సమాచార ప్రసార రంగంలో మరో నూతన తరం..5జీ టెక్నాలజీ..!!

‘‘నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమవునురా’’ అన్నది ఒక తెలుగు సినిమా పాటలో వినిపించే లోకోక్తి, అనగా అసాధ్యం అన్నది ఏదో ఒకనాటికి సాధ్యం అవుతుందన్నది దాని అర్థం కావచ్చు. కృష్ణుని జన్మవృత్తాంతంలో తనను సంహరించడానికి పైకి విసిరన కంసుడితో ఆ శిశువు నేను శ్రీకృష్ణుడిని కాదని, నిన్ను వధించడానికి పుట్టిన కృష్ణుడు వేరే చోట సురక్షితంగా పెరుగుతున్నాడని అశరీరవాణి రూపంలో పలికి మాయమవుతుంది. తర్వాతి కాలంలో ఇదే శ్రీకృష్ణుడు శశిరేఖకు ‘మాయాదర్పణం’లో అభిమన్యుడిని చూపించాడని మహాభారతంలో ప్రస్తావించారు. ‘పుక్కిటపురాణాలు’ అని పురాణాలపై ఉన్న విమర్శను కాసేపు పక్కనపెడితే, అశరీరవాణి రూపంలో ఆకాశంలో నుండి శబ్దాలు, మాటలు వినిపించడం అన్నది ఏ రకంగానూ సాధ్యం కాదు. ఇది విచిత్రమైన, సంభ్రమాశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇదే నమ్మశక్యం కాకుండా ఉంటే, మాయా దర్పణంలో ఎక్కడ, ఏం జరుగుతున్నది, ప్రత్యక్షంగా, దృశ్యసహితంగా ప్రదర్శించే వారంటే అసలు నమ్మలేము. ఇలాంటివి సాకారం అయ్యే అవకాశం ఉందన్న ఊహ కూడా మదిలో మెదలదు. కానీ నేటి ఆధునిక కాలంలో సమాచార సాంకేతిక రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పుల ఫలితంగా ఆకాశంలో ప్రయాణించే రేడియోతరంగాల పౌనఃపున్యంతో సెల్‍ఫోన్‍ల ద్వారా మనం పరస్పరం సంభాషిస్తున్నాము. ఆధునిక పరిజ్ఞానమైన ‘4జీ’ సాంకేతిక పరిజ్ఞానం సాకారం కావడంతో ఒకరితో మరొకరు దృశ్య సహితంగా సంభాషించుకొనే (వీడియో కాలింగ్‍) సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ‘4జీ’ సాంకేతిక పరిజ్ఞానం కన్నా మెరుగైన ప్రత్యేకతలు, సదుపాయాలతో ‘5జీ’ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో కూడా అతిత్వరలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్న తరుణంలో, 5జీ ద్వారా మరెన్ని వింతలు, విశేషాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తికరమైన చర్చ ప్రపంచ వ్యాప్తంగా నడుస్తోంది. ఈ సందర్భంలో మనం కూడా 5జీ గురించి తెలుసుకుందామా..!!


5 జీ అంటే :
సమాచార ప్రసారరంగంలో (Tele Communications)లో 1జీ, 2జీ, 3జీ, 4జీ తరువాత వచ్చినదే 5జీ. ఇందులో ‘జీ’ అనేది Generation (తరం)ను సూచిస్తుంది. సూక్ష్మంగా చెప్పాలంటే మొబైల్‍ డేటా నెట్‍వర్క్కు సంబంధించి 5వ తరానికి చెందిన వైర్‍లెస్‍ కమ్యూనికేషన్‍ టెక్నాలజీనే ‘5జీ’గా వ్యవహరిస్తారు. 4జీతో పోలిస్తే 5జీ అనేది మొబైల్‍ నెట్‍ వర్క్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


1 జీ నుండి 5 జీ వరకు – పరిణామ క్రమం :


1జీ :
మొబైల్‍ ఫోన్లలో 1జీ టెక్నాలజీని ఉపయోగించడం 1980లలో ప్రారంభమైంది. మొదటితరం వైర్‍లెస్‍ సెల్యులర్‍ టెక్నాలజీనే 1జీగా వ్యవహరిస్తారు. దీని ద్వారా శబ్దాలను గ్రహించి మాట్లాడుకోవడం (Voice Calls)మాత్రమే సాధ్య మయ్యేది 1జీ టెక్నాలజీతో సమాచారాన్ని ప్రసారం చేయడానికి అన్‍లాగ్‍ సిగ్నల్స్ను ఉపయోగిస్తారు. (అన్‍లాగ్‍ సిగ్నల్స్ అనేవి – భౌతిక కొలతలను సూచిస్తూ నిరంతరంగా ప్రయాణించే సంకేతాలు) అయితే 1జీ టెక్నాజీ వాడడం వల్ల మొబైల్‍ ఫోన్లలో బ్యాటరీ మన్నిక సరిగాలేక పోవడం (Poor Battery Life),, మాటలు సరిగా వినిపించక పోవడం, మాట్లాడే సమయంలో అకస్మాత్తుగా కాల్‍ ఆగిపోవడం (Dropped Calls) లాంటి అసౌకర్యాలు ఉండేవి. 1జీ టెక్నాలజీ గరిష్ఠ వేగం 2.4 కేబీపీఎస్‍.

2 జీ :
మొబైల్‍ ఫోన్స్ 1జీ నుండి 2జీలోకి ప్రవేశించడం ద్వారా సాంకేతికంగా మొదటి పరోగతి సాధించాయి. 1జీ మరియు 2జీల మధ్య ప్రధానమైన తేడా రేడియో సిగ్నల్స్ అని చెప్పవచ్చు. మొదట చెప్పుకున్నట్టు 1జీలో అన్‍లాగ్‍ రేడియో సిగ్నల్స్ను ఉపయోగించగా 2జీలో డిజిటల్‍ రేడియో సిగ్నల్స్ను ఉపయోగిస్తారు (డిజిటల్‍ సిగ్నల్స్ అనేవి – సమయ విభజన ద్వారా వేరు చేయబడి, డిజిటల్‍ మాడ్యులేషన్‍ ద్వారా ఉత్పత్తి చేయబడే సంకేతాలు) 2జీ నెట్‍ వర్క్ను మొట్టమొదటిసారిగా జీఎస్‍ఎమ్‍ ప్రమాణం (Standards)లో ఫిన్‍లాండ్‍ చెందిన రేడియో లింజా (ప్రస్తుతం ఎలీసాఓయిజ్‍లో భాగం) 1991లో ప్రవేశపెట్టింది.
2జీ ప్రధాన ఉద్దేశం సురక్షితమైన మరియు విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడమని చెప్పవచ్చు. 2జీలో మొదటిసారిగా సీడీఎమ్‍ఎ (CDMA ` Code System for mobile communications)మరియు జీఎస్‍ఎమ్‍(GSM ` Global Service System for Mobile communications) ప్రమాణాలను ప్రవేశపెట్టారు. 1జీలో వాయిస్‍ కాల్స్ మాత్రమే అందించగా, 2జీలో వాయిస్‍ కాల్స్తో పాటు డేటా ఆధారిత సేవలతో చిన్న చిన్న సేవలైన ఎస్‍ఎమ్‍ఎస్‍ (SMS) మరియు ఎమ్‍ఎమ్‍ఎస్‍ (MMS)లను అందుబాటులకి తీసుకురావడం జరిగింది. వీటితో పాటు అదనంగా 2జీలో ఇంటర్నెట్‍ రోమింగ్‍, కాన్ఫరెన్స్ కాల్స్, కాల్‍హోల్డ్ మరియు సేవల ఆధారంగా రుసుములు నిర్ణయించడం (billing baced or Service), కాల్‍ మరియు టెక్టస్ ఎన్‍క్రిప్షన్‍తో పాటు జీపీఆర్‍ఎస్‍ (GPRS – General Packet Radio Service) ఎడ్జ్ (EDGE – Enhanced data Rates for GSM Evolution)తదితర సేవలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. జీపీఆర్‍ఎస్‍ ఆధారిత 2జీ సేవల వేగం 50 కేబీ పీఎస్‍ కాగా (EDGE) ఆధారిత 2జీ సేవల వేగం 1ఎంబీపీఎస్‍.

2జీ – 2.75 జీ :
2జీ నుండి 3జీకి వెళ్ళేముందు మధ్యలో 2.5జీ మరియు 2.75 జీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిద్వారా నెమ్మదిగా డేటా పంపిణీ చేసే సౌకర్యం (Slow data transmission) వాడుకలోకి వచ్చింది. 2.5జీలో కొత్తగా ప్యాకెట్‍ స్విచ్చింగ్‍ టెక్నిక్‍ (Packet switchning Technique)ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఇది 2జీ కన్నా మరింత సమర్థవంతంగా పనిచేసింది. తదనంతరం 2.75జీ వచ్చింది దీనిద్వారా డేటా పంపిణీలో వేగం మరింత పెరిగింది. అమెరికాకు చెందిన ఎటీ & టీ (AT&T) జీఎస్‍ఎమ్‍ నెట్‍వర్క్ మొదటిసారిగా 2.75 జీని EDGE టెక్నాలజీతో ప్రవేశపెట్టింది. అయితే 2.5జీ, 2.75 జీలు అంతగా ప్రాచుర్యం పొందలేదు.

3జీ :
3జీ ప్రపంచ వ్యాప్తంగా 2001లో అందుబాటులోకి రాగా, మనదేశంలో 2008లో ప్రవేశపెట్టడం జరిగింది. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకుగానూ, యూఎంటీఎస్‍ (UMTS – Universal Mobile Telecommunications system) అన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని 3జీకి అనుసంధానించడం జరిగింది. తద్వారా డేటా సేవలు మరింత వేగంగా అందించేందుకు వీలు కలిగింది. ఇంటర్నేషనల్‍ టెలికామ్‍ యూనియన్‍ రూపొందించిన, ఇంటర్నేషనల్‍ మొబైల్‍ టెలికమ్యూనికేషన్స్ – 2000 (IMT-2000) లక్ష్యాలకు, ప్రమాణాలకు అనుగుణంగా 3జీ నెట్‍వర్క్ సేవలు పనిచేస్తాయి. డేటా సేవలు చాలా చౌకగా లభించాయి.
3జీ ద్వారా వెబ్‍ బ్రౌజింగ్‍, ఈ మెయిల్‍, వీడియో డౌన్‍లోడింగ్‍, పిక్చర్‍ షేరింగ్‍, స్ట్రీమింగ్‍తో కూడిన మల్టీమీడియా సేవలతో పాటు ఆడియోను కంప్రెస్‍ చేయడం ద్వారా ఒకే పౌనఃపున్యంనందు కొన్నివేల మంది ఏక కాలంలో మాట్లాడుకునే సదుపాయం లాంటి విశిష్టమైన ప్రయోజనాలు సిద్ధించాయి. యూఎన్‍ ఇంటర్నేషనల్‍ టెలీ కమ్యూనికేషన్స్ యూనియన్‍ యొక్క (ఐఎంటీ-2000) ప్రమాణాల ప్రకారం 3జీ వేగం కదలకుండా స్థిరంగా ఉన్న పరికరాలలో 2 ఎంబీపీఎస్‍గానూ, కదిలే వాహనాలలో 384 కేబీపీఎస్‍గానూ ఉంటుంది. 3జీ తర్వాత, 4జీ రావడానికి ముందు 3.5 జీ, 3.75జీ కూడా అందుబాటులోకి వచ్చాయి. 3జీ ద్వారా ఆశించిన గరిష్ఠ వేగం 21.6 ఎంబీపీఎస్‍.


4జీ (ప్రస్తుతం నడుస్తున్న తరం) :
3జీతో పోలిస్తే 4జీ చాలా విభిన్నమైనది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2009లో అందుబాటులో రాగా, మన దేశంలో 2012లో ప్రవేశపెట్టారు. సాంకేతిరంగంలో వచ్చిన మార్పుల వల్ల అసాధ్యం అనుకున్న సేవలన్నీ 4జీతో సాకారమయ్యాయి. అత్యధిక వేగం (High Speed), అత్యధిక నాణ్యత (High Quality), మరియు అత్యధిక సామర్థ్యం(High Capacity)తో కూడిన సేవలను వినియోగదారులకు అందించడం 4జీ ప్రధాన ఉద్దేశ్యంగా చెప్పవచ్చు. అంతేకాకుండా చాలా తక్కువ ధరకే వాయిస్‍ మరియు డేటా సేవలతో పాటు మల్టీమీడియా మరియు ఇంటర్నెట్‍ ఓవర్‍ ఐపీ తదితర సేవలు అందించడం జరిగింది. ఐపీ టెలిఫోనీ, గేమింగ్‍ సర్వీసెస్‍, హై డెఫనేషన్‍ మొబైల్‍ టీవీ, వీడియో కాన్ఫరెన్సింగ్‍, 3డీ టెలివిజన్‍ మరియు క్లౌడ్‍ కంప్యూటింగ్‍ తదితర అత్యాధునిక సేవలు కూడా వినియోగదారులకు లభించాయి.


4జీలో ఇంతటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడానికి ఎమ్‍ఐఎమ్‍ఒ (MIMO – Multiple input and Multiple output). మరియు ఓఎఫ్‍డీఎమ్‍ (OFDM – Orthogonal Frequency Division Multiplexing) లాంటి టెక్నాలజీలు ఉపయోగించడమే నని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా 4జీలో వైమ్యాక్స్ (Wimax – ప్రస్తుతం వాడుకలో లేదు), ఎల్‍టీఈ (LTE – Long term Evolution, ప్రస్తుతం విస్తృతంగా వాడుకలో ఉంది.) లాంటి ప్రమాణాల (standards)ను కూడా ఉపయోగిస్తూ సేవలను మరింత నాణ్యతతో అందించడం జరుగుతోంది. రాబోయే తరాలకు (Future Generations) సంబంధించిన ఫోన్లన్నీ కాలానుగుణంగా Backward Compatible (వెనుకటి తరాలకు సంబంధించిన 2జీ, 3జీ నెట్‍వర్క్లలో కూడా 4జీ ఫోన్లు పనిచేయడం) సామర్థ్యాన్ని కూడా కల్గి ఉండడం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పవచ్చు. 4జీ ద్వారా అందజేయబడే సేవలన్నీ వినియోగదారులకు సులువుగా చేరడానికి ఓఎఫ్‍డీఎమ్‍ (OFDM) టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఓఎఫ్‍డీమ్‍ (OFDM)డిజిటల్‍ మాడ్యులేషన్‍ (పరిస్థితుల కనుగుణంగా సంకేతాలను మార్పు చేయడం) కల్గి ఉండి ప్రతి సిగ్నల్‍ను విభిన్న పౌనఃపున్యాలలో (Different Frequncies) చిన్నచిన్న సమూహ ప్రసారాలుగా (Narrow band Channels)గా విడదీస్తుంది. తద్వారా మరింత నాణ్యతతో కూడిన సేవలు అందజేయడానికి వీలవుతుంది. 4జీ ద్వారా వాయిస్‍ కాల్స్ జీఎస్‍ఎమ్‍ (GSM), యూఎమ్‍టీఎస్‍(UMTS), సీడీఎమ్‍ఏ 2000 (CDMA2000) రూపాలలో అందించడానికి పెద్ద ఎత్తున మౌళిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. అయితే ఎల్‍టిఈ ప్రమాణాలను (Standard) వినియోగించి వాయిస్‍ కాల్‍ నెట్‍వర్క్ను పునర్నిమించవచ్చు. 4జీ అనంతరం మరియు 5జీ కన్నా ముందు 4.5జీ మరియు 4.9జీ అందుబాటులోకి వచ్చాయి. 4జీ గరిష్ఠవేగం కదిలే పరికరాలలో 100 ఎంబీపీఎస్‍ మరియు తక్కువ చలన శక్తి కల్గి స్థిరంగా లేదా కదులుతున్న పరికరాలలో 1జీబీపీఎస్‍ వేగాన్ని కల్గి ఉంటుంది.
4జీలో లేటెన్సీ 300 మిల్లీ సెకండ్స్ నుండి 100 మిల్లీ సెకండ్స్కు తగ్గించబడింది. ఒక సెల్‍ఫోన్‍ లేదా ఉపకరణంలో ఏదైనా పనిచేయడానికి మనం మీద నొక్కినప్పటి నుండి ఆ పని పూర్తవడానికి పట్టే సమయాన్ని లేటెన్సీ అంటారు. (తరువాయి వచ్చే సంచికలో)


పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *