మన భద్రత మన చేతుల్లోనే…

ప్రకృతిని ఎంతగా వినియోగించుకుంటే నాగరికత అంత అభివృద్ధి చెందుతుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటుంటారు. ప్రకృతిని వినియోగించుకునే విధానం నాగరికత అభివృద్ధిని నిర్ణయిస్తుంది. ఆ జీవిత విధానాలనే సంస్కృతి అంటారు. ప్రకృతి అనేక సహజ నిర్మాణాలతో కూడుకొన్నదే అయినా నాగరికత అభివృద్ధి చెందేకొద్దీ దాని నిర్మాణ రూపాలు మారిపోతాయి. వినియోగం అనేదానిలోనే విధ్వంసం దాగి ఉంటుంది. సమతుల్యతను భంగపరుస్తుంది. ప్రకృతిలో సంభవించే ఈ అసమతుల్యతనే పర్యావరణ సంక్షోభం అంటాం. దీన్ని నివారించడమే పర్యావరణ పరిరక్షణ. ఈ పరిరక్షణ అనేది రోజువారీ జీవితంలో కొనసాగే నిరంత పక్రియ. రోజువారీ చర్య ఏకరీతి (మొనాటనీ) కి దారి తీస్తుంది. దీన్నించి బయటకి లాగి ఒక స్ఫూర్తినిచ్చేవే ‘‘దినోత్సవాలు’’. ఇవి ఆయా విషయాలను బట్టి, ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ దినోత్సవాలుగా రూపొందుతాయి.


ఈ నెలలో మనకి ప్రధానంగా రెండు ప్రపంచ దినోత్సవాలున్నాయి. ఏప్రిల్‍ 18న అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం (వరల్డ్ హెరిటేజ్‍ డే). ఏప్రిల్‍ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవం (ఎర్త్ డే).


అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ గురించి ప్రజలకు వీటి ప్రాధాన్యతను వివరించి, అవగాహన కల్పించి, పరిరక్షణా స్ఫూర్తిని కలిగించడమే ధ్యేయంగా వరల్డ్ హెరిటేజ్‍ డే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 800 పురాతన కట్టడాలు, స్థలాలను గుర్తించి వాటిని పరిరక్షిస్తున్నారు.
మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా ‘ఆర్కియాలజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా’ అనే సంస్థ మనదేశంలోని చారిత్రిక కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన తెలంగాణ ప్రభుత్వం పురాతన కట్టడాల పరిరక్షణ కోసం చట్టం చేయడమే కాక తెలంగాణ వారసత్వ సంపదను కాపాడే అనేక చర్యలు తీసుకుంటుంది. రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో గుర్తింపు పొందడానికి విశేష ప్రయత్నాలు చేస్తుంది. నిజానికి మన చార్మినార్‍, కుతుబ్‍షాహీ సమాధులు, గోల్కొండకోట, కోటిలింగాల, మెదక్‍ చర్చి ఇవన్నీ అర్హత వున్నవే.
‘ఎర్త్ డే’ను ప్రపంచ వ్యాపిత పర్యావరణ సంక్షోభ నివారణకు గేలార్డ్ నెల్సన్‍ ప్రతిపాదించారు. 1970 ఏప్రిల్‍ 22 నుంచి ఈ ఎర్త్డే ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు. ముందు మనం చెప్పుకున్నట్లు ప్రకృతి విధ్వంసం పలు విధాలుగా, పలు కారణాల వల్ల జరుగుతుంది. మానవ అవసరాలు (నెసెసిటీస్‍), సౌకర్యాలు (కంఫర్టస్) గా, విలాసాలు (లగ్జరీస్‍) గా మారిన కొద్దీ ఈ అవసరాలు తీర్చే గని ప్రకృతి మాత్రమే కనుక, దానిని వినియోగించే క్రియలు నిరంతరం విపరీత ధోరణులకు దారి తీయడంతో ఏర్పడిన సంక్షోభమే నేటి వర్తమానం.


ఈ సంక్షోభ నివారణకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు రోజువారీ ప్రయత్నాలు చేయాలి. ప్రజలు పర్యావరణానికి హాని చేయని, అందరికీ మంచి జరిగే జీవన విధానాన్ని అనుసరించాలి. ఆడంబరాలకు చోటివ్వని సౌకర్యవంతమైన జీవితం కోసం కృషి చేయాలి. అవసరాలకు పరిమితులు విధించుకోవాలి. ముఖ్యంగా పత్రికలు, మీడియా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సమాచారాన్ని, కార్యాచరణ చైతన్యాన్ని ప్రజలకు అందించాలి. వివిధ సామాజిక సంస్థలు ఎప్పటికప్పుడు వ్యవస్థాగత చర్చలు జరపాలి. వాదనలు ప్రతివాదనలు ప్రచారం చేయాలి. పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచీ అవగాహన కలిగించాలి.


ఇవన్నీ ప్రస్తుతం కరోనా నేపథ్యం నుంచి ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణ ఎంత అవసరమో మరింత బాగా అర్థమై మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *