ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం!



గత 6వ కథనంలో శాస్త్రీయ పద్ధతి గూర్చి, త్యాగనిరితితో గూడిన శాస్త్రజ్ఞుల పరిశోధన గూర్చి తెలుసుకున్నాం. ఇదంతా ఊహలతో కూడుకున్నది కాదని, శూన్యంలో జరిపేది అంతకన్నా కాదని గుర్తించడం జరిగింది. ఈ ఆలోచనలు, పరిశోధనలు భూమి ఆధారంగా, భూమి చుట్టూ ఆవరించిన వాతావరణం, పర్యావరణం, జీవావరణం, నేల, నీరు, గాలి తదితర అంశాలతోటే అనుసంధానమై వుంటాయి. వీటికి అతీతంగా ఏ పరిశోధన, పరిశీలన జరగదు. గ్రహాంతర పరిశోధనలు కూడా దాదాపు ఈ నేపథ్యంలోనే వుంటాయి. కాబట్టి, భూగోళమే ఓ విధానాత్మక శాస్త్రీయ క్షేత్రంగా గుర్తించాలి. ఈ భూమి, వాతావరణం, జీవం ఏర్పడిన విధానాల్ని మొదటే చూసాం. అయితే, ఈ భూమి ఇప్పుడున్న విధంగానే మొదటి నుంచి వుందా లేక మార్పులకు గురైందా, భవిష్యత్తులో ఇప్పుడున్న విధంగానే వుంటుందా అనే అంశాల్ని తెలుసుకోవాలి.


దాదాపు 15వ శతాబ్దం దాకా, భూమి బల్లపరపుగానే వుందన్న భావనతో వున్న సమాజం, ఇది దేవుని సృష్టి అనే భావించేది. ఇప్పటికి ఈ భావనలు విద్యాధికుల్లో కొనసాగడం గమనార్హం. భూమి గుండ్రంగా వుండి సౌరకుటుంబంలో ఇదో భాగమని, సూర్యుడి చుట్టే భూమి భ్రమణం చేస్తుందని కోపర్నికస్‍ చెప్పేదాకా, గ్రహణ చల సిద్దాంతాన్ని కెప్లర్‍ ప్రతిపాదించే దాకా, భూమి బల్లపరుపుగా వుందని ఏదో ఆధారంపై (మనం ఆది శేషుడు అని నమ్ముతాం) వుందని భావించేవారు. గెలీలియో లోలకం కనిపెట్టిన తర్వాత భూమి గుండ్రంగా వుందనే విషయం తేలిపోయింది. సముద్ర ఒడ్డుకు చేరుకునే ముందు, పడవ పొగ, పొగగొట్టం, తెరచాప, తర్వాత పూర్తి పడవ కనపడుతుందని తెలుసుకునే పాఠాన్ని ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నది తెలిసిందే!


అయినా, ఈ భూమి గూర్చి అనేకమైన అర్థంకాని ప్రశ్నలు మనను వెంటాడుతూనే వున్నాయి. మూడోవంతు నీటితో కూడుకున్న భూగోళం, ఒక భాగమే భూభాగాన్ని కల్గిన భూమి ఎలా ఏర్పడిందనేది ఓ ప్రశ్న! అలాగే యావత్‍ భూభాగమంతా ఒకే తీరుగా కాకుండా ధృవప్రాంతాలు మంచుతో, భూమధ్య భాగం వేడితో, ఎత్తైన పర్వతాలు తిరిగి మంచుతో ఎలా వుంటాయనేది కూడా చాలామందికి అవగతం కాదు. ఎత్తైన పర్వతాలు, కొండలు, గుట్టలు, లోయలు, నదులు, మైదానాలు, ఎడారులు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా తికమక ప్రశ్నలే! ఖాతాలు, సముద్రాలు, మహా సముద్రాలు ఆవిర్భవించిన తీరు అబ్బురపరుస్తుంది. నేలపైన చిత్తడి, బురద, ఊబి నేలలు, మహారణ్యాలు, సతతహరిత అరణ్యాలు, కోనిఫర్‍లు, టండ్రాళ్ళు ఏర్పడిన విధం వైవిధ్య భరితంగా తోస్తాయి. వీటి గూర్చి ఎంతగా తెలుసుకున్నా ఏదో ఒక శేషప్రశ్న మిగిలి పోతూనే వుంటుంది.


భూమియే ఓ వ్యవస్థ (The Earth as a System) :

అయిదు దశాబ్దాల క్రితం మాత్రమే భూగ్రహం యొక్క సుందర దృశ్యాన్ని చూసామంటే ఆశ్చర్యం వేయవచ్చు. మన చందమామ కథలు, చంద్రునిలో వృక్షమని, ఆ వృక్షం కింద ఓ ముసలావిడ వుంటుందనే కట్టుకథలు పటాపంచలం కావడం, ఈ దృశ్యాన్ని ప్రపంచస్థాయి ఏ ఇతిహాసం, మత గ్రంథం, మన దగ్గరైతే వేదాలు చెప్పని, చూపని వైనం. 1969 జులై 16న అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని అట్లాంటిక్‍ మహాసముద్ర తీరంలోని కెనడి అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించబడిన అపోలో-ll ఉపగ్రహ వాహక నౌక 3,84,400 కి.మీ. ప్రయాణం చేసి జులై 20న చంద్రునిపై దిగి పంపించిన ఫోటోలతో భూమి అద్భుత దృశ్యాన్ని చూడడం జరిగింది. ఈ వాహక నౌకలో వెళ్ళిన నీల్‍ ఆర్మ్స్ట్రాంగ్‍ చంద్రునిపై మొదట కాలిడిన వ్యక్తి కాగా, రెండో వ్యక్తి ఆల్డ్రిన్‍ బజ్‍. వీరితోనే ప్రయాణించిన మైకెల్‍ కొలిన్స్ (Neail Armstrong/ Aldrin Buzz/ Michael Collins) నౌకలోనే వుండి సహకరించాడు. ఈ యాత్రకు ముందే సెప్టెంబర్‍ 13, 1954న చంద్రున్ని తాకి తిరిగివచ్చిన నౌకగా రష్యా నిర్మిత లూనా-2కు దక్కినా భూగ్రహ దృశ్యాల్ని చూసింది జులై 20, 1969 నాడే! అప్పన్నుంచీ మానవ మేధస్సు సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల గూర్చి, భూగోళం యొక్క లోతుపాతుల గూర్చి శోధించి, సాధించాలనే తపన పెరిగింది. అప్పటిదాకా అంతంత మాత్రంగానే తెలిసిన భూఖండాల సంబంధం, సముద్రాల మధ్యన గల ఆటుపోటులు, విభజన రేఖలు, వాతావరణం, జీవసంపదలు మరింతగా వెలుగులోకి వచ్చాయి.


ఈ సుందర దృశ్యాలతోపాటు భూగోళానికి వాటిల్లుతున్న ముప్పును, పెరుగుతున్న భూతాపం, తరుగుతున్న ఓజోన్‍పొర మందం, పెరుగుతున్న గ్రీన్‍హౌజ్‍ వాయువుల సమ్మేళనం ఆమ్లవర్షాలు, కాలుష్యం, అడవుల, ఖనిజసంపద తరుగుదల, పెరుగుతున్న సముద్ర మట్టాలు, కరుగుతున్న మంచు శిఖరాలు (Glacier), ధృవప్రాంతాలు, ఒకటేమిటి, దాదాపు యావత్‍ భూగోళ గుండెకోతను వీక్షించే అవకాశం దక్కింది. ఈ దృశ్యాలే భూమిని రక్షించాలనే ఆలోచనలకు పునాదులు వేసాయి. ఈ క్రియాశీల పరిశీలననే భూవ్యవస్థ శాస్త్రంగా (Earth System Science) వ్యహరిస్తారు. ఈ యాత్రతో గ్రహాల మధ్య దూరాన్ని దాదాపు కచ్చితంగా లెక్క గట్టగలిగితే, గ్రహాల గమనాన్ని సెకన్స్లో లెక్కించే విధానం తెలిసింది.


భూఖండికల ఆవిర్భావం – దశలు :
(Continental Formation – Phases) :

1988లో నాసా (National Aeuronatic space Administration) సలహా మండలి ఏర్పాటు చేసిన భూ వ్యవస్థ శాస్త్ర (Earth System Science) కమిటీ భౌగోళిక మార్పుల్ని అయిదు దశలలో జరిగినట్లు పరిశీలించింది. ప్రస్తుతం మనం చూస్తున్న భూ ఖండికలుగా ఏర్పడడానికి, వందల మిలియన్‍ సంవత్సరాలు పట్టినట్లు గుర్తించారు. ఒకప్పుడు వాయు రూపంలో, తర్వాత మంచుగా, నేలగా, నీరుగా ఏర్పడుతున్న క్రమంలో భూమి ఓ పెద్ద అయస్కాంత శక్తిని పొందినట్లు తేల్చారు.


వాయుగోళంగా ఉన్న భూగోళపు లోపలి పొరల మధ్యన అత్యంత వేడిమితో అగ్ని జనించడం, అవి ఉపరితలం వైపు విరజిమ్మడం, (mantle explasion) అవి స్థానికంగా తక్కువకాలం ప్రభావం చూపినా, విశాల ప్రాంతాల్లోని ధూళిచే, వాయువులచే మిళితమై దీర్ఘకాల ప్రభావాన్ని చూపినట్లు, ఇవి వందల మిలియన్ల సంవత్సరాలపాటు (అప్పటికీ కాల గతులు లేవు) దహించబడడంతో ఘనపదార్థ నేలగా మారినట్లు గుర్తించారు. ఇలా ఏర్పడిన నేలకు, పటుత్వం పెరిగినకొద్ది, ఆకర్షణశక్తి సంతరించుకున్నట్లు, ఇదే అయస్కాంత శక్తిగా మారినట్లు పరిశీలించారు. కాలం గడిచిన కొద్ది ఘన పదార్థాల నేల మధ్యన కదలికలు, ఒత్తిడి పెరిగి నేల ఆకృతులలో అనేక మార్పులు జరిగినట్లు విశ్లేషించారు. ఈ క్రమంలోనే భూమిపైన వివిధ వాయువులు సమ్మేళనంగా మారడం, భౌతిక వాతావరణం ఏర్పడడం, నీటి ప్రాంతాలు రూపొందడం కనుమరుగు కావడం, పర్వతాల ఆవిర్భావం, తిరిగి ధృవప్రాంతాల మంచు ఖండికలు ఏర్పడడం, భూమి భ్రమణం చెందడం, సూర్యుని చుట్టూ పరి భ్రమించడంతో వాతావరణ మార్పులు సంభవించి, అతిశీతలం (Iceage) నుంచి ఉష్ణ మండలంగా మారడం, మంచు కరగడం, సముద్రాలు ఏర్పడడం, ఈ ప్రయాణంలోనే జీవం పుట్టడం, కదులుతున్న నేల ఖండికలతో జీవం విభిన్న ప్రాంతాలకు విస్తరించడం జరిగినట్లు వీరు తేల్చారు.
(తరువాయి వచ్చే సంచికలో)

  • డా।। లచ్చయ్య గాండ్ల, ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *