాతావరణ మార్పులపై సముద్రాలు చాలా ప్రభావం చూపిస్తాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా వర్షాలు, రుతు పవనాలు రాక సముద్రాల వల్లే వీలవుతుంది. రుతుపవనాలే రాకపోతే భూమి పరిస్థితి, భూమిపై నివసించే మనుషులు ఏమవుతారో ఓసారి ఊహించుకోండి. తుఫానులు, గాలులకు సముద్రాలే ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలను పూర్తిగా నియంత్రించేది సముద్రమే. అలాగే కొన్ని విషపూరితమైన వాయువులను కూడా సముద్రం పీల్చుకుంటుంది. దీని వల్ల మనుషులపై ఎలాంటి ప్రభావం ఉండదు. సముద్రాలు లేని భూమిపై మనిషి ఎంతో కాలం జీవించ లేడు. కరవు కాటకాలతో మానవజాతే అంతరించిపోతుంది.

సముద్రంలో ఉండే మత్స్య సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్ల మంది సముద్రంలోని జీవులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాటిని అమ్ముకోవడం ద్వారా వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సముద్రాలు కోట్లాది మందికి ఆహార భద్రతలను, ఉపాధిని కల్పిస్తున్నాయి. 2030 నాటికి సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా 40 మిలియన్ల మంది ఉపాధి పొందుతారని అంచనా. సముద్ర గర్భంలో నూనె, సహజ వాయువు, విలువైన ఖనిజాలు లభిస్తాయి. వాటిని కూడా వెలికి తీస్తున్నారు.

భూమికి, భూమిపై జీవించే మనుషులకు కావాల్సిన ఆక్సిజన్లో సగం ఆక్సిజన్‍ ను అందించేది సముద్రాలే. భూమిపై జీవావరణ పరిస్థితులు కల్పించడంలో ప్రధాన పాత్రను ఇవే పోషిస్తున్నాయి. కానీ వీటినే కలుషితం చేసి సముద్ర జీవుల మరణానికి కారణం అవుతున్నాడు మనిషి. దీని వల్ల జీవావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం లోపిస్తుంది. ఇది తిరిగి మనిషిపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే సముద్రాల ప్రాధాన్యతను మనుషులకు చెప్పేందుకు ప్రతి ఏడాది జూన్‍ 8న ‘మహా సముద్రాల దినోత్సవం’ నిర్వహించుకుంటున్నాం.


ప్రపంచంలోనే అతి లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్‍. ఇది పసిఫిక్‍ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 35,838 అడుగులు. 1960లో మనుషులు ఈ ప్రదేశానికి వెళ్లి వచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *