పంప మహాకవి గాథ


తెలుగుభాషకు ప్రాచీనహోదానిచ్చింది కుర్క్యాలలోని బొమ్మలగుట్ట త్రిభాషాశాసనం. ఈ శాసనం క్రీ.శ.945 ప్రాంతందై వుంటుందని కుర్క్యాలశాసనాన్ని పరిశోధించి, పరిష్కరించి వెలుగులోనికి తెచ్చిన నేలటూరి వేంకట- రమణయ్య అభిప్రాయం. ఈ శాసనంలో పేర్కొనబడ్డ రెండు ప్రదేశాలలో ఒకటి సిద్ధశిల. దీనిమీదనే శాసనం, బొమ్మలమ్మ (చక్రేశ్వరి), ఆద్యంత తీర్థంకరులు, ఇతర జైనమునుల శిల్పాలు చెక్కబడ్డాయి. రెండవది వృషభాద్రి. బొమ్మలమ్మగుట్టనే వృషభాద్రి అంటారు కాని, నేలటూరి అభిప్రాయం ప్రకారం ఈ గుట్ట ఎక్కడుందో గుర్తించబడలేదు. అంతేకాదు కుర్క్యాల శాసనకర్త జినవల్లభుని సోదరుడు మహాకవి పంపనకు 2వ అరికేసరి ఇచ్చిన అగ్రహారం ‘ధర్మవుర’ ధర్మపురా కాదా తేలలేదు.


జినవల్లభుడు పంపన గురించి ఈ శాసనంలో చాలా గొప్పగా చెప్తాడు. పంప విక్రమార్జునీయం కవి. పండరంగవల్లికి చెందిన కొండాకుందాన్వయుడు, పొత్తెగబలి దేశిగణంలోని జయంగొండ సిద్ధాంత భఠారుని శిష్యుడు. పంప సకలకళాప్రవీణ, భవ్యరత్నాకర, గుణపక్షపాతి వంటి బిరుదులెన్నో కలవాడు. కావ్యరచనా ధురీణుడు, ఛందోసూత్రాలను సముచితంగా ప్రయోగించగలవాడు. జినవల్లభుడు తన అన్న పంపకున్న బిరుదనామంతో కవితాగుణార్ణవ తటాకాన్ని తవ్వించాడు. 2వ అరికేసరి కోరికమేరకు అతని ఆస్థానకవిగా వున్న పంప ‘విక్రమార్జున విజయం’ను రచించాడు. అందుకుగాను అరికేసరి పంపకు ‘కలాప’గ్రామాన్ని తలపించే ‘ధర్మవుర’అనే అగ్రహారాన్ని ప్రదానం చేసాడు. మహాకవి పంపన క్రీ.శ.609-650 మధ్యకాలంలో జీవించివుంటాడని చరిత్రకారులు అంగీకరించారు.


విక్రమార్జున విజయాన్ని రాసినందుకు తనకు అరికేసరి ధర్మవు అగ్రహారాన్ని ఇచ్చినట్లు తన కావ్యంలో చెప్పుకున్నాడు పంపడు. ఇదే సంగతిని కుర్క్యాల శాసనం కూడా తెలుపుతున్నది. ధర్మపురాన్ని ద్విజావసథ గ్రామం… పక్కన గుట్టను ద్విజావసథ పర్వతం… అగ్రహారపుగుట్ట పిలిచేవారు.
ధర్మవుర ఎక్కడుంది? గోదావరి ఉత్తర భాగానికి సబ్బినాడు వ్యాపించి వున్నట్టు శాసనాధారాలు బయటపడలేదు. అందువల్ల గోదావరి ఒడ్డున ధర్మపురి కుర్క్యాల శాసనంలోని ధర్మవుర ఒక్కటవడానికి అవకాశం లేదు. కరీంనగర్‍ జిల్లాలో ధర్మపురమనే గ్రామాలు చాలానే వున్నాయి. శాసనంలో ధర్మవుర వృషభాద్రికి దక్షిణంగా వుందని చెప్పబడ్డది. ధర్మవురలో వున్నవారికి బొమ్మలమ్మ గుట్ట కనపడేంత సమీపంలో వుండవచ్చు. నేలటూరి వేంకట రమణయ్య వృషభాద్రిని గుర్తించే ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. ASI అధికారి డా.గాయిగారు నేటి కుర్క్యాల గ్రామం శాసనంలోని ధర్మవుర గ్రామవర్ణనకు సరిపోతుంది అన్నారు.
ప్రస్తుత కుర్క్యాల గ్రామంలో ఏ ప్రాచీన అవశేషాలు లభించడం లేదు. కనుక ఇపుడున్న వూరు పాతగ్రామం కాదు. అయితే అపుడు కుర్క్యాల పాతగ్రామం ఆనవాల్లు దొరకాలి. గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారం బొమ్మలమ్మగుట్ట దక్షిణ ప్రాంతంలో ఇటుకముక్కలు, కుండపెంకులు విరివిగా దొరికాయి. పురాతత్వవేత్తలు ఈ వస్త్వాధారాలు వేయేండ్లకు పూర్వపువని నిర్ధారించారు. అక్కడి పాతచెరువుల మధ్య బయలులో పొలాలలో కూడా పాత ఇటుక ముక్కలు, కుండపెంకులు, పూర్తిపాత్రలు, ఒక మాస్తికల్లు(సతిశిల), మరొక శిల్పం లభించాయి. అక్కడే బ్రాహ్మణుల మాన్యాలున్నట్టు తెలుస్తున్నది. దాన్ని కుర్క్యాల గ్రామప్రజలు పాటిగడ్డ అని పిలుస్తారు. ఈ చోటనే ధర్మవుర లేదా ధర్మపురం వుండేదనడంలో సందేహం లేదు.


పంప భారతంలో ‘బీరదళవియ నన్నియ చాగద శాసనం… గుణార్ణవన ధర్మద ధర్మవురం మనోహరం’ అనే పద్యాలవల్ల ధర్మవుర దానంగా స్వీకరించినపుడే అక్కడ పెద్దచెరువు వుండేదన్న విషయం తెలుస్తున్నది. జినవల్లభుడు తవ్వించిన తటాకం పేరు ‘కవితా గుణార్ణవం’ కదా.


పంప వంశక్రమం:
పంప విక్రమార్కవిజయంలో ‘ఆ కొమరయ్యంగ అవనితల
ఆకాశవ్యాప్త కీర్తి నిజగుణరత్నాకరున్‍ అజ్ఞాన తమో నికరన్‍
అభిమానదేవరాయన్‍ తనయమ్‍’ అని తెలిపాడు.
అనేక వైదిక క్రతువులు నిర్వహించిన మాధవ సోయయాజి కొడుకు అభిమానచంద్రకు కొమరయ్య, కొమరయ్యకు అభిమాన దేవరాయ, అతని పుత్రుడే పంప అని వివరాలు తెలుపబడ్డాయి.
జినవల్లభుని కుర్క్యాల శాసనంలో


ఈ వివరాలు తెలుపబడ్డాయి.
విక్రమార్జున విజయానికి, కుర్క్యాల శాసనానికి వంశక్రమ వివరాలలో భేదాలు కనిపిస్తున్నాయి. జినవల్లభుని, పంపల తండ్రిపేరు అభిమానదేవరాయ, భీమపయ్యలని రెండు విధాలుగా చెప్పబడ్డది.
పూనాలోని భండార్కర్‍ ఓరియంటల్‍ ఇన్స్టిట్యూట్‍, సెంట్రల్‍ జైన ఓరియంటల్‍ లైబ్రరీ (అర) మ్యాన్యుస్క్రిప్టస్ లలో ‘భీమ నామధేయమ్‍’ అని వుంది. విక్రమార్జున విజయమ్‍ లో వబ్బనబ్బెను పంప పేర్కొనక పోవడంవల్ల బహుశః ఆమె అతని సవతితల్లి అయ్యుంటుందని, అందుకే తండ్రిపేరు, తమ్మునిపేరు చెప్పలేదని నేలటూరి వేంకటరమణయ్య అభిప్రాయపడ్డాడు.


పంపని కులం:

పంప పంచార్షేయ (రుషులు భార్గవ, చ్యవన, ఔర్వ, అప్రవాద, జమదగ్ని ప్రవరకు చెందిన) శ్రీవత్సగోత్రీకుడని, కమ్మె బ్రాహ్మణుడని శాసనం చెప్తున్నది.


పంపని మతం:
పంప తాత వైదికుడైన మాధవ సోమయాజి. తండ్రి భీమపయ్య వైదికమతాన్ని విడిచి జైనాన్ని స్వీకరించాడు. కనుక పంప జైనమతా వలంబకుడు. పంప కులదైవాలు ఆద్యంత తీర్థంకరులైన రుషభ, వర్ధమానులు. పంప ఆదిపురాణంలో ఆదినాథుని, చక్రేశ్వరిని ప్రస్తుతించాడు. పంప, జినవల్లభులిద్దరు ఒకే దేవతలను పూజించే వారు.


పంప జన్మస్థలం:
బెంగి(వేంగీ)నాడులోని వంగిపర్ర పంప పూర్వీకుల గ్రామం. అభిమాన చంద్రుడు గుండికఱ్ఱలోని నిడుంగొండకు చెందినవాడు. మాతామహుడు జ్యోతిష సింఘ వెల్వెలలోని అణ్ణిగెఱెవాడు. కన్నడిగులు అంటున్నట్టు పంప కర్ణాటకవాడు కాదు. నిడుంగొండ లేదా నిడిగొండ జైనశాసనాలు, జైన బసదుల ఆధారాలు లభిస్తున్న జనగామ జిల్లాలోని నిడిగొండ కావచ్చని ఆర్‍.శేషశాస్త్రిగారు అభిప్రాయపడ్డారు.


పంప రచనలు:
కుర్క్యాల శాసనంలో ఆ శాసన రచయిత ఎవరో పేర్కొన బడలేదు. కనుక అది పంప రాసివుంటాడేమోనని నేలటూరి అభిప్రాయపడ్డాడు. చరిత్రకారులు జినవల్లభుడే ఆ శాసనం రాసివుంటాడని గట్టి అభిప్రాయం కలిగివున్నారు.


వేములవాడ చాళుక్యరాజు 2వ(ఇమ్మడి) అరికేసరి (క్రీ.శ.625-655) వద్ద పంప దండనాయకుడుగా పనిచేసాడు. అతని ఆస్థానకవి కూడా. పంప కన్నడభాషలో ఆదిపురాణ, విక్రమార్జున విజయమనే కావ్యాలు రచించాడని తెలుస్తున్నది. మహాభారత కథానుసరణంతో రచించిన విక్రమార్జున విజయం 14 ఆశ్వాసాలతో, 1706 పద్యాలలో రాసాడు పంపన. పంప భారతం ఉనికి నన్నయ్యకు ముందు ఉండి ఉండక పోయినట్లయితే తెలుగు భారతం ఉండకపోయే దేమోనని అభిప్రాయ పడ్డారు డా.నాయని కృష్ణకుమారి, డా.రామచంద్రరావు (నన్నయ-పంప భారతావతారిక).


పంపన ‘నేను వ్యాసమునీంద్రుని వచనామృత వారధిలో ఈదులాడాను. అయినా కవి వ్యాసుడననే గర్వం లేదు నాకు. గుణార్ణవుని మంచితనం నా హృదయంలో ప్రవేశించడం చేత ఈ భారతాన్ని చెప్తున్నాను. సకలార్థ సంయుత, అలంకృత, ఉదాత్త వృత్తివిన్యాస, అనేక లక్షణ గుణ కారణభూత, మృదుపాద, వాక్సౌందర్య శోభిత, కళాలలిత, సుప్రసిద్ధ అయిన నా కవితాకన్యను అరికేసరికి గాక వేరొక్కరికి ఇవ్వవచ్చునా?’ అని విక్రమార్జున విజయంలో రాసుకున్నాడు.
పంపని తర్వాత వందేండ్లకు వచ్చిన నన్నయ, పంపన కంటే భిన్న స్వభావం కలవాడు. పంప జైనుడు, నన్నయ వైదికుడు. రాజరాజుకు పూర్వం వేంగీదేశంలో జైనమతమే అధికంగా వుండేది. వైదికధర్మం వ్యఘటితం అవుతుండేది. రాజరాజు తండ్రి విమలాదిత్యుడు మొదట శైవుడైనా, అపర వయస్సులో జైనధర్మం స్వీకరించినవాడు. దేశిగణాచార్యుడైన త్రికాలయోగి సిద్ధాంతదేవుడు ఇతనికి దీక్షాగురువు. రాజరాజు తండ్రివలెగాక వైదిక మతానుయాయి కావడం విశేషం. అతడు పార్వతీపతి పదాబ్జ ధ్యానరతుడైన శైవుడు.


భారతాంధ్రీకరణ చేస్తున్న నన్నయ మనసులో పంపడే వున్నాడు. పంపనితో తననుతాను పోల్చుకుంటూ భారతరచన చేసినట్లు నన్నయ భారతావతారిక వల్ల తెలుస్తున్నది. అరికేసరి ఆదేశిస్తే పంపకవి, రాజరాజు మాట మన్నించి నన్నయ వేర్వేరు భారతాలు రచించారు. పంపన అరికేసరిని అర్జునునితో పోల్చితే, నన్నయ రాజరాజు వంశానికి పాండవులే వంశకర్తలని చెప్పాడు. కన్నడంలో భారతం రాసిన పంప తెలుగువాడు. తెలుగులో భారతం రాసిన నన్నయ కన్నడిగుడు.


ఆదిపురాణం: అరుణ సరోరుహం మృదుతరదళ విన్యాసమమర
భారతం: అరుణ సరోరుహదళ మృదులంబు (అరణ్య.3-299)
పంప: ఏలాలవంగలవలీ వేలావన భూమియుళ్‍ (ఆది పురాణం 13-2)
నన్నయ: ఏలా లవంగలవలీ వేలాపనములకు (ఆది-8-137) (నిడుదవోలు వేంకటరావు: పంపమహాకవి అనుసరణములు)
పంపని భారతం, భట్టారకుని భారతరచనలను పోల్చి చూసినపుడు రెండుగ్రంథాలను ఒకరే రచించినారా అన్నంత పోలిక కన్పిస్తుంది.(పుట్టపర్తి-తెలుగు కన్నడముల చుట్టరికము) జినేంద్రపురాణాన్ని రాసిన పద్మకవి కూడా పంపనే అని నిడుదవోలు వేంకటరావు, తిరుమల రామచంద్ర, చల్లా రాధాక•ష్ణశర్మ, దివాకర్ల వేంకటావధాని అభిప్రాయపడ్డారు. కాని, కొర్లపాటి శ్రీరామమూర్తి, కొల్లూరు సూర్యనారాయణ వంటి వారు కొందరు అంగీకరించలేదు పంప తెలుగువాడే కాని తెలుగులో రచనలేవీ తనపేరు మీద లభించలేదు. పంప ‘జినేంద్రపురాణం’ రాసివుంటే పద్మకవి అనే మారుపేరుతో రాయాల్సిన అగత్యమేమిటన్నది సమాధానం లేని ప్రశ్న.


జినేంద్రపురాణం రాతప్రతి, అచ్చుప్రతులేవీ లభించడం లేదు. కాని, అందులోనిదని చెప్పే ఒక పద్యాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి (ప్రబంధ రత్నావళి), నిడుదవోలు వేంకటరావులు(మన కవులు) ఉదాహరించారు.
పద్మకవి రాసినాడని చెప్పే జినేంద్రపురాణం నుంచి లభిస్తున్నదొకే ఒక సీసపద్యం. అది…
‘హరినిలయంబును హరినిలయంబును విషధరాఢ్యంబును విషధరాఢ్య
మప్సరోమయమును నప్సరోమయమును వనవిలాసమును బావనవిలాస
మున్నత కరిశృంగ మిందుకాంతస్రవ మిందుకాంత
మురుకలనకులంబు నురుకలనకులంబు నంశుకాంతద్యోతి తాంశుకాంత
మొనర నవశతసాహస్రయోజనోన్న
తనమును బదివేలు యోజనా లమరువలయు
గలిగి కనకాద్రి కిన్నూట గలిగి తనరి
ప్రథితమై యొప్పు మందర పర్వతంబు’
ఈ పద్యం చిత్రకవిత అని, ఈ చిత్రకవిత్వాన్ని నన్నెచోడుడు వంటి కవులు పదవశతాబ్దంలోనే రచించారని, ఈ పద్యం పద్మకవిగా పేరుపొందిన పంపనదని నిడుదవోలు వేంకటరావు నిరూపించే ప్రయత్నం చేసారు.


పంపకవియే పద్మకవియని ‘నాడోజ పంప’ అనే గ్రంథంలో తిమ్మప్పయ్య నిర్వివాదంగా నిరూపించినారు. పంపనామం పద్మప్రభ అనే 6వ జైనతీర్థంకరుని పేరుకు తద్భవరూపం. ఈ విషయాన్ని తనకు కన్నడభాషాపండితుడు, మద్రాసు యూనివర్సిటీలో కన్నడశాఖలో అసిస్టెంట్‍ ప్రొఫెసరుగా పనిచేసిన హెచ్‍.శేషయ్యంగారు తెలియజేసినట్టు నిడుదవోలు రాసుకున్నారు. నాడోజ పంపలోని 76, 77, 78 పేజీలలో తిమ్మప్పయ పేర్కొన్నారు. పంపకవి అతని భారతక•తిని గూర్చి అత్యద్భుతమైన విషయాలిందులో వున్నాయి. జినేంద్రపురాణం పంపమహాకవికి గురువైన జినేంద్రముని చరిత్ర. ఆ కాలంలోని జైన సమయాచార్యులలో ప్రసిద్ధుడాయన. ఇతడు పంపకవికిగాక పొన్నకవికి కూడా గురువు. ఆ గ్రంథాల ఆశ్వాసాంత గద్యాలు ఉదాహరించారు.


పంపకవి: ఆదిపురాణం
‘ఇందు దేవేంద్ర మునీంద్ర వంద్య పరమ జినేంద్ర ముఖచంద్ర వాక్చంద్రికా ప్రసర ప్రసాదోతీర్ణ సూక్తి కల్లోల మాలాకీర్ణ కవితా గుణార్ణవ ప్రణీతమప్పాది పురాణదోళ్‍’.


పొన్నవి: శాంతిపురాణం
‘ఇదు జినేంద్ర చరణసరసీరుహ శిలీముఖాయమాన శ్రీమదుభయకవి చక్రవర్తినివర్తితముం అమ్మనభక్తాభిధాన విద్యానిదావమల్ల పార్యతదనుజాతాధిజాత సారస్వత పొన్నపార్య కారితము మప్పపురాణ చూడామణియోళ్‍’.
ఈ జినేంద్రుడు కానూరు గచ్ఛకు చెందిన జైనాచార్యుడు. అర్హద్బలి, అరహనంది, వీరనంది, రామనంది, చందినంది అని ఈతని పర పూజ్యపాద చరిత్రలో ప్రస్తుతించబడినాడు.
నన్నయకు పూర్వం రచింపబడిన ఆంధ్రజైన కావ్యాలలో పంపకవి జినేంద్రపురాణమొకటని చెప్పడం ఒప్పు అంటాడు నిడుదవోలు వేంకటరావుగారు.
పంప మహాకవి-శుభనంది సమాధి, బోధన్‍


బోధన్లో పంపసమాధిగా పిలువబడుతున్న సమాధిమీద ఉన్న శిలాఫలకంమీద
‘దేవేంద్ర సిద్ధా
0త మునీశ్వ
రస్య శిష్యోభవ
శ్రీశ్చుభనంది ను(నా):
ఆరాధ్య రత్నత్రయ మం
త్యకాలే సమాధినాసౌ సుర
లోకమాప’ అన్న లేఖనముంది.
దేవేంద్ర సిద్ధాంత మునీశ్వరుని శిష్యుడు, రత్నత్రయాలను (జైనంలో సమ్యగ్‍ దర్శనం, సమ్యగ్‍ జ్ఞానం, సమ్యగ్‍ చరిత్రలు) ఆచరించే శ్రీశుభనంది అంత్యకాలంలో ‘సమాధి’ని పొంది, దేవలోకానికి చేరుకున్నాడని అర్థం. అది శుభనంది సమాధి శాసనం. శుభనంది అనే జైనముని బోధన్లో సమాధి అయినాడు. ఆ సమాధి పంపనిదని జనంలో వాడుక.


ఆదిపురాణలో 16వ అధ్యాయంలోని 35వ పద్యం పంపకు శుభ అనే నామాంతరమున్నట్లు చెప్తుంది.
‘సవహతి కవితా గుణార్ణవాఖ్యాం
నను భువన త్రతయేప్యనసస్య రూఢాం
న విషయమమ తిర్యదేయ చింతా
చతురధికా జినవింశతి శ్శుభాయ’
దేవేంద్ర సిద్ధాంత మునీశ్వరుని శిష్యుడైన శుభ లేదా శుభనంది ఈచోట సమాధి చేయబడ్డాడని శాసనం చెప్తున్నది. శాసనం ప్రకారం కాదు ఆదిపురాణం ఆధారంగా శుభనందే పంపనే. జైనులలో, హిందువులలో సన్యాసులైన పిదప ఆశ్రమనామాలు ధరించడం సాంప్రదాయికం. అందువల్ల పంప జైనసన్యాసియై ‘శుభనంది’ కావడం నిజమైవుంటుంది.


పంప సన్యాసియై శుభనంది నామం స్వీకరించడం నిర్హేతుకం కాదు. ఆదిపురాణ లోని అన్ని ఆశ్వాసాంత గద్యలలో ‘సరస్వత్‍ మణిహార’, ‘సుకవిజనా మనో మానసోత్తంస’, ‘సంసార సారోదయ హంస’ వంటి మాటలు ఆదినాథ, భరత మొదలైన నిర్వాణం పొందిన ఇతర పరిశుద్ధాత్మల సంబంధించిన మాటలు. ఈ విశేషణలు పంప సన్యాస జీవితాన్ని గడిపాడని సూచిస్తున్నాయి. పంపకు ఆదినాథ, భరత, బాహుబలి ఆదర్శమూర్తులు. వాళ్ళు అనుసరించిన త్రిరత్నాలు మోక్ష సాధనామార్గాలు. పంపకూడా జైనమునులు సమంతభద్ర, పూజ్యపాదులవలె నిర్వాణస్థితిని పొందాలనుకున్నాడు.


ఆదిపురాణ 16వ అధ్యాయం 36వ పద్యంలో
నయవినయ ధియః సమంతభద్రా
విదధతో వ్మాయదామ పూజ్యపాదా
గమయతి పరమాక్షరద్వయం తే
మమ జిన తత్పదయక్షరం జినేంద్రా


జైనమతం జినుడు కావలసిన వారు ‘పరినిష్క్రమణ కళ్యాణ’ (సన్యాసం) ఆచరించాలి. పంపకూడా జినత్వం (కేవల జ్ఞానం) పొందడానికి, తనను తాను సిద్ధపరచుకుని వుంటాడు. అజితనాథ పురాణ పంప తన జీవితంలో ఆచరణలో పెట్టేవాడని చెప్తున్నది. రన్న తాను, పంప, పొన్నలు ముగ్గురు రత్నత్రయాలవంటివారని, జైనమతానికి దీపదర్శనాలవంటివారని రాసాడు. పంప గురువు పేరు జయనంది. అందువల్ల తానుకూడా గురువువలెనె సన్యాసాశ్రమంలో శుభనంది నామాన్ని పొందివుంటాడు.


కవిజనదూళా రత్నత్రయ
పవిత్రమన సగణ పంపనుం పూన్నిగనుం
కవిరత్ననుమీ మూవర
కవిగళ జినసమయ దీపకర పణరూళరే
ఇదు సకల మునీంద్ర వృంద వృందారక శ్రీమతజితసేన భట్టారక శ్రీపాదపద్మ ప్రసాదాసాదిత రత్నత్రయాలంకృత శ్రీమదభినవ కవిచక్రవర్తి, కవిరత్నవిజిరత ఇత్యాది…
పంప బోధన్‍లో నివసించాడా? బోధన్‍ గురించి, దాని పరిసరాల గురించి తన రచన ఆదిపురాణంలో వివరంగా రాసాడు. బోధన్‍ ఆదిపురాణంలో 3సార్లు, విక్రమార్జునవిజయలో 2సార్లు ప్రస్తావించబడుతుంది. జైనంలో దిగంబర శాఖకు బోధన్‍ పవిత్రతీర్థం. బాహుబలి తనరాజ్యానికి రాజధానిగా ఏలిన ప్రదేశం. భరతుడు బాహుబలి భారీ విగ్రహాన్ని బోధన్‍ లోనే నిలిపాడు. బోధన్‍ పురాతన నగరం. మహాభారతంలో, స్కాందపురాణంలో, అంగుత్తనికాయలో పేర్కొనబడిన నగరం. అస్మక రాజధానిగా, రాష్ట్రకూటులకు, వేములవాడ చాళుక్యుల రాజధానిగా వున్న బోధన్‍ పౌదన్యపురం, బహుధాన్యపురం, పోదన,పోతలి, బోధన, ఏకచక్రపురం అని అనేక నామాంతరాలతో పిలువబడ్డది.


చాముండరాయ పురాణ,పే.73 (కెఎస్‍ పి ఎడిషన్‍)
‘దివ్యాపురి రత్నమతో నిధిశ్చ
దివ్యాచమూ భోజన బాజనేచ
దివ్యాని శయ్యాసన వాహనాని
నుట్కేన సార్దంతు దశాంగ భోగం’
శ్రావణ బెళగొళలో లభించిన బొప్పన లేదా సుజనోత్తమ రాసిన క్రీ.శ.1180నాటి శాసనంలో భరతుడు సోదరుడు బాహుబలి కొరకు 525 ధనువుల ఎత్తైన విగ్రహాన్ని పౌదన్యపురంలో ప్రతిష్టించాడని తెలుస్తున్నది.


పై ఆధారాలతో పంప శుభనంది ఒకడేనని సీతారం జాగీర్దార్‍ రాసారు.
అనంతపురం జిల్లాలో కొనకండ్ల గ్రామంలో క్రీ.పూ. 1వ శతాబ్దంలో ఏలయ్యో, ఎల్లయ్యో అనే అతను జైనం స్వీకరించి యత్యాశ్రమంలో పద్మనంది అనే పేరు ధరించాడు. గద్ద ఈకల ఫించాన్ని పట్టుకునేవాడు. అతనికి పద్మనంది, గ•ద్ధపింఛుడు, ఏలాచార్యుడు అని పేర్లు. ఒకప్పుడు కొండకుంద అనే పేరున్న కొనకండ్ల నివాసి కనుక తనకు ఆ వూరి నివాసిగా ఏలాచార్యునికి కొందకుందాచార్యుడనే పేరొచ్చింది. కొండకుందాచార్యుడు సారత్రయ గ్రంథాలను, నియమసారమనే గ్రంథాలను రచించాడు. పద్మనంది దిగంబర జైనులకు గురుపీఠం. అతని శిష్యులలో బలాకపింఛుడు, కుందకీర్తి, సామంతభద్రులు ముఖ్యులు. పంపకు కొండకుందా చార్యుడు, అతని శిష్యులు ఆదర్శం. పంపడు కమ్మనాడులో పుట్టి సబ్బినాడులో జీవించినా సన్యాసం స్వీకరించి శుభనంది పేరుతో బోధన్‍ లో మరణించాడు. (ఆరుద్ర-ఆంధ్రపత్రిక,69వ సంచిక,1979-80, పే.7-12)


ఆధారాలు:

  1. ఆర్‍.శేషశాస్త్రి, జె.సదానందం-కవిజనాశ్రయ కర్త•త్వము-పునఃపరిశీలనము,భారతి, జులై 1988
  2. డా. ముదివేడు ప్రభాకరరావు-భారతీయ సంప్రదాయ భూమిక భిన్నత్వంలో ఏకత్వం
  3. వేటూరి ప్రభాకరశాస్త్రి-చాటుపద్య మణిమంజరి-2
  4. ఆరుద్ర-ఆంధ్రులపై జైనమత ప్రభావం, జైనమతానికి ఆంధ్రుల సేవ, ఆంధ్రపత్రిక,1979-80
  5. డా.ఎం.చిదానందమూర్తి(కన్నడం)-కరీంనగర్‍ జిల్లాలోని పంపమహాకవి సోదరుడు జినవల్లభుడి శాసనం-మరికొన్ని పరిశోధనాంశాలు, భారతి, మార్చి,1980
  6. తిరుమల రామచంద్ర-మనవి మాటలు
  7. పేర్వారం జగన్నాథం(సం.)-నన్నయ భారతి,తె.వి.-1994
  8. పంప భారత(విక్రమార్జున విజయ),1898
  9. వేటూరి ప్రభాకరశాస్త్రి-ప్రబంధ రత్నావళి
  10. దివాకర్ల వేంకటావధాని-ప్రాఙ్నయయుగం
  11. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్వర్ణోత్సవ సంచిక-1994
  12. N.Venkata Rao-Lives of Telugu Poets,1953
  13. శ్లిష్టా రామకృష్ణశాస్త్రి-విమర్శవ్యాసములు,1940
  14. పుట్టపర్తి-తెలుగు కన్నడముల చుట్టరికము
  15. Sitaram Jagirdar-Pampa’s Samadhi, Epigraphia Andhrica, Vol.II,p.31-35)
  16. Nelaturi Venkata Ramanayya -The Kurkyala Inscription- Epigraphia Andhrica-II


ఈ వ్యాసానికి ప్రేరకుడైన చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్‍ కు, పుస్తకదాత బంగారు రామాచారి సార్‍ కు పంప మహాకవి గురించి రాసిన ప్రతి రచయితకు ధన్యవాదాలతో…

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *