నాటి కరోడ్‍ గిరి… నిజాం ఖజానా గని

వరంగల్‍ రైల్వేస్టేషన్‍కు ఎదురుగా కనిపించే అతి పురాతన భవనం నిజాం కాలం నాటి కరోడ్‍గిరి. కరోడ్‍గిరి అంటే ఆనాడు కస్టమ్స్ కార్యాలయం అన్నమాట. అదివ్వాళ ఆదాయ పన్నుకార్యాలయంగా ఉంది. నిజాం ప్రభుత్వం తన ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో ఈ కరోడ్‍గిరి శాఖను ఏర్పాటు చేసింది. అనాటి రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేసే ప్రభుత్వ శాఖల్లో అబ్కారీ, కరోడ్‍గిరి శాఖల ద్వారానే ఎక్కువ ఆదాయం వచ్చేది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు నేటి ప్రభుత్వాలు విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్నే ఆనాడు కరోడ్‍గిరిగా వ్యవహరించారు. నిజాం సరిహద్దులు దాటి యూనియన్‍ ప్రాంతం నుంచి ఏ విధమైన నిత్యవసర వస్తువులు, ఇతర వస్తువులు వినియోగానికి అక్కడకు వచ్చే వస్తువులపై కరోడ్‍గిరి పన్ను వేసేవారు. రైల్వేస్టేషన్‍లో ప్రయాణికులు దిగగానే కరోడ్‍గిరి సిబ్బంది వారు మూటముల్లె విప్పి కొత్త బట్టలుగానీ, వస్తువులు గానీ ఉంటే కరోడ్‍గిరి పన్నువేసేవారు. ఈ విధంగా నిజాం ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని ఆనాటి కరోడ్‍గిరి లెక్కలే సాక్ష్యం. అందుకే ఈ శాఖకు కరోడ్‍గిరి అనే పేరు పెట్టింది నిజాం ప్రభుత్వం. వరంగల్‍లో దాదాభాయి ఇంటాలియా అనే పార్శీ వ్యక్తి సారా కాంట్రాక్టర్‍గా ఉండేవారు. దేశాయ్‍ అనే పేరుతో పిలువబడే దాదాభాయి ఇంటాలియా నిర్మించిన గృహమే ప్రస్తుత ఇన్‍కంట్యాక్స్ కార్యాలయం.

ఈ బంగ్లాను తన వ్యాపారాలకు కేంద్రంగా చేసుకున్నాడని ప్రతీతి. ఈ దాదాభాయి దేశాయ్‍ పేరుమీదే ‘దేశాయిపేట’ ఏర్పాటయిందంటారు. ప్రస్తుతం పంజేతన్‍ పాఠశాల భవనాన్ని కూడా దాదాభాయి ఇంటాలియా నిర్మించారు. ఇది వరంగల్‍ నగరంలో మొట్టమొదటి రెండంతస్తుల భవనం. కరోడ్‍గిరిలోని ఉన్నతాధికారిని మొహతెమీం అని పిలిచేవారు. దీనిపైన వచ్చే ఆదాయం నేరుగా నాటి నవాబు ప్రత్యేక ఖాతాలోనే జమ అయ్యేది. బ్రిటీష్‍ ఇండియాలో ఆనాడు బొంబాయి, మద్రాసు, కరాచీ, కలకత్తా వంటి ఓడరేవుల ద్వారా దిగుమతయ్యే విదేశీ సరుకులపై ఏ విధంగానైతే సుంకాన్ని విధించిందో అదేవిధంగా నిజాం రాష్ట్ర సరిహద్దులైన ఔరంగాబాద్‍, రాయచూర్‍, నల్లగొండ, కరీంనగర్‍, వరంగల్‍, మహబూబ్‍నగర్‍ ప్రాంతాల్లో పీఠాలు, నాకాలు, చౌకీలు ఏర్పాటు చేసి దిగుమతి అవుతున్న విదేశీ వస్తువులపై సుంకాన్ని వసూలు చేసేవారు. ఖమ్మం, భువనగిరి, పెద్దపల్లి ప్రాంతాల్లో ఆ కాలంలో పీఠాలు ఏర్పాటు చేయగా రైల్వేస్టేషన్‍ల సమీపంలోనే కరోడ్‍గిరి నాకాలను ఏర్పాటు చేసేవారు. ఆ విధంగా ఏర్పడిందే వరంగల్‍ రైల్వేస్టేషన్‍ ఎదురుగా ఉన్న కరోడ్‍గిరి కార్యాలయం. ఆంధప్రదేశ్‍ ఏర్పడిన తర్వాత ఈ భవనాన్ని ఇన్‍కంట్యాక్స్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. సుంకాల విధింపులో ఆనాడు కూడా వ్యవసాయ రంగానికి రాయితీలుండేవి. వ్యవసాయ సంబంధ పనిముట్లు, ఇతర సామాగ్రిపై ఆనాడు ఎలాంటి సుంకాలు వేసేవారు కాదు. కానీ నిజాం రాష్ట్రంలో ఒకసారి కరోడ్‍గిరి వసూలు చేసిన వస్తువులు హైదరాబాద్‍ నగరంలోకి చేరుకుంటే మాత్రం మరోసారి ‘చుంగీ’ అనే పన్నును వసూలు చేసేవారు. అయితే ఈ చుంగీ విధానం పెద్దగా లాభసాటి కాకపోవడంతో ఆ తర్వాత కాలంలో ఎత్తివేశారు.
క్రీ.శ. 1862-63 ప్రాంతంలో ఈ కరోడ్‍గిరి విధానం అమలులోకి వచ్చింది. అయితే 1949 నుంచి 1952 వరకు హైదరాబాద్‍ రాష్ట్ర కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మోటార్‍ స్పిరిట్‍, పందాలు ఆడడం, సాధారణ విక్రయాలు, వ్యవసాయ ఆదాయం, సినిమా ప్రదర్శనలు, చెరుకు లాంటి వాటిని సేల్స్ టాక్స్ కమిషనర్‍ కిందకు తీసుకువచ్చారు. 1956లో ఆంధప్రదేశ్‍ ఏర్పడిన తర్వాత వరంగల్‍ కమర్షియల్‍ టాక్స్ అధికారి పరిధిలోకి సాధారణ పన్ను, సెంట్రల్‍ సేల్స్ ట్యాక్స్ ఆక్ట్, మోటార్‍ స్పిరిట్‍ సేల్స్ట్యాక్స్ ఆక్ట్, వినోద పన్ను చట్టాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో ఇన్‍కంట్యాక్స్ కమినర్‍ను ఏర్నాటు చేసి అన్ని జిల్లాలను తీసుకువచ్చారు.

  • కన్నెగంటి వెంకటరమణ
    (పూర్వ డీపీఆర్వో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *