(గత సంచిక తరువాయి)
మొదటి దశ : వాయురూపంలో అతివేడిగా వున్న గోళం, చల్లబడుతున్న క్రమంలో పై భాగాల్లో అతిశీతల మంచు, కొంత మేర వివిధ వాయువుల సమ్మేళనంతో వాతావరణం, దీంతో నేల, జీవపదార్థం ఆవిర్భవించడం జరిగింది. భూభ్రమణంతో ఈ పరిణామాలు వేగవంతం కావడం జరిగింది.
రెండో దశ : ఈ దశలో వాయువులలోని వివిధ రసాయనిక చర్యలతో గోళం ఉపరితలంపై గల ఆవిరి, అప్పుడే ఏర్పడుతున్న ద్రవం (వివిధ మూలకాలతో), నీరు (H2O) మంచు ఖండికలు కలిసి, తేమగా మారి, సూర్యరశ్మిని కొంత అడ్డుకోవడంతో, తిరిగి ద్రవ స్థితిని పొంది, వివిధ భాగాలకు ప్రవహించినట్లు పరిశీలించారు. ఇలా భూగోళ వేడి నియంత్రించడంతో ఈ రుతు సంబంధ కాలచక్రం రూపుదిద్దుకున్నది.
మూడో దశ : ఈ దశలో వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో జనించిన జీవం, క్రియాశీలమైన జీవన చర్యలు జరపడం, వాయువులలోని కార్బన్, నైట్రోజన్, ఫాస్పరస్, సల్ఫర్ లాంటి రసాయనిక పదార్థాలు భూ వాతావరణంలోకి వ్యాప్తి చెందడం జరిగాయి.
నాల్గోదశ : క్రమక్రమంగా ఓ నిర్ధిష్ఠ భౌతిక, ఘనరూపాన్ని సంతరించు కోవడం, ఏర్పడిన అయస్కాంత క్షేత్రంతో భ్రమణం, పరిభ్రమణం క్రమబద్దీకరణ జరగడం, ఏర్పడుతున్న వాతావరణం (వేడి /శీతలం / వాయువులు / జలం మొ।।)తో అనుసంధానమై స్పందించడం, అనగా భూఖండికల కదలికలు, దృవప్రాంతాల మంచు కరిగి, సముద్రాలు ఏర్పడడం, పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు చోటు చేసుకోవడంతో మంచు శిఖరాలు, అప్పుడే ఏర్పడుతున్న నేల ఖండికలు కోతకు గురికావడం, వార్షిక చక్రం రూపుదిద్దుకోవడం జరిగినట్లు వీరు తేల్చారు.
ఈ దశలోనే మొదటి తరం ప్రాథమిక మొక్క జాతులు పుట్టడం, క్షీణించడంతో, నేలలోని వివిధ ఖనిజాలతో కలిసి, తిరిగి మొలకెత్తడం, కొత్త వాటికి జీవం పోయడం జరిగిందని నిర్ణయించారు.
చివరి దశ : రాత్రింబవళ్ళు ఏర్పడడం, వేడిమికి, చల్లదనానికి గురికావడం, జీవసంబంధ వైవిధ్య పదార్థాలు పుట్టడం, పెరగడం, నశించడం, పవనాలు ఏర్పడడం, నేలనుంచి, సముద్రాలవైపు, సముద్రాల నుంచి నేలవైపు అవి చలించడం ఉపరితలంగా జరుగుతే, భూగర్భంలో సర్దుబాట్లతో భూకంపాలు రావడం, వేడిమి బయటకు చిమ్మడం (Volcano)తో భూమి ఓ ధృడమైన స్వరూపాన్ని (నేల) సంతరించు కున్నది.
పై పరిశీలనలతో పాటు, ఈ బృందం భూమికి పొంచివున్న ప్రమాదం గూర్చి కూడా అధ్యయనం చేసింది. అతిగా వినియోగిస్తున్న శిలజా ఇంధనాలతో అధికమైతున్న భూతాపం విచ్ఛలవిడిగా ఉపయోగించడంతో తరుగుతున్న ఖనిజ సంపద, క్షీణిస్తున్న ఓజోను పొర, మితిమీరుతున్న హరిత వాయువులు (green house gases) వెరసి భూగోళాన్ని అస్థిరతకు గురిచేస్తున్నట్లు తేల్చారు.
ఈ కమిటీ నివేదికను తయారు చేయడంలో కీలకపాత్రను పోషించిన విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగపు డైరెక్టర్ ప్రాన్సిస్ బ్రెతర్‍టన్ (Francis Bretherton) నివేదికకు ముగింపు వాక్యాలు రాస్తూ, భూగోళానికి కలుగుతున్న హాని, నష్టం, కష్టం మన అభివృద్ధి నమూనాలతో కాదు, మనం కోల్పోతున్న విచక్షణా జ్ఞానంతో..’ అన్న మాటలు మూడు దశాబ్దాల తర్వాత కూడా నగ్న వాక్యాలుగానే మిగిలిపోయాయి.
ఖగోళ వింతలు నిరంతరం సంభవిస్తూ వుంటాయి. వాటి ప్రశస్త్యాన్ని పిల్లలకు చూపాలి. వివరించాలి.
(వచ్చే సంచికలో భూఖండికల ఏకం – పంగె ఏర్పడిన విధానం చూద్దాం!)
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162