తెలంగాణానేలిన శంకరగండరస కొత్తచరిత్ర

రాష్ట్రకూటులేలిన దక్కనులో భాగంగా తెలంగాణా కూడా వుంది. రాష్ట్రకూటుల అధికారాన్ని ఒకసారి మన్నిస్తూ, మరోసారి వ్యతిరేకిస్తూ పాలించిన వేములవాడ చాళుక్యులే తెలంగాణాలో పాలకులుగా కనిపిస్తారు. తెలంగాణా చరిత్రలో రాష్ట్రకూటులను లెక్కించకపోవడానికి కారణమిదేనేమో. కాని, తెలంగాణా (నల్గొండ, మెదక్‍, వరంగల్‍ జిల్లాల) నేలిన శంకరగండరస శాసనాలు తెలంగాణాను పాలించిన రాష్ట్రకూట ప్రతినిధు లున్నారనే విషయాన్ని ధ్రువ పరుస్తున్నాయి.


తెలంగాణాజిల్లాలలో (పాత)జిల్లాలు నల్గొండ, వరంగల్‍, కరీంనగర్‍, మహబూబ్‍ నగర్‍, మెదక్‍, నిజామాబాదుల శాసనాలు సంపుటాలుగా అచ్చయినాయి. వీటిలో నల్గొండ, వరంగల్‍, మెదక్‍, మహబూబు నగర్‍ జిల్లా సంపుటాలలో మాత్రమే రాష్ట్రకూట శాసనాలున్నాయి. మెదకులో 1.మల్లికార్జునపల్లి (క్రీ.శ.846), 2.వెండికోలు (క్రీ.శ.967), వరంగల్లులో 3.ఖాజీపేట (క్రీ.శ.872), 4.జాఫర్‍ ఘడ్‍, 5.ఆకునూరు, నల్లగొండలో 6, 7. వెల్మజాల (క్రీ.శ.907), 8. తుమ్మల గూడెం, 9. మంతపురి (క్రీ.శ.972), 10. ఆమనగల్లు (క్రీ.శ.888) (రచయిత పరిష్క రించినది, అముద్రితం), మహబూబు నగర్లో 11.మీనాంబరం (క్రీ.శ.939-967) శాసనాలున్నాయి. ప్రస్తుతం ఈ 11 శాసనాలు తెలంగాణాలో లభిస్తున్న రాష్ట్రకూటుల శాసనాలు. ఇవి క్రీ.శ.846 నుంచి 972సం.ల మధ్య వేయబడినవి. వేములవాడ చాళుక్యుల శాసనాలు, పై శాసనాలు తెలంగాణాలో రాష్ట్రకూటులు పాలించిన వివరాలను వివరిస్తున్నాయి. పై శాసనాలలో 1,4,5,8,10 శాసనాలు శంకరగండరస గురించి చెప్పినవి.


రాష్ట్రకూట చక్రవర్తి ధ్రువుని పెద్దకొడుకు స్తంభుడు కాకుండా 2వ కొడుకు గోవిందుడు సింహాసనమెక్కాడు. దాంతో స్తంభుడు తిరుగుబాటు చేసాడు. కాని, ఓడిపోయి బందీయైనాడు. గోవిందుడు అన్నను గౌరవించి, గంగవాడి పాలకుని చేసాడు. కొంతకాలానికి స్తంభుడు క్రీ.శ.810లో మరణించాడు. అతనివారసుడైన శంకరగణను రాజును కానివ్వలేదు గోవిందుడు. శివమారను రాజును చేసాడు. కాని, అతడు కూడా తిరుగుబాటులో భాగస్తుడైనాడు. అతనిస్థానంలో వచ్చిన రాజమల్ల కూడా రాష్ట్రకూటులపట్ల విధేయంగా వుండలేదు. బంకేయ అనే యోధుడు అతనిని కావేరి అవతలికి తరిమివేసాడు. కొంతకాలానికి రాజమల్ల మళ్ళీ గంగవాడినాక్రమించాడు. (The Early History of the Deccan-Ed. G.Yazdani,1960-p.274-276) శంకరగండరస రాష్ట్రకూటరాజు గోవిందుని పెద్దన్న స్తంభుని కొడుకని, గంగవాడి పాలనాధి కారాన్ని తనకివ్వనందుకు క్రీ.శ. 817సం.లో 1వ అమోఘవర్షుని మీద జరిగిన తిరుగుబాటులో భాగస్వామి అయినాడని మెదక్‍ జిల్లా శాసనసంపుటి ఉపోద్ఘాతం (p.xiv)లో వివరించబడింది.


రాష్ట్రకూటరాజ్య వారసుడు కావలసిన గోవిందుని కొడుకు అమోఘవర్షుడు చిన్నవాడు. అందువల్ల అతనికి రక్షణకు విశ్వసనీయమైన, సమర్థుడైన తన తమ్ముని కొడుకు, గుజరాతు పాలకుడు కర్కను మాన్యఖేటకు రప్పించాడు. క్రీ.శ.814లో గోవిందుడు మరణించాడు. బాలచక్రవర్తి 1వ అమోఘవర్షునికి వ్యతిరేకంగా క్రీ.శ.817లో పెద్ద తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు దారుల పేర్లు ప్రత్యేకంగా ఎక్కడా పేర్కొనబడలేదు. రాజరక్షకుడు కర్క పాతాలమల్ల ఈ తిరుగుబాటును క్రీ.శ.821 వరకు అణిచి వేసాడు. వేంగీచాళుక్య విజయాదిత్య మద్దతుతో సాగిన ఈ పోరులో అమోఘవర్షుడు పారిపోయి తలదాచుకున్నాడు. కాని, కర్కునివల్ల తిరుగుబాటు వీగిపోయింది. అమోఘవర్షుడు సింహాసనం అధిష్టించాడు.
కొక్కల కొడుకుగా, 2వ  కృష్ణుని భార్య సోదరునిగా శంకరగణ పేర్కొనబడ్డాడు. ఇతనికే సంకిల అనే మారు పేరుంది. అందువల్లనే ఈ శంకరగణనే శంకరగండరస అని, అతనికి పానూరవాడి, కొలను పాకలను పాలించే అధికారబాధ్యతలు అప్పగించినట్లు చెప్పడం కష్టం. ఎందుకంటే శంకరగండరస అమోఘవర్షుని పాలనాకాలం నుంచి అకాలవర్షుని పాలనదాకా పానూరవాడి-27000, కొలనుపాక- 20000లను పాలించినట్లు శాసనాధారాలున్నాయి. చరిత్రలో శంకరగండరస గుర్తింపు సరిగా లేదు. యాజ్దాని ఎడిటరుగా ‘దక్కను తొలిచరిత్ర-1960’ రచించేటప్పటికి వరంగల్‍, నల్గొండ, మెదక్‍ శాసనాలు ప్రచురించబడలేదు. కొత్త శాసనాల వివరాలు వెల్లడి కాలేదు. దానితో చరిత్రకారులలో శంకరగండరస చారిత్రకత మీద సందేహాలు చోటు చేసుకుని ఊహలకు దారితీసాయి.
కక్కలదేవుడు తర్వాత ఆహవమల్ల సామంతునిగా పనిచేసిన మాటూరువంశపు శాంతివర్మ కర్ణాటకరాష్ట్రం షిమోగాజిల్లాలోని సోరబ్‍ తాలూకాప్రాంతాన్ని ఏలుతున్నపుడు వేయబడిన వేలూరు అగ్రహారం దానశాసనంలో మరొక శంకరగండకరస ప్రస్తావించబడ్డాడు. (ఎపిగ్రాఫియా కర్ణాటికా, వా.8, పే.477, 479)


మెదకుజిల్లా శాసన సంపుటిలోని క్రీ.శ.846నాటి 1వ శాసనం (మల్లికార్జునపల్లి) శంకరగండరస పానూరు వాడి-27000 పాలకుడని పేర్కొంటున్నది. పాణూరవాడి-27000ల నాడు మెదక్‍ జిల్లాలోని సదాశివపేట, ఆందోలు ప్రాంతమైవుంటుందని చరిత్రకారుల అభిప్రాయం. శంకరగండకరస (శ్రీమత్పారణ కుల)పాణరవంశం వాడని జాఫర్గఢ్‍ శాసనం చెప్తున్నది. పూర్వ వరంగల్‍ జిల్లా శాసన సంపుటిలోని ఆకునూరు, జాఫర్‍ గఢ్‍ శాసనాలు, పాత నల్గొండజిల్లా శాసన సంపుటిలోని తుమ్మలగూడెం శాసనం, ఈ రచయిత పరిష్కరించిన ఆమనగల్లు (నల్గొండ జిల్లా) కొత్తశాసనం శంకరగండరసను పేర్కొంటున్నాయి. క్రీ.శ.888సం. ఆమనగల్లు శాసనంవల్ల రాష్ట్రకూటచక్రవర్తి 2వ అకాలవర్షుని పాలనాకాలంలో మహామండలేశ్వరుడు శంకరగండరస కొల్లిపాక-20000లనాడు పాలకుడని తెలుస్తున్నది. ఆమనగల్లులో ఒక జైనబసదిని నిర్మించాడని శాసనంలో చెప్పబడ్డది.
ఆమనగల్లు శాసనం శంకరగండరస కొలిపాక-20000ల నాడు రాజధానిగా పాలించాడని చెప్తున్నది. అమోఘవర్షుని కాలంలోనే కొలిపాకపాలకుడుగా, మహాసామంతాధిపతి, మహామండలేశ్వరుడుగా నియమింపబడ్డ శంకరగండరస పేరుమీదనే జాఫర్‍ గడ్‍, ఆకునూరు, కడవెండి, తుమ్మలగూడెం, ఆమనగల్లు శాసనాలు వేయబడ్డాయి. మల్లికార్జునపల్లి శాసనంలో శంకరగండరస పాణూరవాడి-27000 నాడు పాలకుడుగా ప్రస్తావించ బడ్డాడు. శంకరగండరస ఇంత పెద్దరాజ్యాన్ని పాలించినవాడైనా చరిత్రలో ప్రస్తావించబడలేదు. తన పేరుండి, తేదీలేని శాసనాలతో శంకరగండరసకాలాన్ని నిర్ణయించడంలో చరిత్రకారులకు సందేహం మిగిలిపోయింది. ఆమనగల్లు శాసనంలో లభించిన శాసనకాలం, క్రీ.శ.888 ఆ సందేహాన్ని తీర్చింది. జాఫరుఘడ్‍ (వేల్పుగొండ) శాసనంలో శంకర గండరస సుదీర్ఘమైన వర్ణనలతో కీర్తించబడ్డాడు. అది శంకరగండరస ప్రత్యేకతను వివరిస్తున్నది.


కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్లునికాలంలో కొలనుపాక-7000ల నాడును మహాసామంత ‘అమిలరస’ పాలిస్తున్నపుడు రాష్ట్రకూట వంశానికి చెందిన మహాసామంత శంకరగండరసకిచ్చిన పూర్వపు తామ్రపత్రాల ప్రకారం, అతడు నిర్మించిన రావుండయ్య జైనబసదికు చేసినదానం తాళవ•త్తిని పునరుద్ధరించబడ్డట్లు (నల్గొండ జిల్లా శాసనసంపుటి-2,నం.4) క్రీ.శ. 1067సం. నాటి కొలనుపాక శాసనంలో పేర్కొన బడ్డది. చక్రవర్తి త్రిభువన మల్లదేవుని కాలం క్రీ.శ.1077లో కొల్లిపాకెయగోవ, మహా మండలేశ్వరునిగా నియమించబడ్డ శంకర గండరస ‘లత్తలూరు పురవరేశ్వర, రట్టమార్తాండ, జయధీర, భువనైకరామ, బిరుదంకభీమ, క్షత్రియ పవిత్ర, సిద్ధమైలారదేవ లబ్ధవర ప్రసాదు’నిగా కీర్తించబడ్డాడు. (నల్గొండజిల్లా శాసనసంపుటి-14,క్రీ.శ.1077)


మొదట పేర్కొన్న రాష్ట్రకూటులపాలనా కాలంనాటి శంకర గండరస (క్రీ.శ.888సం.), క్రీ.శ.921సం.లో ప్రస్తావించబడిన శంకర గండరస, కళ్యాణీచాళుక్యుల పాలనాకాలంనాటి శంకర గండరసకు (క్రీ.శ.1077సం.) నామ సామ్యం, బిరుదులలో కొంత సామ్యమున్నప్పటికి ముగ్గురు వేర్వేరే.
రాష్ట్రకూటుల చరిత్రను రాసిన కర్ణాటక చరిత్రకారుడు హంప నాగరాజయ్య శంకరగండరస అసగమరస కొడుకని, అతనికాలం క్రీ.శ.950 అని పేర్కొన్నాడు. బహుశః అది క్రీ.శ. 921సం. నాటి వేలూరుశాసనంలోని శంకరగండరస గురించి అయివుంటుంది. శంకరగండరస 3వ ఇంద్రునికి, అతని కొడుకులకు, 3వ  కృష్ణుని వరకు విధేయ యోధుడుగా వున్నాడని, క్రీ.శ.924లో బనవాసి-12000 రెండుముక్కలైనపుడు ఒకభాగానికి 2వబంకేయ, రెండవ భాగానికి శంకరగండరస పాలకులైనారని (ARIE 1947-48, No.203, p.25) హంపనాగరాజయ్య తన పుస్తకంRashtrakutas Re-visitedలో రాసాడు. కాని క్రీ.శ.1074, 1077సం.లలో కొలిపాక పాలకుడుగా ఉన్న అసగమరసకు శంకరగండరసకు సంబంధం వుందని చెప్పడానికి వీలుంది. (నల్గొండ జిల్లా శాసనసంపుటి-నం.11,12)
శంకరగండరసకున్న బిరుదుల గురించి హంప నాగరాజయ్య గొప్పగా వివరించారు. జైనంలో వుండే 63మంది మహాపురుషులకు విశిష్టమైన పేర్లుంటాయి. అటువంటి బిరుదనామాలు కలిగివున్న వారిలో 1వ అమోఘవర్షుడు-వీరనారాయణ, 4వ ఇంద్రుడు, 3వ గోవిందుడు- కీర్తినారాయణ, 2వ బూతుగ-గంగనారాయణ, 2వ అరికేసరి -ఉదారనారాయణ, అన్నిగదేవ-నన్నినారాయణ, శంకంర గండరస-విద్విష్ట నారాయణ అనే బిరుద నామాలతో పేర్కొన బడ్డారు. రాష్ట్రకూటుల కాలంలో తెలంగాణా నేలిన వారిలో వేములవాడ చాళుక్యులతోపాటు, శంకరగండ రసను తప్పక పేర్కొనాలి.


కొలనుపాకలో జైన దేవాల యాలను క్రీ.పూ.638లో శంకరరాజు నిర్మించాడని జైనులు చెప్తుంటారు. ఈ జైనదేవా లయాలను శంకర గండరసనే నిర్మించివుంటాడు. కొలనుపాకలో దేవాలయాల నిర్మాణ వాస్తును పరిశీలించినపుడు అవి 9,10 శతాబ్దాల లోనే ఎక్కువభాగం కట్టించినట్లు తెలుస్తుంది. ఇపుడు కులమఠాలుగా చెప్పబడుతున్నవన్నీ రాష్ట్ర కూటులనాటి జైనబసదులే. ఆ గుడులలో జైనతీర్థంకరుల అధిష్టాన పీఠాలో, శిల్పాలో, శాసనాలో అగుపిస్తున్నాయి. వీరనారాయణ దేవాలయం కూడా జైనమందిరమే. అమోఘవర్షునికి ‘వీరనారాయణ’ అనే నామాంతరం వుంది. అతని పేరన కట్టిందే ఈ దేవాలయం. ఇప్పటికి గుడి ముందర జైనమాన స్తంభం వుంది. కొలనుపాక పురావస్తు మ్యూజియంకు తరలించిన 4అడుగుల ఎత్తైన జైనతీర్థంకరుడు మహావీరుని శిల్పం ఈ గుడిలోనిదే. గుడి గోడల్లో జైన శిల్పాలు, శాసనాలు ఇప్పటికి వున్నాయి. ప్రధాన జినదేవర మందిరం (అతిశయ బసది) కూడా శంకరగండరస కొలను పాక ఏలికగా వున్నపుడు కట్టించిందేనని చెప్పవచ్చు. శంకరగండరస నిర్గ్రంథ సంప్రదాయ జైనుడని అంటారు.


