విశ్వనగరంగా హైదరాబాద్‍

మున్సిపల్‍ పట్టణాభివృద్ధిశాఖ, ఐటి మంత్రి కేటీఆర్‍ అవిరళకృషి


నవోబాఁకా షహర్‍గా పేరుగాంచి… ఆధునిక కాలంలో హైటెక్‍ సిటీగా వృద్ధిచెంది… భవిష్యత్తులో విశ్వనగరంగా ఎదిగేందుకు… మన హైదరాబాద్‍ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దశాబ్దాలుగా హైదరాబాద్‍లో ఉన్న సమస్యలను ఒక్కటొక్కటిగా తెలంగాణ ప్రభుత్వం పరిష్కరిస్తోంది. దేశంలోనే హైదరాబాద్‍ను నెంబర్‍ వన్‍ స్థానానికి తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‍, మున్సిపల్‍ పట్టణాభివృద్ధి శాఖ & ఐటీ మంత్రి కేటీఆర్‍ అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ఇతర నగరాల మాదిరిగా హైదరా బాద్‍ అంటే కేవలం ఓ భౌగోళిక ప్రాంతం కాదు. ప్రజారంజకమైన ప్రాంతానికి ప్రతీక. హైదరాబాద్‍ మానవ జీవ చైతన్యానికి దిక్సూచి. ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్‍ ఒకటిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‍ కృషి నిరూపమానం. 2014 నుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అమితంగా కష్టపడుతూ.. హైదరాబాద్‍ నగరం అన్నిరంగాల్లో మేటిగా నిలిచేందుకు అద్భుత కౌశలాన్ని ప్రదర్శించారు. ఒక దేశం రాజధానికి కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు హైదరాబాద్‍లో మెండుగా ఉన్నాయి. అటు అభివృద్ధికి, ఇటు ప్రజల జీవనానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం తనదైన తరహాలో ముందుకు పోతున్నది. అందుకే హైదరాబాద్‍ నివసించడానికి మెరుగైన నగరంగా వివిధ అధ్యయనాల్లో ఎంపికవుతున్నది.


ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం ఆకర్షణీయంగా మారింది. కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్యంలో తెలంగాణ ముందుంటున్నది. పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు పూర్తి పారదర్శక, సరళమైన, అవినీతి రహితమైన విధానాలను తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నది. అందుకే తెలంగాణకు పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఫుడ్‍ ప్రాసెసింగ్‍, ఐటీ, ఫార్మా, పవర్‍, ప్లాస్టిక్‍, ఇంజినీరింగ్‍, అగ్రోబేస్డ్, గ్రానైట్‍ స్టోన్‍ క్రషింగ్‍, ఎలక్ట్రికల్‍, ఎలక్ట్రానిక్స్, పేపర్‍, ప్రింటింగ్‍, టెక్స్టైల్స్, సిమెంట్‍, ఏరోస్పేస్‍, సోలార్‍, ఆటోమొబైల్‍ రంగాలు హైదరాబాద్‍లో విస్తరించాయి. జనవరి 2020 నాటికి రూ.2,04,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం వెనుక మంత్రి కేటీఆర్‍  కృషి ఎంతగానో ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8 శాతంగా ఉంటే తెలంగాణ 79 శాతం సాధించింది. 2017లో హైదరా బాద్‍లో నిర్వహించిన ప్రపంచస్థాయి పారిశ్రామిక సదస్సు విజయవంతమైంది. హైదరాబాద్‍ అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్తూ జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఔషధ రంగానికి రాజధానిగా వెలుగొందుతున్నది. ఫార్మా, లైఫ్‍ సైన్స్ రంగాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. జీనోమ్‍ వ్యాలీ, దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్క్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‍ హైదరాబాద్‍ ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టులతో ఈ నగరం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. కొవిడ్‍-19 వైరస్‍ను నిర్మూలించే మందును కనుగొనడంలో ముందుకు సాగుతున్నది. ప్రపంచంలో తయారయ్యే మొత్తం వ్యాక్సిన్లలో సుమారు 30 శాతానికి పైగా హైదరాబాద్‍ నగరం నుంచే ఉత్పత్తి కావడం తెలంగాణకు గర్వకారణం. భారత్‍ బయోటెక్‍ వంటి కంపెనీలు వ్యాక్సిన్‍ తయారీలో ముందు వరుసలో ఉన్నాయి.


హైదరాబాద్‍ అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ఐటీ రంగం. ప్రపంచంలోని ఐదు అగశ్రేణి ఐటీ సంస్థలైన గూగుల్‍, మైక్రోసాఫ్ట్, అమెజాన్‍, ఫేస్‍బుక్‍, సేల్స్ ఫోర్స్ తమ రెండో అతిపెద్ద కార్యా లయాలను హైదరాబాద్‍లో ఏర్పాటు చేశాయంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉన్నదో అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం 2016లో గ్రామీణ, పట్టణ యువతను ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీని రూపుదిద్దింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.66,276 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే 2019-20 నాటికి అవి రెట్టింపయ్యాయి. రూ.1,28,807 కోట్లకు ఎగుమతులు పెరిగాయి. కరోనా సమయంలో ఐటీ ఎగుమతుల జాతీయ సగటు 8.09 శాతం ఉంటే తెలంగాణలో 18 శాతం వృద్ధి నమోదైంది.


ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడంలోనూ దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్‍ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆదర్శంగా నిలుస్తున్నది. ఎల్బీనగర్‍ నియోజకవర్గంలో 12 చోట్ల రూ.448 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. లాక్‍డౌన్‍ కాలాన్ని సద్వినియోగం చేసుకొని రోడ్ల అభివవృద్ధి పనులు పూర్తిచేశారు. మంత్రి కేటీఆర్‍ సారథ్యంలో అధికార యంత్రాంగం కదిలివచ్చి హైదరాబాద్‍ నగరాన్ని ముస్తాబు చేస్తున్నది. రహదారులు, పై వంతెనలు, అండర్‍ పాస్‍లు, నాలాల విస్తరణ పనులపై ప్రభుత్వం దృష్టిసారించింది. రూ.23 వేల కోట్లు అంచనా వ్యయంతో వ్యూహాత్మకంగా రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే రూ.3 వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. మరో రూ.4 వేల కోట్ల పనులు ప్రారంభం కానున్నాయి. 54 జంక్షన్లలో ఫ్లై ఓవర్లు నిర్మించి ప్రజల ట్రాఫిక్‍ కష్టాలను తీర్చనున్నారు. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి రూ.120 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నాలాలు, రోడ్లు, పార్కులు, ఫుట్‍పాత్‍లు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‍ నగరం చుట్టూ మణిహారంలా ఉండే ఔటర్‍ను పచ్చని తోరణంగా మార్చేందుకు ఎన్నో రకాల మొక్కలను నాటారు. వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. హరితహారంలో భాగంగా నగరమంతా 5 కోట్ల మొక్కలను నాటి పచ్చదనంతో తీర్చిదిద్దారు. మల్టీజెన్‍ థీమ్‍ పార్కులు 320, 50 థీమ్‍ పార్కులు, 120 జంక్షన్ల రూపుమారుతున్నది. ప్రజాసమస్యలు తీర్చే దిశగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోనే రూ.232 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. గతంలో ఏ చిన్న రోగమొచ్చినా.. పెద్దాసు పత్రులకు పరుగులు పెట్టేవారు. బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అవసరమైన చోట, అనువైన ప్రదేశాల్లో కార్పొరేట్‍ దవాఖానలకు దీటుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ ఆదరాభిమానాలు చూరగొన్నాయి.


నగర స్వరూపం మార్పు :

‘‘ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లేకపోవడం, వరదనీటి పారుదల వ్యవస్థను పట్టించుకోకపోవడం, గొలుసు కట్టు చెరువుల లింకులు తెగిపోవడం, వరదనీటికి అడ్డుగా ఉన్న నిర్మాణాలతో నగరం ముంపునకు గురవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అడ్డుగా ఉన్న నిర్మాణాలన్నింటిని తొలగించాల్సిన అవసరం లేదు. స్థానికంగా ఉన్న సమస్యలకు ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలను అవలంబిస్తే చాలు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‍ దిశానిర్దేశాల మేరకు త్వరలో గ్రేటర్‍ వరదలపై అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్‍ను నియమించనున్నది జీహెచ్‍ఎంసీ. అనంతరం దశలవారీగా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనుంది.


నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక :
హైదరాబాద్‍ నగర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతుంది తెలంగాణ ప్రభుత్వం. గత పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్‍ నగరం మురికి కూపంగా మారింది. గత 50 ఏండ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చాక అభివృద్ధి బాటలో దూసుకు పోతుందని అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఔటర్‍రింగ్‍ రోడ్డు చుట్టుపక్కల ఫారెస్ట్ బ్లాక్‍లను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేలా ఫారెస్ట్ బ్లాక్‍లను అభివృద్ధి పరచడానికి వివిధ శాఖలు, అధికారులు సమన్వయంతో అర్బన్‍ లంగ్స్ స్పేస్‍లను అభివృద్ధి చేస్తున్నారు. నగర పౌరులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించండంతో పాటు టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. నగరం చుట్టుపక్కల వెల్‍నెస్‍ టూరిజం, మెడిసినల్‍ టూరిజం, డిస్టినేషన్‍ టూరిజం, ఎకో టూరిజం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు, అభివృద్ధి పనులు చేపట్టారు. ఓఆర్‍ఆర్‍ వెంట మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వివిధ ప్రాంతాల్లో మైనింగ్‍ జోన్స్, క్వారీలను గుర్తించి వాటిని పూడ్చివేసి పార్కులుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టారు.


హైదరాబాద్‍ నగరంలో ఎన్నో ఇంజనీరింగ్‍ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వివిధ రంగాలకి సంబంధించిన ఇంజినీర్లని ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్‍ నగరానికి సాటి ఏ నగరం లేదు. ఎన్నో బహుళ జాతి కంపెనీలు అభివృద్ధి సాధించడానికి ఇక్కడ శాశ్వతంగా ఆఫీసులని ఏర్పాటు చేయడమే ఉదాహరణ. ఇక్కడ ఏర్పాటైయిన ఎన్నో ఐటి మరియు ఐటిఇయస్‍ కంపెనీలు దేశవ్యాప్తంగా యువతకి ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. విద్యా ఉద్యోగ సంబంధిత విషయాల కోసం దేశం నలుమూలల నుంచి ఎంతోమంది యువత హైదరాబాద్‍కు తరలివస్తున్నారు. నగరంలోని శాంతిభద్రతలని కాపాడి ప్రజలకి సురక్షిత ప్రదేశంగా రక్షణ కలిపించడంలో సామర్థ్యం కలిగిన పోలీసు బలగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నగరంలో కొత్తగా కట్టే నిర్మాణాల్లో అధికారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, అనుమతులు ఇచ్చే సందర్భంలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తుంది.


2022 నాటికి ‘నో ప్లాస్టిక్‍ సిటీ’గా హైదరాబాద్‍ :
2022 నాటికి పూర్తిగా ప్లాస్టిక్‍ రహిత నగరంగా మార్చాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్లాస్టిక్‍ కవర్ల ప్రత్యామ్నాయాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పుట్‍పాత్‍ అక్రమణల తొలగింపు మాదిరిగా కొద్ది రోజుల్లో ప్లాస్టిక్‍ పై కూడా ప్రత్యేక డ్రైవ్‍ చేపడుతున్నట్లు జీహెచ్‍ఎంసీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల ద్వారా ముందుగా ఉద్యమంలా చేపట్టి అనంతరం నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తామంటున్నారు.


మూసీనది అభివృద్ధి కోసం మాస్టర్‍ ప్లాన్‍ :
హైదరాబాద్‍ నగరంలోని మూసీనది అభివృద్ధి కోసం మాస్టర్‍ ప్లాన్‍ రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. మూసీ రివర్‍ ఫ్రంట్‍ను అభివృద్ధి చేయనున్నారు. మూసీనదిలో మురికి నీరు చేరకుండా ఇప్పటికే చర్యలు చేపట్టారు. మురికి నీరు పోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీకి రెండు వైపులా ఉద్యానవనాలు ఏర్పాటుచేసి, మూసీ మీదుగా ఓఆర్‍ఆర్‍ నుంచి ఓఆర్‍ఆర్‍ వరకు రహదారి నిర్మించనున్నారు. మూసీ నది దాటడానికి పలుచోట్ల వంతెనలు కూడా నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నగర పరిధిలోని చెరువుల అభివృద్ధికి దశలవారీగా పనులు చేపట్టి చెరువుల అభివృద్ధికి కృషి చేస్తుంది.


మూసీ ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు :
మూసీ ప్రాజెక్టు ద్వారా ఈ వానాకాలం పంటలకు నీరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 25 వేల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీర్లను కూడా ఆదేశించింది. మూసీలో ప్రస్తుతం 2.64 టీఎంసీల నీరు ఉండగా, ఆన్‍, ఆఫ్‍ పద్ధతిలో రైతులకు వాటిని అందజేసేలా చర్యలు తీసుకోపోతుంది.


పర్యాటక కేంద్రాలుగా చెరువులు :
ఔటర్‍ లోపలి చెరువులను సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 40 చెరువులను పరిరక్షించి, పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్ది, అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


జలం.. పుష్కలం :

నగరానికి నాగార్జున్‍సాగర్‍ ప్రాజెక్టులోని అక్కంపల్లి నుంచి కృష్ణా జలాలను, కాళేశ్వరం ఎగువన గల ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను రోజూ తరలిస్తున్నారు. వీటితో పాటు జంట జలాశయాలైన ఉస్మాన్‍ సాగర్‍ (గండిపేట), హిమాయత్‍సాగర్‍, సింగూరు, మంజీర ప్రాజెక్టుల నుంచి నగరానికి నీటిని తరలిస్తున్నారు.


పొదుపుగా వాడేందుకు వాటర్‍బోర్డు ప్రణాళికలు :
ప్రస్తుతం నగరానికి సమీపంలోని జలాశయాల నుంచి సమృద్ధిగా నీటిని వాడేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా సింగూరు, మంజీరా ప్రాజెక్టుల నుంచి కనీసం 300 మిలియన్‍ గ్యాలన్ల నీటిని నగరానికి తరలిస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాల తరలింపులో ఇబ్బందులు తలెత్తితే అత్యవసరంగా ఉస్మాన్‍సాగర్‍, హిమాయత్‍సాగర్‍ల నుంచి పెద్దఎత్తున నీటిని వినియోగించు కోవాలని భావిస్తున్నారు. భవిష్యత్‍ అవసరాలకు అనుగుణంగా నీటిని పొదుపుగా వినియోగించడానికి ఏడాది ప్రణాళికను రూపొందించినట్లు తెలిసింది.


భారీ బడ్జెట్‍ కేటాయింపులు:
హైదరాబాద్‍ నగర అభివృద్ధికి వచ్చే మూడేళ్లకు ప్రతి సంవత్సరం రూ .10,000 కోట్లు కేటాయించినందుకు పరిశ్రమలు, ఐటి మంత్రి కె టి రామారావు హైదరాబాద్‍ ప్రజల తరపున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అధిక మొత్తంలో నిధుల కేటాయింపు రాజధాని నగరాన్ని ప్రపంచ నగర ప్రమాణాలకు తగినట్లుగా రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంకల్పం గురించి మాట్లాడటమే కాకుండా, లక్ష్యాన్ని సాధించడానికి చర్యలను ప్రారంభించడంలో సహాయ పడుతుంది. ఈ నిధులను నగరం మరియు దాని శివార్లలో అభివృద్ధి చేయడానికి, మూసి నది మరియు మూసి రివర్‍ డెవలప్‍మెంట్‍ ఫ్రంట్‍ శుభ్రపరచడానికి ఉపయోగించాలి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍ రావు యొక్క దూరదృష్టి ఇప్పటికే సానుకూల ఫలితాలను ఇచ్చిందని ఆయన అన్నారు. ప్రారంభంలో, ప్రభుత్వం శాంతిభద్రతల నిర్వహణపై దృష్టి సారించింది. పోలీసు సిబ్బందికి సౌకర్యాలను మెరుగుపరచడం మరియు తగిన నిధులను కేటాయించడం ద్వారా పోలీసు బలగాలను ఆధునీకరించడం ద్వారా పోలీసు శాఖకు విస్తృతమైన సహాయాన్ని అందించింది. తరువాత, తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం (SRDP) మరియు ఇతర సౌకర్యాల మెరుగుదలతో సహా భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి తగిన నిధులను కేటాయించడం ప్రారంభించింది.


ఎస్‍ఆర్‍డిపిలో భాగంగా, రాజధాని నగరంలో ట్రాఫిక్‍ రద్దీని తగ్గించడానికి ఫ్లైఓవర్‍లు, అండర్‍పాస్‍లు చేపట్టారు. హైదరాబాద్‍ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది, రెండవ దశ కూడా త్వరలో పూర్తవుతుందని ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రాథమిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడంతో హైదరాబాద్‍ నగరం అభివృద్ధి వేగం మరింత వేగవంతం అవుతుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‍రావు నాయకత్వంలో తక్కువ వ్యవధిలో కాలేశ్వరం వంటి అతిపెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తన సామర్థ్యాలను నిరూపించుకున్న ప్రభుత్వం, హైదరాబాద్‍ను ప్రపంచ నగరంగా అభివృద్ధి చేయడం ద్వారా తన సామర్థ్యాలను మరోసారి రుజువు చేస్తుంది.


ప్రధాన రోడ్లకు ఇరువైపులా పుట్‍పాత్‍లు :

త్వరలో సుమారు 1,125 కిలోమీటర్ల పొడవున ప్రధాన రోడ్లకు ఇరువైపులా పుట్‍పాత్‍లు అందుబాటులోకి రానున్నాయి. రోడ్ల పునరుద్ధరణ పనులతో పాటు పుట్‍పాత్‍లు కూడా అభివృద్ధి చేయ నున్నారు. మంత్రి కేటీఆర్‍ ఆదేశాల మేరకు పుట్‍పాత్‍ల అభివృద్ధికి జీహెచ్‍ఎంసీ ప్రత్యేక ప్రాధాన్యత నిస్తున్నది. ఇప్పటికే సుమారు రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‍ రోడ్‍ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ ఆధ్వర్యంలో సుమారు 330 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు, జీహెచ్‍ఎంసీ ఆధ్వర్యంలో మరో 795 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.


ఫ్లైఓవర్లకు మరమ్మతులు :
నగర వ్యాప్తంగా సుమారు 30 ఫ్లైఓవర్లు ఉన్నాయి. అయితే అందులో కొన్ని ఫ్లైఓవర్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా కొన్ని ఫ్లైఓవర్లు 20 నుంచి 30 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రతి ఫ్లైఓవర్‍కు 20 ఏండ్ల తర్వాత బేరింగులు మార్చాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. పై వంతెనల నిర్వహణకు జీహెచ్‍ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది.


ఉత్తమ ప్రజా రవాణా :
దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు, అంతర్జాతీయ నగరాలకు వాయుమార్గం కనెక్టివిటీ, రోడ్డు, రైలు సౌకర్యాలు కలిగి ఉండటంతో పరిశ్రమలు హైదరాబాద్‍కు తరలివస్తున్నాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలకు మధ్యలో ఉండటం కూడా కలిసి వస్తున్న అంశం. దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపేలా రోజుకు వందల్లో విమానాలు, 160కి పైగా రైళ్లు, 2 వేల బస్సులు నిత్యం రవాణా సౌకర్యాన్ని అందజేస్తున్నాయి. అంతేకాదు లండన్‍, బ్యాంకాక్‍, ఫ్రాంక్‍ఫర్ట్, సింగపూర్‍, కౌలాలంపూర్‍ మధ్య తూర్పు దేశాలకు నేరుగా వాయు మార్గం ఉన్నది. మూడు జాతీయ రహదారులు, ఏడు రాష్ట్ర రహదారులు నగరం మీదుగా వెళ్తున్నాయి. ఎంఎంటీఎస్‍ ప్రయాణంతో పాటు, దక్షిణ మధ్య రైల్వే జోన్‍ సికింద్రాబాద్‍ కేంద్రంగా పనిచేస్తుండటం, శంషాబాద్‍ అంతర్జాతీయ విమానాశయ్రం వంటివి అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.


అభివృద్ధికి రహదారులు :
2014నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‍ అభివ•ద్ధి కోసం రూ.32,553 కోట్లు ఖర్చు చేసి నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో మంత్రి కేటీఆర్‍ చూపిస్తున్న చొరవ అంతా ఇంతా కాదు. అందులో నగరంలో రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యాన్నిస్తున్నారు. ట్రాఫిక్‍ సమస్యను తీర్చేందుకు శ్రద్ధ పెట్టారు. ట్రాఫిక్‍ రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‍పాస్‍లు నిర్మించారు. అలాగే అన్ని పురపాలికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషిచేస్తున్నది.
జీహెచ్‍ఎంసీ పరిధిలో దాదాపు 9,103 కి.మీ. మేర రోడ్లున్నాయి. ఇందులో 709 కి.మీ. ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం సవాల్‍గా తీసుకొని పరిరక్షిస్తున్నది. రహదారుల నిర్వహణ, నిర్మాణానికి ఏటా సగటున రూ.500 కోట్లకు తగ్గకుండా జీహెచ్‍ఎంసీ ఖర్చుచేస్తున్నది. ఇండియన్‍ రోడ్‍ కాంగ్రెస్‍ (ఐఆర్‍సీ) ప్రమాణాల ప్రకారం రోడ్డు మధ్యలో ఎత్తుగా ఉండి.. పక్కలకు ఏటవాలుగా ఉండేలా ప్రమాణాలు పాటిస్తున్నది. వాన నీళ్లు రోడ్డుపై నిలువకుండా వాటర్‍ డ్రైయిన్లలోకి వెళ్లి నీరు ఎక్కడా ఆగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


పీరియాడికల్‍ ప్రివెంటివ్‍ మెయింటెనెన్స్ (పీపీఎం)లో భాగంగా నిర్ణీత కాలవ్యవధిలో క్రమం తప్పకుండా రహదారులు నిర్మిస్తున్నారు. గ్రేటర్‍ హైదరాబాద్‍లోని రహదారులను సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం (సీఆర్‍ఎంపీ)లో భాగంగా జీహెచ్‍ఎంసీ పలు ఏజెన్సీలకు అప్పగించింది. ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో రోడ్ల నిర్వహణ చేపట్టడం ఇదే ప్రథమం. రూ.1800 కోట్ల వ్యయంతో 700 కి.మీ. పైచిలుకు ప్రధాన రోడ్లను ఐదేండ్ల పాటు సమగ్రంగా అభివ•ద్ధి చేసే లా ఏర్పాటుచేశారు. రోడ్లపై చిన్న గుంత పడినా ఏజెన్సీలదే బాధ్యత. రోడ్లపై డ్రైనేజీ, పచ్చదనం పెంచడం, ఫుట్‍పాత్‍ల నిర్వహణ సైతం వారే చూసుకోవాల్సి ఉంటుంది. ఫుట్‍పాత్‍ల నిర్మాణం, మ్యాన్‍హోళ్ల మరమ్మతుల బాధ్యత కూడా వారికే అప్పగించడం గమనార్హం.
ప్రభుత్వం చేపట్టే రోడ్ల నిర్మాణాలు ప్రజల అవసరాలకు తగినట్లుగా, శాశ్వత ప్రాతిపదికన, భవిష్యత్‍ తరాలు కూడా ఉపయోగించుకునేలా ఉండాలన్నదే సీఎం కేసీఆర్‍ ఆకాంక్ష. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు లైన్ల రోడ్లు, ప్రతీ గ్రామానికి మంచి రహదారి ఉండేలా విధానపర నిర్ణయం తీసుకొని ఆ రోడ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించటమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.


హైటెక్‍సిటీ ప్రాంతానికి వెళ్లే మార్గాలపై ట్రాఫిక్‍ రద్దీని తగ్గించేందుకు రూ.185 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతికతతో తీగల వంతెన నిర్మాణం చేపట్టారు. దీనికి అనుబంధంగా జూబ్లీహిల్స్ రోడ్‍ నం- 45ను కూడా నిర్మించారు. దీంతో నగరంలోని సెంట్రల్‍ జోన్‍తో సహా ఇతర ప్రాంతాల నుంచి హైటెక్‍సిటీ, జిల్లాలకు వెళ్లేవారికి ప్రయాణ దూరం తగ్గుతుంది. 48.6 కి.మీ. మేర 8 మేజర్‍ కారిడార్లను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సమీకృత రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 700 కిలోమీటర్లకు పైగా ప్రధాన రోడ్లను పునరుద్ధరించారు. ఏదేమైనా సీఎం కేసీఆర్‍కు ప్రజా శ్రేయ స్సే అంతిమ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా ప్రజాభీష్టం మేరకు పనులను ముమ్మరం చేస్తూ ప్రజల మన్నలను పొందటం విశేషం.


ట్రాఫిక్‍కు ఉపశమనం – అత్యాధునిక వసతులతో శాటిలైట్‍ బస్‍బే :
ఎల్బీనగర్‍ మీదుగా నిత్యం సుమారు 30 -35 వేల మంది ప్రయాణికులు నల్గొండ, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. 600 నుంచి 700 వరకు ఆర్టీసీ, ప్రైవేట్‍ బస్సులు వెళ్తుంటాయి.. రాత్రి సమయాల్లోనైతే దిల్‍సుఖ్‍నగర్‍, ఎల్బీనగర్‍లో ఏపీకి వెళ్లే బస్సులతో పాటు ప్రైవేట్‍ వాహనాలు రోడ్లపైనే నిలపడంతో ట్రాఫిక్‍ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‍ సమస్యలు అధిగం కావడంతో బస్‍ బేల ప్రతిపాదనను ఎమ్మెల్యే సుధీర్‍ రెడ్డి మంత్రి కేటీఆర్‍ దృష్టికి తీసుకువెళ్లారు. ట్రాఫిక్‍ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మహావీర్‍ హరిణ వనస్థలి జింకల పార్కుకు సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని అనువైందిగా గుర్తించారు. 1.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ శాటిలైట్‍ బస్‍ బేల ఏర్పాటుపై హెచ్‍ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి డిజైన్లను రూపొందించారు. దీంతో ఎల్బీనగర్‍, దిల్‍సుఖ్‍నగర్‍ ట్రాఫిక్‍ జంఝాటానికి మహా ఉపశమనం కలగనుంది. మంత్రి కేటీఆర్‍ ఈ ప్రాజెక్టుకు గ్రీన్‍ సిగ్నల్‍ ఇవ్వడంతో ప్రాజెక్టు పనులకు మార్గం సుగమమైంది. దీని అంచనా వ్యయం 10 కోట్ల రూపాయలు.


శాటిలైట్‍ బస్‍ బే ప్రత్యేకతలు ఇవే…!!
మొత్తం ఆరు బస్‍బేలు ఉంటాయి. ప్రతి దానిలో ఏసీ, నాన్‍ ఏసీ నిరీక్షణ గదులు, కరోనా మార్గదర్శకాల ప్రకారం ఏసీ నిరీక్షణ గదిలో 21 మంది, నాన్‍ ఏసీ దాంట్లో 48 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయనున్నారు.

  • శాటిలైట్‍ బస్‍ బే ప్రీ-పాబ్రీకేడెట్‍ పద్ధతిలోనిర్మాణం
  • సిటీ బస్సుల కోసం ప్రత్యేకంగా బస్‍బే.
  • ఒక్కో బస్‍బేలో స్టాల్స్, ఏటీఎం, ఫార్మసీ, వాటర్‍ ఎటీఎం, ఎంక్వైరీ కౌంటర్‍.
  • 490 కిలోవాట్స్ సౌర విద్యుత్‍ ఉత్పత్తి.
  • ప్రత్యేక కమాండ్‍ కంట్రోల్‍ కేంద్రం, ఫుడ్‍కోర్టస్, లోకల్‍ బస్టాప్‍.
  • నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించుకునేలా ఎస్టీపీ నిర్మాణం
  • నాలుగు టాయిలెట్స్ బ్లాక్స్.
  • ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‍.
  • ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రం, భారీ కెఫెటేరియా


దేశం మొత్తం విమాన ప్రయాణికుల్లో హైదరాబాదీల వాటా 6.4శాతం :
హైదరాబాద్‍ నుంచి రాకపోకలు సాగించే విమాన ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. దేశం మొత్తం ప్రయాణికుల్లో 6.4 శాతం మంది మన హైదరాబాద్‍ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇది 2010-11లో 5.3 శాతంగా ఉంటే, 2020 వచ్చేసరికి 6.4శాతానికి చేరుకున్నది. విమాన తయారీ కంపెనీలైన లాక్‍హెడ్‍ మార్టిన్‍, బోయింగ్‍, జీవీ ఏవియేషన్‍, రాఫెల్‍ అండ్‍ పిలాటస్‍ కంపెనీలు హైదరాబాద్‍ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండటం విశేషం. 2010- 11లో కేవలం 7.5 మిలియన్ల ప్రయాణికులు హైదరాబాద్‍ నుంచి ప్రయాణం చేయగా, 2019-20కి వచ్చే సరికి ఆ సంఖ్య 22 మిలియన్లకు చేరుకున్నదని నైట్‍ఫ్రాంక్‍ నివేదిక స్పష్టం చేసింది.


మణిహారంగా మెట్రో :

దేశంలో రెండో అతిపెద్ద మెట్రో వ్యవస్థ హైదరాబాద్‍లోనే ఉన్నదని నైట్‍ ఫ్రాంక్‍ వెల్లడించింది. నగర ప్రయాణికులకు ట్రాఫిక్‍ ఇబ్బంది లేకుండా, సమయం ఆదా అయ్యేలా, సురక్షిత జర్నీకి హైదరాబాద్‍ మెట్రో తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని వివరించింది. ప్రపంచంలో పీపీఈ విధానంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు హెచ్‍ఎంఆర్‍. 57 స్టేషన్లతో 72 కిలోమీటర్లతో దేశంలోనే అతి పెద్ద నెట్‍వర్క్ కలిగిన రెండో నగరం భాగ్యనగరమేనని వెల్లడించింది. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద ఇంటర్‍ఛేంజ్‍ స్టేషన్‍ అమీర్‍పేట్‍ అని పేర్కొంది. బస్సు, ట్యాక్సీ, ఆటో సేవలతో కనెక్ట్ అయి ఉందని వివరించింది.


విద్యుత్‍ వాహన యోగం :
తెలంగాణ ప్రభుత్వం ఏ రంగంలో మార్పులు తెచ్చినా అదొక సంచలనమవుతున్నది. తాజాగా తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్‍ ఆవిష్కరించిన విద్యుత్‍ వాహన, ఇంధన నిలువ విధానం ఉత్పత్తిదారులకు, నిపుణులకు ఆసక్తిని రేకెత్తించింది. ‘తెలంగాణ ప్రభుత్వం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నది.. ఇప్పుడు ప్రపంచానికి అవసరమైన నాయకత్వం ఎలా ఉండాలో తెలంగాణ చూపుతున్నది’ అని అమెరికా కేంద్రంగా పనిచేసే, ప్రకృతి వనరుల పరిరక్షణ మండలి అంతర్జాతీయ కార్యక్రమ సీనియర్‍ డైరెక్టర్‍ అంజలి జైస్వాల్‍ ప్రస్తుతించారు. విద్యుత్‍ వాహనాలకు ప్రోత్సాహమివ్వడమే కాదు, ఈ వాహనాలను నడపడానికి అవసరమైన పరిస్థితులను కల్పించేదిగా తెలంగాణ విధానం ఉన్నదని విద్యుత్‍ రవాణా నిపుణురాలు చారులత ప్రశంసించారు. పారిశ్రామికులు మొదలు విద్యావేత్తల వరకు పలువురు ఈ విధానం సమగ్రమైనదీ, ముందుచూపుతో రూపొందించినదని హర్షించడం మన రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టిని వెల్లడిస్తున్నది.


వాహన ఉత్పత్తి రంగానికి తెలంగాణను ప్రధాన కేంద్రంగా చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని, లక్షా ఇరువై వేల మందికి ఉపాధి కల్పించాలని కూడా భావిస్తున్నది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు రంగంలోకి దిగాయంటే, ఎంతగా ముందస్తు కృషి సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. డ్రైవర్‍ లేకుండా నడవడమే కాకుండా, ప్రయాణాలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ద్వారా వాహనాల మధ్య అనుసంధానం నెలకొంటుంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు ఉండవు. భిన్న సాంకేతికల మేళవింపుతో రవాణాలో కొంగ్రొత్త మార్పులు వస్తున్నాయి. అయితే విదేశాలలో సాంకేతికాభివృద్ధి గురించి చెప్పుకోవడానికే మనం ఇంతకాలం అలవాటు పడినాం. ఇక నుంచి మనమే ముందుండి ఇతరులకు దారి చూపాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఆలోచనా సరళి. విద్యుత్‍ వాహనాలు, బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలోనే అగశ్రేణి పరిశోధనా కేంద్రంగా మన రాష్ట్రాన్ని వృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేయడానికి ప్రేరణ ఇదే. వచ్చే పదేండ్లలో రవాణా రంగంలోని అబ్బురపరిచే మార్పులకు రాష్ట్ర ప్రభుత్వ విధానమొక సంకేతం.


భాగ్యనగరంలో ‘‘డేగకన్ను’’ :
హైదరాబాద్‍లో ఉగ్రవాదుల కదలికలు… హైవేపై అక్రమ రవాణా.. దొంగలు, దోపిడీదారులు ఇలా నేరగాళ్లకు నగరం అడ్డాగా మారిపోయిందనే విమర్శలు గతంలో ఎక్కువుగా ఉండేవి. అయితే తెలంగాణ వచ్చాక విమర్శలకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా పోలీస్‍ యంత్రాగం నేర నియంత్రణకు పక్కా చర్యలను చేపట్టి… నగరాభివృద్థికి అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు.


భద్రతకు కమాండ్‍ అండ్‍ కంట్రోల్‍ సెంటర్‍ :
నగరంలో అనేక ప్రత్యేకతలతో కమాండ్‍ అండ్‍ కంట్రోల్‍ సెంటర్‍ సిద్ధమయ్యింది. ఈ పోలీస్‍ టవర్స్లో ఒకటి పూర్తిగా టెక్నాలజీకి సంబంధించింది కాగా, మరొకటి హైదరాబాద్‍ పోలీస్‍ కమిషనరేట్‍ కార్యాలయ భవనం. వీటి మధ్య సుమారు 40 వేల చదరపు అడుగులతో అత్యాధునిక టెక్నాలజీతో ఉండే సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడ వీక్షీంచేందుకు ఏర్పాట్లు చేశారు.


నిఘా నేత్రం :
నగరంలో 3,42,645 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటైంది. సీసీ కెమెరాల ఏర్పాట్లలో దేశంలోనే హైదరాబాద్‍ తొలి స్థానంలో ఉన్నది. ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు సీసీ టీవీల ద్వారా 18,235 నేరాలను పోలీస్‍ శాఖ గుర్తించింది. బంజారాహిల్స్లో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్‍ కేంద్ర కార్యాలయం ట్విన్‍ టవర్స్లో ఏర్పాటు పూర్తికాబోతున్నది. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా వెంటనే అది ట్విన్‍ టవర్స్కు చేరి, అక్కడినుంచి సంబంధిత అధికారులకు క్షణాల్లో సమాచారం చేరుతుంది. ఇలాంటి వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. రాష్ట్ర పోలీస్‍ వ్యవస్థను స్కాట్లాండ్‍ యార్డ్ పోలీస్‍ వ్యవస్థకు సమానంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్‍ సంకల్పం నెరవేరబోతున్నది.


షాన్‍దార్‍ షెహర్‍ :
అత్యంత నివాసయోగ్యమైన నగరం.. మెట్రో మణిహారం.. ఉపాధికి ఆశాకిరణం.. ఐటీలో రారాజు.. విభిన్న సంస్కృతులు.. పర్యాటక సోయగాలు.. పుష్కలంగా నీళ్లు.. రెప్పపాటు కోతల్లేని విద్యుత్‍.. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగలిగేంత ప్రయాణ సౌకర్యం.. విస్తారమైన రోడ్లు.. ఫ్లైఓవర్లు.. నిమిషాల్లో గమ్యం చేర్చే ఔటర్‍ రింగురోడ్డు.. వెరసి హైదరాబాద్‍ ప్రపంచానికి గమ్యస్థానమైంది. అభివృద్ధికి కేరాఫ్‍గా నిలిచింది. ఏ రంగం తీసుకున్నా.. ఏ వైపు చూసినా.. ప్రగతి పథమే. అన్నింటా కీర్తికిరీటమే.. అందుకే హైదరాబాద్‍ ‘ది బెస్ట్ సిటీ’ అంటూ.. ప్రముఖ రియల్‍ ఎస్టేట్‍ సర్వే సంస్థ నైట్‍ఫ్రాంక్‍ తన నివేదికలో స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ చొరవతో నగరంలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని, ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ విశ్వనగరానికి క్యూ కడుతున్నాయని ప్రశంసించింది. మంత్రి కేటీఆర్‍ ఆవిష్కరించిన ఈ నివేదికలో అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించింది.


రియల్‍ ఎస్టేట్‍ :
రియల్‍ ఎస్టేట్‍ రంగంలో హైదరాబాద్‍ ఉత్తమంగా నిలిచింది. 2015-19 మధ్యకాలంలో 2.1 యూఎస్‍ బిలియన్‍ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఇదే సమయంలో మన దేశానికి 35.2 బిలియన్‍ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీ, ఐటీఈఎస్‍ ఆఫీస్‍ స్పేస్‍ వినియోగంలో 2014 -2019 కాలంలో పెరుగుదల 211 శాతంగా ఉన్నదని ‘నైట్‍ఫ్రాంక్‍’ స్పష్టం చేసింది.


ఫార్మా, లైఫ్‍ సైన్సెస్‍ :
హైదరాబాద్‍ ఆసియాలోనే అతిపెద్ద ఫార్మాహబ్‍గా పేరుగాంచడమే కాకుండా, ఫార్మా క్యాపిటల్‍ ఆఫ్‍ ఇండియాగా సైతం ప్రసిద్ధిగాంచింది. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం ఉత్పత్తులు ఒక్క హైదరాబాద్‍లోనే తయారవుతున్నాయి. అంతేకాకుండా విదేశీ ఎగుమతుల్లో 20 శాతం ఇక్కడి నుంచే ఉంటున్నాయి. ఈ నాలుగేండ్ల కాలంలో సుమారుగా 100 బిలియన్ల పెట్టుబడులను నగరం ఆకర్షించగలిగింది. లైఫ్‍ సైన్సెస్‍ పాలసీతో పాటు, జీనోమ్‍ వ్యాలీ 2.0, హైదరాబాద్‍ ఫార్మాసిటీ, మెడికల్‍ డివైజెస్‍ పార్క్లను ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో ఈ రంగం మరింత పుంజుకోనున్నదని నైట్‍ఫ్రాంక్‍ తన నివేదికలో తెలిపింది.


దేశానికే ఆదర్శం :
టీఎస్‍-ఐపాస్‍తో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నైట్‍ ఫ్రాంక్‍ తన నివేదికలో పేర్కొంది. ఇక్కడ పెట్టుబుడులు , పరిశ్రమలు పెట్టేందుకు వచ్చిన ఇన్వెస్టర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనుమతుల విషయంలో కాలయాపన జరుగకుండా తెలంగాణ స్టేట్‍ ఇండస్ట్రియల్‍ ప్రాజెక్ట్ అప్రూవల్‍ అండ్‍ సెల్ఫ్ సర్టిఫికేషన్‍ సిస్టంతో సులభతరం చేసిందని వెల్లడించింది. సింగిల్‍ విండో విధానాన్ని అమలు చేసి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించిన రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించింది. మొత్తం పక్రియ పారదర్శకంగా ఆన్‍లైన్‍లో నిర్వహిస్తున్నారని, ఇది తెలంగాణ సర్కారు పనితీరుకు నిదర్శనమని పేర్కొంది.


టీఎస్‍ఐఐసీతో :
తెలంగాణ స్టేట్‍ ఇండస్ట్రియల్‍ ఇన్‍ఫాస్ట్రక్చర్‍ కార్పొరేషన్‍(టీఎస్‍ఐఐసీ)తో రాష్ట్రంలోని పొటెన్షియల్‍ గ్రోత్‍ సెంటర్లను గుర్తించి వాటి అభివృద్ధికి కృషి చేయడం గొప్ప విషయమని నివేదికలో వెల్లడించింది. ఇప్పటివరకు 153 ఇండస్ట్రియల్‍ పార్కులను సర్కారు అభివృద్ధి చేసిందని పేర్కొంది. ఇందులో ప్రధానంగా కరీంనగర్‍ ఐటీ ఇంక్యూబేషన్‍ సెంటర్‍, మహబూబ్‍నగర్‍ ఐటీ హబ్‍, నిజామాబాద్‍ ఐటీ టవర్‍, ఇంక్యూబేషన్‍ సెంటర్‍ వరంగల్‍, టీ వర్కస్ అండ్‍ టీ హబ్‍ హైదరాబాద్‍, ఈ-సిటీ, రావిర్యాల, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫక్చరింగ్‍ క్లస్టర్స్ (ఈఎంసీ) వంటివి ప్రముఖమైనవిగా నివేదికలో వివరించింది. అంతేకాదు ఈజ్‍ ఆఫ్‍ డూయింగ్‍ బిజినెస్‍ (ఈవోడీబీ)తో నీతి ఆయోగ్‍-2019 ఈజ్‍ ఆఫ్‍ డూయింగ్‍ బిజినెస్‍ స్టేట్‍ ర్యాంకింగ్స్లో రాష్ట్రం మూడో స్థానాన్ని దక్కించుకుందని పేర్కొంది.


ఆలోచనల ఆచరణకు అవకాశం :
‘ఉద్యోగం దక్కించుకోవడం కాదు.. ఉద్యోగాలను సృష్టించడం నేర్చుకోవాలి.’ అనే మంత్రంతో నూతన ఆలోచనల అమలుకు అవకాశం కల్పించింది సర్కార్‍. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్‍ దిశానిర్దేశంతో ఔత్సాహికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్టార్టప్‍ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఈ నిర్ణయమే అనేక అధ్యయన సంస్థలను నగరం వైపు చూసేలా చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అని నైట్‍ఫ్రాంక్‍ తన నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వం ప్రోత్సాహంతో 2015లో 1500 స్టార్టప్‍లు ఏర్పాటు కాగా, 2018లో 4 వేల స్టార్టప్‍లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మహిళల్లో ఉన్న సృజనాత్మకత వెలికితీసి వారిని వ్యాపారాధిపతులుగా చేయడంలోనూ ‘వీ-హబ్‍’ తో చేయూత నిచ్చింది. మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్‍ వీ హబ్‍ ఏర్పాటు చేసిందని నైట్‍ఫ్రాంక్‍ నివేదికలో పేర్కొంది.


చెరువులపై ప్రత్యేక శ్రద్ధ :
నగరంలో చెరువుల రక్షణ, సుందరీకరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‍ తెలిపారు. నగర పరిధిలోని 185 చెరువులను దశల వారీగా పటిష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు డ్రోన్‍ల ద్వారా చెరువులు, దాని పరిసరాల్లో యాంటీ లార్వా స్ప్రేయింగ్‍ చేపట్టినట్లు చెప్పారు. నిరుపయోగ వస్తువులను నాలాలు, చెరువుల్లో వేయడంతో అవి కలుషితమై దోమలు వ్యాప్తిచెందే అవకాశముందని పేర్కొన్నారు. నగరంలోని 39 చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను యంత్రాలతో తొలగిస్తున్నట్లు తెలిపారు.
ఎంటమాలజీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేసి డెంగీ, మలేరియా, చికెన్‍గున్యా, పైలేరియా, మెదడువాపు, కొవిడ్‍ తదితర వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మలేరియా నివారణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నారు.


కాలువల అభివృద్ధికి మాస్టర్‍ ప్లాన్‍ :
హైదరాబాద్‍, సికింద్రాబాద్‍ ప్రాంతాలను కలిపి అప్పటి నగరపాలక సంస్థ(ఎంసీహెచ్‍) పరిధిలో వరదనీటి కాలువల అభివృద్ధికి మాస్టర్‍ప్లాన్‍ రూపొందించేందుకు కిర్లోస్కర్‍ కన్సల్టెంట్‍ను నియమించింది. అప్పట్లో నగర విస్తీర్ణం 170 చదరపు కిలోమీటర్లు కాగా, 71 డ్రెయిన్‍లు 169 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేసేందుకు ఆరు జోన్లుగా విభజించి పనులకు రూ. 256కోట్లు ఖర్చవుతుందని 2002లో నివేదిక సిద్ధం చేశారు.
2007 ఏప్రిల్‍లో శివార్లలోని 12 మున్సిపాలిటీలను ఎంసీహెచ్‍లో విలీనంచేసి జీహెచ్‍ఎంసీని ఏర్పాటు చేశారు. అనియంత్రిత పట్టణాభివృద్ధి, భూ వినియోగ మార్పిడి, చెరువుల్లోకి నీరు వచ్చే మార్గాలు మూసుకుపోవడం తదితర పరిస్థితులు ఏర్పడ్డాయి. చెరువులు ఆక్రమణలకు గురికావడమే కాకుండా తీవ్రంగా కలుషితమయ్యాయి. దీంతో మొత్తం 625 చదరపు కిలోమీటర్ల మేర జీహెచ్‍ఎంసీ పరిధిలో వరదనీటి పారుదల నెట్‍వర్క్ మాస్టర్‍ప్లాన్‍ను రూపొందించేందుకు వాయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్‍ లిమిటెడ్‍కు 2008లో బాధ్యతలు అప్పగించారు. వాయంట్స్ సొల్యూషన్‍ ఇచ్చిన మాస్టర్‍ప్లాన్‍ అమలుకు రూ. 6711 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ మాస్టర్‍ప్లాన్‍ అమల్లో భాగంగా నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా 2016 నాటికి రూ. 200కోట్ల జెఎన్‍ఎన్‍యూఆర్‍ఎం, 13వ ఆర్థిక సంఘం నిధులతో 58 కిలోమీటర్ల మేర మాత్రమే నాలాల విస్తరణ సాధ్యమైంది.


తక్షణం తొలగించాల్సిన ఆక్రమణలు 12,000 :

నాలాల విస్తరణ సాధ్యం కాకపోవడం, 2016, 2017లో విపరీతంగా వరదలు రావడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంజినీరింగ్‍, టౌన్‍ ప్లానింగ్‍, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి నాలాలపై తక్షణం తొలగించాల్సిన ఆక్రమణలు 12000 ఉన్నట్లు తేల్చారు. అంతేకాకుండా పలుచోట్ల నాలాలు 90 డిగ్రీల మేర మలుపులు తిరిగి ఉండడం కూడా నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నాలాల విస్తరణకు రూ. 2300కోట్లతో 43 పనులు నిర్వహించాల్సి ఉందని నివేదిక తయారు చేశారు. అలాగే 47(15.91కి.మీ.లు) బాటిల్‍నెక్స్ను విస్తరించాల్సి ఉందని గుర్తించారు.

జీహెచ్‍ఎంసీ పరిధిలో నాలాల వివరాలు…

  • జీహెచ్‍ఎంసీ పరిధిలో మొత్తం నాలాలు : 173
  • మొత్తం నాలాల పొడవు : 390కి.మీ.లు
  • ఇందులో ప్రైమరీ నాలాలు : 82
  • ప్రైమరీ నాలాల పొడవు : 211కి.మీ.లు
  • సెకండరీ నాలాలు : 76
  • సెకండరీ నాలాల పొడవు : 160కి.మీ.లు
  • తృతీయ శ్రేణి నాలాలు : 15
  • తృతీయ శ్రేణి నాలాల పొడవు : 19కి.మీ.లు
  • వాయంట్స్ సొల్యూషన్స్ నివేదిక ప్రకారం నాలాలపై ఆక్రమణలు : 28000
  • సమస్యాత్మక ప్రాంతాల్లో తక్షణం తొలగించాల్సినవి : 12000
  • ఇప్పటి వరకు తొలగించిన ఆక్రమణలు : 160

రూ.14,300 కోట్లతో నాలాల అభివృద్ధి
వరద ఎంత వచ్చినా గ్రేటర్‍లో ముంపు సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం పకడ్బందీచర్యలు చేపడుతోంది. రూ.14,300 కోట్లతో మాస్టర్‍ ప్లాన్‍ అమలుకు సమాయత్తం అవుతోంది. ఇందులోభాగంగా జీహెచ్‍ఎంసీలో నాలాల అభిరూ.14,300 కోట్లతో నాలాల అభివృద్ధికి ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఓ విశ్రాంత ఇంజినీర్‍కు బాధ్యతలు అప్పగించింది. నాలాలను అభిరూ.14,300 కోట్లతో నాలాల అభివృద్ద్ధి చేయడంతో పాటు వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమవుతున్నది.

ప్రత్యామ్నాయాలను గుర్తించి సమస్య పరిష్కారానికి ముందుకు సాగేందుకు చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలను తొలగించాల్సి వస్తే తొలగించనుంది. ఎవ్వరికీ ఇబ్బంది కలుగనిరీతిలో సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, అతి తక్కువ నిర్మాణాలను తొలగిస్తూ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయించింది.

నీటి ప్రవాహాన్ని డైవర్ట్ చేసే ఏర్పాట్లు :
గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించేందుకు వేలకు వేలు ఇండ్లు తొలగించాల్సిన అవసరం లేదు. సమస్య ఎక్కడుందో గుర్తించి ఉన్న అడ్డంకులను తొలగించడమో, లేక నీటి ప్రవాహాన్ని అవసరాలకు అనుగుణంగా డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. నాలాలను విస్తరించే అవకాశం ఉన్న చోట విస్తరించి.. సాధ్యం కాని చోట నాలా లోతును పెంచే అంశాన్ని పరిశీలించనున్న ప్రభుత్వం. వీలైన చోట నీటి ప్రవాహానికి డబుల్‍ ఛానలింగ్‍ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

ట్రాఫిక్‍ ఎక్కువైనందున ఫ్లైఓవర్లు, అండర్‍పాస్‍లు నిర్మించుకుంటున్నది జీహెచ్‍ఎంసీ. అలాగే, చిన్న చిన్న లింకు రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‍ను తగ్గించు కోగలుగుతుంది. ఇదే తరహాలో వ్యూహాత్మకంగా వరద నీటిని శాస్త్రీయ పద్ధతుల్లో మళ్లించడం, లోతట్టు ప్రాంతానికి సాఫీగా వెళ్లే విధంగా చేస్తే సరిపోతుంది. ప్రతి రోడ్డుకు డ్రెయిన్‍ను ఏర్పాటుచేసి రోడ్డుపై పడిన నీటిని సాఫీగా వెళ్లే విధంగా చేస్తే సమస్య చాలా వరకు అదుపులోకి వస్తుంది.

నగర అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న జీహెచ్‍ఎంసీ :
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో భవిష్యత్‍ అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్‍ అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ్డాక టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం హైదరాబాద్‍ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్‍ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి హైదరా బాద్‍ అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. నగరాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న జీహెచ్‍ఎంసీ అధికారులతో పలుమార్లు సమావేశమై అనేక అంశాలపై చర్చిస్తున్నారు.
తెలంగాణను పునర్మించుకుంటున్నామని, ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధి గడిచిన మూడున్నరేళ్ళలో సాధించుకున్న ఘనతేనని, సొంత ఆర్ధిక వనరుల విషయంలో గుజరాత్‍, తమిళనాడు రాష్ట్రాల కంటే అగ్రస్ధానంలో ఉన్నామన్నారు. చాలా అంశాల్లో ఇప్పుడు దేశంలోనే మిన్నగా తెలంగాణ నిలుస్తోందన్నారు.
హైదరాబాద్‍ నగరాభివృద్ధికి స్వచ్ఛ నమస్కారం, ఐ లవ్‍ మై జాబ్‍, మర్యాదగా మాట్లాడుకుందాం, స్వచ్ఛదూత్‍ యాప్‍, మస్కిటో యాప్‍ తదితర వినూత్న కార్యక్రమాల ద్వారా జీహెచ్‍ఎంసీ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తూ అవార్డులు గూడా గెలుచుకున్నది.

హుస్సేన్‍సాగర్‍ చుట్టూ నైట్‍ బజార్‍ :
హుస్సేన్‍సాగర్‍.. ముఖ్యమైన పర్యాటక ప్రాంతం..చారిత్రక సంపదతోపాటు ఆహ్లాదాన్ని పంచే పరిసరాలు ఇక్కడి ప్రత్యేకత.. సాగర పరీవాహక ప్రాంతం చుట్టూరా ఉన్న లుంబిని పార్క్, ఎన్టీఆర్‍ గార్డెన్‍, సంజీవయ్య పార్కు అందాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. తాజాగా ఈ అందాల సరసన పర్యాటకానికి మరింత వన్నెను తీసుకొస్తూ హెచ్‍ఎండీఏ ‘నైట్‍ బజార్‍’ను ఏర్పాటు చేయబోతున్నది.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‍ సూచనల మేరకు సంజీవయ్య పార్కు నుంచి బుద్ధ భవన్‍ వరకు హుస్సేన్‍సాగర్‍ తీరం వెంబడి సుమారు 1300 మీటర్ల విస్తీర్ణాన్ని హైదరాబాద్‍ ప్రజలకు నైట్‍బజార్‍ రూపంలో పర్యాటక ఆకర్షణగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ మేరకు రూ.15కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించారు. సాగర్‍ ఎఫ్‍టీఎల్‍, నీటి నాణ్యతను కాపాడుతూ ప్రీ -ఫ్యాబ్రికేడెట్‍ ఎఫ్‍ఆర్‍పీ (ఫైబర్‍ రీన్‍ఫోర్స్డ్‍ ప్లాస్టిక్‍) ప్లాంటర్‍ బాక్స్లతో పర్యావరణ అనుకూలంగా ఇది ఏర్పాటు కానుంది.

బస్తీ దవాఖానాలు :
పేదలకు నాణ్యమైన చికిత్స అందించడానికి 44 కొత్త బస్తీ దవాఖానాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మునిసిపల్‍ అడ్మినిస్ట్రేషన్‍, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‍ తెలిపారు. ఇవి ప్రస్తుతం ఉన్న 123 బస్తీ దవాఖానాలకు అదనంగా ఉంటాయి. జీహెచ్‍ఎంసీ కీటక శాస్త్ర బృందానికి చెందిన మొత్తం 2,412 మంది సభ్యులు 2,200 యంత్రాలను ఉపయోగించి లార్వా నిరోధక కార్యకలాపాలు మరియు ఫాగింగ్‍ కార్యకలాపాలను చేపట్టారు.
బస్తీ దవాఖానల వల్ల వ్యాధులను ఎక్కడికక్కడే కట్టడి చేయడమే కాకుండా దీర్ఘకాలిక, ఇతరాత్ర వ్యాధులను సకాలంలో గుర్తించడం, గోల్డెన్‍ టైమ్‍లో చికిత్స అందించడంతో ఎంతో ప్రాణాలను కాపాడడమే కాకుండా నిరుపేదలను ఆర్థిక భారం నుంచి గట్టేక్కించగలుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.

నందన నగరం :
ఏ నాయకుడికైనా ప్రజా సేవలో ముఖ్యంగా కావలసింది ఉత్సాహం, క్రియాశీలత. వీటితోపాటు ప్రజా సంక్షేమం పట్ల అభిరుచి ఉన్న నేత ఆ రంగంలో రాణిస్తాడు. తెలంగాణ పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావులో పై గుణాలతో పాటు చిత్తశుద్ధి కూడా మిక్కుటంగా ఉన్నాయి. అలుపూ సొలుపూ లేకుండా హైదరాబాద్‍ నగరాభివృద్ధికి ఆయన  కృ షి చేస్తున్నారు. ఆ  కృ షి ఎంతగా అంటే, హైదరాబాద్‍ మహానగరం నివాస యోగ్యతలోనూ, ఉపాధి కార్యక్రమాల అమలులోనూ దేశంలోని 34 నగరాల్లో తొలిస్థానంలో ఉన్నట్లుగా హాలిడిఫై వెబ్‍సైట్‍ ఈ మధ్య వెల్లడించింది.

2019లో అమల్లోకి వచ్చిన తెలంగాణ మున్సిపల్‍ చట్టం, అధికారులను, ప్రజాప్రతినిధులను పౌరులకు బాధ్యులను చేస్తూ విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. నగర పౌరులకు ఆహ్లాదాన్ని వ్వడానికి కూడా హైదరాబాద్‍ మహానగర పాలక సంస్థ విస్తృత ఏర్పాట్లను చేస్తున్నది. విశ్వనగరంగా ఖ్యాతి గడించిన భాగ్యనగరం ఇకమీదట ఉద్యానవనాలతో కళకళలాడనున్నది. కేటీఆర్‍ సూచన మేరకు జీహెచ్‍ఎంసీ పరిధిలో 1,727 ఎకరాల విస్తీర్ణంలో అందమైన థీమ్‍ పార్కుల నిర్మాణానికి బల్దియా శ్రీకారం చుట్టింది.

తీగల వంతెన :
రాష్ట్ర ప్రభుత్వం దుర్గం చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సిద్ధమైంది. హైటెక్‍ సిటీ ప్రాంతానికి వెళ్లే మార్గాలపై ట్రాఫిక్‍ రద్దీ తగ్గించాలనే లక్ష్యంతో మంత్రి కేటీఆర్‍ సూచనమేరకు ఒక తీగల వంతెన నిర్మాణం రూ.185 కోట్ల వ్యయంతో నిర్మించింది. శని, ఆదివారాల్లో దుర్గం చెరువుపై వాహనాలను అనుమతించకుండా పూర్తిగా పర్యాటకులకు కేటాయించాలని నిర్ణయించారు.

ఐటీలో మనమే మేటి :
కంప్యూటర్‍ పితామహుడైన చార్లెస్‍ బబేజ్‍, డబ్ల్యూ.డబ్ల్యూ. డబ్ల్యూ. పితామహుడైన లీ, ఇంటర్నెట్‍ పితామహుడైన విన్‍ సర్ఫ్ ఆలోచనలను, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని యువనేత కేటీఆర్‍ రాష్ట్రంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో టీ హబ్‍ (T-HUB) ను స్థాపించి అంకుర సంస్థలను ప్రోత్సహిస్తూ, యువతలో నూతన ఆలోచనలను, ప్రయోగాలను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి ఘనత మన ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‍కే దక్కుతుందనటంలో సందేహం లేదు.

ప్రజలకు మంచి పరిపాలన అందించడమే ‘ఇ-పరిపాలన’ ముఖ్య ఉద్దేశం. దేశంలో సమాచార సాంకేతికతకు సంబంధించి 1970లో డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ ఎలక్ట్రానిక్స్ స్థాపితమయింది. దీంతో మన దేశంలో ఇ-పరిపాలన ప్రారంభమైంది. 1977లో జాతీయ ఇన్ఫొమాటిక్‍ కేంద్రం, 1980లో కంప్యూటర్‍ వాడకం, 1997లో NICNET మొదలైంది. 1998లో నేషనల్‍ టాస్క్ఫోర్స్ ఆన్‍ ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీతో సాఫ్ట్వేర్‍ అభివృద్ధికి భారత ప్రభుత్వం కృషిచేసింది.

1999లో కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‍ ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ శాఖను ఏర్పాటుచేయడం కీలకాంశం. 2000లో 12 అంశాలతో కూడిన ఎలక్ట్రానిక్‍ పాలన, 2006లో జాతీయ ఎలక్ట్రానిక్‍ ప్రణాళిక అమలయింది. 2012 నుంచి డిజిటల్‍ ఇండియాగా ఎలక్ట్రానిక్‍ పాలనతో దేశం, రాష్ట్రాలు ముందుకు దూసుకుపోతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అందులో భాగంగానే ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం ముదావహం.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‍ రాబోయే ఐదేండ్లలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలనే దృఢ సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 52 వేల కోట్ల విలువ గల ఐటీ ఎగుమతులు చేయగా, రాబోయే ఐదేండ్లలో లక్ష కోట్ల ఎగుమతులు లక్ష్యంగా చేసుకున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధిరేటుతో రూ.1,09,219 కోట్ల ఐటీ ఎగుమతులు చేయడం హర్షణీయం. దేశ ఐటీ రంగంలో తెలంగాణ వరుసగా ఐదవసారి మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తున్న సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఐటీ ఎగుమతుల్లో ముందున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 17.93 శాతం వృద్ధి చెందినందుకు ఐటీ శాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‍ ప్రత్యేకంగా అభినందించారు. ఐటీ ఎగుమతుల్లో దేశ సగటు 8.09 శాతం కాగా దేశంలో ఇతర రాష్ట్రాల సగటు 6.92 శాతంగా ఉన్నది. దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా 11.6 శాతం ఉండటం గమనార్హం. దేశ ఐటీ ఎగుమతులు రూ.11,12,496 కోట్లు కాగా తెలంగాణ రాష్ట్రం ఒక్కటే 1,28,807 కోట్ల రూపాయల మేరకు ఐటీ ఎగుమతులు చేసి దేశ ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా నిలిచింది. హైదరాబాద్‍తో పాటు వరంగల్‍, నిజామాబాద్‍, కరీంనగర్‍, ఖమ్మం జిల్లాల్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‍, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‍ కృషి చేస్తున్నారు.

ప్రపంచ దిగ్గజ సంస్థలైన యాపిల్‍, గూగుల్‍, అమెజాన్‍ లాంటి సంస్థలను హైదరాబాద్‍కు రప్పించడంలో కేటీఆర్‍ పాత్ర కీలకమైంది. విదేశాల్లో ఐటీ రంగంలో పనిచేసిన అనుభవాన్ని, మేధస్సును ఉపయోగించి ఒక ఐటీ మంత్రిగా వివిధ దేశాల్లోని బడా కంపెనీలను తెలంగాణకు వచ్చేలా ఒప్పించారు. వారికి కావలసిన అన్నిరకాల సదుపాయాలను కల్పిస్తానని భరోసా, భద్రతను ఇచ్చి ఆయా కంపెనీలు రాష్ట్రంలో స్థాపించేలా కృషిచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‍ క్యాంపస్‍, అమెరికా తర్వాత మెక్రోసాఫ్ట్కు అతిపెద్ద క్యాంపస్‍, ఆసియాలో గూగుల్‍కు మొదటి కార్యాలయం, దేశంలోనే మొదటి ఐకియా స్టోర్‍ హైదరాబాద్‍లోనే ఏర్పాటయ్యాయి. ఇక ఫేస్‍బుక్‍, ఆపిల్‍ కంపెనీలు సైతం హైద రాబాద్‍లో పెట్టుబడులు పెట్టాయని నైట్‍ఫ్రాంక్‍ నివేదిక వెల్లడించింది.

ఐటీ హబ్‍గా దేశంలోనే నెంబర్‍ వన్‍గా ఎదిగేలా హైద రాబాద్‍ను అభివృద్ధి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా ఐటీ కంపెనీలు నగరానికి క్యూ కట్టేలా చేయడంలో టీఎస్‍ ఐపాస్‍ వంటి పథకాలు సత్ఫలి తాన్ని ఇస్తున్నాయి. మరోవైపు బీపీఎం, ఫార్మా రంగాల్లోనూ హైదరాబాద్‍ ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. టీ- వ్యాలెట్‍, టీ-యాప్‍ ఫోలియో, టీ-పైబర్‍, వి- హబ్‍ సత్ఫతితాలిస్తున్నాయి. డిజిటల్‍ లావా దేవీల్లో కూడా దేశంలోనే తెలంగాణ నెంబర్‍ వన్‍ స్థానంలో ఉందన్నారు.

విశ్వనగరంగా హైదరాబాద్‍ అభివృద్ధి :
హైదరాబాద్‍ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్‍ నాలుగేళ్లుగా మొదటిస్థానంలో ఉంటోంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‍. గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన సందర్భాలు లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్‍లోని పార్కులు, రోడ్లు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులు మంజూరు చేయడం.. మంజూరైన నిధులతో పనులు వేగవంతం చేయడం జరుగుతోంది. నగరంలోని 826 బస్టాపులను ఆధునీకరించే నిర్మాణ పనులు జరుగు తున్నాయి.. దేశంలోని మెట్రో నగరాల్లో ఎల్‍ఈడీ బల్బులు సంపూర్ణంగా బిగించిన మొదటి నగరంగా హైదరాబాద్‍ నిలిచింది. నాలుగు లక్షలకు పైగా ఎల్‍ఈడీ బల్బులు బిగించడం వల్ల జీహెచ్‍ఎంసీకి నెలకు 35 కోట్ల రూపాయలు కరెంట్‍ బిల్లు మిగులుతోంది. నగరంలో మూడు వేల కోట్ల రూపాయల అంచనాతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. హెచ్‍ఎండీఏకు ఈ ఏడాది వెయ్యి కోట్లకు పైగా ఆదాయం రాగా, మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ఉపయోగ పడుతున్నాయి.

విశ్వ నగరాలు.. శాస్త్రీయ విధానాలు :
భారీ వర్షాలతో నిండా మునకేస్తోంది మన గ్రేటర్‍ సిటీ. ఈ దుస్థితిని నివారించేందుకు న్యూయార్క్ సిటీ, లండన్‍ మహా నగరం, ఫిలడెల్ఫియా నగరం, పారిస్‍ సిటీ విశ్వనగరాల్లో అమలవుతున్న అత్యున్నత శాస్త్రీయ విధానాలు భాగ్యనగరం లోనూ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో లండన్‍, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, పారిస్‍ నగరాల్లో భారీ వర్షం, విపత్తులు సంభవించినపుడు ప్రధాన రహదారులు, కాలనీలు మునగకుండా వరద, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు ఉండడం విశేషం. ఆయా నగరాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను నగరంలోనూ అమలు చేస్తే ముంపు సమస్యలను నివారించడం సాధ్యపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ చర్యలన్నీ హైద్రాబాద్‍ నగర సర్వోతముఖాభివృద్ధికి తోడ్పడతాయి.

కట్టా ప్రభాకర్‍
ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *