పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘నల్లగొండజిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త పుప్పాల కృష్ణమూర్తి గారి విశ్లేషణ.
కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారి ఆహ్వానం మేరకు నల్లగొండ జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 53 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు 12కథలను ఎంపిక చేశారు. ఈ పుస్తకానికి కవర్ రమావత్ శ్రీనివాస్, లోపలి బొమ్మలు చెంచుల వెంకటరమణ వేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.
తెలుగు సాహితీ ప్రపంచంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు విశిష్ట స్థానముంది. అనేకమంది కవులు, రచయితలు ఈ జిల్లా మాగాణాన్ని తమ సాహితీ సేద్యంతో సుసంపన్నం చేసి రత్నాల వంటి కావ్యాలు వెలువరించారు.
బాల సాహిత్యం అనగానే ముందుగా జిల్లాలో గుర్తుకొచ్చే పేరు రామన్నపేట కవి, రచయిత, వ్యాస కర్త, కార్టూనిస్టు పెండెం జగదీశ్వర్. పిల్లల కోసం కథలు, గేయాలు వ్యాసాలు జోక్స్తో సుమారు 48 పుస్తకాలు రాసారు. గంధం నర్సయ్య, డాక్టర్ సిరి వెన్నెల, పుప్పాల కృష్ణమూర్తి, అల్లుబెల్లి నర్సింహారెడ్డి, దొడ్డి రాంమూర్తి, మేకల మదన్ మోహన్, బుచ్చిరెడ్డి జిల్లాలో అనేక మంది కవులు రచయితలు, పిల్లల కోసం తమ కాలాన్ని, వివేకాన్ని వెచ్చించి బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు.
2010 ప్రాంతంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థ నుండి జాబిలి పత్రిక మూడు సంవత్సరాల పాటు మాస పత్రికగా వెలువడి జిల్లాలోని పాఠశాలల్లో విద్యనభ్యసించే అనేక మంది బాల బాలికలను రచయితలుగా, కవులుగా, చిత్రకారులుగా తీర్చిదిద్దింది.
పెద్దల రచనల ప్రేరణగా, పిల్లలు కథలు వెలువరించడం ఆహ్వానించవలసిన విషయం, పిల్లల ఊహల ప్రపంచం నుండి జాలు వారిన ఈ సంకలనంలోని పన్నెండు కథలు రాసిన విద్యార్థినీ విద్యార్థులకు ముందుగా అభినందనలు. వేల కొద్ది గల పిల్లల్లో కేవలం కొద్ది మంది మాత్రమే సృజనాత్మకంగా రచనలు చేస్తూ, రాబోయే తరానికి సాహితీ ప్రతినిధులుగా నిలవబోతున్నారు. వీరి కథలు చమత్కారంగా, హాస్యంతో, వినోదంగా, అంతిమంగా నీతి బోధకంగా సాగాయి.
ఆ దిక్కుగా – ఈ సంకలనం ప్రేరణగా బాల బాలికలకు కలాల్ని సారిస్తారని ఆశిస్తూ…
-పుప్పాల కృష్ణమూర్తి, బాల సాహితీవేత్త