ఏప్రిల్ 18న అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం
టునీషియాలో 1982 ఏప్రిల్ 18న ఇంటర్నేషనల్ కౌన్సిల్, మూమెంట్స్ అండ్ సైట్స్ (ఐసిఒఎంఒఎస్) అనే సంస్థ నిర్వహించిన ఒక సదస్సు ఇంటర్నేషనల్ డే ఫర్ మూమెంట్స్ అండ్ సైట్స్ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాలని సూచించింది. ఈ సదస్సు ప్రారంభమైన రోజు ఏప్రిల్ 18. కనుక ఆ తేదీనే ఎన్నుకున్నారు. యునెస్కో 1983 నవంబర్‍లో ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. ఈ దినోత్సవాన్నే ‘వరల్డ్ హెరిటేజ్’ డే అనడం ఆనవాయితీగా ఉంది. పురాతన కట్టడాలు, స్థలాలను గూర్చిన అధ్యయనం వాటి పరిరక్షణ విషయంలో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు పరస్పరం ఆర్థిక, సాంకేతిక, సిబ్బంది పరమైన విషయాలలో సహకరించుకోవడం మొదలైనవి ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యాలు.
కార్యక్రమాలు
ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజున అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారసత్వ సంపద ప్రాధాన్యతను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 ప్రపంచ స్థాయి పురాతన కట్టడాలు, స్థలాలను గుర్తించి వాటిని పరిరక్షిస్తున్నారు.
భారతదేశంలో
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి నుండి భారతదేశ వారసత్వ సంపద విలువ, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిపించేందుకు ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ’, ‘రాష్ట్ర పురావస్తు శాఖ’లు ప్రతి సంవత్సరం వారసత్వ వారంను కూడా నిర్వహిస్తున్నాయి.
వారసత్వమే భావితరాలకి వారధి..
మన అపురూప సంస్కృతీ సంపదల సంరక్షణకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ కృషికి ప్రజల సహకారమూ చాలా అవసరం. మన సంస్కృతీ చిహ్నం ఏదైనా సరే రూపు చెడగొట్టకూడదు. తరతరాలుగా వస్తున్న కళా సంపదను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం. మన సంస్కృతిని, మన వారసత్వ సంపదను మనం పోగొట్టుకుంటే జాతి జీవచ్ఛవంగా మిగిలిపోతుంది. అంతరించిపోతున్న మన మహోన్నత సం స్కృతిని పరిరక్షించు కోవడం ఎలా? నాగరికత-సంస్కృతి అనే పదాలను మన సంభాషణల్లో, రాసే రాతల్లో తరచుగా వాడుతూ వుంటాం. ‘నాగరికత’ అనేది ‘సివిలైజేషన్’ అన్న పదానికి మారుగా వాడుతున్నాం. నగరజీవనం ఆధారంగా మలచుకొన్న భావన నాగరికత. ‘సంస్కృతి’ దీనికి భిన్నమైనది. ఆంగ్ల భాషలోని ‘కల్చర్’ అనే శబ్దానికి సమానార్థకంగా ‘సంస్కృతి’ అనే శబ్దాన్ని వాడుతున్నాం. ఇది కేవలం ఆంతరిక ‘ సంస్కృతి ’. అంటే.. ‘ఆ జాతి ఔన్నత్యం, సంస్కారం, శిక్ష, కృషి లేదా ఆ జాతి మనుగడలో అంతర్లీనంగా ఉండి, అంతర్వాహినిగా ప్రవహిస్తూ పాటింపబడే ధర్మం’ అని అర్థం చెప్పుకోవాలి.
మానవనిర్మిత కట్టడాలు, రాజ ప్రాసాదాలు, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన అపురూపమైన సుందర ప్రదేశాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారికి వారసత్వంగా సంక్రమించాయి. వీటిని నిర్లక్ష్యం చేయడమంటే, జాతి తన చరిత్రను చెరుపుకోవడమే! అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక నిర్మాణాలు, పురావస్తు సంపద గుర్తింపునకు నోచక మరుగున పడివున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చారిత్రక స్పృహ కలిగిన మేధావుల సూచనల మేరకు ఐక్యరాజ్యసమితిలోని యునెస్కో, దాని అనుబంధ సంస్థ ‘అంతర్జాతీయ పురాతన కట్టడాల, స్థలాల పరిరక్షణ సంఘం’ ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ప్రతి ఏటా ఏప్రిల్ 18ని ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’ (వరల్డ్ హెరిటేజ్ డే)గా పాటిస్తోంది.
1972లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో ప్రపంచ సాంస్కృతిక, ప్రకృతి పరిరక్షణ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రపంచ స్థాయి పురాతనకట్టడాలు, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన స్థలాలు, వాటి అధ్యయనం, పరిరక్షణ విషయంలో సభ్య దేశాలు పరస్పరం ఆర్థిక, సాంకేతిక, వృత్తి నైపుణ్యం సిబ్బందిపరమైన విషయాల్లో సహకరించుకోవడం వంటి ఎన్నో అంశాలు ఈ తీర్మానంలో ఉన్నాయి. ఈ తీర్మానానికి స్పందించి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 800 ప్రపంచ స్థాయి పురాతన కట్టడాలు, స్థలాలను గుర్తించి పరిరక్షిస్తున్నారు.
ప్రపంచస్థాయి వారసత్వ కట్టడాలు, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన సుందర స్థలాలుగా మన దేశంలో 18 కట్టడాలు, ఐదు స్థలాలు వారసత్వ గుర్తింపు పొందాయి. వాటిలో క్రీ.పూ. మూడు-రెండు శతాబ్దాలకు చెందిన ‘సాంచీ’ (మధ్యప్రదేశ్) స్తూపాలు, క్రీ.పూ.200 నుంచి క్రీ.శ.7వ శతాబ్దానికి చెందిన అజంతా-ఎల్లోరా గుహాలయాలు (మహారాష్ట్ర), క్రీ.శ.6వ శతా బ్దానికి చెందిన మహారాష్ట్రలోని ఎలిఫెంటా గుహాలయాలు, క్రీ.శ.7, 8 శతాబ్దాలకు చెందిన మహాబలిపురం రాతి రథాలు (చెన్నై), క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన తంజావూరులో రాజరాజ చోళుడు నిర్మించిన ‘బృహధీశ్వరాలయం’, క్రీ.శ.11వ శతాబ్దం నాటి ఛండేల రాజులు నిర్మించిన ఖజురహో దేవాలయాలు (మధ్యప్రదేశ్), క్రీ.శ. 12వ శతాబ్దంనాటి తూర్పు గాంగ రాజైన మొదటి నరసింహదేవుడు నిర్మించిన ‘కోణార్క సూర్య దేవాలయం’ (ఒడిశా), క్రీ.శ15-16 శతాబ్దాలకు చెందిన హంపీలోని విజయనగర నిర్మాణాలు, క్రీ.శ.16, 17 శతాబ్దాల నాటి మొగల్ చక్రవర్తులు నిర్మించిన ఆగ్రాకోట, తాజమహల్, ఫతే పూర్ సిక్రీ (ఉత్తరప్రదేశ్), ఢిల్లీలోని కుతుబ్ మినార్, హుమాయున్ సమాధి, క్రీ.శ.16,17 శతాబ్దాలకు చెందిన క్రైస్తవ వాస్తుకళా విశేషాలు తెలిపే గోవా చర్చిలు, ఇంకా బౌద్ధయుగంలోని నలందా విశ్వవిద్యాలయం వంటి వాస్తు నిర్మాణాలు వారసత్వ గుర్తింపు పొందాయి. కట్టడాలే కాక సహజంగా వెలిసిన మనోహర ప్రదేశాలైన ఖజీరంగ వన్య సంరక్షణ ప్రాంతం, కేవల్ దేవ్, సుందరబన్, నందాదేవి వంటి ఉద్యాన వనాలు మొదలైనవి ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి.
ప్రపంచ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంఘంలో సభ్య దేశమైన భారత్.. పురాతన నిర్మాణాలు, సుందర ప్రదేశాలను గుర్తించి పరిరక్షిస్తోంది. ప్రజల్లో మన వారసత్వ సంపద విలువ, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, రాష్ట్ర పురావస్తు శాఖలు దేశంలో ప్రతిఏటా ‘వారసత్వ వారం’ (హెరిటేజ్ వీక్)ను కూడా నిర్వహిస్తున్నాయి. అయితే వర్తమానంలో బాధ కల్గించే విషయం ఒకటుంది… ఇప్పటికే మన అపూర్వ వాస్తు-శిల్ప సంపద విదేశీ దాడుల్లో నలిగి, కొంతరూపు కోల్పోయింది మరి కొంత విదేశాలకు తరలిపోయింది. పోయింది పోగా ఆలనా పాలనా లేకుండా ఎన్నో శిల్పాలు చెల్లా చెదురుగా పడివున్నాయి. వెలకట్ట లేని అపూర్వ శిల్ప, పంచలోహ విగ్రహాలు అంతర్జాతీయ ముఠాల ద్వారా విదేశాలకు తరలిపోతున్నాయి.
మన జాతి గొప్పది. మన శిల్పం గొప్పది. అమరావతి మనది. అజంతా మనది. ఆంకర్‍వాట్‍లో అంగణ్ణా మణ్ణిని మన శిల్పులే తీర్చిదిద్దారు. వీటి గొప్పతనం మనది అని డంబాలు కొట్టడమే నేర్చుకున్నాం గాని, మన పూర్వ కళాస్వరూపాలను ప్రాణపదంగా కాపాడుకోవడం నేర్చుకోలేకపోయాం.
అమరావతి పాలరాతి ప్రతిమలు, చంద్ర శిలలు, బుద్ధుని పాదాలు, నాగశిల్పాలను విచ్చల విడిగా మేలురకం సున్నం కోసం గతంలో కాల్చివేసారు. ఖజురహో దేవాలయ శిల్పాలను మూల ప్రతిమల నుంచి ఛేదించి, విదేశాలకు తరలించారు. బీహారులోని నలందా మ్యూజియం నుంచి ఏడు బుద్ధ విగ్రహాల శిరస్సులను ఖండించి విదేశాలకు చేరవేసారు. తమిళనాడుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘నటరాజ పంచలోహ విగ్రహం’ 75 లక్షల రూపాయలకు అమెరికాలోని బోస్టన్ మ్యూజియంకు అమ్ముడుపోయింది. మధ్యప్రదేశ్‍లోని విష్ణువు, బుద్ధ ప్రతిమలు విదేశాలకు తరలిపోయాయి.
ఎన్నో అమూల్య తాళపత్ర గ్రంథాలు పూజా మందిరాల్లో పురావస్తు ప్రదర్శన శాలల్లో వెలుగు చూడకుండా పాలిపోతున్నాయి. జోతిష్య, గణిత -వాస్తు, వ్యాకరణ, ఆయుర్వేద, ఖగోళ మొదలగు శాస్త్రాల అమూల్య విషయాలు ఈ గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని వెలుగులోనికి తేవడం మన కనీస ధర్మం.
ఆంధ్ర-తెలంగాణలలో 1960 నాటి పురావస్తు స్థలాల కట్టడాల పరిరక్షణ చట్టం కింద దాదాపు 500 కట్టడాలు ఉన్నాయి. వీటిలో శిలాయుగ చిత్రలేఖనాలున్న గుహాలయాలు, బృహత్ శిలాయుగపు సమాధులు, బౌద్ధ స్తూపాలు, ఆరామాలు, మధ్యయుగాల ఆలయాలు, కోటలు, ఇస్లాం- క్రైస్తవ మత నిర్మాణాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కోట, హన్మకొండ వేయిస్తంభాల గుడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం, క్రీ.శ. 8, 9 శతాబ్దాలకు చెందిన ఆలంపూర్ చాళుక్యుల దేవాలయాలు, హైదరాబాద్‍లోని కుతుబ్‍షాహీ సమాధులు, గోల్కొండ కోట, చార్మినార్, మక్కా మసీదు, మెదక్ చర్చి మొదలైన వివిధ కాలాల నిర్మాణాలు, వారసత్వ కట్టడాలకు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో గుర్తింపు పొందడానికి అర్హత వుంది.
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది ఒడ్డున ఉన్న శ్రీముఖలింగం దేవాలయాలు, శాలిహుండాం బౌద్ధ నిర్మాణాలు, అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయం, విజయనగరం జిల్లాలోని రామతీర్థం, విశాఖ జిల్లాలో బుద్ధుని ధాతువులు లభించిన బావికొండ, తొట్ల కొండ మొదలైనవి చార్రితక వారసత్వ నిర్మాణాలే! సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు లోయ, బొర్రా గుహలు ఒక మిలియన్ సంవత్సరాల నాటివి. మనోహర సుందర ద•శ్యాలు ఉన్న ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి అనువైనదిగా ఉంది. విశాఖపట్నానికి 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొర్రా గుహలు సుమారు 500 మీటర్ల లోతున ఉన్నాయి. భీముని పట్నంలోని డచ్ వారి సమాధులు, చర్చిలు క్రీ.శ. 1661-1770 సంవత్సరాల నాటి నిర్మాణాలు. గుర్తింపులేని ఎన్నో పురాతన నిర్మాణాలు రాష్ట్రమంతటా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఆయా ప్రాంతాల పార్లమెంటు అసెంబ్లీ సభ్యులు కలిసికట్టుగా కృషి చేసి – ప్రపంచ వారసత్వ కమిటీల దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వపరంగా మన పురావస్తు కేంద్ర రాష్ట్ర శాఖలు వీటి సంరక్షణకు కృషి చేస్తున్నాయి. కానీ అది చాలదు. ప్రజల సహకారం కూడా ఉండాలి. ఏమిటా సహకారం అంటే ప్రాచీన తాళపత్ర గ్రంథాలను ప్రభుత్వ పరం చేయాలి. దేవాలయాల మీద శాసనాలను సున్నం, రంగులతో కప్పకూడదు. రాగి, శిలా శాసనాల అక్షర రూపాలను పాడు చేయకూడదు. త్రవ్వకాలలో దొరికిన నాణేలు ఇత్యాది వస్తుసముదాయాలను సొంత లబ్ధికి కరిగించకూడదు. మన సంస్కృతీ చిహ్నం ఏదైనా సరే రూపు చెడగొట్టకూడదు. తరతరాలుగా వస్తున్న మన కళా సంపదను పరిరక్షించు కోవడం మన కర్తవ్యం. మన సంస్కృతిని, మన వారసత్వ సంపదను మనం పోగొట్టుకుంటే యావత్ జాతి జీవచ్ఛంగా మిగిలిపోతుంది.
విదేశాలలో మనకున్న కీర్తి మన సంస్కృతిని పురస్కరించుకొని పుట్టిందే! ఎన్నో శతాబ్దాల సంస్కృతీ సంపదకు వారసులుగా భారతీయులమైన మనం గర్వంగా నిలబడదాం. దీనికి ప్రభుత్వ సహకారం, ప్రజల సహకారం ఎంతైనా అవసరం అని గుర్తించాలి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మన సంస్కృతీ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించి మెలగుదాం.
- దక్కన్ హెరిటేజ్ అకాడమీ,
ఎ : 8686664949