(గత సంచిక తరువాయి)
గర్‍వాల్, కుమాన్ జిల్లాల ఆక్రమణ:
1814-15 గూర్ఖాలతో యుద్ధం చేసిన బ్రిటీషువారు ఖాడ్మండును ఆక్రమించాలనుకున్నారు. గూర్ఖాల ప్రతిఘటనతో సాధ్యంకాలేదు. కాని, గూర్ఖాల ఆధిపత్యం తక్కువగా వున్న గర్‍వాల్, కుమాన్ జిల్లాల్ని (నేటి ఉత్తరాఖండ్) బ్రిటీషు వారు చేజిక్కించుకున్నారు. వెంటనే విలియం వెబ్‍కు కుమాన్ ప్రాంతాన్ని, జాన్ హడ్‍సన్ (Hodgson)కు గర్‍వాలా ప్రాంతాన్ని అప్పజెప్పారు. వీరు 1816లో తమ సర్వేలను ప్రారంభించారు.
రాబర్ట్ మరణంతో ఆయన కుటుంబ బాధ్యతలతోపాటు, మిగతా సర్వే బాధ్యతల్ని హెన్రీ తిరిగి స్వీకరించాడు. అప్పటికే రాబర్ట్, వెబ్, జోన్స్, క్రాఫర్డ్లు సేకరించిన గణాంకాల్ని, ఇతర సమాచారాన్ని హెన్రీ క్షుణ్ణంగా పరిశీలించి, టిబెట్ పర్యాటకులు ఇచ్చిన సమాచారంతో పర్వతాలపై పరిశోధన, పరిశీలన అనే శీర్షికతో త్రైమాసికలో ఓ వ్యాసాన్ని రాసాడు.
నేపాల్ సరిహద్దులో వెబ్ సేకరించిన పరిశీలనల్ని రాబర్ట్ కొలెబ్రూక్‍కు అందించగా, రాబర్ట్ దాని ఎత్తును 8186.5 మీటర్లుగా నిర్దారించాడు. వెబ్ దానికి దవలగిరి అని స్థానిక పేరును సూచించగా, హిమాలయాల్లో గుర్తించబడిన రెండో శిఖరం ఇది. (మొదటిది చొమోలారి). హెన్రీ మరికొంత పరిశీలనతో దీని ఎత్తును 8533 మీటర్లని సవరించాడు. (ప్రస్తుత ఎత్తు 8.167 మీ) దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా పశ్చిమ దేశాల్లో, దక్షిణ అమెరికాలో గుర్తింపు పొందిన పర్వతాలకన్నా ఇదే నాడు ఎత్తైన శిఖరంగా వున్నా, యూరోపియన్స్ దీన్ని అంగీకరించలేదు. కాని మౌంట్ బ్లాంక్ ఎత్తు 300 మీటర్లు ఆటూ, ఇటు వున్నా గుర్తించారు.
పట్టుదల పెంచిన విమర్శ :
దవళగిరి ఎత్తుపై, వెబ్, హెన్రీల పరిశీలనపై త్రైమాసికలో వచ్చిన విమర్శకు ధీటుగా సమాధానం చెప్పాలని భావించిన వెబ్ త్రైమాసిక సిబ్బందిని తోడు రమ్మని కేదార్‍నాథ్ శిఖరాన్ని చేరుకున్నాడు. ఈ పర్వత శ్రేణి భూమధ్యరేఖకు ఉత్తరాన 28-38 డిగ్రీల అక్షాంశాల మధ్యన వుంది. భూమధ్యరేఖకు ఇంత దగ్గరలోగల పర్వతాలు మంచుమయంగా వున్నాయంటే, అవి నిజంగానే ఎత్తైన శిఖరాలనే భావన త్రైమాసిక సిబ్బందికి కలిగింది. తర్వాత వెబ్ యమునా నది ప్రారంభ స్థానాన్ని, దాని ఆవలగల ఆరు శిఖరాల ఉన్నతాల్ని కొలిచి టిబెట్‍కు చేరుకున్నాడు.
లాంబ్టన్ మౌల్యలేఖ త్రిభుజీకరణానికి భిన్నంగా నీరు మరిగే ఉష్ణోగ్రత పైన (పైకిపోయిన కొలది నీరు మరిగే ఉష్ణోగ్రత తగ్గుతుంది) ఆధారపడి ఈ శిఖరాల ఎత్తుల్ని నిర్ణయించారు. అయినా, కేదార్‍నాథ్ శిఖరాన్ని పాదరస భారమితి (అనార్థ్ర 1843లో రూపొందించ బడింది)తో కొలిచి దాని ఎత్తును 3657 మీటర్లుగా నిర్దారించాడు. వాతావరణ పరిస్థితులు, పీడనములు భారమితిపై ప్రభావాన్ని చూపడంతో శిఖరాల ఉన్నతాలు 100 మీటర్ల తేడాతో వుండేవి. దీంతో సంతృప్తి చెందిన వెబ్ తనపై, తన బాస్ అయిన రాబర్ట్పై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాడు. దీంతో 1822లో ప్రచురితమైన సర్వేలోని ముఖ్యమైన స్థానాలు, శిఖరాల అక్షాంశాలు, రేఖాంశాలు, ఎత్తులు అనే వ్యాసంలో వెబ్ ఇచ్చిన కొలతలే ఆధారంగా చూపారు.
గర్‍వాల్ సర్వే :
ఈ ప్రాంతంలో సర్వే ప్రారంభించిన హడ్‍సన్ త్రిభుజీకరణ చేసుకుంటూ ఉత్తరదిశగా వెళ్ళాడు. వీలుకాని చోట చక్రసాధనం (నడక సాధనం) వాడాడు. చుర్ పర్వత అక్షాంశ, రేఖాంశాలపై అనుమానం వచ్చి 1818లో దానిపై బురుజును నిర్మించి సహరాన్‍పూర్ నుంచి ముస్సోరికి, తూర్పునగల సురక్‍నందా నుంచి హిమాలయాల్లోని చిన్నా, పెద్ద శిఖరాల కోణాల్ని గుర్తించాడు. ఎవరెస్టు, హడ్‍సన్‍లు చుర్ పర్వతాన్ని మరో పరిశీలనా కేంద్రంగా ఎంచుకున్నారు.
హిమాలయాలు చూడడానికి అందంగా వున్నా గడ్డగట్టే చలి, నీరుపోస్తుంటే అలాగే నిలిచి పోవడంతో శిఖరాల్ని పరిశీలించడం, కొలతలు చేయడం చాలా ఇబ్బందితో కూడుకునేది. రోజుల తరబడి వేచి చూస్తేగాని కొలతలకు అవకాశం చిక్కేది కాదు. దీనికి తోడు పర్వతాల ద్రవ్యరాశి (mass), వడంబం (plumb)పై చూపే వికర్షణ, భూమి సాంద్రత (density) వల్ల కొలతల్లో తేడాలు వచ్చేవి. ఈ విషయంగా చుర్ పర్వతం వద్ద 36 సెకండ్లు, సహరాన్‍పూర్ వద్ద 15 సెకండ్ల వడంబం వికర్షణ వుంటుందని ఓ పరిశోధన తెలుపుతుంది. దీంతో హడ్‍సన్ కొలత చేసిన సహరాన్‍పూర్-చుర్‍ల మధ్యనగల 100 కి.మీ. మౌల్యలేఖ నిడివిలో 0.533 కి.మీ. తేడా వచ్చింది. దీనికి నిరాశ పడిన హడ్‍సన్ తిరిగి నేలపై మౌల్యరేఖను గుర్తించాలనుకున్నా, ఆరోగ్యం సహకరించక పోవడంతో ఈ పనిని సహ సర్వేయర్ జేమ్స్ హేర్బెర్ట్ (Herbert) చేపట్టి, హిమాలయాల మొదటి మౌల్యరేఖను కొలిచిన ఘనతను దక్కించుకున్నాడు.
అయినా, సహరాన్‍పూర్-చుర్-సురక్‍నందా త్రిభుజాన్ని మౌల్యలేఖ త్రిభుజీకరణంతో కలుపుతూ కొన్ని స్థానాల్ని సరిచేసాడు. చేర్పులతో జాబితాను రూపొందించి, 1822లో సర్వేలోని ముఖ్యమైన స్థానాలు, శిఖరాల అక్షాంశాలు, రేకాంశాలు, ఎత్తులు అనే శీర్షికతో త్రైమాసికంలో హడ్‍సన్ మరో వ్యాసాన్ని రాసి, అనేక శిఖరాల
ఉన్నతాల్ని వెలుగులోకి తెచ్చాడు.
ఇలా హడసన్, హెర్‍బర్ట్లు, వెబ్‍ల సహకారంతో గర్‍వాల్ – కుమాన్ ప్రాంత శ్రేణిలో 46 హిమాలయ పర్వత శిఖరాల స్థానాల్ని గుర్తించారు. ఇందులోని మూడు ఎత్తైన శిఖరాలకు A1, A2, A3 లుగా పేరు పెట్టారు. A2ను 7847 మీటర్ల ఎత్తుతో ఎత్తైన శిఖరంగా హెర్‍బర్ట్ ప్రకటించాడు. ఇదే తర్వాత నందాదేవి శిఖరంగా గుర్తించబడ్డది.
భూపరిమాణ శాస్త్రం (Geodesy)
భూమియొక్క ఆకృతిని, భూమధ్యరేఖకు, ధృవాలకు గల వ్యత్యాసాన్ని అధ్యయనం చేయడమే భూపరిమాణ శాస్త్రం అంటారు.
రెన్నెల్‍లాగా, మెకంజీలాగా సాధారణ సర్వేలకు భిన్నంగా, భౌగోళిక, ప్రాపంచిక దృక్పథంతో భూమి ఆకారంపై, పరిమాణంపై ఓ కచ్చితమైన పరిశీలన చేయాలని లాంబ్టన్ భారత ఉపఖండ మహాచాపం సర్వేను ప్రారంభించి తన కోరిక నెరవేరకుండానే అకాలమరణం చెందడంతో ఈ బృహత్కర కార్యక్రమాన్ని లాంబ్టన్ స్థానంలో వచ్చిన జార్జ్ ఎవరెస్టు పూర్తి చేయడం గమనార్హం.
భూగోళ ఆకృతి :
హిరణ్యాక్షుడు చుట్టచుట్టినట్లుగా భూమి బల్లపరుపుగా లేదు. గెలీలియో లాంటి శాస్త్రజ్ఞుల పరిశీలనతో భూమి గుండ్రంగా వుందనే వాదనలు ముందుకు వచ్చాయి. భూమి గుండ్రతపై అనేక వాదనలుండేవి. 17వ శతాబ్దంలో ఖగోళ శాస్త్రజ్ఞులు భూమి నిజగోళం (true sphere)గా కాకుండా దీర్ఘగోళం (ellipsoid) లేదా గోళాభం (spheriod) వుండవచ్చని అభిప్రాయపడ్డారు. కొందరు నిలబెట్టిన గుడ్డు ఆకారమంటే, మరికొందరు ద్రాక్షపండు లాంటి ఆకారమన్నారు.
ఈ విషయాల్ని తేల్చడానికి 18వ శతాబ్దం చివరి భాగంలో ఫ్రాన్స్కు చెందిన రెండు సాహస బృందాలు బయలు దేరాయి. ఒక బృందం దక్షిణ అమెరికాలోని ఈక్వడార్‍లో గల భూమద్యరేఖ ప్రాంతానికి, మరొకటి స్కాండినేవియాకు దగ్గరగల ఆర్కిటిక్ వృత్తంలోని లాప్‍లాండ్ (Lapland)కు వెళ్ళాయి. భూమధ్యరేఖకు వెళ్ళిన బృందం తొమ్మిది సంవత్సరాలు పరిశోధన చేసింది. చివరికి రెండు బృందాలు ఒక డిగ్రీ అక్షాంశ విలువను లెక్కించగా భూమధ్యరేఖ దగ్గర ఒక డిగ్రీ అక్షాంశం మధ్య దూరం 110 కి.మీ. కన్న తక్కువగా, ఆర్కిటిక్ వలయం దగ్గర 111 కి.మీ. కంటె కొంచెం ఎక్కువగా వున్నట్లుగా తేలింది.
దీంతో భూమి మధ్యభాగంలో అక్షాంశాలు దగ్గరగా, దృవాల దగ్గర కొంచెం దూరంగా వున్నట్లు తేల్చారు. కాబట్టి, భూమి భూమధ్యరేఖ దగ్గర కొంచెం ఎక్కువ గుండ్రంగా, ధృవాల దగ్గర తక్కువ గుండ్రంగా వున్నట్లు అభిప్రాయానికి వచ్చి, భూమి లఘ్వక్ష గోళాభం (oblate spheriod) ఆకారంలో (ద్రాక్ష పండులా) వుందని నిర్దారించారు. ఈ విధంగానే లాంబ్టన్ కూడా ఉష్ణమండల అక్షాంశాల ప్రాంతంలో సర్వే చేయాలని భావించే, దీనికి ఉపఖండం బాగుంటుందని ఈ మహాచాపానికి ప్రారంభించాడు.
గోళీయ ఆధిక్యం (spherical excess)
భూమి సమతలంగా లేక, ఎత్తు పల్లాలతో గుండ్రంగా వుండడంతో, ఏర్పర్చే కోణాల మొత్తం 1800 డిగ్రీల కన్నా కొంచెం ఎక్కువగా వుంటాయి. దీంతో త్రిభుజం తెరుచుకున్నట్లుగా వుంటుంది. ఈ ఆధిక్యతనే గోళీయ ఆధిక్యం అంటారు. సాధారణ ప్రదేశాల్లో ఇది సమస్యకాదు. పైథాగరస్ సిద్దాంతాన్ని ఉపయోగించి ద్విమితీయ కొలత (two dimensional) కొలతల్ని గుర్తించవచ్చు! కాని వేలాది చదరపు కిలోమీటర్ల సర్వేలో ఈ గోళీయ ఆధిక్యం అత్యధికంగా పెరుగుతుంది. దీనికై భూగోళ శాస్త్రజ్ఞులు భూమి వ్యాసాన్ని, దాని చుట్టు కొలతను పరిగణలోకి తీసుకొని, వాటి నుంచి గోళీయ ఆధిక్యానికి ఓ ప్రామాణిక దిద్దుబాటును నిర్ణయిస్తారు.
ఈ విధానాన్నే లాంబ్టన్ అవలంభించి మహాచాపం యొక్క భౌగోళిక ప్రాముఖ్యాన్ని అనేకసార్లు నిరూపించడంతో ఈ మహాచాపానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. లాంబ్టన్ మరణం తర్వాత ఈ మహాచాపం బాధ్యతల్ని చేపట్టిన జార్జ్ ఎవరెస్టు మరో 20 సం।। పాటు శ్రమించి భూపరిమణానికి కొత్త కొలతలు అందించాడు. ఈ కొలతల ప్రకారం భూమి చుట్టు కొలతలో 38 మీటర్ల తేడా మాత్రమే రావచ్చని, నాటి ఏసియాటిక్ సొసైటీ అధ్యక్షుడైన జేమ్స్ ప్రిన్సెప్ అభిప్రాయపడి, ఎవరెస్టును అభినందించాడు.
36 నక్షత్రాలు – 48 రాత్రులు – మూడువేల పరిశీలనలు :
దూరంగా నున్న రెండు అక్షాంశాల స్థానాల్ని తెలుసుకోవాలంటే, ఒకేరకమైన పరికరాలను, రెండు స్థానాల్లో ఒకే పద్దతిని ఉపయోగించి కొలతలు తీసుకోవాలి. ఇందుకోసం 1839-40లో బీదర్, సిరోంజి, కలియానా ప్రాంతాల అక్షాంశాల్ని తెలుసుకోవడానికై ముందు సిరోంజి దగ్గర వాగ్, ఉత్తరకొస చాపం కలియానా దగ్గర ఎవరెస్టు ఎంపిక చేసిన 36 నక్షత్రాల్ని 48 రాత్రులు కృషి చేసి మూడువేల పరిశీలనలు చేసారు. అలాగే 1841లో బీదర్, సిరోంజిల నుంచి పరిశీలించారు. ఈ పరిశీలనల ద్వారా ఎవరెస్టు, ఒక డిగ్రీలోని, ఒక నిమిషంలోని, ఒక సెకండు లోని మూడు దశాంశ స్థానాల కచ్చితత్వంతో మూడు ప్రాంతాల అక్షాంశాల్ని గుర్తించాడు. (సెకండులోని ఆరు దశాంశాల వరకు కూడా ఎవరెస్టు గణించాడు). దీంతో మహాచాపం పొడవును ఒకే కచ్చితత్వంతో తెలుసుకోగా వచ్చిన విలువను, త్రిభుజీకరణం చేయటం వలన వచ్చిన విలువతో పోల్చి ఎవరెస్టు భూపరిమాణాన్ని ఈ కింది విధంగా నిర్ణయించాడు.
దీనికై ఎవరెస్టు రెండు స్థిరాంకాల్ని (constants)ను నిర్ణయించాడు. మొదటిది తెలియదు (బహుశా కలకత్తాలోని ఆయన రాసిన సంపుటాల్లో వుండవచ్చు!) రెండో స్థిరాంకం ప్రకారం భూమిని గూర్చిన వివరాలు ఈ విధంగా వున్నాయి.
- భూమధ్యరేఖ వ్యాసార్థము (radius) – 64,00,000 మీటర్లు (6400 కి.మీ.)
- ధృవాల(ఉత్తర) వ్యాసార్థం-63,79,502 మీటర్లు (6379 కి.మీ.)
- ఉత్తర ధృవం దగ్గర అణిగిన విలువ – 20,498 మీటర్లు. (20.49 కి.మీ.) (భూవ్యాసార్థం నుంచి ధృవ వ్యాసార్థం తీసివేయగా అణిగిన విలువ వస్తుంది.)
- భూమధ్యరేఖ వ్యాసంతో ధృవాలు -1:312.22 నిష్పత్తిలో అణిగి వున్నాయి. (భూమధ్యరేఖ వ్యాసార్థాన్ని ధృవాల దగ్గర అణిగిన విలువతో భాగిస్తే ఈ నిష్పత్తి వస్తుంది.)
నేటి ఆధునిక విలువలకు దాదాపు ఎవరెస్టు ప్రకటించిన విలువలకు చాలా దగ్గరగా వున్నాయి. ఇవి ఎవరెస్టు ఇతర సిబ్బంది నిబద్దతకు తార్కాణం. తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో, మానవ శ్రమతో, ప్రాణ నష్టాలలో, ఇబ్బందులతో సాధించిన ఈ విలువలు చాలా కచ్చితత్వమని నాడు, నేడు భూగర్భ, భూపరిమాణ శాస్త్రవేత్తలు గుర్తించడం గమనార్హం. (ప్రస్తుతం భూమి సగటు వ్యాసార్థం – 6371 కి.మీ. పరిగణిస్తున్నారు.)
పదుల సంఖ్యలో సర్వేయర్ల, వందల సంఖ్యలో సహాయ సిబ్బంది ప్రాణ త్యాగా లతో కొనసాగిన ఈ మహాచాపం ప్రధాన ఘట్టం 1843లో ముగిసింది. హతిపాంను అమ్మకాని పెట్టి, 1844లో ఇంగ్లాండ్ చేరిన ఎవరెస్టు 55 సం।। వయస్సులో ఎమ్మా వింగ్‍ను పెళ్ళి చేసుకోగా, వారికి ఆరుగురు సంతానం కలిగారు.
ఈ సర్వే సందర్భంగా 25 సం।। పాటు తాను రాసుకున్న నోట్సు అనేక సంపుటాలుగా (నేటికి కలకత్తాలో వున్నాయి) వున్నా, సరియైన పరికరాలతో ప్రయాణికులు భూపరిశీల నలు చేసి రేఖాంశాన్ని తెలుసుకోవడం అని ఎవరెస్టు రాసిన ఒకే వ్యాసం (1859) ప్రచురితం కావడం గమనార్హం. 76 సం।। వయసులో 1866లో ఓ మహాశిఖరం తుదిశ్వాస విడిచినా, నేటికి, ఎప్పటికి మౌంట్ ఎవరెస్టుగా ఈ భూమి ఉన్నంత కాలం జార్జ్ ఎవరెస్టు వుంటాడు.
శిఖరాలు – నామకరణం :
ఎవరెస్టు వారసుడిగా సహచర సర్వేయర్ ఆన్‍డ్రూ స్కాట్ వాగ్ (Andrew Scott Waugh) నియమించబడ్డాడు. దాదాపు మహాచాపం పూర్తి కావడంతో, సర్వేయర్లంతా హిమశిఖరాలపై దృష్టిసారించారు. వెబ్, హడ్‍సన్, హెర్‍బర్ట్లు 46 శిఖరాలను గుర్తించగా, కెప్టెన్ టిజి.మాంట్‍గోమరి (Mottgomerie) కారకోరమ్ శ్రేణిలోని మరికొన్ని శిఖరాల్ని గుర్తించాడు. 14 శిఖరాలు 6100 మీటర్ల కన్నా ఎత్తులో వుండగా, మరో అయిదు శిఖరాలు 7000 మీటర్లకు పైగా వున్నాయి. ఇందులో మూడు అత్యుత్తమ శిఖరాలుగా వీరు గుర్తించారు. వీటికి A1, A2, A3, K1, K2 లంటూ పేర్లు పెట్టారు. సర్వే నిబంధనల ప్రకారం ప్రతి శిఖరానికి స్థానిక పేరు పెట్టాలి. ఎవరెస్టు కూడా ఇదే ఆశాభావాన్ని వ్యక్తపరిచేవాడు. నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఓ రాజ్యం నుంచి మరో రాజ్యానికి పోవడం ఇబ్బందికరంగా వుండేది. కొన్ని శిఖరాలు రెండు, మూడు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇలాంటి శిఖరాలకు స్థానిక పేరును నిర్ణయించడం కత్తిపై సాములాంటిది.
A2 ఎత్తు 7847 మీటర్లుగా నిర్ధారించి, ప్రపంచంలో ఇదే ఎత్తైన శిఖరంగా భావించారు. దీనికి స్థానిక పేరును కనుగొని నందాదేవిగా పేరు పెట్టారు. వాగ్ బృందం పరిశోధనలతో మరికొన్ని శిఖరాలు నందాదేవికి ముందు వచ్చి చేరాయి. తర్వాత దీని ఎత్తు 7816 మీటర్లుగా నిర్ధారణ కావడంతో సిక్కిం భారత్‍లో కలవక ముందు ఇండియాలో ఎత్తైన శిఖరంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం నందాదేవి దేశంలో రెండో ఎత్తైన శిఖరంగా వుంది.
1847లో వాగ్ ఈశాన్య రేఖాంశ, కలకత్తా రేఖాంశాల ఖండన ప్రదేశమైన సోనఖోడా నుంచి పర్వత శ్రేణుల్ని పరిశీలించగా ఓ ఎత్తైన శిఖరం బయటపడింది. దాని ఎత్తు 8598 మీటర్లుగా తేలింది. తిరిగి అదే సంవత్సరం నవంబర్‍లో డార్జిలింగ్ నుంచి, పైన చూసిన శిఖరానికి పడమరగా 200కి.మీ. దూరాన నేపాల్, టిబెట్ సరిహద్దులో మరో శిఖరాన్ని చూసాడు. దీనికి గామా అనే గ్రీక్ అక్షరం పేరుగా పెట్టాడు. అదే సమయంలో మరో సర్వేయర్ జాన్ ఆర్మ్స్ట్రాంగ్ (Armstrong) కూడా ముజఫర్‍పూర్ నుంచి ఓ శిఖరాన్ని చూసి Bగా, మరో శిఖరానికి Aగా గుర్తులు పెట్టాడు. వాతావరణం సరిగా లేకపోవడంతో (రోజుల తరబడి వేచి చూడాలి) వీటి ఎత్తులను నిర్ణయించలేక పోయారు. ఎవరెస్టుకు గణనలు చేసిపెట్టిన జాన్‍పీటన్ (Peton)చే వాతావరణం బాగున్నప్పుడు తిరిగి లెక్కలుతీయించగా వాగ్ మొదట చూసిన శిఖరం సిక్కింలోని కాంచంజంగాగా, A శిఖరం 8474 మీటర్ల ఎత్తులో నేపాల్, టిబెట్ సరిహద్దులోని మకాలు (Makalu)గా తేలింది.
అయినా సంతృప్తి చెందని వాగ్ 1850లో జేమ్స్ నిఖాల్ సన్ (Nicholson) అనే సర్వేయర్‍చే తిరిగి పరిశీలనల్ని చేయించాడు. ఈయన చూసిన ఎత్తైన శిఖంకు H అని పేరు పెట్టాడు. మరింత కచ్చితత్వంకై కలకత్తాలోని ముఖ్య గణనాధికారి అయిన రాధానాథ్ సికందర్ (మొత్తం సర్వే సిబ్బందిలో ఈయనొక్కడే నిపుణుడైన భారతీయ సిబ్బంది) ను మంచు శిఖరాల్ని 160 కి.మీ. దూరం నుంచే స్థానాల్ని గుర్తించే విధంగా గణిత సూత్రాల్ని మార్చమన్నాడు. అలా మార్చబడిన సూత్రాలతో వక్రీభవన, వడంబ దోషాల్ని తగ్గించుకుంటూ, అప్పటికే రికార్డు చేయబడిన క్రాఫర్డ్, వెబ్‍ల గణాంకాల్ని పరిశీలించి యావత్ శిఖరాలకు I-LXXX (80) దాకా రోమన్ అంకెలతో సూచించారు. అన్నింటిని సరిచూసుకొని కొలతల్ని పరిశీలించగా XV గుర్తుగల శిఖరం ఎత్తైనదిగా తేలింది. దీన్ని పోల్చి చూడగా వాగ్ గామా, ఆర్మ్స్ట్రాంగ్ B నిఖాల్‍సన్ H ఒకటేనని, అదే XV శిఖరమని తేలింది. దీని ఎత్తు 8848 మీటర్లుగా గుర్తించారు.
1856లో హరముఖ శిఖరంపై అత్యంత చలిలో ఓ శిబిరంలో ఉన్న వాగ్ బృందం ఈ విషయాన్ని ఏసియాటిక్ సొసైటికి సమాచారాన్ని పంపింది. దీనికి స్థానిక నేపాలి పేరు దేవధంగగా, టిబెట్ పేరు చ-మో-లన్‍గ-మా (cha-mo-lung-ma) అని ప్రస్తావన వచ్చినా, సహ సర్వేయర్లు వ్యతిరేకించినా, జార్జ్ ఎవరెస్టు అందించిన సేవలకు గుర్తుగా, అందరి నాలుకలపై సులభంగా పలికేదిగా ఎవరెస్టు పేరును XV శిఖరానికి పెట్టి తన గురుభక్తిని చాటుకున్నాడు. అయినా వివాదం రాగా, 1857లో వచ్చిన సిపాయిల తిరుగుబాటుతో దీన్ని ఎవరు పట్టించుకోలేదు.
అప్పన్నుంచి మౌంట్ ఎవరెస్టు 8846-8881 మీటర్ల మధ్యన, (వాతావరణ పరిస్థితులకు లోబడి కోణంలో హెచ్చుతగ్గుదలలో ఈ వ్యత్యాసం వుంటుంది) కొనసాగుతూనే వుంది. అలాగే హిమపాతం కూడా ఈ వ్యత్యాసానికి కారణమవుతుంది.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరానికి తన పేరు పెట్టినప్పుడు గాని, తర్వాత బతికిన దశాబ్దకాలంలోగాని జార్జ్ ఎవరెస్టు పట్టింపు లేకుండా, కనీసం ఆ శిఖరాన్ని చూడకుండా వుండడం ఎవరెస్టు గొప్పతనమో, నిర్లక్ష్యమో ఏనాటికి తేలని అంశం! కాని భూమి వున్నంత కాలం ఓ ఉద్యోగి స్వార్థరహిత సేవలకు నిదర్శనంగా, ఆనవాలుగా మౌంట్ ఎవరెస్టు స్థిరంగా (Ever-rest) అలరారుతూనే వుంటుంది.
పేరుకే నోచుకోని K2 శిఖరం:
పడమరన గల కారకోరమ్ శ్రేణిలోని శిఖరాలను పరిశీలించిన కెప్టెన్ టిజి.మాంట్‍గోమరి వాటికి K అనే అక్షరంతో ఓ క్రమ సంఖ్యనిచ్చాడు. 8126 మీటర్ల ఎత్తులో చివరనున్న శిఖరానికి నాంగపర్‍బల్ అని, K1కు మషేర్‍బ్రమ్ అని స్థానిక పేర్లు పెట్టాడు. మరికొన్నింటికి కెచు, కెటు అని, వాగ్ పేరున మౌంట్‍వాగ్ అని, తాను గుర్తించిన మరో శిఖరానికి మౌంట్ మాంట్‍గోమరి అని, విక్టోరియారాణి భర్త పేరున మౌంట్ ఆల్‍బర్ట్ అని, కారకోరం శ్రేణుల్ని మొదటగా చేధించిన సర్వేయర్ పేరున మౌంట్ గుడ్‍విన్ ఆస్టన్ (Godwin Austen) అని పేర్లు పెట్టారు.
ఈ శ్రేణిలో అత్యంత ఎత్తైనదిగా, ఎవరెస్టు శిఖరంతో పోటిపడేలా వున్న K2 శిఖరాన్ని 1858లో తిరిగి లెక్కలు చేయగా కాంచన్‍జంగా కన్నా ఎత్తుగా 8611 మీటర్ల ఎత్తులో వుందని తేలింది. కాని, స్థానికంగా వున్న రాజకీయ అనిశ్చితతో దాని స్థానిక పేరును సర్వేయర్లు తెలుసుకోలేక పోయారు. దేశ విభజన తర్వాత K2 ఆజాది కాశ్మీర్ (POK)లో వుండడంతో నేటికి మ్యాప్‍లలో ఖ2 గానే, పేరు లేనిదానిగానే మిగిలిపోయింది. ప్రపంచంలోనే రెండో ఎత్తైన శిఖరం పేరు లేకుండా వుండడం, నాడు లాంబ్టన్ పేరు జ్ఞాపకం రాకపోవడం ఓ విచిత్రం. (నిజానికి లాంబ్టన్ పేరు పెట్టవచ్చు). మంచు శిఖరాల ఔన్నత్యాలు మారుతూ వుంటాయి.
హిమాలయాలు కేవలం భారత ఉపఖండానికే కాక, ఆవలివైపున గల అనేక దేశాలకు ఉమ్మడి శ్రేణులు, సరిహద్దులు. కొన్ని శిఖరాలు రెండు, మూడు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాబట్టి వాటికి స్థానిక పేర్లుంటాయి. బహుశా ఆయా దేశాల పటాల్లో వారి స్వంత పేర్లతోనే వాటిని చూపుతుండవచ్చు. అందుకే సర్వేయర్లు పేరుపెట్టిన శిఖరాల పేర్లు శాశ్వతం కాకపోవచ్చు! ఒక్క మౌంట్ ఎవరెస్టు తప్ప. అందుకే ఈ శిఖరాల్ని ఆయా దేశాలకు పరిమితంగా కాకుండా, విశ్వ సంపదగా భావిస్తే, ఆశ్రేణులకు, ఆయా దేశాల ప్రజలకు, యావత్ భూమండలానికి, ముఖ్యంగా పర్యావరణానికి శ్రేయస్కరం. ఇదే జరుగుతే దేశాల సరిహద్దుల్లో మిలటరీ కవాతుల అవసరం వుండదు. ఇది జరగాలని ఆశిద్దాం!!
(Space Applicatiom Centre (SAC), అహమ్మదాబాద్‍లో రచయిత Research Assistantగా పనిచేసిన అనుభవం ఈ కథనాలు రాయడానికి దోహదపడింది.)
అనుబంధం:
1 The Great Arc – John Keay
2 మహాచాపం- సివిఅర్‍కె ప్రసాద్ (అనువాదం), ఎమెస్కో
3 Over the Karakorams – Francis Edward Younghusband
4 Trials in Tibet – Ekai Kawaguchi
5 At the Source of the Indus – Sven Hedin
6 On the Roof of the World – John Wood
(3 to 6 – From EXPLORATION , Edited by John Keay)
7 Different Atlases
నోట్: శ్రమ, నిజాయితీలకు నిలువెత్తు తార్కాణాలు ఈ సర్వేలు.
అందుకే అందరూ చదవాలి. (రాబోయే సంచికలో కొన్ని భూగర్భ/ బాహ్య ప్రయోగాలు చూద్దాం!)
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162