తీర్పుల్లో ఉర్దూ కవిత్వం


ఉర్దూ భాషకి కోర్టులకి అవినావభావ సంబంధం ఉంది. ఉర్దూ పదజాలం కోర్టు పరిభాషలో ఎక్కువగా కన్పిస్తూ వుంటుంది. శాసనాలలో కూడా ఉర్దూ పదాలు ఎక్కువగా దొర్లుతూ వుంటాయి. వకాలత్‍, హలఫ్‍నామా, వకీలు, గవా, హాజిర్‍హై లాంటివి కొన్ని ఉదాహరణలు.
ఉర్దూ పదాలు, పదబంధాలే కాదు, చాలా తీర్పుల్లో ఉర్దూ కవిత్వం కూడా కన్పిస్తూ వుంటుంది. సంక్లిష్టమైన కేసుల్లో, అదే విధంగా ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన కేసుల్లో కూడా ఉర్దూ కవిత్వం దర్శనం యిస్తూ వుంటుంది. యుద్ధనేషియా కేసులో, సెక్స్ వర్కర్స్ కేసులో, పరువు హత్య కేసులో సుప్రీంకోర్టు మీర్జా గాలీబ్‍ ఫైజ్‍ అహ్మద్‍ ఫైజ్‍ కవితలను ఉదహరిస్తూ వచ్చింది. తాము చెప్పే తీర్పుకి మరింత బలం చేకూర్చడానికి ఈ కవితలను న్యాయమూర్తులు ఉదహరించారని అన్పిస్తుంది.


సుప్రీంకోర్టే కాదు, చాలా హైకోర్టులు కూడా చాలా తీర్పుల్లో ఉర్దూ కవితా చరణాలను ఉదహరిస్తూనే వున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టులే కాదు దిగువ కోర్టులు కూడా ఉర్దూ కవిత్వాన్ని, సాహిత్యాన్ని తమ తీర్పుల్లో ఉదహరిస్తూ తమ తీర్పులకి మరింత నిండుదనాన్ని ఇస్తున్నారు.
పంజాబీ హిందూ పిల్లలకి సంరక్షకులుగా తమని నియమించమని మహమ్మద్‍ షానవజా జహీర్‍ కోర్టులో దావా దాఖలు చేశాడు. అతనికి ఓ భార్యా, ఇద్దరు పిల్లలు వున్నారు. పెద్ద కూతురు వయస్సు 19 సంవత్సరాలు. యూనివర్సిటీలో చదువుతుంది. రెండవ కూతురుకి 16 సంవత్సరాలు. ఢిల్లీ పబ్లిక్‍ స్కూల్లో చదువుతుంది. అతని ఇంటిలో నాలుగు అంతస్తులు వున్నాయి. ఆ ఇంటికి అతని భార్యా, అతనూ యజమానులు. అతని తల్లిదండ్రులు కూడా ఆ ఇంటిలో వాళ్ళతో కలిసి వుంటారు.


పంజాబీ హిందూ పిల్లలు ఇద్దరూ మైనర్లు. వాళ్ళు క్రింది భాగంలో వుంటున్నారు. జహీర్‍కి స్నేహితుని పిల్లలు వాళ్ళు. ఆ పిల్లల తల్లి క్యాన్సర్‍ వల్ల 20.4.2012వ రోజున చనిపోయింది. వాళ్ళ తండ్రి ప్రవీణ్‍ దయాల్‍ 30.4.2013న చనిపోయాడు. అతను బతికి వున్నప్పుడు తన పిల్లల బాగోగులు జహీర్‍ చూడాలని అతను తరుచూ చెప్పేవాడు. ఆ విధంగా కోరేవాడు. తన పిల్లలని చూడటానికి ఎవరూ లేరని కూడా అతను చెప్పేవాడు. ఆ విషయాన్ని వాళ్ళ పామిలెట్‍ అసోసియేషన్‍లో కూడా చెప్పేవాడు. ప్రవీణ్‍ దయాల్‍కి వున్న ఒకేఒక సోదరుడు అమెరికాలో వుంటున్నాడు. అతను ఈ పిల్లల బాగోగులు చూసే పరిస్థితిలో లేనని చెబుతాడు. ఆ విధంగా కోర్టులో దరఖాస్తుని కూడా దాఖలు చేశాడు. ప్రవీణ్‍ దయాల్‍ ఆస్తులని జహీర్‍ పర్యవేక్షించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతాడు.
శ్రీమతి శివదాసిని వాళ్ళ మరో దగ్గరి బంధువు. ఆ పిల్లల అమ్మమ్మ. వయోభారం వల్ల పిల్లల బాగోగులు చూసే పరిస్థితిలో ఆమె లేదు. అదే విషయం కోర్టుకి తెలియచేసింది.


ప్రవీణ్‍ దయాల్‍ చనిపోయినప్పటి నుంచి ఆ పిల్లల బాగోగులని జహీర్‍ చూస్తున్నాడు. తమ ఇంటి క్రింది భాగంలో పిల్లలని వాళ్ళ మతాచారాల ప్రకారం పెంచుతూ వున్నాడు. అతని మంచితనాన్ని మరీ ఎక్కువగా పొగడాల్సిన అవసరం లేదు. అతను తనని ఆ పిల్లలకు సంరక్షడునిగా నియమించమని కోర్టులో సివిల్‍ కేసుని దాఖలు చేశాడు. అది ఢిల్లీ హైకోర్టు దాకా వెళ్ళింది.
ఈ కేసుని పరిష్కరిస్తూ కోర్టు నిదా ఫాజిల్‍ అన్న ప్రముఖ
ఉర్దూ కవితని, అదే విధంగా ఉర్దూ కవి జావెద్‍ అక్తర్‍ కవితలని తమ తీర్పులో ఉదహరించింది.
ఉర్దూ కవి నిదా పాజిల్‍ కవిత ఇలా వుంటుంది.
‘ఫర్‍ సే మజీద్‍ హై
బహుత్‍ దూర్‍,
చలో ఉన్‍ కర్‍ లియో
కిస్సీ రోటే హుమె బచ్చే కో హస్నా జామే’

పార్థన చేసే మజీద్‍ చాలా దూరంలో వుంది.
పర్వాలేదు
ఇక్కడ ఏడుస్తున్న పిల్లలని సంతోషంలో
వుంచుదాం.( తెలుగు)
ఏడుస్తున్న పిల్లలని సంతోషపెడితే భగవంతున్ని పూజించినట్టే నని కవి భావన.
ఈ కవితని కోర్టు తమ తీర్పులో ఉదహరించింది. అక్కడితో వూరుకోలేదు. ప్రముఖ ఉర్దూ కవి జావెద్‍ అక్తర్‍ రాసిన కవితని కూడా ఉదహరించింది. అమాయక జీవులని రక్షించడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం ఆ కవిత సారాంశం. ఆ కవిత ఇలా వుంటుంది.
‘జో మజాబ్‍ హోజో జాబ్‍ హో
జో బీ నామ్‍ హా ఉస్కా
ఇన్సాన్‍ వొహీ హై జిస్‍కో
మహబ్బత్‍ కర్‍నా ఆమో
కహాజో అఘర్‍ మాసూమ్‍
మిలే ఉస్కో రహాన్‍ మె
ఉసే ఘర్‍ నహీ సమ్‍జే
బడ్కే ఉసే ఆప్పే – ఈ ’’

మతం ఏదైనా
విశ్వాసం ఏదైనా
ఎవరైతే ప్రేమించగలరో వాళ్ళే మానవత్వం వున్న మనుషులు,
ఓ అనాధని
తమ పిల్లలుగా కౌగిలించుకోగలరో
వాళ్ళే మానవత్వం వున్న మనుషులు.
ఈ కేసులో జహీర్‍కి ఆ లక్షణాలు అన్నీ వున్నాయని కోర్టు పేర్కొంది. ఆ విధంగా పేర్కొంటూ అతన్ని ఆ పిల్లలకి, వాళ్ళ ఆస్తికి సంరక్షకునిగా నియమించింది. ఆ పిల్లలకి రావల్సిన డబ్బులన్ని ట్రస్టులో దాఖలు చేయాల్సిందిగా జహీర్‍ కోరినాడు. ఇన్సూరెన్స్ నుంచి, అదేవిధంగా బ్యాంకుల నుంచి రావల్సిన డబ్బులని ఆ ట్రస్టులో జమ చేయాలని కోర్టు ఆదేశించింది.
పిల్లలకి 25 సంవత్సరాలు వచ్చిన తరువాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళు నిర్ణయించకుంటారు. ఇదీ కోర్టు తీర్పులోని సారాంశం.
ఒక నిర్ణయాన్ని బలంగా చెప్పటం కోసం కవితా చరణాలని ఉదహరించడం మంచిదే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. కోర్టులు ఆ జాగ్రత్తలని తీసుకుంటున్నట్టు అన్పిస్తుంది. అలా జాగ్రత్తలు తీసుకోనప్పుడు తీర్పుల గురించిన వ్యాఖ్యానాలు మారే అవకాశం వుంటుంది.
ఏమైనా కవితా చరణాలని తీర్పుల్లో ఉదహరించడం అభిలషణీయమే. తెలుగు కవిత్వం కూడా తీర్పుల్లో చేరితే మరింత సంతోషం వేస్తుంది.


-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *