సమసిపోతుందనుకున్న కరోనా సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరింత ఉధృతంగా వచ్చింది. అంతకు ముందెన్నెడూ లేనంతగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ‘టైమ్స్’ సర్వే ప్రకారం ప్రభుత్వ లెక్కలకు ముప్పైరెట్లు కేసులున్నట్లు తెలుస్తోంది. సెకండ్ వేవ్ గురించి మొదటి నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు, సామాజిక పరిశీలకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మొదటి కోవిడ్ సమయంలో దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక ఇంటర్వ్యూలలో కూడా పలురంగాల మేధావులు యిదే చెప్పారు. ఇప్పుడు ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)లో మనమున్నాం.
ఇంతకు ముందు డ్రాప్‍లెట్స్ ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తి జరుగుతుందనుకున్నాం. ఈసారి గాలిద్వారా కూడా వ్యాపిస్తుందనడానికి ఆధారాలున్నట్లు సీసీఎంబీ కూడా వెల్లడించింది. ఇది మరింత ప్రమాదకరస్థితి.
‘‘బతికుంటే బలుసాకు తినొచ్చు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలు బలిపెట్టలేమన్న’’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లుగానే కరోనా నివారణకు కావాల్సిన చర్యలు పకడ్బందీగా నిర్వహించిన ఘనత కూడా మన తెలంగాణ ప్రభుత్వానిదే. ఇప్పుడు కూడా అదే చిత్త శుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. టెస్టులను ముమ్మరం చేసింది. వాక్సినేషన్‍లో ముందుంది. గాంధీ హాస్పిటల్‍ను పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్‍గా మార్చింది. ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలను ప్రజల అందుబాటులోకి తెస్తుంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన సందర్భంలో యుద్ధవిమానాల ద్వారా బళ్లారి, ఒడిశాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి కరోనా కట్టడికి జరుగుతున్న చర్యలు. ఇవి మాత్రమే సమస్యను పరిష్కరించలేవు.
ప్రజల నిర్లక్ష్యమే సెకండ్‍వేవ్‍కి కారణమంటున్నారు. స్వీయ నియంత్రణ పాటించలేదని అంటున్నారు. ప్రజలెప్పుడూ వివిధ సమూహాలుగా విడిపోయి వుంటారు. దీనికి అనేక అసమానతలు కారణం. వీరి అవసరాలలోనూ, అవకాశాలలోనూ తీవ్రమైన తేడాలుంటాయి. అందువల్ల అందరూ ఒకే రకంగా ఆలోచించడం గానీ, ఆచరించడంగానీ సాధ్యంకాదు. స్వీయ నియంత్రణ పాటించడానికి యివన్నీ అవరోధాలే. ప్రజల స్వీయ నియంత్రణతో పాటు దీనికి వ్యవస్థాగతమైన కట్టడి చాలా అవసరం. జీవిత కార్యకలాపాలకి అవరోధం కలిగించని కట్టడి అవసరం. జీవిత అవసరాలకు తప్పనిసరికాని సామూహిక కార్యకలాపాలు, పబ్‍లు, బార్లు, రెస్టారెంట్స్, సినిమాలు వంటి వాటిపట్ల కట్టడి అవసరం. వీటిని అధికారయంత్రాంగం నిర్వహించవలసిన చర్యలు.
ఇది సమాజం ఉదాసీనంగా ఉండవలసిన సమయంకాదు. మౌనం ఎప్పుడూ నేరమే. ఇది మాట్లాడు కోవలసిన సమయం. ప్రభుత్వం, ప్రజలు, ప్రజలపట్ల సేవాదృక్పథం వున్న వ్యక్తులు, సంస్థలు, వైద్య, విద్య సంస్థలు, అధికార యంత్రాంగం, స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ సిటిజెన్స్, వివిధరంగాల మేధావుల మధ్య అర్థవంతమైన సంభాషణ జరగాలి. ఈ ఉమ్మడి ఆలోచనలు, ప్రణాళికలు, సమిష్టి ఆచరణ మాత్రమే సమస్యను పరిష్కరించడంలో దోహదపడతాయి.
మానవాళి మనుగడకి అందరూ తమతమ రాజకీయాలను ప్రక్కనబెట్టి మాట్లాడుకోవాల్సిన సమయం. ఈ సమన్వయం చిత్తశుద్ధితో రాజకీయాల కతీతంగా ప్రల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాలి. వాక్సిన్, ఆక్సిజన్ కొరతను అధిగమించాలి. ప్రజలందరికీ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. డిజాస్టర్ మేనేజ్‍మెంట్ యాక్ట్ 2005ను సక్రమంగా అమలు చేయాలి.
సుప్రీంకోర్టు చెప్పినట్లు కోవిడ్ ఒక జాతీయ అత్యవసర పరిస్థితి అని గుర్తించి దాన్ని ఎదుర్కోవడానికి ఒక జాతీయ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలు కేంద్రం మధ్య నిజమైన సహకార సంబంధాలుండాలి. ఇప్పుడు సమిష్టి కృషి ఒక్కటే మానవాళికి రక్షణ.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్