ఇరు ధృవాలు – భూగోళపు రిఫ్రిజిరేటర్లు

ప్రకృతే నియంత్రిస్తుంది! 13 ప్రకృతే శాసిస్తుంది!!



(గత సంచిక తరువాయి)
గత ఆరు దశాబ్దాలుగా అంటార్కిటికాకు సంబంధించిన అనేక వాస్తవాలు, విషయాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఈ శ్వేత ఖండంపై అనేక పరిశోధనలు జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. భూతాపం సముద్రాలపైననే కాకుండా, సహజసిద్ధమైన ఈ మంచు ఖండంపై ఎలా ప్రభావం చూపుతుందో, భవిష్యత్తులో యావత్‍ భూగోళం ఎంతటి విపత్తును ఎదుర్కోబో తుందో తెలుసుకుంటే కాళ్ళకింద భూమే కాదు మొత్తం భూగోళమే అతాలాకుతలం అవుతుంది.
కరోనా కష్టకాలంలో యావత్‍ ప్రపంచం తనకుతానే (మనిషిని) రక్షించు కునే ఏకైక ఆలోచనలకే పరిమితమైంది గాని, దీనికి సంబంధించిన మూలాల్లోకి, భూమండలానికి జరుగుతున్న వినాశనం గూర్చి, తెరమరుగైతున్న, కనుమరుగైతున్న అశేష జీవజాలం గూర్చి కించిత్తు ఆలోచించడంలేదు. కరోనాను మించిన క్రికెట్‍ రోగం సాటి మనిషినే కాదు, జంతు జాలాన్ని వీటికి ఉపయోగపడే క్రిమికీటకాల్ని, సూక్ష్మ జీవుల్ని, చివరికి భూమాతకు జరుగుతన్న దాష్టికాన్ని పట్టింపు లేకుండా చేస్తున్నది. పాలకులే ఈ రోగాన్ని పెంచి పోషిస్తున్నారు. చివరికి చదివితే మతిపోయినట్లు మానవత్వమే మంటగలుస్తున్నది. (గత అక్టోబర్‍ 25, 2021న మెట్రో రైలులో కింద కూర్చున్న ఓ బాలింతరాలి ఉదంతం)


దినదిన గండం – తరుగుతున్న అంటార్కిటికా!
గ్లోబును చూసినప్పుడో, పరిశోధనల, ప్రయోగాల సందర్భంగానో కొందరి దృష్టిలో పడే దక్షిణ ధృవభాగం అంటార్కిటికా! ఈ ఖండం యొక్క ఉనికి, నైసర్గీక స్వరూపం, భౌగోళిక మార్పులు చాలామందికి తెలియని అంశాలే! తెలిసినా పెద్దగా పట్టింపు లేనివారే! దాదాపు 1950 దాకా సాగిన యాత్రలన్నీ సాహస యాత్రలుగా మిగిలిపోగా, జులై1, 1957 నుంచి డిసెంబరు 31, 1958 దాకా గుర్తించబడిన అంతర్జాతీయ జియోఫిజికల్‍ సంవత్సరం(Geophysical Year) సందర్భంగా బెసాన్‍కన్‍ విశ్వవిద్యాలయం తలపెట్టిన అంటార్కిటికా అన్వేషణ యాత్ర (Expedition), ఈ ఖండం యొక్క దీనావస్థను ప్రపంచ దృష్టికి తెచ్చింది. తర్వాత జరిగిన యాత్రలన్నీ వివిధ ప్రయోగాలకు కేంద్రంగా మారగా, క్లాడ్‍ లోరియస్‍ తన బృందంతో జరిపిన పరిశోధనలు మాత్రం, అంటార్కిటికాకు జరుగుతున్న విధ్వంసాన్నే కాక, ఈ విధ్వంసం యావత్తు భూగోళానికి ఎలాంటి ముప్పును కలిగించబోతుందో తెలియజెప్పింది. గత కొంతకాలంగా జరుగుతున్న భూభౌతిక, సముద్ర పరిశోధనలు, అంటార్కిటికా ఖండంపై జరిపిన పరిశోధనలు భూమికి సంబంధించిన కొన్ని నగ్న సత్యాల్ని బయటపెట్టాయి.


ఈ మధ్యన ఐక్యరాజ్య సమితికి సముద్రాల రక్షణ సలహాదారుగా వున్న బ్రిటన్‍కు చెందిన లూయిస్‍ పగ్‍ (Lewis Paugh) అంటార్కిటికా మంచు కింద గల నీటిలో ఈది అనేక విపత్కర విషయాల్ని బహిర్గతం చేసాడు. దాదాపు అన్ని సముద్రాలలో అత్యంత దూరం ఈదిన సాహసిగా ఈయనకు గుర్తింపు వుంది. మార్చి 9, 2015న అంటార్కిటికా రోస్‍ సముద్రం (Ross Sea)లోని వేల్స్ఖాతం (Bay of Whales)లో మైనస్‍ ఒక డిగ్రీ సెల్సియస్‍ ఉష్ణోగ్రతలో 350 మీటర్ల దూరాన్ని ఈది అంటార్కిటికాలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని రికార్డు చేసాడు.
వృత్తి రీత్యా బారిస్టర్‍ అయిన లూయిస్‍ సముద్ర ప్రేమికుడు కావడంతో 2005 లోనే అంటార్కిటికా ఈయన దృష్టిని ఆకర్షించింది. దశాబ్దం తర్వాత మంచు పలకల కింద నీటిలో ఈది ఆ నీరు వేడిగా ఉన్నట్లు గుర్తించాడు. పైనంతా మంచు, లోన నీరు, సహజంగా నీరు కూడా చల్లగానే వుండాలి. కాని అలా కాకుండా వేడ్కెడానికి గల కారణాల్ని విశ్లేషించగా, భూ ఉపరితలంలో వెలువడుతున్న కార్బన్‍ డయాక్సైడ్‍ సముద్ర నీటిలో కరగడంతో మంచు పలకల కింద నీరు కూడా వేడెక్కుతున్నదని గుర్తించాడు. నిజానికి ఈ వాయువును చల్లని నీరు గ్రహించి సముద్ర గర్భంలో నిలువ చేయడం ద్వారా సముద్ర జీవరాసి మనుగడకు దోహద పడుతుంది. కాని, దీని గాఢత పెరగడంతో జీవరాసికి ప్రమాదమే కాకుండా, పైన మంచు కరుగుతుంది. దీంతో ప్రపంచ వ్యాపితంగా సముద్ర మట్టాలు పెరగడం ప్రారంభిస్తున్నాయి.


అంటార్కిటికా ఓ సజీవ పరిశోధనా కేంద్రం :
చెప్పడానికి ఇది మంచుఖండం మాత్రమే కాదు, యావత్‍ భూమికి ఇదో నిజమైన ఉత్ప్రేరకం (catalyst) భూవాతావరణాన్ని సహజసిద్ధంగా వుంచడానికి దోహదపడే ఓ కాపలాదారు. అందుకే భూమిపై జరిగే, జరిగిన మార్పులకు ఇదో సజీవ సాక్ష్యం! అన్ని రకాల అవలక్షణాల్ని, విషాల్ని తనలో దాచుకొని, భూమండలానికి, జీవకోటికి ప్రాణదాతగా పనిచేస్తుంది. భూమికి సంబంధించిన మార్పుల్ని, కథనాల్ని ఇది కథలుగా చెపుతుంది. కాని, ఇదంతా నిన్నటి దృశ్యం! నేడంతా తారుమారైతున్నది. మంచుఖండికలు కరగడం ప్రారభించాయి. దీంతో ఈ ప్రాంతంలో కొత్తగా 65,000 వేల సరస్సులు ఏర్పడినట్లు లూయిస్‍ గుర్తించాడు. ఇవన్నీ కూడా 2005-2015 మధ్యన అధికమైనట్లుగా రికార్డు చేసాడు. ఇందులోని కొన్ని భాగాల్లో 200c ఉష్ణోగ్రత పెరిగినట్లుగా తేలింది. ఈ ఉష్ణోగ్రతలో అడుగు భాగంలో మంచు కరిగి ఏర్పడిన నీరు నదులుగా పారుతున్నట్లు, ఇవి ఉపరితలానికి చేరి సరస్సులుగా మారుతున్నట్లు గుర్తించాడు.


కరుగుతూ తరుగుతున్న త్వాయ్‍టెస్‍ మంచు ఖండిక:
భారత్‍, అమెరికాకు చెందిన అంతరిక్ష నౌకల డేగ కన్నులు అందిస్తున్న చిత్రాల ప్రకారం అంటార్కిటికా పశ్చిమ భాగాన గల త్వాయ్‍టెస్‍(Thwaittes) ఖండిక అతి పెద్దది. అముండ్‍సేన్‍ సముద్రంలోని (Amundsen Sea) పైన్‍ ద్వీపపు (Pine Island) ఖాతం (Bay) కు ఆనుకొని వున్న ఈ మహామంచు ఖండం చివరి భాగం 120 కి.మీ. వెడల్పుతో సుమారుగా బ్రిటన్‍ భూభాగంతో సమానంగా వుండి, వెయ్యి మీటర్ల మందంతో వుండేది. ఇంత విశాల మంచు ఖండిక మంచును కోల్పోతూ నీరుగా మారుతున్నట్లు న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డెవిడ్‍ హాలండ్‍ (David Holland) నాయకత్వంలోని బృందం గత 2020 జనవరిలో గుర్తించడం జరిగింది. వీరు కూడా మూడు నెలల పాటు ఇక్కడే వుండి క్లాడ్‍ లోరియస్‍ బృందంలా మంచు పొరల్లోకి 600 మీటర్ల లోతుకు రంధ్రం (bore) వేసి ఈ మధ్యన జరుగుతున్న అంతర్గత మార్పుల్ని పరిశీలించారు. వీరు కూడా ఆ రంధ్రం ద్వారా అడుగుభాగాన వేడినీరు వున్నట్లుగా గుర్తించారు.


నిజానికి భూమి కూడా మామూలు చిన్న గ్రహమేనని, దీనిపై ఈ ధృవం నుంచి ఆ ధృవం దాకా, తూర్పు పడమరలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కల్గివుంటాయని, భూమండలం, జలమండలం, మంచు భాగాలు (Glaciers) విడివిడిగా మనజాలవని, ఇవి ఓ శరీర అవయవాల్లా ఒకదానితో ఒకటి అనుసంధానం చెంది, మొత్తం భూగోళాన్ని ఓ ఆవాసయోగ్య గ్రహంగా కాపాడుతాయని వీరు భావిస్తూ, ఈ సమతుల్యత ఈ మధ్యకాలంలో దెబ్బతిన్నదని, కొన్ని గణాంకాల్ని పొందుపర్చారు. వీరి పరిశీలన ప్రకారం, మంచు ఖండంపైన నీరు గడ్డకట్టే (freezing) ఉష్ణోగ్రత కన్నా 20c ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లు, గత కొన్ని దశాబ్దాలుగా త్వాయ్‍టెస్‍ 600 బిలియన్‍ టన్నుల మంచును కోల్పోగా ప్రస్తుతం సంవత్సరానికి 50 బిలియన్‍ టన్నుల మంచు కరిగి తరులుతున్నదని తేల్చారు.
దీని ప్రభావంతో 1990 నుంచి సముద్రాల నీటిమట్టం పెరగడం ప్రారంభించాయని, ఈ లెక్కన మంచు కరిగిపోతూ వుంటే రానున్న కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాపిత సముద్ర మట్టాలు 12 అడుగుల ఎత్తుకు పెరుగుతాయని తెలిపారు. అనగా, అంటార్కిటికా మంచు ఖండంలో 3 శాతంగా ఉన్న త్వాయ్‍టెస్‍ మంచు ఖండిక, భౌగోళికంగా 4 శాతం సముద్ర మట్టాల్ని పెంచగలుగుతుంది. విశ్వవిద్యాలయ విద్యార్థులతో సహా 24 మందిగల బృందం ఈ యాత్రను శీతాకాలంకు ముందే పూర్తి చేయాలనుకున్నా, అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో యాత్ర ఆలస్యం కావడం, ఉన్న మూడు నెలలు కూడా ఇబ్బంది కరంగా ఉండడంతో అనుకున్నంత పరిశీలన జరపలేక పోయామని డేవిడ్‍హలండ్‍ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.


అంతర్జాతీయ త్వాయ్‍టెస్‍ సంస్థ (ITGC) 2.1 మిలియన్‍ డాలర్ల గ్రాంట్‍ అందించిన ఈ ప్రాజెక్టులో ఆయన భార్య డెనిసె (Denise) కూడా న్యూయార్క్ నుంచి సహకారం అందించింది.
అయిదు సంవత్సరాల క్రితమే అంటార్కిటికా అడుగుభాగంలోని నీరు వేడెక్కతున్నట్లు గుర్తించిన మొదటి వ్యక్తి లూయిస్‍ పగ్‍ కాగా ఇది వాస్తవమని రంధ్రం వేసి చూపడమే కాక, ఈ నీటిలో ఉప్పునీరు (ఇతర సముద్రాల నీరు కలిపి) కూడా ఉందని డేవిడ్‍ బృందం తేల్చింది. లూయిస్‍ 2005 నుంచి 2015 దాకా దశాబ్ద కాలం అంటార్కిటికాలో జరుగుతున్న మార్పుల్ని పరిశీలించి, నీటి ఉష్ణోగ్రతలోని మార్పుల్ని రికార్డు చేసాడు. ప్రస్తుతం డేవిడ్‍ బృందం పరిశోధనలు మరిన్ని పరిశీలనల్ని జరపాలని భావిస్తున్నది.


కనుమరుగైతున్న లార్సెన్‍ బి మంచు పలక
ప్రధాన మంచు ఖండిక (ice shelf) చివరి అంచుల నుంచి విడివడిన మంచు సముద్రతలంపై తేలుతూ పయనించేదే మంచు పలకలు ఈ పక్రియ దాదాపు 12,000 సం।।ల నుంచి (మంచు యుగం) జరుగుతున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇలా విడివడిన మంచుతో ఏర్పడిన లార్సెన్‍ ‘బి’ మంచు పలక 220 మీ. మందంతో 1995లో సుమారు 3,250 చ.కి.మీ. వైశాల్యం కలిగి వుండేది. కాని నేడు 60 శాతంకు పైగా కరిగి తరిగి పోవడంతో దాని చుట్టూ గల సముద్ర నీటి మట్టం పెరిగినట్లుగా గుర్తించారు. 1990 నుంచి సంవత్సరానికి 2-4 గిగాటన్నుల చొప్పున కోల్పోయిన మంచు, 2006 నాటికి 2240 గిగా టన్నులకు చేరుకుంది. అనగా 300 శాతం పెరిగింది. గతంలో ఇలాగే లార్సెన్‍ ‘ఎ’ మంచు పలక కరిగి సముద్రనీరుగా మారినట్లుగా పరిశోధకులు గుర్తించారు.


ప్రిన్స్ గస్టర్‍ చానల్‍ (సముద్రం) రూపొందండం :
(Prince Gustar Channel (Sea)

పశ్చిమ అంటార్కిటికా, తూర్పు జెమ్స్ రాస్‍ (James Ross) ద్వీపానికి మధ్యన 1995 వరకు 130 కి.మీ. పొడవుతో, 24 కి.మీ. వెడల్పుతో దాదాపు 700 చ.కి.మీ. వైశాల్యం గల మంచు పలక ఒకటి ఈ మధ్యన కరగడంతో ఓ ఓడల మార్గం (చానల్‍) ఏర్పడింది. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 10,000 సం।। క్రితం కూడా భౌగోళిక మార్పులకు గురైన ఈ భాగం విచ్ఛిన్నమైనట్లు, 1900 సం।। నుంచి తిరిగి ఇది రూపు దిద్దుకున్నట్లుగా భావిస్తున్నారు. 1985 వరకు అంటార్కిటికాకు వచ్చే నౌకలను ఇక్కడే లంగర్‍ వేసి నడుచుకుంటూ వెళ్ళేవారు. కాని, ఈ కొత్త చానల్‍ ఏర్పడిన తర్వాత నౌకలు మరింతగా అంటార్కిటికా భూభాగంలోకి వెళ్ళుతున్నాయి.


దెబ్బతింటున్న శీతలీకరణ కేంద్రాలు:
భూమి ఓ నిర్ధిష్ట రూపం దాల్చి జీవరాశి మనుగడకు దోహద పడడానికి మిలియన్‍ సంవత్సరాలు పట్టినట్లుగా ప్రకృతి సూత్రాల కథనాల్లో చూసాం. భూభాగం, సముద్రాలు ఏర్పడంతో పాటు, ఇరు ధృవాలు మంచు ఖండాలుగా రూపుదిద్దుకున్నాయి. పైననే ప్రస్తావించినట్లుగా ఇవి ఒకదానితో మరోకటి సంబంధాన్ని కల్గి వుంటాయి. కాబట్టే భూగోళంపై వాయువులు, గాలులు, వాతావరణం, ఉష్ణోగ్రతలు, వివిధ రుతువులు ఓ క్రమపద్ధతిలో రూపాంతంరం చెంది ఒకదాని తర్వాత మరోకటి, ఓ నిర్ణీత కాలంలో చక్రంలా వస్తూ, పోతూ వుంటాయి. వీటినే ఆరు రుతువులుగా, మూడు కాలాలుగా చెప్పుకుంటాం. ఏ రుతువు మరో రుతువు ధర్మాల్ని కల్గి ఉండక పోగా, ఒక కాలం మరోకాలానికి విభిన్నంగా ఉష్ణోగ్రతల్ని వాతావరణాల్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ క్రమానుగత ఛట్రానికి, భూమి పైనున్న విభిన్న భాగాలు అనుసంధానకర్తలుగా పనిచేస్తాయి. అనగా, సముద్రాలు భూభాగంతో, భూభాగం (కొండలు, పర్వతాలు, మైదానాలు, లోయలు) మంచు భాగాలతో తిరిగి ఇవి సముద్ర, భూభాగాలతో అవినాభావ సంబంధాన్ని కలిగి వుంటాయి. ఇదంతా భూమిపై గల విభిన్న రకాల అడవుల పై భాగంలోని ఓజోన్‍, హరిత వాయువుల నియంత్రణలో జరుగుతూ వుంటాయి. ఈ అడవుల మనుగడ తిరిగి పక్షులపై, జంతువులపై, గాలులపై, వర్షాలపై ఆధారపడడం అనివార్యం. వీటన్నింటికి, శక్తి ప్రధాత స్వయం ప్రకాశితుడైన సూర్యుడే! వీటిని విడివిడిగా చూడలేము. ఇందులో ఏది కాదన్నా, సమతుల్యత దెబ్బతిన్నా, యావత్‍ భూగోళం మనుగడకే ప్రమాదకరం!


ఉదాహరణకు, సముద్రంపై నుంచి భూమివైపుకు వీచేగాలులు, ఆవిరిగా మారిన తేమను మోసుకొస్తాయి. ఈ తేమ జీవరాశికి ఓ ఏర్‍కూలర్‍గా, ఏర్‍కండిషన్‍గా పనిచేస్తుంది. అలాగే మైదానాల నుంచి వీచే గాలుల్ని, కొండలు, గుట్టులు, ఎత్తైన ప్రదేశాలు నియంత్రిస్తాయి. ఇలా నియంత్రించబడక పోతే, గాలులు (wind) ఏదో ఒకవైపు ప్రయాణించి మరో ప్రాంతంలో ప్రభావాన్ని కల్గిస్తాయి. ఇదే జరిగితే నియంత్రణ (wind) లేని ఏకరీతి గాలులు, అనగా స్థానిక పవనాలు ప్రపంచ పవనాలుగా మారుతాయి. వీటి ఫలితంగా భూగోళంపై ఏ ఉపద్రం సంభవించినా, అవి ప్రపంచ వ్యాపితమైతాయి. ఇప్పుడు వాటిని మనం ప్రత్యక్షంగా చవిచూస్తున్నాం. వేడి, చలిగాలులు, అధిక వర్షాలు, సునామీలు, ఉప్పెనలు, వర్షాభావాలు, అడవులు తగలబడడం నిత్యకృత్యాలుగా భూగోళం అంతటా చూస్తున్నాం. అంటే ప్రమాద ఘంటికలు ఓ ప్రాంతానికో, దేశానికో పరిమితం కాకుండా ప్రపంచీకరణ చెందాయన్న మాట!


ఈ ప్రభావాలు మొత్తంగా ఇరు ధృవాల్లోని మంచు ఖండాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భూవాతావరణం వేడెక్కడంతో, ఈ ధృవాల మంచు కరగడమే కాక, పర్వత శ్రేణుల్లో నిక్షిప్తమైన (glaciers) మంచు ఖండాలు జాలువారుతున్నాయి. వీటిని మనం కాశ్మీర్‍లో, ఉత్తరాఖండ్‍లో ప్రతీ సంవత్సరం చూస్తూనే వున్నాం. ఇలా కరిగిన ఘనరూప మంచు సముద్రాల్ని చేరడంతో, సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తీర ప్రాంతాలు కోతకు గురైతున్నాయి. అంటే సముద్ర లోతులు కూడా పూడికకు గురైతున్నాయన్న మాట! ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‍లో ఏం జరగబోతుందో ఊహించడం కష్టమేమికాదు!


ఇలా భూమిపై జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం ఏకబిగిన ధృవాలపై పడడంతో, యావత్‍ భౌగోళిక వాతావరణాన్ని నియంత్రించే ఈ శీతలీకరణ (refrigerators) ఖండాలు వేడెక్కి పోతున్నాయి. ఫలితంగా నియంత్రణ లేని వాతావణ మార్పుల్ని ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా చవిచూస్తున్నాం. భూ, సముద్ర వాతావరణాల స్థిరత్వం దెబ్బతింటున్నది. భూగోళం ఓ శరీరం అని భావిస్తే, ఇరు ధృవాలు కేంద్రనాడీ వ్యవస్థ అయితే, మిగతా భూభాగాలు శరీర భాగాలు. మరి కేంద్ర నాడీవ్యవస్థనే దెబ్బతింటే, శరీరం ఎలా పట్టుతప్పుందో, అలాగే భూగోళం కూడా ఈ దుస్థితిలోకి నెట్టివేయ బడుతున్నది.


ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తుంటే, వీటిని పూర్వ స్థితికి పునరుద్దరించడం కూడా జరగని పనిగా తోస్తున్నది. మొన్న గ్లాస్గోలో జరిగిన ప్రపంచ దేశాధినేతల సమావేశంలో, కర్బన ఉద్గారితాల్ని, మిథేన్‍ విడుదలల్ని నియంత్రించడానికి, మొత్తంగా నిలుపుదల (zero) చేయడానికి దశాబ్దాలు కావాలని మోడీతో సహా ప్రపంచ నాయకులు చేతులెత్తిన విధం చూసాం! దీన్ని బట్టి ఈ భూగోళ పరిరక్షణ అనేది మాటలకే పరిమితమని తేలిపోయింది. మరి ఈ బాధ్యత ఎవరిది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు తిరిగి మానవులదని, సంస్కారవంతులమని (civilized) చెప్పుకుంటున్న ప్రజలదేనని తేలుతుంది. మరి ఇది జరుగుతుందా అని అనుకుంటే, సమాధానం కూడా కష్టమే!
భారత్‍లో హిమాలయాల నుంచి మొదలు కొని దక్షిణానగల పడమటి కనుమల్ని ఏ విధంగా అభివృద్ధి పేరున పాలకులే ధ్వంసం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. వీటిని నిలువరింప చేస్తే… ఆ శక్తి ప్రజలకుంటే, ఈ ప్రజలంతా దోస్తు, మగరమచ్‍ (Dost Magarmach) సినిమాలోని బాలుడైన ‘రాము’ లా జంతువుల్ని ప్రేమిస్తే… భూమి మరికొన్ని వేల సంవత్సరాలు జీవరాశికి ఆలవాలంగా మనుగడను సాగిస్తుంది. (వచ్చే సంచికలో అంటార్కిటికా అంతరిస్తే.. కథనాన్ని చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *