ఒక్కక్షణం అలా నిలబెట్టి ఎటువంటివారినైనా మంత్రముగ్ధుల్ని చేయగలిగిన సమ్మోహన శక్తి ఫోటోగ్రఫీకి ఉంది. అంతర్లీనమైన కళాదృష్టికి అనుక్షణం అన్వేషణ తోడైతే నిత్య నూతన దృశ్యాల చిత్రీకరణ సాధ్యమవుతుంది. పరుగులుపెట్టే కాల గమనంలో జీవన విధానాలను తన కెమెరాలో బంధించి ఆలోచనకు సింగా రించిన దృశ్యపు కూడికగా రూపు దిద్దిన ఫోటోగ్రాఫర్ పఠాన్ హుస్సేన్‍ఖాన్. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల్ల గ్రామంలో జన్మించిన హుస్సేన్ ఖాన్ చిన్నప్పటి నుండే ప్రకృతి ఆరాధకుడు. విభిన్న సృజనాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తి. ఆ అభిరుచి ఆయనను పదేళ్ళ వయస్సులోనే ఫోటోగ్రఫీ రంగం వైపు మళ్ళించింది.
గ్రామీణ జీవనాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రజల వృత్తులు, శ్రమైక పోరా టాన్ని, సంస్కృతి, సంప్రదాయ, ఆచార వ్యవహారాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుని తనదైన దృష్టికోణంలో ఫొటోలుగా తీశారు. తన కళా హృదయాన్ని ప్రతి ఫోటోలో హుస్సేన్‍ఖాన్ వ్యక్తంచేసిన తీరుతో ఆయన ప్రతిభ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఎంతో గుర్తింపును, పురస్కారాలను సాధించిపెట్టింది. వినూత్న దృశ్యాలకు సరికొత్తదనాన్ని జోడిస్తూ ఫోటోగ్రాఫర్‍గా తన ప్రయాణాన్ని హుస్సేన్‍ఖాన్ కొనసాగిస్తున్నారు.
విద్యార్థిగా ఉన్నప్పుడే చదువుకుంటూనే ఫోటోస్టూడియోలో పనిచేసి ఎన్నో నైపుణ్యాలను నేర్చుకున్న హుస్సేన్‍ఖాన్ చదువు వాళ్ల నాన్న చనిపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. జీవనం కొనసాగించేందుకు అలాంటి పరిస్థితులలో ఫోటోగ్రఫీని వృత్తిగా కొనసాగించారు. క్రమంగా ఫోటో గ్రఫీపై ఆసక్తి ఇంకా పెరిగి కృషి చేస్తుంటే అందుకు అనుభవం కూడా క్రమంగా తోడైంది. ఇదే దశలో కీ.శే. వాసిరెడ్డి బాలాజీరావు పరిచయం కావడంతో ఆయనను గురువుగా భావించి ఎన్నో మెళకువలు నేర్చుకుని ఫోటోగ్రఫీలో అద్భుతాలను ఆవిష్క రించారు హుస్సేన్‍ఖాన్. అంచెలం చలుగా ఎదుగుతూ ఈ రంగంలో ఇంకా ఏదో సాధించాలన్న తపనతో అనేక వర్క్షాప్‍లకు ఆయన హాజ రయ్యారు. 90కి పైగా అవార్డులను ఫోటోగ్రఫీ రంగంలో కృషికి గాను ఆయన అందుకున్నారు. అందులో జాతీయ, అంతర్జాతియ అవార్డులను పొందిన ఫోటోలుకూడాఉన్నాయి. స్వయంగా ఏదో ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు ఐదు వర్క్ షాప్ లను నిర్వహించారు.
వర్క్ షాప్ లలో ఆలోచనాత్మకమైన ఫోటోగ్రఫీ అవసరాన్ని హుస్సేన్‍ఖాన్ తెలియజెప్పగలిగారు. ఫోటోగ్రఫీ రంగంలోకి కొత్తగా వచ్చే ఔత్సాహికుల కోసం స్వయంగా తానే శిక్షణను ఇస్తూ వారిని ప్రోత్సహించారు. ఫోటోగ్రాఫర్ల కోసం ఒక క్లబ్‍ను కూడా స్థాపించారు. తెలుగు ఆర్ట్ ఫోటోగ్రఫీ సంస్థకు కార్యదర్శిగా ఉన్నారు. ఎంతోమంది ఫోటోగ్రాఫర్లను ఈ సంస్థ ద్వారా గౌరవింపజేస్తూ సముచిత సత్కారాలను అందజేస్తూ ప్రోత్సాహాన్నందిస్తున్నారు. గిరిజన మహిళల జీవన ప్రవృత్తులు హుస్సేన్‍ఖాన్ తీసిన విలక్షణత కలిగిన ఫొటోలు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాయి. సందర్భోచితమైన దృశ్యీకరణకు సాక్ష్యంగా నిలిచే ఫోటోలను తీస్తున్న హుస్సేన్‍ఖాన్‍ను ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు స్ఫూర్తిగా తీసుకోవాలి. కృషి, నిపుణతల సంగమంగా తన వృత్తిలో రాణిస్తున్న హుస్సేన్‍ఖాన్ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నతోన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిద్దాం.
-పఠాన్ హుస్సేన్‍ఖాన్
ఎ : 98490 26296
-టీఎస్వీ
ఎ : 944146476