వెలిగేచీకటి


చేతికున్న వాచీలో టైం చూసుకొని వెహికిల్‍ స్పీడ్‍ పెంచాను. ఎంత స్పీడు పెంచితే మాత్రం ఏం లాభం… ముందర సిగ్నల్‍ దగ్గర అయిదునిమిషాలైన ఆగక తప్పదు. ఇలాంటి ఇంకో నాలుగైదు సిగ్నల్స్ దాటుకుంటే గానీ ఆఫీసుకి చేరుకోలేను. ప్చ్… ఎంత తొందరగా ఇంట్లోంచి బయటపడినా ఈ రోడ్లమీద ట్రాఫిక్‍ని తప్పించుకొని ఆఫీసుకు చేరుకునేసరికి ప్రతిరోజూ ఆలస్యమే. భగవంతుడా! అసలీ హైదరాబాద్‍లో ట్రాఫిక్‍ సమస్యకి పరిష్కారమే లేదా? ఎం.ఎం.టి.ఎస్‍.లూ, మెట్రో రైల్‍… ఎన్నైనా సరిపోనంతగా రోజురోజుకీ పెరుగుతున్న జనం, రోడ్ల మరమ్మత్తుల విషయంలో విఫలమవుతున్న అధికారులు… హు… ఎవర్ని నిందించి మాత్రం ఏం ప్రయోజనం!
ఆలోచనలతోపాటే వేగంగా డ్రైవ్‍చేసుకుంటూ ఆఫీసుకు చేరుకునేసరికి సమయం పదిన్నర… అంటే ఇవాళ కూడా అరగంట ఆలస్యం. బాస్‍కి మళ్ళీ ఏదో ఓ కథ అల్లి చెప్పక తప్పదు, లేదంటే ‘హాఫ్‍ డే సాలరీ’ కట్‍ అంటూ అనవసరంగా బీపీ రెయిజ్‍ చేసుకుంటాడన్న సంగతి గుర్తొచ్చి తొందరగా వెహికిల్‍ స్టాండ్‍వేస్తుండగా జేబులోని సెల్‍ఫోన్‍ రింగయింది… డిస్‍ప్లేలో చూశాను. ఛోటుగాడి స్కూల్‍ నుంచి ఫోన్‍.. మొన్నే కద యానివల్‍ ఫీజ్‍ పే చేశాను కద, మళ్ళీ వీళ్ళు ఫోనెందుకు చేస్తున్నట్టు అనుకుంటూ ఫోన్‍ లిఫ్ట్ చేసి,
‘‘హలో…’’ అన్నాను.
‘‘గుడ్మార్నింగ్‍ సర్‍.. ఉజ్వల కాన్వెంట్‍ స్కూల్‍ నుంచి మీ అబ్బాయి అనురాగ్‍ క్లాస్‍టీచర్‍ని మాట్లాడుతున్నాను’’ అవతల్నించి ఓ తీయని కంఠం.
‘‘గుడ్మార్నింగ్‍ టీచర్‍… చెప్పండి!’’ అన్నాను విషయమేమిటో అర్థం కాక.


‘‘ఇవాళ పదకొండు గంటలకు సెకండ్‍ క్లాస్‍ వాళ్ళకు పి.టి.ఎం. (పేరెంట్‍-టీచర్‍ మీటింగ్‍) ఉంటుంది. మీ అబ్బాయి సెకెండ్‍ క్లాస్‍ రిపోర్ట్కార్డ్ తీసుకోవడానికి మీ అబ్బాయితోపాటు మీరూ రావలసి ఉంటుంది…’’ అంది ఇంగ్లిషులో సౌమ్యంగా.
అప్పటికే ఆఫీసుకు అరగంట ఆలస్యంమైందన్న టెన్షన్‍లో ఉండగానే, మధ్యలో ఇదేమి గోల అన్న చిరాకుతో ‘‘ఏమిటి టీచర్‍! ఇప్పటికిప్పుడే ఫోన్‍ చేసి రమ్మంటే ఎలా రాగలం చెప్పండి. కనీసం ఒకరోజు ముందయినా ఇన్ఫర్మేషన్‍ ఇవ్వాలని తెలియదా మీ స్కూల్‍వాళ్ళకి?’’ అన్నాను.