విజ్ఞానసర్వస్వం, సం.9 (పే. 156- 159)లో నేలటూరి వేంకట రమణయ్య రాసిన ‘రాష్ట్రకూటులు’లో ‘ఒకప్పుడు గంగవాడి ప్రభువైన ఎరయ నీతిమార్గుడు రాష్ట్రకూటులను ధిక్కరించి స్వతంత్రుడు కావడానికి ప్రయత్నం చేసాడు. పరిసరదేశాల్ని ఏలుతున్న సామంత రాజులు అనేకులు అతనితో ఏకీభవించారు. వారిని అణిచివేసి, తన అధికారాన్ని నిలుపుకున్నాడు అమోఘవర్షుడు. అతని ఆజ్ఞతో బంకెయ నల్లకేతనుడనే సేనాధిపతి గంగవాడి మీద దాడిచేసాడు. అపుడు పూర్తికాని దాడిని తర్వాత గుణగవిజయాదిత్యుడు విజయవంతంగా కొనసాగించాడు. దూరదృష్టిగల అమోఘవర్షుడు నీతిమార్గునికి రాజ్యాన్ని తిరిగివ్వడమే కాకుండా అతని కొడుకు బూతుగకు తనకూతురు అబ్బలబ్బెను ఇచ్చి పెండ్లిచేసాడు. అట్లా రాష్ట్రకూట, గాంగ వంశాలకు బాంధవ్యాలు కుదిరాయి. ఈ కథలోని ఎరయ నీతిమార్గుడు జాఫర్గఢ్‍ శాసనంలో పేర్కొనబడిన ‘హెరియమ్మ’నే కావచ్చు. ‘హరియమ్మరాజ జ్యేష్టుడు, వంశోద్ధారుడు, అతని జ్యేష్ట పుత్రుడు మన శంకర గండరసని అదే శాసనం చెప్తున్నది.


శంకరగండరస కాలం నిర్ధారించడానికి ఆమనగల్లు శాసనం ఆధారం. శంకరగండరస గుణ గణాలను, అమోఘ వర్షునితో అతని సమకాలికతను వివరించే జాఫర్‍ గఢ్‍ శాసనం మరొక ప్రధానమైన ఆధారం.
ఈ శాసనంలో శంకరగండరసకు రాష్ట్రకూట కులతిలకుడు, పాణరవంశం (పాణ..రేంద్రనామగ) వాడు, గరుడ లాంఛనుడు (గరుడకేతన), సాహసశక్తి సంపన్న, దుష్టనిగ్రహ, శిష్ట ప్రతిపాలనరాగి, రట్టబలకె, భువనైకధీర, పరమ మహేశ్వర, నయవినయ, సత్య శౌచాచార, శీలసంపన్న, ధర్మ విచార, ఏకోగ్ర మహాతప, సమ్యక్త్వ పూర్వ అనే ప్రశస్తులున్నాయి. శంకరగండ పాలనా కాలంలో అరియకుండె (హన్మ కొండ) సమీపంలోని జాఫర్గఢ్‍ (వేల్పు గొండ) కొండపై అక్కడ భూరి దుర్గం నిర్మించబడిందని, కొండపై దేవగుండం తొలిపించ బడినదని, దానిని ‘అమోఘ కూటగిరి’ అని పిలిచినట్లు, నృపతుంగ భూపాలుడు (1వ అమోఘ వర్షుడు), దంతెదుర్గుల ప్రస్తావనలు కూడా జాఫర్గఢ్‍ శాసనంలో వున్నాయి.

శ్రీ రామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *