
పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పచ్చదనం కూడా ఒక కీలకమైన అంశం. తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతున్న హరితహారం పథకం గొప్ప విజయాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ పథకం నిర్దిష్టమైన అవగాహనతోనూ, నిబద్ధతతోనూ సరైన ప్రణాళికతోనూ కృషి చేయడం వల్లనే యిది సాధ్యమైంది. అంతర్జాతీయ లెక్కల ప్రకారం కెనడాలో ఒక్కో మనిషికి తలసరి 10,163 చెట్లు ఉండగా భారత్‍లో కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కలు తెలంగాణకు వర్తించవు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మొక్కల పెంపకంలో ప్రపంచ స్థాయిలో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది. మొక్కలు నాటటమే కాక వాటి మనుగడకి కృషి చేసి 85 శాతం విజయం సాధించింది. అటవీ సరిహద్దులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా అడవుల విధ్వంసాన్ని తెలంగాణ అటవీశాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో నివారించే కృషి చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హరితహారం అమలుకోసం హరితనిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో ప్రకటించారు. దేవాలయంలో హుండీలాగే తెలంగాణ సమాజం కోసం హరితనిధి ఏర్పాటు చేయడం హర్షణీయం. దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేసాయి. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు ప్రజాప్రతినిధులు, ఐఎఎస్, ఐపిఎస్, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ వ్యాపార సంస్థలు తమ సహకారాన్ని అందించడానికి అంగీకరించడం అభినందనీయం. పిల్లల్లో హరిత నిధి పట్ల పాఠశాల స్థాయి నుండే అవగాహన కల్పించడం, ప్రతి ప్రతివ్యక్తినీ భాగస్వామిని చేయడం అనే ఆలోచన ప్రజల అవగాహన, బాధ్యత, జవాబుదారీతనం అనే నూతన పక్రియకు దోహదం పడుతుంది.
హరితహారం కార్యక్రమం వల్ల మొక్కలు నాటడం తెలంగాణ జీవన విధానంలో ఒక భాగమైంది. పంచాయతీరాజ్, మున్సిపల్ యాక్టుల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ పెట్టడంతో ప్రభుత్వానికి వున్న నిబద్ధతను తెలియజేస్తుంది. హరిత నిధితో పల్లె ప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనాలు, అర్బన్ పార్కులు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంటాస్ట్రీట్ ప్లాంటేషన్‍లో భాగంగా 95% వరకు నాటిన మొక్కలు బతుకుతాయి. హరితహారం వల్ల భూమి కోత నివారణ, భూగర్భ జలాల పెంపు, పక్షి, జంతువులకు ఆవాసం, ఆహారం అందించడం సాధ్యమవుతున్నది. కాలుష్యాన్ని నివారించి, ప్రాణవాయువును అందించడం జీవవైవిధ్యాన్ని కాపాడటంలో హరితహారం ఎంతో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
2018 సం।।లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ కాలపరిమితి, ఋతువుల రాకపోకలకు సంబంధం లేకుండా 365 రోజులు నిరంతరంగా కొనసాగుతున్న, సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు భాగస్వాములవుతున్న గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం దేశ, విదేశాల ప్రముఖుల మన్ననలు పొందింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూసీకి మహర్దశ తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ యుద్ధప్రాతిపదికన హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి వ్యవస్థకు ప్రత్యేక చర్యలు చేపట్టడం సంతోషదాయకం. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోని పట్టణాలకు ధీటుగా గుర్తింపు పొందేందుకు ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళికలను రూపొందించేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవి.
హరితనిధి, హరితహారం రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి, కాలుష్యరహిత ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. ఇందులో ప్రజలను భాగస్వాములను చేయడం ప్రభుత్వ పారదర్శతకు నిదర్శనం.