దానికి అవతల్నుంచి తమ తప్పేమీ లేదన్నట్లుగా, ‘‘అయ్యో… అదేమిటి సార్‍.. నిన్ననే మీ మొబైల్‍కి మెసేజ్‍ పంపించాం… అంతేకాదు మీ బాబు స్కూల్‍ డైరీలో కూడా రెండ్రోజుల్నించి మెన్షన్‍ చేస్తూనే ఉన్నాం కదా… మీరు చూసుకోలేదా?’’ అన్న వివరణతో డీలాపడిపోయాను.
నిజమే! నెలాఖరు రోజులవడంతో ఆఫీసులో పని ఒత్తిడివల్ల నాలుగైదు రోజుల్నించి ఛోటుగాడి గురించి పట్టించుకున్నదే లేదు కదా అనుకుంటూ, ‘‘అవునా…? అయాం సారీ టీచర్‍.. నేను చూసుకోలేదు. సరే.. తప్పక అబ్బాయితో కలిసి వస్తాను’’ అంటూ ఫోన్‍ పెట్టేశాను.
ఎలాగూ ఆఫీసుకు లేటయ్యింది కదా.. ఇవాళ్టికి లీవ్‍ పెట్టేస్తే సరి అనుకుని ఆఫీసుకు ఫోన్‍ చేసి ఏదో కారణం చెప్పి ఇవాళ రాలేకపోతున్నానంటూ ఇన్ఫర్మేషన్‍ ఇచ్చి వెహికిల్‍ స్టార్ట్ చేసి వెనక్కి మళ్ళించాను.



ఇంటికెళ్ళి అనురాగ్‍ని తీసుకొని స్కూల్‍కి చేరుకునేసరికి సరిగ్గా పదకొండున్నర అయింది. అనురాగ్‍తో కలిసి లోపలికడుగుపెట్టగానే ఎదురుగా గులాబీ రంగు చీరలో, అదే రంగులో ఉండిలేనట్టున్న చిన్ని స్టిక్టర్‍ బొట్టుతో ఏయిర్‍ హోస్టెస్‍లా సన్నగా, నాజూగ్గా ఉన్న టీచర్‍ ఎదుర యింది. అలా వదిలేసిన పొడగాటి సిల్కీ హెయిర్‍తో, పెదవులకు లిప్‍స్టిక్‍ దగ్గర్నించి, చెవులకు దుద్దులూ, చేతులకు గాజులూ.. కాళ్ళకి చెప్పులూ అన్నీ మ్యాచ్‍ అయ్యేలా అందంగా అలంకరించుకున్న ఆమె రూపం ఎవరినైనా ఇట్టే ఆకర్షించేలా వుంది. అప్పటివరకు ప్రసన్నంగా వున్న ఆమె ముఖం ఎందుకో మమ్మల్ని చూడగానే కోపంగా ఎర్రబడింది.
చిరునవ్వుతో ఆమె దగ్గరికెళ్ళి విష్‍ చేయబోతుండగా మధ్యలోనే అడ్డుకుని.. వెయిటింగ్‍ రూం వైపు చూపిస్తూ ‘‘మీరు కాసేపు ఆ గదిలో వెయిట్‍ చేయండి. మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి’’ అంది సీరియస్‍గా.
ఆమె ఎందుకంత సీరియస్‍గా ఉన్నదో నాకేమీ అర్థం కాలేదు. వీడేమైనా తప్పుచేశాడా.. అన్న అనుమానంతో వాడి వంక చూశాను. టీచర్‍ తీరుకి భయపడినట్లున్నాడు పాపం. వాడి కళ్ళల్లో భయం స్పష్టంగా కన్పిస్తుంది. నెమ్మదిగా వెళ్ళి వెయిటింగ్‍ చైర్స్లో కూర్చున్నాం.
కూర్చోగానే ఛోటుగాడు, ‘‘డాడీ.. టీచర్‍ చాలా కోపంగా
ఉన్నట్లుంది’’ అన్నాడు చెవిలో గుసగుసగా.
‘‘అవును. ఎందుకంటావు? అన్నట్లు నీ రిపోర్ట్ కార్డులో మార్కులు బాగానే వచ్చాయి కదా?’’ అడిగాను నేను కూడా లోగొంతుకతో.
‘‘ఐ డోంట్‍ నో డాడ్‍.. నేనైతే చూడనేలేదు… నాకెలా తెలుస్తుంది చెప్పు?’’ అన్నాడు వాడు అమాయకంగా చేతులు తిప్పుతూ.
‘‘ఏమోరా ఛోటూ! మీ టీచర్‍ తీరు చూస్తుంటే, ఇవాళ నీతో పాటు, నాకు కూడా క్లాస్‍ పీకేటట్లుందనిపిస్తుంది’’ అన్నాను ఆవిడ బారినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ.


పదినిమిషాల తర్వాత అటెండర్‍ వచ్చి, ‘‘సార్‍! మిమ్మల్ని మేడమ్‍ గారు పిలుస్తున్నారు’’ అన్నాడు వినయంగా. ఛోటుగాడితో పాటు తన చాంబర్‍వైపు కదిలాను. గుమ్మం దగ్గర మమ్మల్ని చూడగానే, ‘‘రండి… కూర్చోండి..’’ అంది గంభీరంగా ఎదురుగా ఉన్న చైర్స్వంక చూపిస్తూ.
కూర్చున్నాను. ఛోటుగాడు నా వెనకే వాళ్ళ టీచర్‍కి కనిపించకుండా నక్కినక్కి నిల్చున్నాడు.
‘‘చూడండి! మీ అబ్బాయి అనురాగ్‍ మీద చాలా కంప్లయింట్స్ ఉన్నాయి. కాని, ముందుగా ఇతని ఎగ్జామ్స్, రిపోర్టుకార్డు సంగతి చూడండి. చూసిన తర్వాత ఇతనికి మేం ఏం నేర్పించాలో, ఎలా బోధించాలో మీరే తేల్చండి’’ అంటూ ఒక్కమాటలోనే సారాంశాన్నంతా వివరిస్తూ రిపోర్టుకార్డును నా ముందుకు తోసింది సీరియస్‍గా.
నాకిప్పుడు అర్థమయింది ఆమె ఎందుకంత కోపంగా ప్రవర్తిస్తుందో.
మౌనంగా రిపోర్టుకార్డు చేతిలోకి తీసుకొని సబ్జెక్ట్లవారీగా మావాడు సాధించిన మార్కుల్ని గమనిస్తుండగానే, ‘‘ముందు ఇంగ్లీష్‍ పేపర్‍ చూడండి. మీవాడు ఇంగ్లీష్‍లో ఫెయిల్‍ అయ్యాడు!’’ ఆవేశంగా అంటూ ఆన్సర్‍ పేపరును నాకందించింది.
పేపర్‍ని తీసుకొని మొదట్నించి చివరిదాకా పరిశీలించాక, మావాడి ముఖంలోకి చూశాను. బుద్ధిగా చేతులు కట్టుకొని అమాయకంగా నిల్చుని భయంగా చూస్తున్నాడు వాడు. పాపం వాడిని చూస్తే జాలేసింది. తలతిప్పి టీచర్‍ వంక చూశాను. ఆమె ముఖంలో ఎలాంటి మార్పులేదు. అదే సీరియస్‍నెస్‍తో నా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లుంది.
రాని చిరునవ్వుని ముఖానికి అతికించుకుని, ‘‘చూడండి టీచర్‍! ఆంగ్లభాష ఒక పరభాష. అంటే విదేశీ భాష. కనీసం వాడికిప్పుడు నిండా ఏడేళ్ళుకూడా లేవు. ఈ వయసులో వాడికి మాతృ భాషనే పూర్తిగా అర్థమై చావదు. ఇంకా ఇంగ్లీషంటారా? అదంతా పై తరగతుల్లో వాడే నేర్చుకుంటాడులే..’’ అన్నాను చాలా తేలికైన విషయంగా కొట్టిపారేస్తూ.


తనేమాత్రం ఊహించని ఇలాంటి నా సమాధానానికి అసలే కోపంతో ఉడికిపోతున్న ఆవిడ ముఖం మరింత అరుణవర్ణంలోకి మారసాగింది. దాంతో కుర్చీలోంచి ఆవేశంగా ముందుకు వంగుతూ, ‘‘అవును.. మీరన్నట్లు ఇంగ్లీషు విదేశీ భాష. అది పరభాషనే అనుకుందాం. మరి తెలుగు వాడి మాతృభాషనే కద! అయినా మీవాడు తెలుగులో కూడా ఫెయిల్‍ అయ్యాడు! దీనికేమిటి మీ సమాధానం?’’ అంటూ మా వాడి తెలుగు పేపర్‍ని నా ముందుకు తోసింది విసురుగా.
తీసుకొని చూశాను. చాలాచోట్ల ఒత్తులు, దీర్ఘాలు, పొల్లులు మరిచినట్లున్నాడు. దాదాపుగా తప్పులు కనిపించాయి వాడు రాసిన పేపర్‍లో.
మరోసారి వాడివంక చూశాను. పాపం వాడు ‘సారీ డాడ్‍.. క్షమించ’ మన్నట్టు దీనంగా చూస్తున్నాడు నావంక. పాపం పసివయసు లోనే వాడికిన్ని కష్టాలా అనిపించింది. వాడిపట్ల నాకు సానుభూతి పెరిగింది. అలాగని టీచర్‍ చెబుతున్నదాంట్లో కూడా తప్పేమీ కనిపించ లేదు.
‘‘మీరన్నది నిజమే టీచర్‍! తెలుగు మాతృభాషనే కాదనను. కాని అది చాలా కఠినమైన భాష. అంతేకాదు, తెలుగు భాష ధ్వని, ఉచ్ఛారణలపై ఆధారపడిన భాష. ఉచ్ఛారణ ఎలా ఉంటుందో, ఎలా పలుకుతామో అలాగే రాయాల్సి వుంటుంది. మీరు ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు కాబట్టి ఈవిషయం మీకు తెలియందేమీ కాదు. అన్నట్లు మీది ఇంగ్లీష్‍ మీడియం స్కూల్‍. మీ స్కూల్లో తెలుగులో స్పష్టమైన ఉచ్ఛారణతో బోధించగలిగే టీచర్లు ఎవరున్నారు చెప్పండి? అయినా మా వాడి తెలుగు పేపర్‍ చూస్తుంటే మీ టీచర్లు తెలుగు ఎంత బాగా బోధిస్తున్నారో అర్థమవట్లేదా…!’’ అన్నాను కాస్త ఘాటుగానే తప్పంతా వాళ్ళపైకే నెట్టేస్తూ.
దానికావిడ పిచ్చి కోపంతో రియాక్టవుతూ, ‘‘అయితే తప్పంతా మా టీచర్లదేనంటారు మీరు. మరయితే తరగతిలోని మిగతా విద్యార్థు లందరూ ఎలా…’’ అంటూ ఏదేదో వివరించబోతుంటే ఆవిడ వాక్యాన్ని మధ్యలోనే కట్‍చేస్తూ… ‘‘చూడండి టీచర్‍! క్లాసులోని మిగతా స్టూడెంట్స్ విషయం నేనెలా చెప్పగలను?’’ అన్నాను సీరియస్‍గా.


‘‘హలో సార్‍!.. ముందు చెప్పేది పూర్తిగా వినండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి. అంతేగాని, మధ్యలోనే అడ్డు కుంటూ, మీకు తోచినవిధంగా మీరేదేదో మాట్లాడేస్తూ మమ్మల్నీ, మా టీచర్లని దూషిస్తే ఎలా?’’ అంటూ ఇరిటేటింగ్‍గా దాదాపు అరచినంతపనిచేసింది టీచర్‍.
ఒక్క క్షణం సైలెన్స్గా ఆమె వంక చూసి, ‘‘ఓకే… చెప్పండి టీచర్‍! మీరేం చెప్పదలచుకున్నారో పూర్తిగా చెప్పండి. ఆ తర్వాతే నేను మాట్లాడతాను’’ అన్నాను శాంతంగా.
‘‘అయితే వినండి! ఇంగ్లీషులో, తెలుగులో మీ అబ్బాయి ఫెయిల్‍ అయినా మీరు సమర్థించుకున్నారు. ఓకే… కానీ మిగతా సబ్జెక్టుల్లో కూడా మీవాడు చాలా పూర్‍. ఇవాళరేపు పిల్లలు మొబైల్‍ ఫోన్స్, ల్యాప్‍టాప్‍లూ, కంప్యూటర్లో ఏవేవో గేమ్స్, యాప్స్ అంటూ, ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నారో తెలుసు కదా. కాని అనురాగ్‍ కంప్యూటర్‍ సైన్స్లో కూడా చాలా తక్కువ మార్కులు స్కోర్‍ చేశాడు. ఎందుకంటారు? ఇదిగో మీ వాడి కంప్యూటర్‍ పేపర్‍ ఎలా ఆన్సర్‍ చేశాడో మీరే చూడండి’’ అంటూ పేపర్‍ను నాకందించబోతుంటే వద్దని వారిస్తూ…
‘‘నో టీచర్‍! వాడి పేపర్‍ నేనేమీ చూడవలసిన అవసరం లేదు. కాని, ఒక్కటి చెప్పండి! సెకండ్‍ స్టాండర్డ్ పిల్లలకి ఏ రైమ్స్నో, మోరల్‍ స్టోరీసో, టేబుల్స్ నేర్పిస్తే సరిపోదా? ఈ వయసులో వాళ్ళకు కంప్యూటర్‍ పరిజ్ఞానం, మొబైల్స్ యూజ్‍ చేయడం అంత అవసరమంటారా? చిన్నపిల్లలు.. ఎప్పుడెప్పుడు లీజర్‍ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు గ్రౌండ్‍కెళ్ళి ఆడుకుందామా అని చూస్తారే తప్ప, క్లాస్‍రూముల్లో కంప్యూటర్లకి అతుక్కుపోయి కూర్చోవాలని ఎంతమంది పిల్లలు కోరుకుంటారు మీరే చెప్పండి?’’ అంటూ రివర్స్గా రియాక్టయాను.


నా మాటలతో ఆమె కోపం బహుశ… నషాలన్ని తాకి ఉంటుందన్న సంగతి ఆమె ముఖంలో మారుతున్న రంగుల్ని బట్టి అర్థమవుతుంది. కోపంతో అనురాగ్‍గాడి వంక చూసింది. వాడు భయంతో మరింత తల దించుకుని నేలచూపులు చూస్తున్నాడు.
చూపు మరల్చుకుని, టేబిల్‍మీదున్న పేపర్లను సర్దుకుంటూ, ‘‘హుఁ…! మీ అబ్బాయిని మీరింతగా వెనకేసుకొస్తుంటే ఇంక మేంమాత్రం ఏం చేయగలం. ఇదిగో ఇది మీ అబ్బాయి సైన్స్ పేపర్‍! అయినా.. మీకు చూపిస్తే మాత్రం ఫలితమేముంటుంది? దానికి మీ సమాధానమెలా ఉంటుందో నేనూహించగలను! ‘ఐనిస్టన్‍ కూడా చిన్నప్పుడు చాలా డల్‍ స్టూడెంట్‍. సరిగ్గా చదివేవాడు కాదు. ప్రతి క్లాస్‍లో రెండుమూడుసార్లు ఫెయిలయ్యేవాడంటూ, ఇలాంటివే ఏవో ఉదాహరణలు చెబుతారు అంతే కదా!’’ అంది నన్ను ఇమిటేట్‍ చేస్తున్నట్లుగా.
ఏదేమైనా మొత్తానికి నన్ను బాగానే అర్థం చేసుకున్నట్లుందని నాలో నేను నవ్వుకున్నాను.
కొద్దిక్షణాలు ఇద్దరి మధ్యా మౌనం ఘనీభవించింది.


రెండు నిమిషాల తర్వాత మావాడి గురించి మరిన్ని కంప్లైయింట్స్ ఏకరువు పెడుతూ- ‘‘ఒక చదువు విషయంలోనే కాదు, కనీసం డిసిప్లిన్‍గా ఉండడం కూడా తెలియదు మీ అబ్బాయికి. క్లాస్‍లో పక్కవాళ్ళతోనో, ముందూ, వెనకలవాళ్ళతోనో మాట్లాడుతూ చీటికిమాటికీ అందర్నీ డిస్టర్బ్ చేస్తుంటాడు. టీచర్‍ బయటికెళ్ళిందంటే చాలు బెంచీలపై ఇటునుంచి అటు, అటునించి ఇటు గెంతుతూ అందర్నీ ఆటలుపట్టిస్తుంటాడు. అబ్బబ్బ… నిజంగా వాడిని కంట్రోల్‍ చేయడం మా టీచర్ల వల్ల కావడంలేదంటే నమ్మండి’’ అంటూ వాడిపట్ల తనకున్న విసుగునంతా వెళ్ళగక్కింది.
వాడి అల్లరి గురించి వింటుంటే నాకు వాడిమీద కోపం రాలేదు. పైగా నా బాల్యం గుర్తుకొచ్చి ఈసారి పైకే నవ్వుకున్నాను. దాంతో ఆమెలో కోపం మరింతగా కట్టలు తెంచుకుని ఒక్కసారిగా బరస్టవుతూ, ‘‘చూడండి.. నేనింతగా మీ అబ్బాయిని గురించి మాట్లాడుతుంటే మీకు నవ్వులాటగా ఉందా? మీరెందుకిలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’’ అంటూ గట్టిగా నిలదీసింది.
‘‘ఇదిగో చూడండి టీచర్‍! పిల్లలన్నాక అల్లరిచేయడం సహజం. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వదిలిపెట్టండి. అన్నట్లు.. మీరొకటి మరిచిపోయినట్లున్నారు. ఇంతకీ మావాడి మ్యాథమేటిక్స్ పేపర్‍ సంగతేమిటి? మ్యాథ్స్లో మావాడి కెన్ని మార్కులొచ్చాయో మీరు చూపించనేలేదు’’ అన్నాను.
దానికావిడ మొహం తిప్పుకుంటూ, ‘‘హుఁ…! చూసిన పేపర్లు సరిపోలేదా? ఇంకా మాథ్స్ పేపర్‍ చూసిమాత్రం చేసేదేముందిలే’’ అంది గంభీరంగా.
‘‘అన్ని సబ్జెక్టుల పేపర్లు చూపించి ఆ లెక్కల పేపరొక్కటి ఎందుకు చూపించట్లేదు? అది కూడా చూపించండి. అందులో వాడెంత స్కోర్‍ చేశాడో నేను చూడాలి’’ అని పట్టుబట్టాను.


ఒక్కసారి తను అనురాగ్‍ వంక చూసింది. వాడు తలదించుకుంటూ మరింతగా నా వెనకగా జరిగాడు. మ్యాథ్స్ పేపర్‍ గురించి నేనలా పట్టుబట్టడంతో ఫైల్లోంచి తీసి, ఇవ్వాలా వద్దా అని సందేహిస్తూనే నా ముందుంచింది. చేతిలోకి తీసుకొని చూశాను. అయితే, అన్ని సబ్జెక్టులకంటే మ్యాథ్స్లో మార్కుల పరిస్థితి భిన్నంగావుంది. మ్యాథ్స్లో వందకి వంద శాతం మార్కులు సాధించాడు అనురాగ్‍.
టీచర్‍ వంక చూశాను. తనిప్పుడు నావంక చూడట్లేదు. ముభావంగా ముందున్న ఫైళ్ళోకి తలదించుకొని ఏదో చూస్తున్నట్లు నటిస్తుంది. దాంతో ఒక్కసారిగా నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది, ‘‘మావాడికి ఇంగ్లీష్‍ ఎవరు బోధిస్తారు?’’ అడిగాను సీరియస్‍గా.
నా స్వరంలోని తీవ్రతకి ఒక్కక్షణం ఉలిక్కిపడి, తేరుకుంటూ… మెల్లగా తలెత్తి ‘‘నేనే’’ అంది.
‘‘తెలుగు ఎవరు బోధిస్తారు?’’
‘‘నేనే’’ సమాధానమిచ్చింది.
‘‘మరి కంప్యూటర్‍ సైన్స్?’’
‘‘నేనే మీ వాడి మదర్‍ టీచర్‍ని. అది కూడా నేనే’’ అంది సూటిగా నావంక చూడలేక ఫైల్లోకి తలదూరుస్తూ.
‘‘అయితే ఇప్పుడు చెప్పండి. అనురాగ్‍కి మ్యాథమేటిక్స్ ఎవరు బోధిస్తారు?’’ అనగానే, తనేదో చెప్పబోతుంటే, మధ్యలోనే తనకన్నా ముందు నేను కుర్చీలోంచి విసురుగా లేచి నిలబడుతూ,
‘‘నేను… అవును… మా అబ్బాయికి ప్రతిరోజూ ఇంటిదగ్గర మ్యాథమేటిక్స్ ‘నేనే’ బోధిస్తాను’’ అన్నాను ఆవేశంగా ఊగిపోతూ.
నాలోని ఆవేశానికి టీచర్‍ భయంతో తలొంచుకొంటూ, ‘‘అవును నాకు తెలుసు’’ అంది నెమ్మదిగా!
‘‘మరయితే, గుడ్‍ టీచర్‍ ఎవరో మీరే తెలుసుకొండి. అయినా… అనురాగ్‍ మీరు చెబుతున్నంత డల్‍ స్టూడెంట్‍ ఏమీ కాడు. అలాగయితే మ్యాథ్స్లో వందకు వంద ఎలా సాధించగలిగాడు. వాడో వెలిగేచీకటి. వాడిలోని అంధకారాన్ని తొలగించి ఉజ్వలంగా తీర్చిదిద్దాల్సిన మీరు.. ఇలా అనవసరంగా లేనిపోని ఫిర్యాదులు చేయడం సరికాదు. ఇక వాడి అల్లరంటారా?… పిల్లలు పెరిగేకొద్దీ వాళ్ళ అల్లరి అదే తగ్గుతుంది. దానిగురించి మనమేమీ వర్రీ అవ్వాల్సిన పనిలేదు’’ అంటూ రెండు చేతులు జోడించి నేను ఛోటుగాడితో కలిసి బయటికి నడుస్తుంటే…
తను కూడా సీట్లోంచి విసురుగా లేచి కోపంతో కుర్చీని వెనక్కి నెడుతూ, ‘‘మీ తండ్రీ కొడుకుల సంగతి ఇవాళ మన ఇంటిదగ్గర తేలుస్తా.. మీరైతే ఇంటికి పదండి’’ అంటూ ఉక్రోషంగా గొణుక్కుంటూ మమ్మల్ని అనుసరించింది ‘శ్రీమతి నిశిగంధ టీచర్‍’.


మోని శ్రీనివాస్‍
ఎ : 9291223136, 9182931109

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *