ఒట్టి రాళ్ళేగా… అని తీసిపారేసేందుకు వీలుకాని రాళ్ళు… దక్కన్ శిలలు. ఆ శిలలకే గనుక ప్రాణం ఉంటే ఒక్కో శిల ఒక్కో అద్భుతగాధను వినిపిస్తుంది. ఆదిమానవుడికి ఆసరా ఇచ్చిన శిల ఒకటైతే… ఆ మానవుడి ఉలి దెబ్బలను భరిస్తూ చరిత్రకు ఆధారంగా నిలిచింది మరో శిల. ఒక రాజవంశానికి ప్రతీక ఒక శిల అయితే ఒక దేవుడికి సంకేతం మరో శిల. ఏ శిలను చూసినా ఒక్కో అనుభూతి అలా మదిని ఆహ్లాదపరుస్తుంది. ఇటీవలి కాలంలో మాత్రం ఈ అనుభూతి గుండెను పిండేస్తోంది. మరుసటి రోజుకు ఆ శిల అక్కడ ఉంటుందో, ఉండదోనన్న అనుమానం వేధిస్తోంది. పెరిగిపోతున్న నగరీకరణ ఒక కారణం అయితే, సహజ వనరుల అపరిమిత వెలితీత మరో కారణంగా చెప్పవచ్చు. ఈ దక్కన్ రాక్ ఫార్మేషన్స్ను పరిరక్షించడంలో ‘సేవ్‍రాక్ సొసైటీ’, ‘ఫోరంఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ గణనీయంగా కృషి చేస్తుంది.
దక్కన్ శిలలకు భౌగోళికంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. యావత్ భూగోళంలోనే అత్యధిక స్థాయిలో వోల్కానిక్ ఫీచర్లను కలిగి ఉన్న శిలల్లో దక్కన్ శిలలు కూడా ఉన్నాయి. వెల్లువెత్తిన లావా పొరలు పొరలుగా ఘనీభవిస్తే ఇవి రూపుదిద్దుకున్నాయి. దక్కన్ శిలలకు కనీసం 68 మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందని భావిస్తారు. క్రిటాసియస్ పీరియడ్ చివరి దశలో ఇది రూపు దిద్దుకున్నట్లు అంచనా. పశ్చిమ కనుమల్లో ముంబయి సమీపంలో సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న లావా ఉప్పెన దక్కన్ శిలలు ఏర్పడేందుకు ఆధారభూత మైందని అంటారు. ఈ ఏర్పాటు పక్రియ కనీసం 30వేల ఏళ్ళ పాటు కొనసాగి ఉండవచ్చునని అంచనా.
అప్పట్లో ఈ లావా సుమారు 1.5 మిలియన్ చ.కి.మీ. మేర ప్రవహించినట్లు తెలుస్తోంది. నేటి భారత్‍లో సగభాగానికి ఇది సమానం. భూమిలోని ప్లేట్ల సర్దుబాట్లు, ఇతరత్రా కారణాల నేపథ్యంలో కాలక్రమంలో దక్కన్ పీఠభూమి నేటి పరిమాణానికి కుదించుకు పోయింది. ప్రస్తుతం దక్కన్ పీఠభూమి విస్తీర్ణం 512,000 చ.కి.మీ. దక్కన్ పీఠభూమి వాతావరణానికి కూడా ఓ విశిస్టత ఉంది. వోల్కానిక్ వాయువులు మరీ ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ సమకాలీన వాతావరణం రూపుదిద్దుకునేందుకు అప్పట్లోనే ఆధారభూమికంగా మారింది. సగటున 2 సెల్సియస్ డిగ్రీల మేర ఉష్ణోగ్రత పడిపోయేందుకు అది కారణమైంది. ఒకనాడు దక్కన్ పీఠభూమి రాక్షసబల్లులకు ఆవాసంగా ఉండింది. ఈ విధంగా వాతావరణం చల్లబడడం, ఈ శిలలు ఏర్పడే సమయంలో వెలువడిన వాయువులు తదితర కారణాల వల్ల అప్పట్లో ఈ ప్రాంతంలోని రాక్షసబల్లులు అంతరించిపోయాయన్న వాదనలూ ఉన్నాయి.
దక్కన్ ప్రాంతపు శిలల్లో అత్యధిక లావా ఆధారితమే అయినప్పటికీ మరికొన్ని ఇతర రకాల శిలలు కూడా ఉన్నాయి. దక్కన్ శిలలు రూపుదిద్దుకోవడంపై కూడా ఎన్నో సిద్ధాంతాలున్నాయి. లావా పొరల్లో చిక్కుకుపోయిన శిలాజాలకు పేరొందాయి దక్కన్ శిలలు. నేటి ఆధునిక కప్పలకు పూర్వతరాలు అనదగ్గ కప్పల అవశేషాలు అనేకం శిలాజ రూపాల్లో దక్కన్ శిలల్లో లభ్యమవు తుంటాయి. మరెన్నో ఇతర జీవుల శిలాజాలు కూడా వీటిల్లో లభిస్తుంటాయి.
-సువేగా,
ఎ : 9030 6262 88