జీవాన్వేషణ కోసం వరుస కడుతున్న అంతరిక్ష నౌకలు..!!
భూమిపై నున్న పక్షులు, జంతువులతో పాటు ఇతర చలించగల ప్రాణికోటి మనుగడ కోసం పోరాటం చేస్తూ, తమకు అనుకూలమైన ఆహార, ఆవాసాల కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉంటాయి. తాము నివసిస్తున్న ప్రాంతాల్లో శీతోష్ణస్థితిలో కలిగే మార్పులు తమకు ప్రతికూలంగా పరిణమిస్తే, తమకు అనుకూలమైన ప్రాంతాలను వెదుకుతూ అవి వలస వెళ్తాయి. మానవుడు కూడా ఇందుకు ఎంతమాత్రం అతీతుడు కాదు. పెరుగుతున్న జనాభా – తరుగుతున్న వనరులకు తోడు, భూమి మీద పెరిగిపోతున్న కాలుష్యం, భూతాపం వల్ల సమీప భవిష్యత్తులో భూమి మానవ నివాస యోగ్యానికి వీలుకాపోతే ఎలా అన్న ప్రశ్న, మానవుల్ని ప్రత్యామ్నాయ ఆవాస ప్రదేశాలను అన్వేషించేలా చేసింది. ఈ అన్వేషణలో, అనేక ప్రత్యామ్నాయ మార్గాలు మానవుని పలుకరించినప్పటికీ, భూమికి ఆవలవైపు ఉన్న గ్రహాలలో కూడా నివసించాలన్న మనిషి ఆశలకు జీవం పోస్తూ, భూమికి వున్న లక్షణాలకు దగ్గరగా మానవున్ని సూదంటూ రాయిలా అంగారక గ్రహం ఆకర్షించింది. అప్పటి నుండి అంగారక గ్రహం పైకి వివిధ అంతరిక్షాల నౌకలు పంపి అక్కడి వాతావరణాన్ని అన్వేషించడం మొదలెట్టిన మానవుడు, నేటికీ ఆ క్రతువును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో భూమి తరువాత అంగారకుడు మానవ నివాసానికి అనుకూలమేనా, విభిన్న దేశాల వారు పంపిన అంతరిక్షనౌకలు అంగారకుడి ఉపరితలంపై దిగి ఎలాంటి పరిశోధనలు చేపట్టాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి అన్న విషయాలు మనమూ తెలుసుకుందామా!
అంగారకుడిపై ఎందుకింత ఆసక్తి..?
సౌరకుటుంబంలో ఉన్న 8 గ్రహాల్లో కేవలం బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు (కుజుడు) మాత్రమే శిలామయ గ్రహాలు. వీటికి సాంద్రత ఎక్కువ. గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు పెద్దగా ఉన్నప్పటికీ వీటికి సాంద్రత తక్కువ. వీటిని ఉన్నత గ్రహాలు లేదా వాయు గ్రహాలు అని పిలుస్తారు. భూమికి పొరుగు గ్రహమైన శుక్రుడి వాతావరణంలో 96శాతం కార్బన్‍డై ఆక్సైడ్ ఉంది. అంతేకాదు, దీనిపై ఉన్నంత వేడి మరే ఇతర గ్రహంపైనా లేదు. దాని ఉపరితల ఉష్ణోగ్రత 462 డిగ్రీల సెల్షియస్. దీనితో శుక్రుడిపై జీవరాశి ఉండే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. బుధ గ్రహంపైన కూడా 400 డిగ్రీ సెల్షియస్ పైగానే ఉష్ణోగ్రత
ఉంటుంది.
ఇక మనకి పొరుగు గ్రహమైన అంగారకుడి పైకి వెళితే, అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదని, జీవరాశి మనుగడకు అవసరమైన వాతావరణం, నీరు కూడా ఉండేవని అంతేకాకుండా సూర్యరశ్మిని గ్రహించి జీవరాశులు మనుగడ సాగించేందుకు వీలైన పరిస్థితులు అంగారకుడిపై ఉండొచ్చని నాసా అంచనా వేసింది. ఇలా అంచనాలతో సరిపెట్టక 1996, డిసెంబర్ 4న పాత్ ఫైండర్ అనే రోవర్‍ను నాసా అంగారకుడిపైకి పంపింది. ఇది సుమారు 8 నెలలు ప్రయాణించి మార్స్పై వాలింది. పాత్ ఫైండర్ పంపిన ఫోటోల ఆధారంగా కొన్ని వందల కోట్ల ఏళ్ళ క్రితం మార్స్పై ఊహకందని రీతిలో వరదలు సంభవించినట్లు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే భూమికి, అంగారకుడి యొక్క పరిమాణం, స్వరూపం, అంతర్భాగ కూర్పు (Internal composition) మరియు నీటి లభ్యత లాంటి విషయాల్లో ఎన్నో పోలికలున్నాయి. అంగారకుడి మధ్యరేఖపై ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్షియస్‍గా, ధ్రువాల వద్ద -125 డిగ్రీ సెల్షియస్‍గా ఉండి మానవులకు ఆవాసంగా ఉపకరిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయితే అంగారకుడిపై జీవాన్వేషణ కొరకు అంతరిక్ష నౌకలు పంపడం సాధారణమే అయినప్పటికీ గత ఫిబ్రవరిలో యూఏఈ, అమెరికా, చైనాలు ఒకేసారి అంగారకుడిపైకి తమ అంతరిక్ష నౌకలు పంపడం గమనార్హం.
వరుస కడుతున్న అంతరిక్షనౌకలు
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడుదేశాల అంతరిక్ష నౌకలు ఒకే సమయంలో అంగారకుడి మీదకు ఎందుకు ప్రయాణమయ్యాయన్నది ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అంతరిక్ష ఔత్సాహికులను తొలిచివేస్తున్న ప్రశ్న. ఇందుకు కారణం లేకపోలేదు. భూమి, అంగారకుడు తమ తమ కక్ష్యల్లో తిరుగుతూ ప్రతి 26 నెలల కొకసారి ఒక దానికొకటి చాలా దగ్గరగా వస్తాయి. తద్వారా వాటి మధ్యదూరం చాలా వరకు తగ్గిపోతుంది. ఈ విధంగా ఒకదానికొకటి సమీపంగా 6 నెలల పాటు
ఉంటాయి. 2020 సం।। తరువాత, తిరిగి ఇలాంటి దృగ్విషం 2022లోనే సంభవిస్తుంది. ఈ సమయంలో అంగారకుడి పైకి అంతరిక్ష నౌకలు పంపడం వల్ల ఆయా దేశాలకు అంతరిక్ష నౌకల నిర్వహణా ఖర్చులతో పాటు ప్రధానంగా ఇంధన ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే అంగారకుడి పైకి అంతరిక్ష నౌకలు పంపే వారు ఈ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు.
1960వ దశకం నుండి ప్రతి రెండేళ్ళకొకసారి ప్రపంచ వ్యాప్తంగా విభిన్న దేశాలకు చెందిన స్పేస్ ఏజెన్సీలు అంగారకుడిపైకి తమ అంతరిక్షనౌకలను పంపిస్తున్నాయి. అయితే ఒకేసారి మూడు దేశాలకు చెందిన (యూఏఈ, అమెరికా, చైనా) స్పేస్ ఏజెన్సీలు తమ స్పేస్ క్రాప్ట్లను ఒకే Launch Window (ప్రయోగించబడిన ప్రదేశం నుండి ఒక స్పేస్ క్రాఫ్ట్ తన గమ్యస్థానానికి చేరుకోవడానికి నిర్దేశించిన ఖచ్చితమైన సమయాన్ని Launch Window అంటారు)లో ప్రయోగించబడడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం 5 దేశాలకు చెందిన (యూఎస్‍ఏ, యూరోపియన్ యూనియన్, ఇండియా, చైనా, యూఏఈ) 10 స్పేస్ క్రాఫ్ట్లు అంగారకుడి
ఉపరితలంపైన దిగడం గానీ లేదా అంగారకుడి కక్ష్యలో పరిభ్రమించడంగానీ చేస్తున్నాయి. అదే విధంగా నాసాకు చెందిన పర్సెవరెన్స్ రోవర్, అట్లాస్5V41 రాకెట్ ద్వారా గత ఫిబ్రవరి 18న అంగారకుడి ఉపరితలంపైన దిగగా, చైనాకు చెందిన లాంగ్ మార్చ్5 రాకెట్ ద్వారా ప్రయోగించబడిన టియాన్‍వెన్-1 రోవర్ వచ్చే మే నెలలో అంగారకుడి ఉపరితలాన్ని ముద్దాడనుంది.
అంగారకుడిపైన నాసాకు చెందిన ల్యాండర్ మార్స్ ఇన్ సైట్, ఒక రోవర్ క్యూరియాసిటీ, అదేవిధంగా మూడు ఆర్బిటార్స్ అవి వరుసగా మార్స్ రికనైజన్స్, మార్క్ ఒడిస్సీ, మావెన్ (MAVEN)లు ఉన్నాయి. ఇండియాకు చెందిన మంగల్‍యాన్ అనే ఆర్బిటార్ కూడా అంగారకుడిపైన ఉంది. యూరోపియన్ యూనియన్‍కు చెందిన మార్స్ ఎక్స్ప్రెస్ మరియు ఎక్సో మార్స్ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ అనే రెండు ఆర్బిటార్‍లు కూడా అంగారకుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి. అదేవిధంగా యూఏఈ, చైనాలు కూడా వరుసగా హోప్, టియాన్‍వెన్-1 అనే ఆర్బిటార్‍లను కల్గి ఉన్నాయి.
(తరువాయి వచ్చే సంచికలో)
–పుట్టా పెద్ద ఓబులేసు, ఎ : 9550290047