సదాశివపేట- తెలంగాణ రాష్ట్ర ప్రాచీన నగర నిర్మాణ నమూనా


నడిమధ్యన సదాశివుడు,
నలువైపులా ద్వారబంధాలు,
నలుచెరుగులా కందకం,
నలుదిక్కుల చందరంగ శైలి విస్తరణ,
కూర్మ వృష్ట వాస్తు నిర్మాణ కౌశలం,
సదాశివరెడ్డి ఏలిన నేల అదే సదాశివపేట.

భారతదేశం అనాది కాలం నుండి గొప్ప సంస్కృతి వారసత్వానికి పెట్టింది పేరు. ప్రాచీన భారతదేశం సందడిగా ఉన్న పట్టణాలు, గంభీరమైన రాజధానులు, సౌందర్య నిర్మాణాలకు నెలకొలువు. శతాబ్దాల నుండి గొప్ప కట్టడాలు, నిర్మాణ శైలి ఉన్న నగరాలు విలసిల్లుతున్నాయి. చండీఘర్‍, జైపూర్‍, మధురై లాంటి నగరాలు ఈ విధమైన నిర్మాణ శైలికి మచ్చుతునక. అలాంటి ఒక పట్టణమే సదాశివపేట.


సదాశివపేట పట్టణం తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉంది. హైదరాబాద్‍ నుండి ముంబాయి వెళ్ళే రహదారి పక్కన ఉంది. సదాశివపేట 2011 జనాభా లెక్కల ప్రకారం 42,950. పట్టణ వైశాల్యం 21.74చ.కి.మీ. ఈ పట్టణం హైదరాబాద్‍’ నుండి 65కి.మీ. దూరంలో ఉంది. ఈ పట్టణం 17.400 ఉత్తర అక్షాంశం, 77.580 తూర్పు రేఖాంశం మధ్య విస్తరించింది. దీనిలో 7 రెవిన్యూ వార్డులు, 26 ఎలక్షన్‍ వార్డులు ఉన్నాయి. మధ్య యుగం నాటి చారిత్రక పట్టణమైన దీని గురించి తెలుసుకోవడం తెలంగాణ సంస్కృతి వారసులుగా మన కర్తవ్యం. ఇలాంటి పట్టణాలు ఆధునిక నిర్మాణలకు మార్గదర్శి కూడా.


ఈ పట్టణం 17వ శతాబ్దంలో వాస్తు శాస్త్రం ఆధారంగా జైపూర్‍కి ముందే నిర్మింపబడింది. గొప్ప నగర నిర్మాణ శైలితో వాస్తు కట్టడాలతో ప్రత్యేకతను సంతరించుకుంది. నేటి రోజులలో కూడా నగర నిర్మాణానికి ఒక నమూనాగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. చరిత్రలో కనుమరుగైన ఎన్నో నగరాలకు మంచి వాస్తు విశిష్టత
ఉంది. మనం దృష్టి సారించాల్సిన వాస్తు శైలి, నిర్మాణ విశిష్టత దీని సొంతం. ఈ పట్టణ నిర్మాణం’ మనసారా’ వాస్తు శాస్త్రం ప్రకారం, సర్వతోభద్ర ఆకృతిలో నిర్మించారు. వీధుల నిర్మాణం చెస్‍ బోర్డును తలపిస్తుంది.


వివిధ రాజవంశాలు పాలించడం వల్ల సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిగి ఉంది. 12 శ.లో కాలచూరి రాజవంశ సైన్యాధిపతి, వీరశైవ లింగాయత్‍ మత స్థాపకుడు బసవేశ్వరుడు పాలించాడు. ఈ మత ప్రభావం’ వల్ల ఇక్కడ ఇప్పటికి లింగాయతులు అధికంగా ఉన్నారు. ఈ నగర నిర్మాణం గూర్చి ‘అభోన’ రాతి పలకల శాసనాలపై కాలచూరి రాజ వంశ రాజులు రాయించారు. బ్రహ్మస్థానం (నడి బొడ్డున) శివాలయం నిర్మించారు. ఆధునిక కాలంలో నూతన ఇళ్ల నిర్మాణాలు ఎన్ని జరిగినా ఈ పట్టణం మూల వాస్తు శైలిని కోల్పోలేదు. ఈ సంస్థాన చరిత్ర అందోలు రాజుల చరిత్ర, మెదక్‍ రాజుల చరిత్ర, రంగంపేట చరిత్ర గ్రంథాలలో తాళపత్ర గ్రంథాల ఫై రాణి లింగాయమ్మ చే వ్రాయబడిన ‘మా పూర్వ వంశావళి’, చిదిరే లక్ష్మణ శాస్త్రి రచించిన ‘మెదక్‍ రాజుల చరిత్ర’, మొ.గా గల గ్రంథాలు తెలియచేస్తున్నాయి. సురవరం ప్రతాపరెడ్డి గారు తన గోల్కొండ పత్రిక రాణి శంకరమ్మ, సదాశివరెడ్డి ధైర్య, సాహసాల గూర్చి వర్ణించాడు. శౌర్య రాజ వంశ రామినేడు, ముసలా రెడ్డి, పెద్దారెడ్డి, అల్లమయ్య రెడ్డి, రామిరెడ్డి, సదాశివ రెడ్డి, పెద్ద నరసింహ రెడ్డి, లింగాయమ్మ, నరసింహ రెడ్డి, రాణి శంకరమ్మ, సదాశివరెడ్డి ll ఈ సంస్థాన పాలకులు.


17శ.లో రాణి లింగాయమ్మచే నగర శంకుస్థాపన జరిగినప్పుడు సర్వతోభద్ర నిర్మాణ పథకం రచన జరిగింది. చదరంగం బల్ల లాగా వాస్తు సూత్రాల ఆధారంగా పట్టణ నిర్మాణం ప్రారంభించబడింది. తర్వాత పాలకుడైన రామదుర్గ వెంకట నరసింహ రెడ్డి శంకరమ్మ ధైర్యసాహసాలను మెచ్చి వివాహం చేసుకున్నాడు. మెతుకుసీమ సివంగిగా చరిత్రకెక్కిన ఈ రాణి ఖుల్దా యుద్ధంలో పేష్వాలను ఎదిరించి, నిజాం నవాబ్‍ నుండి ‘రాయభాగిన్‍’ బిరుదు పొందింది. చరిత్రకారులు ఆమెను రుద్రమదేవి, అహల్య భాయిలతో పోల్చారు. చిన్న వయసులో వైధవ్యం పొందిన శంకరమ్మ కు సంతానం లేనందున సదాశివరెడ్డి llను దత్తత తీసుకున్నది. గొప్ప వీరుడు సదాశివరెడ్డి. గద్వాల సోమనాథ భూపాలుడు తన కుమార్తెలు శివాయమ్మ, లింగాయమ్మలనిచ్చి వివాహం జరిపించాడు. పార్వతి మరొక సతీమణి. సదాశివపేట అనే పేరు ఈ రాజు పేరుతో గణతికెక్కిన ఈ రాజు పాలనలోనే పట్టణ నిర్మాణం పూర్తయింది.


1946లో సివిల్‍ ఇంజనీర్‍ ఫయాజుద్ధిన్‍ సదాశివపేటను సర్వే చేశారు. సదాశివపేట మ్యాప్‍ మొదటి సారిగా ప్రచురించారు. చెస్‍ బోర్డు ఆకృతిలో పట్టణ నిర్మాణం ఉందని కనుగొన్నది కూడా ఇతనే. మనసారా శిల్ప శైలి ప్రకారం 8 రకాల నిర్మాణ పద్ధతులు ఉన్నాయి. అవి దండక, చతుర్ముఖ, నంధ్యవర్త, స్వస్తిక, ప్రస్తార, సర్వతోభద్ర, కార్ముక, పద్మక.


ఈ పట్టణ పథకం రూపురేఖలు సర్వతోభద్ర నమూనాలో, వాస్తు శాస్త్ర సూత్రాలపై ఆధారపడి నిర్మింపబడింది. నగరం నడి మధ్యన ఎక్కువగా, చివరన తక్కువగా విస్తరించి ప్రకృతి యొక్క పూర్తి ప్రయోజనాలను పొందే విధంగా ఉంది. దక్షిణ భారతదేశంలోని నగర నిర్మాణాలలోనే పేరెన్నదగిన వాస్తు శైలి దీని లక్షణం. వీధుల అమరిక 64 గదులతో చదరంగం బల్లను తలపించేలా ఉంది. చిన్న వీధులన్నీ ప్రధాన వీధితో కలిసి నడి మధ్యలో ముగుస్తాయి. ప్రతి చతురస్రాకారపు వీధి 240 అడుగులు విస్తరించింది. చండీగఢ్‍ కూడా అలాగే దీర్ఘచతురస్రాకారంగా వీధుల నిర్మాణాన్ని కలిగి ఉంది.నీటి ఉదృతికి తట్టుకునే విధంగా పట్టణ నిర్మాణం నడి మధ్యన ఎత్తుగా విస్తరించింది. దక్షిణాన ఉన్న గుండమ్మ భావి, ఊబ చెరువులు నీటి అవసరాలను తీర్చేవి.ఇప్పటి మున్సిపాలిటీ కూడా తన విధులను సులువుగా నిర్వర్తించేందుకు అనుకూలంగా ఈ పట్టణ స్థూలరూపం ఉంది.


చుట్టూ సరిహద్దు గోడ, దాని తరువాత’ కందకం, నలువైపులా సింహాద్వారాలను కలిగి ఉంది. ‘మనసారా’ శిల్ప శైలి లో చెస్‍ బోర్డు లాంటి కచ్చితమైన కొలతలతో వీధుల నిర్మాణం ఉంది. ఈ రకమైన నిర్మాణ శైలి సాధారణంగా పూర్వ కాలంలో పెద్ద, పెద్ద నగర నిర్మాణాలలో చూడగలం. అయితే’ దీని కోసం’ కచ్చితంగా చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉన్న స్థలాన్ని ఎంచుకుంటారు. నిర్మాణశైలిలో సర్వతోభద్ర అంటేనే అందరికి ఆహ్లాదం కలిగించేది. దీని మరొక గొప్ప లక్షణం ఏంటంటే మధ్యయుగాలనాటి కొలత ‘నివర్తన’ 40×40 అడుగులుగా వార్డుల నిర్మాణం జరిగింది. పూర్వ కాలంలో వార్డులు వారి వారి వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. బ్రాహ్మణులు. వైశ్యులు, సువర్ణకారులు, కుమ్మరులు, వద్దేరాలు, కటిక కులస్తులు మొ. వారి కోసం ప్రత్యేక వాడలు ఉన్నాయి. గడి కోట పాలకుల కోసం నిర్మించారు.


కూర్మపృష్ఠ వాస్తు అంటే మధ్యలో విస్తరణ ఎక్కువగా, అంచులలో తక్కువగా ఉండే విధంగా నగర నిర్మాణం ఉంది. పట్టణం మధ్య’ నిర్మాణాలు కందకం ఉన్న స్థలం కంటే 8 మీ. ఎత్తుగా ఉన్నాయి. అంటే బ్రహ్మ స్థానం ఆకృతి స్థాయి 550 మీ., పిశాచ స్థానం( సరిహద్దులు) 542 మీ.లో ఉన్నాయి. నైరుతి ఎత్తు ఉండి, ఈశాన్యం తక్కువ ఉండాలనే ప్రస్తుత వాస్తు శైలిని ఎప్పుడో గ్రహించి అనుసరించారు.రహదారులు ఉత్తర దక్షిణాలుగా, తూర్పు పడమరలుగా విస్తరించాయి. నగరం మధ్యలో వచ్చే రెండు పెద్ద రోడ్డు 6 దండాలు అంటే (36 అడుగులు) గా ఉన్నాయి.


ఇళ్ళ నిర్మాణాలలో అధ్బుత వాస్తు శైలిని పాటించారు. ఒకటి లేదా రెండు అంతస్తులతో మధ్యలో అంగడం, చుట్టూ గదులతో కట్టారు. ప్రాకృతిక గాలి, వెలుతురు ప్రసరించే ఈ ఇండ్లు ఉష్ణ తాపం నుండి సంరక్షిస్తాయి. ఇండ్ల ద్వారాలు పెద్దగా పశువులు కూడా వెళ్ళేలా నిర్మించారు. ఈ తలపుల పై చెక్కిన శిల్పాలను బట్టి వీరు చేసే వృత్తిని గుర్తించవచ్చు. ఇంటి నిర్మాణంలో డంగు సున్నం విరివిగా ఉపయోగించారు. సున్నపురాయి, ఇసుక, బెల్లం, జనపనార, మారేడు పండు, కరక్కాయ మొ. కలిపి డంగు సున్నం చేస్తారు. దీనికీ కార్బన్‍-డై-ఆక్సైడ్‍ పీల్చుకుని ఇంటి లోపల చల్లగా ఉంచే సహజ లక్షణం ఉంటుంది.


ఆధునిక కాలంలో నూతన పోకడలతో ఎన్నో కట్టడాలు, ఇండ్లు నిర్మించినా దాని పూర్వ ప్రాదేశిక నిర్మాణ కౌశలం, పొందిక ఎన్నదగినదే. ఇలాంటి పట్టణాల చరిత్రను వెలికి తీసి చరిత్రలో తగు స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది.


ఆధార గ్రంథాలు:

  • Sadashivapeta- Ancient Town of Telangana written by Gayathri Pakala
  • తెలంగాణ వీరుడు సదాశివరెడ్డి- బిరుదు రాజు రామరాజు

కె. క్రిష్ణప్రియ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *