ఎర్త్ ఫస్ట్


గేలార్ట్ నెల్సన్‍ 1970ల్లో ధరిత్రి దినోత్సవం ఒకటి కావాలని ప్రతిపాదించాడు. దిస్కాన్సిన్‍ సెనేటర్‍గా నెల్సన్‍కి ఉన్న అసంతృప్తి లోంచి ‘ఎర్త్డే’ అనే భావన పుట్టింది. పర్యావరణం గురించి రాజకీయాలుగానీ మీటాయీ కానీ పెద్దగా పట్టించుకోని కాలాన ఎర్త్డే పట్టుకొచ్చింది. తదాదిగా ప్రతి ఏటా ఏప్రిల్‍ 22ను ఎర్త్డేగా పాటించటం జరుగుతోంది. ఇది ప్రతి ఏటా జరుగుతూ ఉన్నదే. ఎర్త్డేను ఎందుకు పాటించటం. ఎందుకు జరుపుకోవటం అనే ప్రశ్నలు ఎప్పటికీ విలువైనవే. ఈ ఘటన ఒక అంశాన్ని మనం గుర్తుంచుకునేలా చేస్తుంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ హిత దృష్టిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి.
మొదటి ఎర్త్డే ఏప్రిల్‍ 22, 1970లో పాటింపబడింది. ఇంచుమించుగా అర్థ శతాబ్ది కాలం గడిచిపోయింది. రెండువేల సంవత్సరం నాటికి మానవ జనాభా 3.7 బిలియన్ల నుండి ఆరు బిలియన్లకు పెరిగింఇ. అంటే 62% పెరుగుదల. ప్రతి రోజూ 46 మిలియన్ల బ్యారెల్స్ ఇంధన వాడకం 73 మిలియన్లకు పెరిగిపోయింది. సంవత్సరానికి 34 ట్రిలియన్‍ క్యూబిక్‍సీటీ సహజవాయువుల వెలికితీత 95 ట్రిలియన్లకు పెరిగి పోయింది.


బొగ్గు తవ్వకాలు 2.2 బిలియన్‍ మెట్రిక్‍ టన్నుల నుండి 3.8 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మోటార్‍ వాహనాల సంతతి 246 మిలియన్ల నుండి మూడింతలుగా పెరిగి 730 మిలియన్లయ్యింది. ఎయిర్‍ ట్రాఫిక్‍ పెరిగింది ఆరింతలుగా. కాగితం తయారీ కోసం వృక్షాలను వినియోగించటం రెండింతలు పెరిగి ప్రతియేటా 200 మిలియన్ల మెట్రిక్‍ టన్నులయ్యింది. మానవ కార్బన్‍ ఉద్దారాలు 3.9 మిలియన్‍ మెట్రిక్‍ టన్నుల నుండి సాలీనా 6.4 మిలియన్లకు పెరిగిందని ఒక అంచనా. భూతాపాలు, భూ ఉష్ణోగ్రతలు పెరిగాయనేది కూడా కటువైన వాస్తవం. ఇక అంతరింపుకు గురవుతున్నవాటి వృద్ధి రేటు గడిచిన 65 మిలియన్‍ సంవత్సరాలలో ఎన్నడూ సంభవించనటువంటి విధంగా పెరుగుతున్నది. సగం అడవులు అంతర్థాన మయ్యాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం పేద ధనిక దేశాల మధ్య వ్యత్యాసం, అంతరాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి ఏటా 18 ఏళ్ల లోపు ఆడపిల్లలు గ్లోబల్‍ సెక్స్ట్రేడ్‍లో 1.2 మిలియన్ల మేరకు బాధితులవుతున్నారు. వంద మిలియన్ల మంది పిల్లలు నిరాశ్రయులై ఇళ్లు లేక వీధుల్లోనే నిద్రపోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది.


ఇటువంటి గణాంకాల జాబితా ఇంతటితో ముగిసేది కాదు 1970ల నుండి 2000 నాటికి పరిస్థితి ఈ విధంగా ఉంటే గడిచిన రెండు దశాబ్దాలలో మరింత పెరిగి ఉంటుందనేది స్పష్టం. ప్రపంచ మానవాళి పర్యావరణ అంశాలను అయితే విస్మరించైనా ఉండాలి లేదా సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోయైనా ఉండాలి. అభివృద్ధి, ప్రగతి లాంటి మాటలు ఒకప్పుడు ఆశను ధ్వనించేవి. ఇప్పుడవి విధ్వంస సూచకాలుగా మారిపోయాయి. పాశ్చాత్య పారిశ్రామిక ప్రపంచం ఇంతకు ముందు తరాలు కనలేనంత, ఊహించలేనంత సమృద్ధిని సాధించాయి. సంపదలను పోగు చేశాయి. కానీ, ఏ మూల్యం చెల్లించబట్టి ఈ సమృద్ధత వచ్చి చేరిందో ఆలోచించవలసిన సమయం వచ్చింది. అసలు ఇప్పుడు రావటం కాదు. ఎప్పటి నుంచో మానవాళి పర్యావరణ హితంగా, మితంగా సర్వజన శ్రేష్ఠంగా జీవించే జీవన విధానాలను అనుసరించ వలసి ఉండగా తద్భిన్నంగా జరిగింది.


1970ల తరువాత ప్రపంచ మానవాళి అభివృద్ధికి పరిమితులు అనే నినాదంతో ఒక అవగాహనను ముందుకు తేగలిగింది కానీ, దానిని కచ్చితంగా పాటించటంలో మాత్రం విఫలమైంది. అభివృద్ధిని పరిమితం చేసుకోవటం అనే మాట అధికార, రాజకీయ సంభాషణల నుండి నిషేధించబడింది. ప్రస్తుతం వ్యవస్థలో కొనసాగుతున్న అంతర్గత తర్కం నిర్ణయాత్మకంగా నిరూపిస్తున్న అంశం ఏమంటే ‘అభివృద్ధి’ / పెరుగుదల అనేది కొద్దిమందికే సంపదను పెంపొందింపజేసేదిగానూ, ఎక్కువ మందికి దుర్భర దారిద్య్రాన్ని, పేదరికాన్ని పెంచేదిగానూ మార్చబడింది. ఇది విచారించదగ్గ విషయం. అభివృద్ధి లేదా పెరుగుదల అనేది నాగరికతకున్న సహజ పునాదులను విధ్వంసపరిచేదిగా నిర్వచింపబడుతున్న విషయం గమనించాలి. ఈ ప్రపంచ మొత్తాన్ని మనం గనుక ఒక జీవి లేదా ప్రాణిగా భావించి నట్లయితే, సునిశితంగా పరిశీలించేవారు ఎవరైనా ఈ పెరుగుదల అనేది ఒక క్యాన్సర్‍లాంటిదని తేలికగానే గుర్తించగలుగుతారు. సకాలంలో గుర్తించి దీనికి చికిత్స అందించకపోయినట్లయితే ఈ క్యాన్సర్‍ మానవ సమాజం మొత్తాన్ని కబళిస్తుందని చెప్పగలుగుతారు. అంతే కాదు, మానవ జాతి అంతరించి పోవటానికి సంబంధించి పలు ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి.


ఒక విషయం సరైన పద్ధతిలో అర్థం చేసుకోవలసి ఉంది. అదేమంటే పెరుగుదల / అభివృద్ధి అన్నది నియంత్రణలో ఉండేది కాదు. అనియంత్రితం. ఈ నిర్నిరోధక పెరగుదల మానవ అస్తిత్వానికి అవసరమైన సహజ భూమికలను, ప్రాతి పదికలను అస్థిరపరచటమే కాకుండా వాటిని ధ్వంసం చేస్తుంది. ఒక వేళ మనం ప్రపంచ మానవాళిగా మనుగడ సాగించగలగాలంటే ప్రస్తుతం అమలులో ఉన్న కొనసాగుతున్న సామాజిక క్రమాన్ని మార్చుకోవాలి.


అయితే ఇంతగా నియంత్రించ వీలులేనంత అభివృద్ధి ఎందుకు సాధించబడింది. ఈ అదుపు చేయలేని పెరుగుదల ఎవరికోసం జరిగిందనేది కూడా లోతుగా ఆలోచించవలసిన అంశం. పర్యావరణానికి జరుగుతున్న హాని ప్రతి రోజూ పత్రికలలో పతాక శీర్షికగా వెలువరించబడాల్సిందే. విద్యలో ప్రతి స్థాయిలో పాఠ్యాంశంగా బోధింపబడ వలసిందే. అటువంటిదేమీ జరుగుతున్న దాఖలాలు లేవు. మానవాళి మొత్తంగానే ఆత్మహత్యా సదృశ్య ఏలుబడిలో ఉంది. పర్యావరణ సంక్షోభం, హాని అనే కటువైన సత్యం లేదా వాస్తవం గురించి వ్యవస్థాగత చర్యలు, ప్రతిఫలనాలు, ప్రతి స్పందనలు ముమ్మరంగా వెలువడాలి. వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం ప్రకృతి, పర్యావరణాలపై దాడి చేస్తూ ఉంటే హేతుబద్ధంగా దీనిని వివరించే చైతన్యం కొరవడింది. ఈ స్థితిని మార్చడానికి కావలసిన ప్రణాళిక కూడా పెద్దగా ఏమీ లేకుండా పోయింది.


మానవులకు ప్రకృతికి మధ్య ఉండవలసిన సమతూకపు సంబంధాలు భయంకంగా దెబ్బతిన్నాయి. పర్యావరణ శరణార్థులు ప్రతిఏటా కరువు కాటకాల వల్ల, వరదలు, అడవులు అంతరించటం భూసార క్షీణతల వల్ల పెరుగుతూనే ఉన్నారు. 1999లోని ఒక నివేదిక ప్రకారం యుద్ధం కారణంగా ఎంతమంది విస్థాపితులయ్యారో అంతకు మించి విస్తాపితులు కావటం జరుగుతూ ఉన్నదంటూ రెడ్‍ క్రాస్‍ సంస్థ తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలు విధ్వంసాల వల్ల 58% మేరకు ప్రపంచంలో పర్యావరణ శరణార్థులు పెరుగుతూ ఉన్నారు. పెరిగే పేదరికం, దారిద్య్రం పర్యావరణ సమస్యలుగా రూపుదిద్దుకున్న గ్లోబల్‍ వార్మింగ్‍ అడవులు అంతరించిపోవటం, పట్టణీకరణలు, నగరాల విస్తరణ తదితరాలన్నీ కలిసి మరింత భీకర విధ్వంసాలకు హేతువులుగా నిలిచిపోనున్నాయి.


పర్యావరణ సంక్షోభాలు ఆగామికాలాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. పెట్టుబడి ఉత్పత్తి విధానాన్ని శాసిస్తున్నది. పెట్టుబడిదారి వ్యవస్థ ఉత్పత్తి ద్వారా ఉనికిలో ఉంటుంది. అది పునరుత్పత్తి, భద్రత, పెట్టుబడి విస్తరణల ద్వారా మనుగడలో ఉంటుంది. జరుగుతున్న సకల సంక్షోభాలకు ప్రబల కారణం పెట్టుబడి మాత్రమే. పెట్టుబడి వృద్ధి పొంది విస్తరించే కొద్దీ ఆ మేరకు సంక్షోభం కూడా పెరుగుతుంది. నాగరికత, ప్రకృతి అన్నీ విధ్వంసాలకు గురవుతాయి. పూర్వమెన్నడూ లేనంతగా ప్రస్తుతం ప్రపంచాన్ని పెట్టుబడి పరిపాలిస్తున్న విషయమూ మనమందరమూ ఎరిగినదే. కాబట్టి ప్రకృతికి, ప్రపంచ మానవాళికి పప్రథమ శత్రువుగా మనం భావించవలసి ఉంది.


పర్యావరణ సమస్యలు ఎప్పుడూ సరికొత్త ప్రశ్నలను సంధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వారసత్వంగా మనకు అబ్బిన ఆలోచనా పద్ధతులను, వాదనలను పర్యావరణ సంక్షోభాలు ప్రశ్నిస్తూనే ఉంటాయి. భూమండలం మునుపెన్నడూ లేనంతగా పర్యావరణ పరంగా క్షీణ దశకు చేరుకుంటున్నప్పుడు కొత్త భావనలు సృజించబడాలి. కొత్త ఆలోచనలు ప్రతిపాదింపబడాలి. సరికొత్త ఆచరణకు కూడా పూనుకోవాలి. అదే విధంగా కొత్త అవగాహనా సాధనాలను కూడా మనమే సృజించు కోవాలి. 1970లో నెల్సన్‍ ప్రతిపాదించిన ఎర్త్డే అట్లాంటి వాటిల్లో ఒకటి.


మానవులందరం ఉమ్మడిగా కలిగి ఉన్నది భూమి మాత్రమే. ఈ భూమిని కాపాడుకోవటంలో ప్రతి ఒక్కరూ చేయదగిన కృషి ఎంతయినా ఉంది. ‘వ్యర్థం కావటాన్ని చూసినప్పుడు నా కొక్కడికే ఆగ్రహం వస్తుంది’ అని ఒక నినాదం. నిజానికి ఈ నినాదం తరచి చూసిన కొద్దీ వ్యర్థాల గురించి ఎంతోకొంత ఆలోచనను కలిగిస్తుంది. ‘నీరు వృధా చేయరాదు’ అనే సూక్తి నీటి ఎద్దడి అధికంగా ఉన్నచోట ఒక మానవ ఉద్వేగాన్ని, సంవేదనను కలిగిస్తుంది. కదిలిస్తుంది. అదొక అవగాహనకు, చైతన్యానికి దారినిస్తుంది. తద్వారా ఆచరణకు పురికొల్పుతుంది. ‘కన్నీళ్లు వృధా చేయరాదు’ అన్నప్పుడు ఒక విధమైన ఉద్వేగానికి గురవుతాం. ‘నెత్తుటి కన్నీరు వృథా కాకూడదు’ అన్నప్పుడు మరొక ఉద్వేగ స్థితి కలుగుతుంది. నెల్సన్‍కు 1970లో వచ్చిన ఆలోచన పర్యావరణ పరిరక్షణకు మద్ధతుగా నిలిచే ఉద్యమమైంది. 193 పైగా దేశాలకు ఎర్త్డే నెట్‍వర్క్ విస్తరించింది. ఈ భూమండలాన్ని కాపాడటం ద్వారా మనిషి తనను తాను కాపాడుకోగలుగుతాడు. ఒక మొక్కనాటడం నుండి మొదలై భిన్న విధాలుగా మనపర్యావరణ చైతన్యం సార్థక ఆచరణగా రూపొందించుకోవచ్చు. ఆ దిశగా అడుగులు పడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా పెద్ద ఎత్తున కదలిక తెచ్చింది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‍ కుమార్‍ చేస్తున్న ప్రయత్నాలు ఈ కోవలోవే.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *