నక్షత్రనౌక అశ్వని తన కక్ష్యలోంచి కిందికి జారింది. దానికి అమర్చిన రాకెట్లు సజావుగా పేలాయి. అశ్వని మెల్లిగా కిందికి దిగుతూ ఉపరితలానికి దగ్గరగా వస్తోంది.
అశ్వనిని నడుపుతున్నది కెప్టెన్ యయాతి. అతనికి నక్షత్ర నౌకలు నడపడం కొత్తకాదు. ఎన్నో వందలసార్లు నడిపి ఉంటాడు. అసలు అతను కళ్ళు మూసుకుని దానిని కిందికి దింపగలడు. ఆ నౌకలో పదిహేను వందల మది ప్రయాణీకులు ఉన్నారు. వాళ్ళంతా రోహిణి నక్షత్రం మీద స్థిరపడటానికి వలస వస్తున్నారు. ఇప్పటికే రోహిణి మీద యాభైవేల మంది మనుషులు ఇల్లూ వాకిలీ కట్టుకొని హాయిగా ఉంటున్నారు.
‘రోహిణికి అయిదు వందల అడుగుల ఎత్తులో ఉన్నాం. రాకెట్లు చక్కగా పనిచేస్తున్నాయి. అంతరిక్షరేవు కదలికలు లేకుండా ప్రశాంతంగా ఉంది’. మేనకకు మాటలు వినిపించాయి. మేనక యయాతికి సహాయకురాలు.
అశ్వని సజావుగా, సుతారంగా నేలను తాకింది. కనులుమూసి తెరిచేటంతలో తీగలలలాంటి వేళ్ళు ఉన్న తొండాల లాంటి చేతులు నౌకపై కప్పును అరటిపండు వలిచి వేసినట్లు వలిచి వేశాయి. నౌక చుట్టూ ముగ్గురు రోహిణివాసులు (రోహిన నక్షత్రంలో నివసించే మనుషులు) నించుని ఉన్నారు. వాళ్ళ మొహాలు బల్లపరుపుగా ఉన్నాయి. మెడలు బాగా ఉబ్బి ఉన్నాయి. వాళ్ళు రోహిణి నక్షత్రంలో ఉత్తర భాగాన పెద్ద పెద్ద నీటి లోయల వద్ద ఉంటారు. రబ్బరులాగ మెత్తగా ఉండే ఒకరకమైన బూజును టన్నులకొద్దీ పండించుకొని తింటారు. అందుకే వాళ్ళ శరీరాలు రబ్బరులాగ మెత్తగా సాగుతూ ఉంటాయి.
తమ నక్షత్రం మీదికి వచ్చి ఉంటున్న ఈ చీమల్లాంటి మనుషులను రోహిణి వాసులు మొదట్లో అసలు పట్టించుకోలేదు. మనుషులు కూడా వాళ్ళకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అందుకే ఈ భీభత్సం.
తీగలలాంటి వేళ్ళతో పట్టుకొని యయాతిని కాబిన్‍లోంచి రోహిణివాసి బయటకు లాగాడు. రెండవవాడు గిలగిల కొట్టుకుంటున్న మేనకను రెండువేళ్ళ మధ్య ఒక పురుగును పట్టుకొన్నట్టు పట్టుకొని ఇవతలకి తీశాడు. మూడో రోహిణి వాసి ఒక పిచికారిలాంటి సాధనంతో కిటికీలోంచి నౌకలోకి పురుగుల మందును కొట్టసాగాడు. ఆ మందు ఘాటుకు తట్టుకోలేక లోపల ఉన్న పదిహేను వందల మంది యాత్రికులు పురుగుల్లా మాడి తమ సీట్లకు అతుక్కు పోయారు.
తనను పట్టుకున్న కబంధ హస్తాలలో నలిగిపోతూ ‘‘మేనకా! మనల్ని వీళ్ళు ఎందుకో చంపటం లేదు. నీకేం కాలేదు కదా?’’ అన్నాడు యయాతి వణుకుతున్న కంఠంతో.
‘‘యయాతీ! వీళ్ళు – ఈ రాక్షసులు పదిహేను వందల మందిని నల్లుల్ని చంపినట్లు చంపారు. ఈ మూకుమ్మడి హత్యలు ఎందుకు చేశారు..?’’ అంది మేనక పెద్దగా ఏడుస్తూ.
‘‘ఎందుకా! నేను చెబుతాను విను’’ అన్నాడు రోహిణి మనిషి. అతనికి మనుషుల భాష తెలుసు. మీరు ఇక్కడికి రోగాలు తెస్తున్నారు. అందుకే మీ నౌకలో వచ్చిన వాళ్ళందరిని చంపేశాం. అంతేకాదు మీ నౌక రేవులో దిగకముందే రేవు ఉద్యోగులుందరిని కూడా చంపేశాం అన్నాడు గురుగురు మంటున్న కంఠంతో. యయాతికి ఆ రోహిణివాసి మాటలు పూర్తిగా బోధపడలేదు. అతనికి తెలిసినంత మటుకు ఇక్కడకి వలస వచ్చిన మనుషులకు ఈమధ్యే ఛాతీకి సంబంధించిన చిన్న అంటురోగం వచ్చింది. అది ప్రమాదకరమైన రోగమేమీ కాదు. దానికి వాళ్ళు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు.
‘‘మీరు అంటున్నది ధూళి జ్వరం గురించేనా? అది చాలా తేలికపాటి రోగం. ఆ జబ్బు నాకూ ఉంది.’’ అంటూ మెరుస్తున్న గోళాల్లాంటి ఆ రోహిణి వాసి కళ్ళలోకి సూటిగా చూశాడు.
‘‘జబ్బును తెచ్చే వైరస్ మీనుంచి మాకు పాకింది. మాకు ఏ రోగమొచ్చినా అది ప్రాణాంతక మవుతుంది. ఇప్పటికే మీ జబ్బు అంటుకుని మావాళ్ళు వందలమంది చనిపోయారు. ఆ వైరస్‍ను మీ నుంచి వేరుచేసి దానిమీద పరీక్షలు జరపాలి. ఆ వైరస్ ఉన్న ఒక ఆడమనిషి, ఒక మనిషి మాకు కావాలి. అందుకే మిమ్మల్ని ప్రాణాలతో ఉంచాం. ఇప్పుడు మనం మా వైద్య కేంద్రానికి వెడుతున్నాం’’ – అలా అంటూనే అతను యయాతిని ఒక గాజుపెట్టెలో పడేశాడు. గిలగిలా తనుకుంటున్న మేనకను తెచ్చి ఆ పెట్టెలోనే పడేశాడు రెండో రోహిణిఆసి. మూడో రోహినవాసి వచ్చి ఆ పెట్టె మూతపెట్టి దానికి పెద్ద తాళం వేశాడు. తరవాత కొక్కాన్ని పట్టుకొని చకచకా ముందుకు నడవసాగాడు.
యయాతి ఆ గాజుపెట్టెను చేతితో తడిమి చూశాడు. అది చాలా మందపాటి గాజుతో చేసిన పెట్టె. అది ఓ చిన్న గదంత
ఉంది. ఆపెట్టె, వాళ్ళ ప్రయోగశాల పరికరం కాబోలు అనుకున్నాడు యయాతి.
‘‘యయాతీ! వీళ్ళు మనల్ని ఏం చేస్తారు?’’ అంది మేనక ఏడుపును బిగపట్టుకుని. భయంతో ఆమె ముఖం పాలిపోయింది.
‘‘ఏంలేదు. పరీక్ష చేస్తారు. మన శరీరంలో దొరికే వైరస్ హానికరమైనది కాకపోతే మనల్ని వదిలేస్తారు. మునుపటిలాగే మనం వీళ్ళతో మంచి సంబంధాలు కలిగి ఉండవచ్చు’’ అన్నాడు యయాతి.
‘‘ఒకవేళ వైరస్ హానికరమైనదని వీళ్ళు భావిస్తే…’’ మేనక తన మాటల్ని పూర్తిచేయలేక పోయింది.
‘‘అప్పుడు మనం ఎదురు తిరగాల్సిందే. నా జేబులో అణు పిస్తోలు ఉంది. దాంతో ఈ గాజు గోడలను పేల్చేస్తాను. తరవాత వాళ్ళమీదకు కాల్పులు జరుపుతూ పారిపోదాం. నలుసుల్లా ఉన్న మనం ఎక్కడయినా దాక్కోవచ్చు. వీళ్ళు మనని వెతికి పట్టుకునే లోపునే మనకు దగ్గరలో
ఉన్న శుక్ర గ్రహానికి సంకేతం పంపుదాం. అక్కడి నుంచి మనకు సమాయం వస్తుంది.
పది నిముషాల నడక తరవాత రోహిణి వాసులు ఒక పెద్ద భవనం లోకి వచ్చరు. ఆ పెట్టెను పట్టుకొచ్చిన రోహిణి వాసి దానిని ఒక పొడవాటి బల్లమీద పెట్టాడు. యయాతికి ఆ గది అంతా స్పష్టంగా కనిపిస్తోంది. దాని నిండా అనేక కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. శస్త్రచికిత్సకు వాడే కత్తులు, కత్తెరలు – కటారులు ఒక బల్లమీద వరుసగా ఉన్నాయి. పైకప్పుకు పెద్దపెద్ద ‘ఆర్క్’ దీపాలు బిగించి ఉన్నాయి.
‘‘యయాతీ! ఇది వీళ్ళ ప్రయోగశాలలా లేదు. ఆపరేషను థియేటరులా ఉంది’’ అంది మేనక.
ఇంతలో తెల్లటి కోటు వేసుకున్న ఒక రోహిణి డాక్టరు తళతళ మెరుస్తున్న పట్టకారు తీసుకొని ఆ గాజు పెట్టె దగ్గరికి వచ్చాడు. ‘‘ఈ మానవ కీటకాల్ని కోస్తేగానీ ఆ వైరస్ బయటికి రాదు’’ అన్నాడు. తన వెనకే ఉన్న ఇంకో రోహిణి డాక్టరుతో.
యయాతికి పరిస్థితి అర్థమైపోయింది. జేబులోనుంచి అణుపిస్తోలు బయటకు తీశాడు. ‘‘మేనకా! మనల్ని ప్రాణాలతో ఉంచి వీళ్ళు పరీక్షలు చెయ్యరు. మనను చంపి ముక్కలు – ముక్కలు చేసి ప్రతీ ముక్కను పరీక్ష చేస్తారు’’ అంటూ యయాతి అణుపిస్తోలుతో ఒకవైపు గాజుగోడను పేల్చాడు. పెళపెళా శబ్దంతో ఆ గోడ కూలిపోయింది. గాజు ముక్కలు దూరంగా ఎగిరిపడ్డాయి.
‘‘మేనకా! పరిగెత్తు… రోహిణివాసి రాక ముందే పారిపో’’. మేనక ఒక్క గెంతులో ఆ గాజు పెట్టె మొండిగోడమీది నుంచి బయటకు దూకింది. ఆమె వెనుకే యయాతి కూడా బయటకు దూకాడు. వాళ్ళను పట్టుకుందామని తీగెల్లాంటి వేళ్ళు జాపి వచ్చిన రోహిణి డాక్టరు అరచెయ్యివైపు గురిచూసి కాల్చాడు యయాతి. అణుతూటా డాక్టరు అరచెయ్యిలోంచి దూసుకుపోయింది. తారులాంటి రక్తం చివ్వున బయటకు చిమ్మింది.
యయాతి, మేనక ఆ బల్లమీద రొప్పుతూ పరిగెడుతున్నారు. రోహిణివాసుల బల్ల ఒక పెద్ద మైదానంలా ఉంది. పరిగెడుతూనే ‘‘మేనకా! చివరకు రాగానే, ముందూ వెనకా చూడకుండా కిందికి దూకెయ్! కాళ్ళూ చేతులూ విరక్కుండా ఉంటే ఏ కంప్యూటర్ క్రిందనో, చెత్తబుట్టలోనో, పుస్తకాల వెనకో దాక్కుందాం. మనల్ని పట్టుకోవడం వాళ్ళకు అంత తొందరగా తెమిలే పనికాదు. ఈలోపల మనకు సహాయం వస్తుంది’’ అన్నాడు యయాతి.
పరిగెడుతున్న మేనక భుజాలమీది నుంచి వెనక్కు చూసింది. ఒకచాకు చేతిలో తీసుకుని డాక్టరు వాళ్ళవైపు కదిలాడు.
‘‘యయాతీ! దూకెయ్’’ అని అరిచింది. అవే మేనక యయాతితో మాట్లాడిన చివరి మాటలు. మెరుపులా ఆ డాక్టరు చాకు మేనక నెత్తిమీద పడింది. మేనక రెండుగా నిలువనా చీలిపోయింది. దాదాపు అరవై అడుగుల ఎత్తు ఉన్న ఆ బల్లమీది నుంచి దూకబోయిన యయాతిని బొటనవేలు చూపుడువేలు మధ్య పట్టుకుని ఇంకో డాక్టరు పైకి లేపాడు.
‘‘పురుగు మనిషి, ఇంక నువ్వు తప్పించుకోలేవు. మమ్మల్ని చంపుతున్న వైరస్‍ని బయటకు తియ్యడానికి నీ శరీరం ముక్కలు ముక్కలుగా కోసి తీరుతాం’’ అన్నాడు.
యయాతి అతని వేళ్ళమధ్య నలిగిపోతున్నాడు. అణుపిస్తోలు తీసుకుందామన్నా అతని చేతులు అతని వశంలో లేవు. ‘‘నన్ను చంపుతున్నానని మురిసిపోకు. మా నౌక సమయానికి శుకగ్రహానికి రాకపోతే అక్కడి నుంచి మమ్మల్ని వెతుక్కుంటూ అనేక నౌకలు వస్తాయి. మీమీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. ఆ దాడిలో మీరు సమూలంగా తుడిచిపెట్టుకు పోతారు’’ అన్నాడు యయాతి.
ఆ డాక్టరు పగలబడి నవ్వాడు. ‘అమ్మా! అలాగా! నీలాంటి పురుగులు చాలా వస్తాయన్నమాట. వాటికీ నీగతే పడుతుంది’’ అన్నాడు.
తరవాత వాళ్ళు యయాతిని బల్లమీద పడుకోబెట్టారు. కదలడానికి వీలులేకుండా అతణ్ణి బల్లకు కట్టివేశారు. తరవాత ఇంకో డాక్టరు వచ్చి ఒక బ్లేడు లాంటి పరికరంతో యయాతి బట్టలన్నీ తీసేశాడు. నగ్నంగా నిస్సహాయంగా పడి ఉన్న యయాతి మీద వాళ్ళ పరీక్షలు మొదలయ్యాయి.
పెద్ద అరుపుతో యయాతి మేలుకున్నాడు. ఒక్కసారి యయాతి కళ్ళు నులుపుకున్నాడు. పక్కనే కూచొని నక్షత్ర నౌకను నడుపుతున్న మేనక వైపుచూస్తూ ‘చాలాసేపు నిద్రపోయాను కదూ’ అన్నాడు.
‘కాసేపే అయింది. బాగా అలిసి పోయావు. నిన్ను లేపడం ఎందుకని నేను స్టీరింగు తీసుకున్నాను’ అంది మేనక.
‘‘అయితే నేను కన్నది కల అన్నమాట’’ అనుకున్నాడు యయాతి. గుండెలమీది నుంచి పెద్ద బరువు దింపినట్లయింది. మేనక నుంచి స్టీరింగు తీసుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే ‘‘అశ్వని’’ సజావుగా సుతారంగా ఉపరితలాన్ని తాకింది. కళ్లుమూసి తెరిచేటంతలో తీగెలలాంటి వేళ్ళు ఉన్న, తొండాల వంటి చేతులు నౌక పైకప్పును అరటిపండు వలిచి వేసినట్లు వలిచి వేశాయి. చుట్టూ ముగ్గురు రోమిణి వాసులు నించుని ఉన్నారు. ఒకడు తీగెల్లాంటి వేళ్ళతో, కాలుతున్న కాబిన్ లోంచి యయాతిని బయటకు లాగాడు. యయాతికి ఒళ్ళు జలదరించింది. భయంతో బిగుసుకు పోయాడు. ‘నాకు వచ్చిన పీడకల నిజమవుతోందా! ఆ కల అయిపోలేదు. ఇప్పుడు నిజంగా మొదలవుతోంది’ అనుకున్నాడు యయాతి.
–మనోహర్