పట్నంలో షాలిబండా

పట్నంలో షాలిబండ
పేరైనా గోలుకొండ

1968లో హీరో కృష్ణ నటించిన ‘‘అమాయకుడు’’ సీన్మాలో ఎల్‍.ఆర్‍. ఈశ్వరి ఈ పాట పాడి యావత్‍ తెలుగు శ్రోతల హృదయలయలను ఊయలలా ఒక ఊపు ఊపింది. ఈ పాట రాసిన కవి వేణుగోపాలాచార్యులు. ఇటీవలే 90 సం।।ల వయసులో హైద్రాబాద్‍ నగరంలోనే కీర్తిశేషులైనారు. ఇతను ఈ సీన్మా సంగీత దర్శకుడు బి.శంకర్‍ ఇద్దరూ హైద్రాబాద్‍ నగరం ముద్దు బిడ్డలే. షాలి బండ గొప్పతనానికి ఈ పాట ఒకే ఒక ఉదాహరణ. అయితే ఈ పాటలోని మొదటి రెండు చరణాలు అంతకు పూర్వమే తరతరాలుగా జానపదుల నోళ్లల్లో నాని నాని లల్లాయి పదాలుగా, పాటలుగా రూపుదిద్దుకున్నవే. అది ఎలాగంటే…
కుతుబ్‍షాహీల పరిపాలనా కాలం తర్వాత ఆసఫ్‍జాహీ- నిజాంల పరిపాలనా కాలంలో ఈ షాలీ బండా ప్రభుత్వ కార్యకలాపాలకు ఒక ముఖ్య కేంద్రం. చందూలాల్‍ పేష్కార్‍, మహారాజా కిషన్‍పర్‍షాద్‍ దివాన్‍, రాజా శాంరాజ్‍, రాజారాయ్‍రాయన్‍, రాజా రాంబఁ్‍ మొదలగు ఉన్నతోద్యోగుల కార్యాలయాలు, నివాసాలు ఈ ప్రాంతంలోనే ఉండేవి. ఆ విధంగా ఆ రోజులలో షాలిబండ ప్రాంతం మొత్తం నగరానికే తలమానికంలా వెలిగి పోయింది. దీని చుట్టూ హరీబౌలి, గౌలిపురా, లాల్‍దర్వాజా, ఆలియాబాద్‍ లాంటి బస్తీలు వెలిసాయి. షాలిబండ చుట్టుపక్కల అనేక హవేలీలు, దేవుడీలు, మంజిల్‍లు, బాడలు, వాడలు నిర్మించబడినాయి.


అటువంటి బంగారు దినాలలో చుట్టుపక్కల పల్లెల నుంచి రైతు బిడ్డలు ఎడ్ల బండ్ల మీద ఆహార ధాన్యాలను, కూరగాయలను, పండ్లుఫలాలను వేసుకుని నగరానికి వస్తూ ఆనందంగా, పరవశంగా ‘పట్నంలో షాలి బండ పేరైనా గోలుకొండ’ అని లల్లాయి పదాలు, పాటలు పాడుకునేవారు. అందులో నుండే ఆ పాట పుట్టింది.
అంతేకాదు.. ఏనుగుల వీరాస్వామి అనే చెన్నపట్నం ఆసామి అక్కడి కోర్టులో దుబాసీగా పని చేసేవాడు. ఆయన కుటుంబ సమేతంగా కాశీ యాత్రకు పల్లకీలో బయలుదేరి 1830లలో ఈ షాలిబండకు వచ్చి దీని వైభవాన్ని తిలకించి, పులకించి తను రాసిన తొలి తెలుగు యాతాగ్రంథంలో ఈ షాలిబండను ప్రస్తుతించాడు. ‘‘షాలిబండ పురము వీథులలో ఏనుగులు సంచరించును’’ అని కీర్తించాడు. అలనాటి ఆ రోజులలో షాలిబండ అంటే ఈనాటి హైటెక్‍ సిటీ అన్నమాట!
సుమారు 60 సంవత్సరాల పూర్వం నా చిన్నప్పుడు ఒక రోజు అమ్మలక్కల ముచ్చట్లు నా చెవుల బడ్డయి.. చిన్నపుడన్నీ ఆశ్చర్యమే కదా!
‘‘అక్కా ఏడికెల్లి వొస్తున్నవ్‍’’?
‘‘బండ క్రిందికి పోయిన చెల్లే, సౌదలు (సరుకులు) కొననీకె’
ఇంత పెద్ద మనుషులు బండ కిందికి ఎట్ల పోతరో అని ఆ క్షణంల నేను ఆశ్చర్యపోయిన గాని ఆ తర్వాతర్వాత అర్థమై పోయింది. బండ అంటే షాలిబండ అని. హైద్రాబాద్‍ పాతనగరంలో కొన్ని బస్తీల పేర్లు షాలిబండ, గాజీబండ, పిసల్‍బండ, మేకల బండ, రాంబక్షిబండ అని ఉండేవి. ఏమిటీ ఇన్ని బండలు అని పరేషాన్‍ ఔతున్నారా? పేరులోనే పెన్నిధి కలదు అన్నట్లు ప్రతిపేరు వెనుకా ఒక కథ కాని కథ ఉంది.


మూసీ నదికి దక్షిణాన చార్మినార్‍ దాటి చాంద్రాయణ్‍గుట్టకు (అసలు పేరు చెన్నరాయుని గుట్ట) వెళ్లే దారి అంతా ‘‘ఛడావ్‍’ ప్రాంతం. అంటే ఎత్తైన ప్రాంతం. ఆ దారిలో ఎత్తు ప్రాంతాలలో ఉన్న ఆ బస్తీల పేర్లకు చివరన ‘బండ’ అని పేరు స్థిరపడి పోయింది. మిట్ట, లేదా మెట్టకు పర్యాయపదమే ఈ బండ. ఎంత బండ ప్రాంతమైనా ఇంటింటికీ ఒక చేదుడు బావి ఉండేది. తియ్యటి పరిశుభ్రమైన గంగాజలం బాగా పైన్నే ఉండేవి. సర్కారీ నల్లాలు ఎవరి ఇంట్లోనూ ఉండేవి కావు. నగరంలో చెరువులు, బావులు, కుంటలు వందల సంఖ్యలో ఉండటం వలన భూమిలో జలసంపద పుష్కలంగా ఉండేది. అవన్నీ ఆక్రమణలకు గురి కాగానే భూమాత గొంతు దాహార్తితో ఎండిపోయింది. హరీబౌలీ, దూద్‍బౌలీ, ఇమాంబౌలీ, రేతీబౌలీ, హమామ్‍ బౌలీ, ఇంజన్‍ బౌలీ ఇపుడు ఎక్కడున్నాయో, నాగమయ్యకుంట, బొగ్గులకుంట, నల్లకుంటలను ఏ మాయల మాంత్రికుడు మాయం చేసాడో ఎవరైనా చెప్పగలరా?
కుతుబ్‍ షాహీల కాలంలో షా అలీ ఒక సూఫీ ఫకీరు. దారి పక్కన గల రాగిచెట్టు కింద అతని నివాసం, అతని మరణం తర్వాత ఆ రాగి చెట్టు క్రిందే అతని దర్గా (సమాధి) వెలిసింది. అట్లా ఆ ప్రాంతానికి షాలిబండ అన్న పేరు స్థిరపడిపోయింది.


అరవై ఏండ్ల కిందట ఇండ్లలో చేతిగడియారాలు, గోడ గడియారాలు లేవు. అప్పుడు అవి చాలా అరుదు, అపురూపం. ధనికులకు మాత్రమే స్వంతం. పేద ప్రజలందరికి షాలిబండ ఛడావ్‍ మీద రోడ్డు పక్కనున్న రాజా రాయ రాయన్‍ దేవుడీ మీద ఉన్న ‘గఢియాల్‍’ (క్లాక్‍ టవర్‍) మాత్రమే గతి. అది నాల్గు వైపులా కనబడే గంటల గడియారం. ఉదయం పూట ప్రజలు సమయం తెలుసుకోవటం కోసం తమ తమ ఇండ్లల్ల నుంచి ఇవతలికి వచ్చి ఆ గడియారంలోని పెద్ద ముల్లు, చిన్నముల్లు వైపు చూసేవారు. చిన్న పిల్లలు తమ ఇంటి ముందున్న అరుగుల మీదికెక్కి, నిలబడి నిక్కి నిక్కి ఆ గడియారం వైపు చూసి చిన్న ముల్లు తొమ్మిది మీదా పెద్ద ముల్లు పన్నెండు మీదా ఉందని లోపలున్న పెద్దలకు ఇవతల నుండే కేకలు వేసి చెప్పేవారు. చలి రాత్రుల్లో నిద్రరాని ముసలి వారు ఆ గడియారం కొట్టే గంటలను లెక్క పెట్టుకుంటూ ఎప్పుడు తెల్లవారుతదా అని ఎండపొడకోసం ఎదిరి చూసేవాళ్లు. ఆ గడియారం ఆ నాటి ప్రజల జీవితాల్లో ఒక విడదీయలేని భాగంగా ఉండేది. కనురెప్పలు వాల్చకుండా సుదీర్ఘంగా దానివైపు చూస్తుంటే మనిషి ముఖాన్ని చూస్తున్న అనుభూతి కలిగేది. ఒక ముక్కలో చెప్పాలంటే లండన్‍ నగరానికి బిగ్‍బెన్‍ గంటల గడియారం ఎట్లాంటిదో మా షాలిబండకు ఆ దేవుడీ గడియారం అట్లాంటిదన్నమాట. 1904లో రాజారాయ్‍ రాయన్‍ తన దేవుడీపై ఈ గడియారాన్ని ప్రతిష్టించాడు.


యూరపు దేశాలలో ఉండే ‘‘గంటల గడియారాల’’ ప్రభావంతో నైజాంల కాలంలో జంట నగరాలలో అనేక క్లాక్‍ టవర్లను నిర్మించారు. లార్డ్బజార్‍ దగ్గరున్న మహబూబ్‍చౌక్‍లో మొదటి నిర్మాణం 1850లో జరిగింది. ఈ మహబూబ్‍ చౌక్‍ మార్కెట్‍లో కోళ్లను అమ్మేవారు. కావున ఇప్పుడు దీనిఇన ‘‘ముర్గీ చౌక్‍’’ అని కూడా అంటున్నారు. మొదటి సాలార్‍ జంగ్‍ చొరవ వలన ఇది నిర్మించబడింది. ఇక ఆ వరుసలో 1860లో సికింద్రాబాద్‍ క్లాక్‍ టవర్‍ 1900వ సంవత్సరంలో రాంగోపాల్‍సేఠ్‍ పూనికతో ‘జేమ్స్ స్ట్రీట్‍ క్లాక్‍టవర్‍, 1903లో నాటి రక్షణ మంత్రి నవాబ్‍ జఫర్‍జంగ్‍’ కృషితో ఫతేమైదాన్‍ క్లాక్‍టవర్‍ నిర్మించబడింది. 1865లో బ్రిటిష్‍ రెసిడెంట్‍ సుల్తాన్‍ బజార్‍ క్లాక్‍టవర్‍ను నిర్మించాడు. ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా 1869లో చౌమహల్లాపై అందమైన గంటల గడియారాన్ని నిర్మించాడు. 1935లో ఏడవ నిజాం నగరాభివృద్ధి పనులలో భాగంగా మోజంజాహీ మార్కెట్‍ అను రాతి కట్టడాన్ని నిర్మించి దానికి ‘‘శీర్ష మాణ్యికంగా’’ మరో గడియారాన్ని నెలకొల్పాడు. హైదరాబాద్‍ నగర సుందరి కీర్తి కిరీటంలో తళుకుబెళుకుల వజ్ర వైఢూర్యాలే ఈ ‘‘గంటల గడియారాలు’’.
ఇదంతా షాలిబండ గతించిన గత కాల వైభవం. కాలం మారింది. కాలవాహిని అలల వాలున నగరం రూపు రేఖలు మాసిపోయి షాలిబండ రంగు వెలిసిన బస్తీగ, పాతనగరంలో వెనుకబడిన బస్తీలలో ఒకానొక బస్తీగ మిగిలిపోయింది. వలస పాలకుల పక్షపాతానికి బలియై, వెలియై ఒంటరిగా బిక్కుబిక్కుమని నిలిచిపోయింది.


గడియారంలోని చిన్న ముల్లు విరిగిపోయి రాలిపోగా, పెద్దముల్లు ఒంటరిగా నిలిచి ఉంది. దాని రంగు ఎండలకు, వానలకు వెలిసి పోయింది. దాని గోపురం ఒక వైపు కూలిపోయింది. చార్‍సౌ సాల్‍ కా షాన్‍ షాలిబండ. ఇపుడు పట్టించుకునే నాథులు లేక అనామకంగా అనాథగా మిగిలిపోయింది. అది ఇప్పుడొక పేద ప్రజలు నివసించే వెనుకబడిన బస్తీ మాత్రమే.
చివరాఖరిలో ఒక ముక్తాయింపు. ఈ గ్రంధ రచయిత పరవస్తు లోకేశ్వర్‍ ఈ షాలిబండ బస్తీలోనే పుట్టి పెరిగి తన నలభై సంవత్సరాల వయసులో ఈ పాతనగరం నుండి నూతన నగరానికి వలస వెళ్లాడు. ఈ మట్టిలో పుట్టి పెరిగిన మట్టి మనిషి అతను. ఈ ‘‘షహర్‍నామా’’ రచన ద్వారా ఎంతోకొంత ఋణాను బంధాన్ని తీర్చుకున్నాడు.


‘పట్నంలో షాలిబండ పేరైనా గోలుకొండ’ అని పాడుకునే పాత రోజులు మళ్లీ వస్తాయా?
(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *