సాహిత్యంతో సంబంధంలేని వ్యక్తులూ, సంస్థలూ తక్కువ. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు సాహిత్యాన్ని తక్కువగా చదువుతూ వుండవచ్చు. కానీ పబ్లిక్ మీటింగ్‍ల్లో ఏదో ఓ కథని కవిత్వాన్నో ఉదహరించని నాయకులు అరుదు. అదే విధంగా న్యాయమూర్తులు కూడా అప్పుడప్పుడూ కవిత్వాన్నో, కథనో తమ తీర్పుల్లో ఉదహరిస్తూ వుంటారు.
ఈ మధ్యన గంగా సహాయ్ వర్సెస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కన్సాలిడేషన్, తీర్పు తేదీ 18 మార్చి 2021 కేసులో అలహాబాద్ హైకోర్టు రిప్ వాన్ వింకిల్‍ని ఉదహరించింది. రిప్‍వాన్ వింకిల్ కథని చదువని వ్యక్తులు అరుదని చెప్పుకోవచ్చు.
వాషింగ్టన్ ఇర్వింగ్ రాసిన చిన్న కథ రిప్‍వాన్ వింకిల్. ఇది 1819-20 ప్రాంతంలో ఆయన రాశారు. రిప్‍వాన్ ఓ రైతు. అందరితో స్నేహపూర్వకంగా వుండే వ్యక్తి. అతను ఓసారి కాట్స్కిల్ పర్వతాల వైపు వెళతాడు. అక్కడ అతనికి మరుగుజ్జులు ఆడుతూ కన్పిస్తారు. వాళ్ళను చూసి అతను ఆశ్చర్యపోతాడు. వాళ్ళు ఇచ్చిన పానీయాన్ని అతను స్వీకరిస్తాడు. తక్షణమే అతను నిద్రలోకి జారుకుంటాడు. 20 సంవత్సరాల వరకు అలాగే నిద్రిస్తాడు. ఆ తరువాత అతనికి మెలకువ వస్తుంది. అప్పటికి అతని వయస్సు పై బడుతుంది. ముసలివాడై పోయి వుంటాడు. తెల్లటి గడ్డం చాలా పొడవుగా పెరిగి వుంటుంది. గతంలో అతను చూసిన మరుగుజ్జులు అతనికి ఎక్కడా కన్పించరు.
అతని వూరు, కుటుంబం గుర్తుకొస్తాయి. వెంటనే తన వూరికి బయల్దేరతాడు. అతని వూరు పూర్తిగా మారిపోయి కన్పిస్తుంది. అతని భార్య చనిపోయిందని తెలుస్తుంది. అతని పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయి వుంటారు. జార్జి వాషింగ్టన్ స్థానంలో కింగ్ జార్జి-3 అధికారంలోకి వచ్చి వుంటాడు. అతన్ని ఎవరూ గుర్తు పట్టరు. అతన్ని విసిగించే భార్య, అతని సోమరి తనాన్ని అసహ్యించుకునే భార్య చనిపోయి వుంటుంది. అతని కుమారుడికి వివాహం అయి వుంటుంది.
అతన్ని అతని గ్రామంలో ఎవరూ గుర్తు పట్టరు. అతను కూడా ఎవరినీ గుర్తు పట్టలేకపోతాడు. అతన్ని అతని తెల్లటి గడ్డాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వుంటారు. మెల్లగా అతను వున్న ఇంటికి వస్తాడు. అది పాతబడిపోయి వుంటుంది. పై కప్పు కిందికి వంగిపోయి వుంటుంది.
మెల్లగా తలుపుతడతాడు. ఓ మహిళ వచ్చి తలుపుతీస్తుంది. అతని భార్య పోలికలు ఆమెలో కన్పిస్తాయి. రిప్‍ని చూసి ‘ఎవరూ’ అని అడుగుతాడు ఆమెను. ఆమె తన పేరు చెబుతుంది. తన కూతురని రిప్ గుర్తిస్తాడు. రిప్ సంతోష పడతాడు. మానాన్న కన్పించకుండా పోయి చాలా సంవత్సరాలు గడిచాయి. మా అమ్మ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. అని ఆమె అతన్ని చూసి చెబుతుంది.
తనే ఆమె తండ్రినని అతను చెప్పేలోపు ఆమె వెళ్ళిపోతుది. అప్పుడు తన తప్పిదాన్ని రిప్ వాన్ వింకిల్ గుర్తిస్తాడు. తాను ఏ పనీ చేయకుండా, సోమరిగా వున్నందుకు తగిన ప్రతిఫలాన్ని పొందానని అనుకుంటాడు. అతన్ని అతని స్నేహితులు కూడా అతన్ని గుర్తుపట్టరు ఇదీ కథ.
ఈ కథని అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో ఉదహరించింది. రిప్ వాన్ వింకిల్లకి సాహిత్యంలో చోటు వుంటుందేమో కానీ కోర్టుల్లో స్థానం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఆలశ్యం, జాప్యం లాంటి విషయాలలో కోర్టులు నలిగిపోతున్నాయి. న్యాయపాలన దెబ్బతింటుంది. ఇక, కేసు విషయానికి వస్తే రామ్ అవతార్‍కి తాము వారసులమని గంగా సహయ్ కోర్టుకి వచ్చారు. అతను తమకు వీలునామా ద్వారా ఆస్తిని ఇచ్చాడని వాళ్ళ వాళ్ళ వాదన. అయితే ఆ దరఖాస్తుని నాలుగు సంవత్సరాల కాలపరిమితి దాటిన తరువాత కోర్టులో దాఖలు చేశారు. ఆ ఆలస్యానికి తగు కారణాలని కూడా వాళ్ళు తన దరఖాస్తులో పేర్కొనలేదు. ఆలస్యానికి వాళ్ళదే తప్పు. అందుకని కోర్టు వాళ్ళ దరఖాస్తుని అంగీకరించలేదు.
తమ తప్పు వుండి కోర్టుకి వచ్చే వాళ్ళ దరఖాస్తులని కోర్టులు అంగీకరించకూడదు. కేసులు జాప్యం కావడానికే అవి ఉపయోగపడతాయి తప్ప మారోరకంగా ఉపయోగపడదు. ఈ దరఖాస్తు పరిష్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు రిప్ వాన్ వింకిల్ కథని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సోమరిపోతులైన లిటొగెంట్లు తగిన సమయంలో చర్య తీసుకోరు. ఆ తరువాత తీరికగా వస్తారు. ఏదో తప్పుడు క్లైమ్స్ని సృష్టిస్తారు. కేసు పరిష్కారంలో జాప్యాన్ని సృష్టిస్తారు. తమ తప్పు లేకున్నా ఇతర పార్టీలు ఈ సోమరిపోతుల వల్ల ఇబ్బదుల పాలవుతారు. అలా కావడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది.
సాహిత్యం అనేది ఒక విషయాన్ని బలంగా చెప్పడానికి, శక్తివంతంగా చెప్పడానికి ఉపయోగపడుతుంది. అది కథ కావొచ్చు, కవిత్వం కావొచ్చు. అదే సాహిత్యం గొప్పదనం. 1819వ సంవత్సరంలో రాసిన రిప్ వాన్ వింకిల్ కథని అలహాబాద్ హైకోర్టు 2021వ సంవత్సరంలో ఉపయోగించుకుంది.
సోమరిపోతులకి సోమరిపోతుల కథ.
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001