లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ


(గత సంచిక తరువాయి)


నష్టపరిహారం క్లెయిమ్‍ చేయాలంటే….

  • పశువులు మరణించిన వెంటనే సంబంధిత ఇన్సురెన్సు కంపెనీకి టెలిగ్రామ్‍ ద్వారా తెలియపర్చాలి.
  • సంబంధిత పశువైద్యాధికారి నుండి ‘‘డెత్‍ సర్టిఫికేట్‍’’ తీసుకొని సమర్పించాలి.
  • పశువుల్ని బ్యాంకు రుణం ద్వారా పొందితే సంబంధిత బ్యాంకు వారికి కూడా తెలియపరచాలి.
  • మరణించిన పశువు ఫోటో తీసి ఉంచాలి.
  • పశువు కళేబరాన్ని ఇన్సురెన్సు కంపెనీ అధికారుల పరిశీలన నిమిత్తం 24 గంటలుంచాలి.
  • కంపెనీ నుండి వచ్చే క్లెయిమ్‍ ఫారం పూర్తిచేసి, డాక్టర్‍ ఇచ్చే పోస్టుమార్టం రిపోర్టు, పశువు ఫోటో,చెవిపోగు మొ।। జత పరచి కంపెనీకి సమర్పించాలి.
  • కాబట్టి రైతాంగం పశునష్టం, మేపుపై ఖర్చు, ఉత్పత్తి అయ్యే పాల ఖరీదు మొ।।లగు వాటి ద్వారా నష్టపోకుండా
  • ఉండాలంటే పశువులకు బీమా తప్పనిసరి గమనించాలి.


1.జాతీయోత్పత్తిలో ఐ.టి. కంటే పశుసంపదే ఘనం.
గ్రామీణ ఆర్థిక రంగానికి వెన్నుముక అయిన పశుసంపద ద్వారా లభించే రాబడి ఇన్‍ఫర్‍మేషన్‍ టెక్నాలజీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. జి.డి.పి. (స్థూల జాతీయోత్పత్తి)లో ఐ.టి. పరిశ్రమ కంటే పాడిపరిశ్రమ వంటి గ్రామీణ ఆర్థిక రంగాల ద్వారా లభించే వాటా, ఉపాధి ఎక్కువ. మొత్తం జి.డి.పి.లో పాడి పశువులు, జీవాలు, కోళ్ళ పరిశ్రమ నుంచి లభించే వాటా 6%. ఈరంగం ద్వారా దేశవ్యాప్తంగా 90 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నది. ఇలా జి.డి.పి.లో ఐ.టి. వాటా కంటే 4 రెట్లు అధికంగా పాడిపరిశ్రమ వంటి రంగాలు సమకూర్చుతున్నాయి. ఉద్యోగాల కల్పనలో ఐ.టి.కంటే 8 రెట్లు అధికంగా ఉంది. కాబట్టి వీటిపై చూపుతున్న శ్రద్ధలో ఏ కొంతైనా ఈ రంగం వైపు చూపితే అద్భుతాలు సాధించవచ్చునని ప్రముఖ ఆర్థిక వేత్త, పార్లమెంటు సభ్యుడు జై. శ్రీరామ్‍ రమేష్‍ పేర్కొన్నారు.

2.పాడికి ప్రసిద్ధి చెందిన పశుజాతులు
భారతదేశంలో ఉన్న దేశవాళి పశువుల్లో ముఖ్యంగా 26 గోజాతులను, 7 గేదెజాతులను పాల ఉత్పత్తికి అనువైనవిగా గుర్తించారు. దేశవాళీ పశువుల విషయానికి వస్తే మనరాష్ట్రం ఆవుల సంఖ్యలో 6వ స్థానంలోనూ, గేదెల సంఖ్యలో 2వ స్థానంలో ఉంది.
పాడికి అనువైన ‘‘గోజాతి’’ పశుజాతులు
1.ఒంగోలు 2. దియోని 3. గిర్‍ 4. ఎర్రసంథి 5. సాహివాల్‍ 6. తార్పార్కర్‍ 7. హర్యానా 8. కాంక్రెజ్‍
పాడికి అనువైన ‘‘గేదె జాతి’’ పశుజాతులు
1.ముర్రా 2. నీలిరావి 3. మోహసానా 4. సూర్తి 5.జాప్రాబాది 6. నాగపురి
పాడికి అనువైన ‘‘విదేశీ గోజాతి’’ పశుజాతులు
1.జెర్సీ 2. హొలిస్టిన్‍ – ఫ్రీజియన్‍ 3. బ్రౌన్‍స్విస్‍ 4.రెడ్‍డేన్‍ 5. బర్‍షైర్‍


ఆవులు, గేదెల జాతుల్లో ముఖ్యమైన జాతుల లక్షణాలు
గోజాతి పశువులు :
ఒంగోలు :
  • ఆంధప్రదేశ్‍ పుట్టినిల్లు అయిన ఒంగోలు జాతి పశువులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఒంగోలు జిల్లాలో అత్యధికం గాను, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పాక్షికంగా ఉన్నాయి.
  • పనికి, పాడికి ప్రపంచ విఖ్యాతి గాంచిన ఒంగోలు గోజాతి ఇండోనేషియా, ఫిలిప్పిన్స్, ఫిజి, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మారిషస్‍, బ్రెజిల్‍, వెస్ట్ఇండియా, కొలంబియా, అమెరికా, మెక్సికో మొదలగు ప్రపంచదేశాల్లో విస్తరించింది.
  • ఒంగోలు జాతి పశువుల శరీరం తెలుపు రంగులో ఉండి పెద్ద సైజు కల్గి, ఎత్తుగా, పొడవుగా ఉంటుంది.
  • మునుగులు వెడల్పుగా విశాలంగా ఉంటాయి. ప్రక్కటెముకలు సమంగా ఉంటాయి.
  • నుదురు కళ్ళ మధ్య వెడల్పుగా కొంచెం మెరకగా, పొడువుగా ఉంటుంది.
  • చెవులు చురుకుగా పొడవుగా, కొంచెం వాలి ఉంటాయి. చివరలు నల్లగా ఉంటాయి.
  • గంగడోలు పెద్దగా, కొద్ది కండకలిగి ముడతలతో, వ్రేలాడుతూ, విసరకర్ర ఆకారంలో గొంతునుండి రొమ్మువరకుంటుంది.
  • కొమ్ములు కురచగా బలంగా, చివరలు సన్నబడి ఉంటాయి.
  • కాళ్ళు పొడుగ్గా కండరాలతో బలిష్ఠంగా శరీరం చక్కగా అమర్చిఉంటాయి. ఆడపశువుల్లో చక్కటి మెత్తని వెంట్రుకలు కలిగి ఉంటాయి. గిట్టలు, మోకాళ్ళు నల్లగా ఉంటాయి.
  • తోక పొడవుగా పిల్లడెక్కలవరకు విస్తరించి ఉంటుంది. తోక కుచ్చు నల్లగా ఉంటుంది.
  • మూపురం అటూ ఇటూ పడిపోకుండా పెద్దగా నిలువుగా రెండువైపుల మాంసంతో కూడిన ముద్ద చెండుగా ఉంటుంది.
  • శరీరం రంగు తెలుపుగా ఉంటుంది. తల, మెడ, మోపురం, తొడలు, మోకాళ్ళు, డెక్కల పై భాగం, కొనచెవి, కనుచుట్టూ చివర నల్లని వెంట్రుక లుంటాయి.
  • ఆవుల్లో పొదుగు మధ్యస్థ సైజులో ఉంటుంది. బరువు సుమారు 450 కిలోలు ఉండి, 300 రోజుల పాడి కాలంలో 613-1120 కిలోల పాల దిగుబడి ఉంటుంది.

మగపశువులు అందంగా, ఆకర్షణీయంగా, నడకలో రాజఠీవి కలిగి మగతనం ఉట్టిపడుతుంది. శేరు తగినంతగా వ్రేలాడుతూ శేరు చుట్టూ నల్లని వెంట్రుకలుంటాయి. మగ పశువులు 600 కిలోల బరువుండి పనిసామర్థ్యం కలిగి ఉంటాయి.


తార్పార్కర్‍ :

  • పనికి, పాడికి ఉపయోగపడే ఈ తార్పర్కర్‍ జాతి పాడికి ప్రసిద్ధి చెందినది. దీనినే తెలుపు సింధి అని కూడా వ్యవహరిస్తారు. బ్రౌన్‍స్విస్‍తో కలిపి సంకరజాతి వృద్ధికి ఈ జాతిని ఉపయోగిస్తున్నారు.
  • పాకిస్తాన్‍లోని దక్షిణ పశ్చిమ సింధ్‍ ప్రాంతంలో ఈ జాతి పశువులు ఉంటాయి
  • తార్పర్కర జాతి పశువుల శరీరం బలిష్టంగా మధ్యస్థ సైజులో పొందికగా ఉంటుంది.
  • శరీరం తెలుపు లేదా బూడిద రంగులో ఉంటుంది. ముఖం పొడవుగా తల పై భాగం వెడల్పుగా ఉంటుంది.
  • తల మధ్యస్థ సైజులో ఉంటుంది. నుదురుభాగం వెడల్పుగా, కంటిపైన కొద్దిగా ఉబ్బుగా ఉంటుంది.
  • చెవులు పొడువుగా వెడల్పుగా ఉండి, కొద్దిగా వ్రేలాడుతుంటాయి.
  • కొమ్ములు మధ్యస్థ సైజులో ఉంటాయి.
  • కాళ్ళు పొట్టిగా, నిటారుగా, బలంగా ఉండి, గట్టి కీళ్ళు కలిగి ఉంటాయి.
  • తోక పొడువుగా ఉండి కుచ్చు నలుపుగా ఉంటుంది.
  • ఆవులు 400 కిలోల బరువు ఉండి, పాడి కాలంలో 1456-2177 లీటర్ల పాలిస్తాయి.
  • మగ పశువులు 560 కిలోల బరువు ఉంటాయి.


ధియోని :

  • ఆంధప్రదేశ్‍, కర్ణాటక, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాల్లో కనబడే ధియోస్‍ పశువులు పాడికి పేరెన్నిక గాంచినవి.
  • పశువులు మధ్యసైజులో ఉంటాయి. నుదురు పెద్దగా, గంగడోలు పెద్దగా ఉంటుంది.
  • కొమ్ములు మందంగా బయటకు మరియు లోపలివైపు వంగి
  • ఉంటాయి. చెవులు వ్రేలాడుతుంటాయి.
  • తోక పొడవుగా, నిటారుగా ఉంటుంది.
  • రంగు తెలుపు మరియు నలుపు లేదా ఎరుపు తెలుపు రంగులో ఉండి, మచ్చలు అక్కడక్కడ ఉంటాయి.
  • ఆవుల్లో 700 కిలోల పాల దిగుబడి ఒక ఈతలో ఉంటుంది.


(తరువాయి వచ్చే సంచికలో)

  • ఆనబోయిన స్వామి
    ఎ : 9963 87 2222

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *