తెలంగాణా చారిత్రక గాథాలహరిలో


ఇక్కుర్తి – అగ్గలయ్య


లేరు నదీలోయ నాగరికతకు ఇక్కుర్తి ఒక పురాతన సాక్ష్యం. ఇక్కుర్తి గొప్ప చారిత్రకస్థలం. అతిపురాతన నాగరికతల నిలయం. ఆదిమానవులకాలం నుండి నేటి వరకు చరిత్రను పుక్కిటపట్టిన కాలనిఘంటువు, విజ్ఞానసర్వస్వం ఈ వూరు. ఇక్కుర్తి పేరు ఇక్కురికి నుండి పరిణమించింది. ఈంకురికి ఇక్కురికి అయింది. కురికి అంటే పురాతన ధాన్య విశేషం. పాల్కురికి పాలకుర్తి అయినట్లు ఇక్కురికే పలుకుబడిలో ఇక్కుర్తిగా పిలువబడుతున్నది.
ఇక్కుర్తి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం. ఆలేరుకు కొలనుపాక, ఇక్కుర్తి గ్రామాలు సమాన (7 కి.మీ.ల) దూరంలో ఉన్నాయి. ఈ రెండు గ్రామాలు జైనమత కేంద్రాలుగా ప్రసిద్ధం. కాని, జైనమతంలోని పరిణామాలవల్ల దిగంబర జైనానికి ఆదరణ తగ్గి, ఆడంబరపూర్వకంగా మారిన శ్వేతాంబర జైనానికి చెల్లుబాటు పెరిగింది. ఆలయాలు, సంపదలు, గౌరవాలు ఎక్కువైనాయి. అదిగాక కొలనుపాక కళ్యాణీచాళుక్యులకు తొలుత రాజధానిగా వుండేది. (సోమేశ్వరునికాలంలో కొత్తగా రూపొందించిన కళ్యాణీనగరం రాజధానిగా చేయబడ్డది.) రాజధాని కావడం మూలాన అక్కడే ఉన్న మిగతా గుళ్ళతోపాటు జైనదేవాలయం ప్రసిద్ధమైంది.


ఇక్కుర్తి అగ్గలయ్య:
ఇక్కుర్తి నరవైద్యవర అగ్గలయ్య ఆధ్వర్యంలో దిగంబర జైనకేంద్రంగా వుండేది. ఇక్కడ బుద్ధసేనజినాలయం అనే జైనబసది వుండేది. దానికి రాజులు దానాలు, కానుకలు ఇస్తుండేవారు. అగ్గలయ్య జైనమతాన్ని సేవిస్తూ తానిక్కడ పెంచిన మూలికలతో ప్రజలకు ఉచితవైద్యసేవలందిస్తుండే వాడు. అవసరపడినపుడు శస్త్రచికిత్సలు కూడా చేసేవాడు. అగ్గలయ్య గురించి సైదాపురంలోని రెండు శాసనాలలో, మెదక్‍ జిల్లా సిరూర్‍ లోని మూడు శాసనాలలలో ప్రస్తావనలున్నాయి. క్రీ.శ.1034లో కళ్యాణి చాళుక్యరాజు రెండో జయసింహుడు నెలవీడు పటాన్‍ చెరు(పొత్తలకెరె)లో వున్నపుడు వైద్యరత్నాకర, ప్రాణాచార్య బిరుదులుగొన్న అగ్గలయ్య అడిగినందువల్ల ముచ్చనపల్లిలోని (ఇక్కుర్తికి 4కి.మీ.ల దూరంలోవున్న ముచ్చనపల్లి ప్రస్తుతం ముస్త్యాలపల్లిగా పిలువబడుతున్న చిన్నగ్రామం) బుద్ధసేన జినాలయానికి, ఇక్కుర్తిలోని వైద్యరత్నాకర జినాలయానికి దానాలుచేసాడని యాదాద్రి-భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట సమీపంలో వున్న సైదాపురం శాసనంలో వుంది. అగ్గలయ్య గురించి మెదక్‍ జిల్లా సిరూర్‍ శాసనంలో వివరించబడ్డది. అగ్గలయ్య జైన మాలవ గణానికి చెందిన యాపనీయ సంఘానికి చెందినవాడు. సిరూరుశాసనం (క్రీ.శ.1074)లో కళ్యాణి చాళుక్యరాజు రెండో సోమేశ్వరుడు అగ్గలయ్యను ప్రధానఅడపంగా, మహాసామంతునిగా నియమించాడని వుంది. మెదక్‍ జిల్లా సిరూర్‍ శాసనం భువనైక మల్లదేవుని పాలనలో (శాసనకాలం-1074) అగ్గలయ్యను మహాసామంత అగ్గలరస అని పేర్కొన్నది. అగ్గలయ్య దాదాపు 50యేళ్ళపాటు జగదేకమల్ల-1, త్రైలోక్యమల్ల, భువనైక మల్లుల రాజాశ్రయంలో వున్నట్టు తెలుస్తున్నది. గావుండా స్థాయి నుంచి ఎదిగి మహాసామంత పదవిని పొందాడు. అడపం అంటే ఆకు, వక్కలు అందించే సేవకుడు కాదు. తాంబూలస్రవం చేసి, చేయించి, రాజ్యంలోని భూదానాలను లబ్ధిదారులకు అందచేసే రిజిస్ట్రేషన్‍ అధికారి అడపం. అప్పట్లో తాంబూలం అందుకోవడం శాసనబద్ధమైన రిజిస్ట్రేషన్‍. వరంగల్‍ కొండపర్తి శాసనం నుంచి(క్రీ.శ.900) రాయల శాసనాలలో కూడా అడపాలు ప్రస్తావించబడ్డారు. అగ్గలయ్య ప్రసిద్ధ ఆయుర్వేదవైద్యుడుగాను, చక్రవర్తి ఆస్థానంలో అడపంగాను బాధ్యతలు నిర్వహించాడని శాసనాలవల్ల తెలుస్తున్నది.


ఇక్కుర్తిబోడు:
కొలనుపాక-7000లనాడులోని ఒక కంపణం(జిల్లావంటిది) ఆలేరు-40. ఆలేటికంపణంలోనిది ఇక్కుర్తి. ఇక్కుర్తిబండ లేదా ఇక్కుర్తిబోడుగా పిలవబడుతున్న ఇక్కుర్తి చెరువుపక్క క్వారీగుట్ట మీద పడమటివైపు ఒక బండరాయికి పార్శ్వనాథుని విగ్రహం చెక్కబడివుంది. అక్కడ గుడి వుండేదని చెప్పడానికి ఆనవాలుగా గుడిశేరడు రాతిముక్క పడివుందక్కడ. ఆ విగ్రహం ముందర వున్న విశాలమైన చదునైన రాతిప్రదేశం ఒకప్పుడు జైనమునుల ధ్యానాలతో, ప్రార్థనలతో గొప్పప్రాభవంతో వుండి వుంటుంది. అక్కడికి తూర్పు కొసన ఒక నీటిగుండం వుంది. గుండం ఒడ్డున జినతీర్థంకరుని పాదాలు చెక్కివున్నాయి. ఈ గుండం ఒకప్పుడు స్నానవాటిక. ఇక్కడ స్నానం చేస్తూ గట్టున పెట్టిన బట్టలను ‘బట్టలభైరవుడు’ ఎత్తుకపోయేవాడట. బట్టలభైరవుడు, బత్తలభైరవుడు, బరివాతల దేవుడని స్థానికులు పిలిచేది పార్శ్వనాథుణ్ణే. గుండం పైకి దక్షిణం దిశన జైనమునులు కూర్చుని ధ్యానం చేసుకునేంత చిన్న చిన్నవి, పైకప్పులేనివి, 4 అడుగులఎత్తుండే రాతిగదుల వంటివి పదిదాకా వుండేవి. అవన్నీ క్వారీలో బండలుకొట్టడంలోనే నష్టమైపోయాయి.
పార్శ్వనాథునికి, గుండానికి మధ్య గుట్ట దిగువగా రెండు గుహలుంటాయి. మొదటి గుహలో శివాలయం, అంతరాళంలో దక్షిణాన వీరభద్రుడు, ఉత్తరాన వినాయకుడు గోడలోనే తాపడం చేయబడివున్నారు. గుడి బయట ద్వారపాలకులు చెక్కబడివున్నారు. అక్కడే ఒక విరిగిన విగ్రహం పడివుంది. దానికి రెండువైపుల శిల్పాలున్నాయి. ఒకవైపున్న బొమ్మ దేవతది అసంపూర్ణం. రెండోవైపు తలలేని జైనమూర్తిది. అంతా ఆకారాన్ని చెక్కేసి బొమ్మ కనబడకుండా చేసారు. గుడి ఎదురుగా నాగశిల్పాలున్నాయి. రెండోగుహ ఇపుడు లేదు. గుట్ట దిగి పదడుగులు వేసి తూర్పుకు వస్తే గుట్టరాయికి అద్భుతమైన ‘అన్నపూర్ణ’ దేవి శిల్పం చెక్కివుంది. పైన శివాలయం, కింద అన్నపూర్ణ శైవమత విస్తరణను సూచిస్తున్నాయి. గుట్టకు ఉత్తరాన గ్రామంలో అగ్గలయ్య సమాధి వుండేదిట. ఏనుగుల సమాధి, గురువు సమాధి అని పిలిచేవారు. ఇపుడక్కడ ఆనవాలేమీ మిగులలేదు.


ఇక్కుర్తి-పురామానవుల ఆవాసం:
ఇక్కుర్తిగుట్ట వెనక దక్షిణం దిక్కున పురామానవుల సమాధులున్నాయి. వాటిలో ఎక్కువగా సిస్తుసమాధులే. కాని, అక్కడ 6 అడుగుల ఎత్తున్న రెండు మెన్హర్లుండడం విశేషం. ఇక్కడ నుండి ప్రారంభమై దాదాపు రెండు కి.మీ.లు ఆదిమానవుల సమాధులు విస్తరించివున్నాయి. వీటిలో సిస్తు సమాధులు, కైరన్లు, డోల్మన్లున్నాయి. ఈ పెట్టెసమాధుల్లో కొన్నింటిలో ఒకేసారి రెండు, మూడు దేహాలను పెట్టిసమాధి చేసినట్లు తెలుస్తున్నది. కొన్ని సమాధుల్లో దక్షిణం దిక్కు తలవైపు బండకు ఒక రంధ్రం చెక్కబడివుంది. ఇది ద్రవిడ సంప్రదాయం. సమాధి చేయడమే ద్రవిడ సంప్రదాయమంటారు. ఇక్కడ బీరప్పగుడిలో లింగాలుగా పూజింపబడుతున్నవి ఒకప్పటి ఆదిమానవుల చేతుల్లోని రాతిపనిముట్లు. రాతిగొడ్డళ్ళు, బొరిగెలు, రాతిసుత్తెలు, రాతికత్తులు ఒకప్పుడు 16 పనిముట్లుండేవి. ఈ సమాధులు, అక్కడ దొరికిన, పరిశీలించిన ఆధారాలు ఆది మానవులిక్కడ పదివేల యేళ్ళ క్రితంనుండి నివసిస్తుండేవారని బోధపడుతున్నది. రాతిపనిముట్లు కొత్తరాతియుగానికి చెందినవే. సమాధులే కొంచెం పాతవి లాగున్నవి.
వివిధకాలాలకు చెందిన ఇట్లాంటి రాకాసిబొందలు, రక్కసిగుళ్ళు, ఆదిమానవుల సమాధులు (సిస్తులు, కైరన్‍లు, డోల్మన్లు, మెన్హర్లు) ఇక్కుర్తిలోనే కాదు చుట్టుపక్కల గొలనుకొండ, మూటకొండూరు, రాయగిరి, బోనగిరి, బీబీనగర్‍, ఘట్కేసర్‍, వాసాలమర్రి,ఇబ్రహీం పట్నం, చల్లూరు, రఘునాథపురం, లక్ష్మక్కపల్లె, పోచన్నపేట, బచ్చన్నపేట, సిద్ధులగుట్ట, జనగాం, కళ్ళెం… ఎటూ 50 నుండి వంద కిలోమీటర్ల దూరం ఆదిమానవుల సమాధులు విస్తారంగా విస్తరించి వున్నాయి. హైదరాబాద్‍ చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఆదిమానవుల పురాయుగపు స్మృతిచిహ్నాలు లెక్కలేనన్ని లభిస్తున్నాయి. సమాధులు, రాతిపనిముట్లు, రాతిచిత్రాలు, కుండలు, రాతలవంటి జాడలు ఎన్నెన్నో దొరకడం తెలంగాణా ఏ పూర్వచారిత్రక ప్రదేశాలతోనైనా సమానంగానో, మిన్నగానో వుందని తెలుస్తున్నది. పరిశోధనలు జరగాలి. కొత్త తెలంగాణా చరిత్ర తిరిగి రాయాలె.


ఇక్కుర్తి-కొసగుట్ట:
వూరికి తూర్పున కొశెగుట్ట వుంది. దాని శిఖరం కొశెగా (వాడిగా) వుందని దాన్ని కొశెగుట్టని పిలుస్తారు ప్రజలు. గుట్టమీద గుహలు, ఆదిమానవుల ఆవాసాలున్నాయి. గుట్టకొసన పడమటిదిక్కు రాయికి ‘వి’ వంటి గుర్తు లోతుగా గంటు చెక్కబడివున్నది.అట్లాంటి గుర్తులను ఆదిమానవుల వాళ్ళ సంచార, నివాస దిశలను తెలుపడానికి వాడుకుంటారని చరిత్రకారులు రాసారు.రైతులు కొత్తపొలాలు అచ్చుకట్టేటప్పుడు తవ్వితే ఈ సమాధుల్లో కొన్ని ఇనుపపనిముట్లు, కుండలు దొరికాయట. అవేవీ మాకు ఎవరు చూపలేదు కాని ఒక కుండపెంకు మీద ‘బ్రాహ్మీ’లిపిలో ‘‘త’’ అనే అక్షరం వంటి గుర్తుండడం నేను, నాకు చరిత్రపట్ల ఆసక్తిని కలిగించిన గురువు విరువంటి గోపాలక•ష్ణగారు, ఇద్దరం చూసాం. ఇటువంటి లిపిగుర్తులు రాయగిరి సమాధులలో లభించిన కుండపెంకుల మీద ఉండడం గమనించాడు ఒకప్పటి నిజాం పురావస్తుశాఖ సూపరింటెండెంట్‍ గులాం యాజ్దానీ. ప్రత్యేకంగా వీటి గురించి తాను రాసిన వ్యాసం అప్పటి పురావస్తుశాఖ వార్షికనివేదికలలో చూడవచ్చు. వాటిమీద ఉన్న గ్రాఫిటీలు ఇక్కుర్తి గ్రాఫిటీతో పోలివున్నాయి. అంతేకాదు ఖమ్మం డిగ్రీకాలేజి ఆవరణలోని పురాసమాధులలో దొరికిన కుండల మీద కూడా గ్రాఫిటీలున్నాయి. అవి కూడా పురాలిపి సంకేతాలే. పరిశోధన జరగాల్సివుంది.


ఇక్కుర్తి గుడులు:
కొసగుట్ట అడుగున నేలమీద దొరికే పెంకులు, ఇటికపెల్లలు అక్కడొక పురాతన గ్రామం వుండేదనడానికి రుజువులు. గుట్టకు ఉత్తరాన అతిపురాతనమైన రెండు ఆలయాలున్నాయి. ఒకటి శిథిలం కాగా, రెండవది పూజార్చకాదులకు నోచుకుంటున్నది. మొదటిది శివాలయం. ఆ గుళ్ళు రాష్ట్రకూటుల కాలం నాటివే అనిపించడానికి అక్కడ పొలాల్లో లభించిన వినాయకుని విగ్రహం సాక్ష్యమిస్తున్నది. గాణపత్యం అధికంగా ఆదరించబడ్డ కాలం రాష్ట్రకూటులదే. ఇంకా అక్కడి పొలాల్లో శిథిలదేవాలయాల ద్వారబంధాలు, లింగాలు, ఆంజనేయుల విగ్రహాలు దొరుకుతున్నాయి. ఇవన్నీ కాక వూరిలో వీరగల్లులు చాలా చోట్ల వున్నాయి. కొన్నిజాగల అవి దేవుళ్ళుగా పూజింపబడుతున్నాయి. మరొక గుడి వూరి నడుమ వుంది. ఆ గుళ్ళో దుర్గాదేవతను ప్రతిష్టించారు. మంటపంలో నంది, ఎదురుగా ఆంజనేయుడుండడం విశేషం. దేవాలయగోపురం మెట్లపద్ధతిలో వుంది. ఆ గోపురానికి చుట్టూ సున్నంతో చేసిన బొమ్మలున్నాయి. వీరులు, ఒంటె, గుర్రాలు, పక్షులు… ఇవే మిగిలివున్నాయిపుడు. ఒకప్పుడు శృంగార శిల్పాలుండేవి. ఏ విధంగా చూసినా ఇక్కుర్తి గ్రామం పురామానవుల ఆవాసం, గొప్ప దేవాలయాల నిలయం అని చెప్పాలి. పాతగుళ్ళవద్ద పాతమట్టిగోడల జాడలున్నాయి. అక్కడేమైనా మట్టికోటవుండేదేమో… పరిశోధించాలి.
ఇక్కుర్తిని, అగ్గలయ్యని పరిశోధించడానికి చారిత్రక మార్గదర్శనం చేసిన చరిత్రకారుడు విరువంటి గోపాలకృష్ణసార్‍కు, నాతోపాటు క్షేత్రపర్యటనలు చేసిన సహచరులు వేముగంటి గోపాలకృష్ణ, మల్లావఝల నారాయణశర్మ, చంటి, నాగరాజులకు, జి.కుమారస్వామి, నట్వా ప్రభాకర్‍ సార్లకు, ఒకసారి మాతోవచ్చిన ద్యావనపల్లి సత్యనారాయణగారికి, ఇక్కుర్తి గ్రామప్రజలకు
ఈ సందర్భంగా నా ధన్యవాదాలు.

  • శ్రీ రామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *